జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, May 3, 2012

మహాసంగ్రామానికి నాంది

*ఉప ఎన్నికలపై జగన్ వ్యాఖ్య
*ఈ ఎన్నికల్లో వేసే ఓటుతో ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలగాలి
* వైఎస్ చనిపోయాక గాలేరు-నగరి పనులు ఎక్కడికిపోయాయో తెలీదు
*కాంగ్రెస్ వాళ్లు ప్రచారానికొస్తే నీటి సమస్యపై నిలదీయండి
*వైఎస్ బతికున్నప్పుడు తిరుపతిలో పేదలకు 27 వేల ఇళ్లు కట్టించారు
* ఆయన చనిపోయాక ఒక్కటంటే ఒక్క ఇల్లూ ఇవ్వలేదేమని కాంగ్రెస్ వారిని ప్రశ్నించండి




 ‘ఈ కాంగ్రెస్ పెద్దలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను ఎంతగా దిగజార్చారూ అంటే.. విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థాలను టార్చిలైట్ వేసి వెతికినా కనిపించే పరిస్థితి లేదు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తేవాలి.. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావాలి.. విలువలను తిరిగి తేవాలి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చేలా జరగబోతున్న ఈ ఉప ఎన్నికలు.. రేపు జరుగబోయే మహా సంగ్రామానికి నాంది పలకనున్నాయి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్రంలో రైతు, పేదవాడు ఎలా బతుకుతున్నాడో పట్టించుకోని ఈ పాలకులకు వారి బాధను తెలియజెప్పేలా ఉప ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు.



‘రాష్ట్ర పాలకులకు, వారిని ఢిల్లీ నుంచి రిమోట్‌తో నడిపిస్తున్న పెద్దలకు ఉప ఎన్నికల తీర్పుతో కనువిప్పు కావాలి’ అని జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న భూమన కరుణాకరరెడ్డి తరఫున జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నిర్వహించిన ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే సువర్ణయుగంలో అవకాశముంటే టీటీడీ కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తాం. వారికి కనీస వేతనం అందేలా కృషి చేస్తాం. వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా గృహాలు నిర్మించుకునేందుకు కృషి చేస్తాం’ అని జగన్ హామీ ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

చిరంజీవి తిరుపతి ప్రజల్ని గాలికొదిలేశారు..

పేదోడికి, రైతన్నకు అండగా నిలబడినందుకు 17 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురయ్యారు. ఇప్పుడు వారి స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే తిరుపతిలో ఉప ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయీ అంటే.. మొన్న చిరంజీవే స్వయంగా చెప్పారు.. ఆయనకు సోనియా గాంధీ ప్రమోషన్ ఇచ్చారట.. రాజ్యసభకు పంపారట.. అందుకని ఆయన తిరుపతి ప్రజలను గాలికి వదిలేశారట. ఇంకా బాధాకరమైన విషయమేంటంటే.. రాజ్యసభకు వెళ్లే వ్యక్తి ఎక్స్ ఆఫీషియో సభ్యత్వానికి తిరుపతి నగరాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నా.. ఆయన మాత్రం హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేసుకున్నారు.

అలా ఆయన గాలికి వదిలేసిన పరిస్థితిలో తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తిరుపతి తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం మహానేత వైఎస్ గాలేరు-నగరి ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఆ మహానేత చనిపోయాక గాలేరు-నగరి ప్రాజెక్టు పనులు ఎక్కడికి పోయాయో తెలియడం లేదు. గాలేరు-నగరి పనులు జరగలేదనో, ఇక్కడున్న అక్క చెల్లెళ్లు నాలుగురోజులకొకసారి నీటి కష్టాలు పడుతున్నారనో చిరంజీవి రాజీనామా చేసుంటే సెల్యూట్ చేసుండేవాణ్ణి.

కాంగ్రెస్ వారిని నిలదీయండి: కాంగ్రెస్ వాళ్లు ఇక్కడికి(తిరుపతికి) ప్రచారానికి వస్తే ఒక మాట అడగండి. తిరుపతి నగరంలో నాలుగు రోజులకోసారిగాని ఐదు రోజులకోసారిగాని నీళ్లు దొరకని పరిస్థితిలో మేం బతుకుతున్నాం.. మీరేం చేస్తున్నారని అడగండి. ఆ మహానేత బతికి ఉన్నప్పుడు ఇక్కడ పేదలకు 27 వేల ఇళ్లు కట్టిస్తే.. ఆయన చనిపోయాక ఒక్కటంటే ఒక్క ఇల్లూ కట్టివ్వలేదేమని ప్రశ్నించండి. సాగు చేయడం కంటే ఆత్మహత్యే మేలనుకునే పరిస్థితిలో రైతు వ్యవసాయం చేస్తున్నా కూడా అతడిని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీయండి.

సంవత్సరమైపోయింది.. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు ఇప్పటికీ విడుదల చేయలేదు.. ప్రభుత్వం ఆ బకాయిలు కడుతుందో కట్టదో తెలియని పరిస్థితిలో చదువుతున్నాం మేం అని ప్రతి విద్యార్థీ కాంగ్రెస్ వాళ్లను నిలదీయండి. అనారోగ్యంతో ఉన్న పేదవాడు 108కు ఫోన్ చేస్తే 20 నిముషాల్లో రావాల్సిన అంబులెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో బతుకుతున్నామని నిలదీయండి. ఆరోగ్యశ్రీని ఎందుకు కుదించారని ప్రశ్నించండి. కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ అర్హత వయసును రెండేళ్లకే కుదించారు.. రెండేళ్లలోపు మూగ, చెవుడు గుర్తించలేకపోతే.. వాడి జీవితమేమైపోవాలని నిలదీయండి.

చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు ఎంతగా కుమ్మక్కయ్యారంటే..,
ఇలాంటి పరిస్థితిలో పోనీ ప్రతిపక్షమైనా ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతుందని చూస్తే.. మన ఖర్మకొద్దీ ఆ ప్రతిపక్ష స్థానంలో చంద్రబాబు ఉన్నారు. దేశ చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో ఆయన కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కయ్యారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు చెందిన వ్యక్తికి హైదరాబాద్ నడిబొడ్డున అమీర్‌పేటలో ఐదెకరాల భూమిని స్వయంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులే ధారాదత్తం చేశారంటే వారి కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీళ్లిద్దరి కలయిక ఎంత నిస్సిగ్గుగా ఉందో తెలుసుకోవాలంటే.. వైఎస్‌పైన, చంద్రబాబుపైన సీబీఐ చేస్తున్న దర్యాప్తు తీరు చూస్తే చాలు.

వెనుకబడిన మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పరిశ్రమలు తేవాలని, ఉపాధి కల్పించాలని తలచి మహానేత.. ఎకరా 8 లక్షల చొప్పున 75 ఎకరాలను 25 ఏళ్లపాటు లీజుకిస్తే సీబీఐ తప్పు పడుతోంది. అక్కడ ఎకరా రూ.15 లక్షల రేటు పలుకుతోందీ అంటోంది. ఎమ్మార్ కేసులోనూ సీబీఐ దర్యాప్తు చేస్తోంది.. అయితే అందులో చంద్రబాబు చేసిన తప్పు వారికి కనబడడం లేదట. వైఎస్ ఉపాధి కల్పించడానికి ఎకరాలను పరిశ్రమలకు కేటాయిస్తే.. చంద్రబాబు పెద్దలు గోల్ఫ్ ఆడుకోవడానికి, విలాసవంతమైన విల్లాలు కట్టుకోవడానికి హైదరాబాద్ నడిబొడ్డున 535 ఎకరాలను ఎమ్మార్‌కు ధారాదత్తం చేశారు. అక్కడ ఎకరా రూ.3 నుంచి రూ.4 కోట్లు పలుకుతా ఉంటే.. ఆయన ఎకరా రూ.29 లక్షల చొప్పునఎమ్మార్‌కు ఇచ్చేస్తే... ఎందుకయ్యా ఇలా చేశావూ అని సీబీఐ కనీసం అడగనైనా అడగడం లేదు.

జోరువానలోనూ.. జనప్రవాహం
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పళణి థియేటర్ సర్కిల్ రోడ్‌షోలో ప్రసంగిస్తుండగానే వర్షం మొదలైంది. అయినా జనం కట్టుకదల్లేదు.. అంత వానలో ఉద్వేగంగా జగన్ ప్రసంగిస్తుంటే.. అంతే ఆత్రుతగా అభిమానులు వింటూ వర్షాన్నే మరచిపోయారు. తర్వాత జగన్ ముత్యాలరెడ్డిపల్లె బహిరంగ సభకు చేరుకున్నారు. అక్కడా జోరు వానలో తడుస్తూనే ప్రసంగించారు. జనం కూడా వర్షాన్ని లెక్కచేయకుండా జగన్‌మోహన్ రెడ్డి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. వర్షం పడుతున్న సమయంలో ఆయన ఆకాశం వైపు చూసి రెండు చేతులెత్తి వరుణ దేవునికి నమస్కరించుకున్నారు.

ఆ దృశ్యాన్ని చూసిన జనం ‘వాళ్ల నాన్న లాగే వర్షం అంటే జగన్‌మోహన్‌రెడ్డికి కూడా ఎంతో ఇష్టం’ అంటూ మాట్లాడుకున్నారు. ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని తిరుపతి చేరుకున్న అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి 11.35 గంటలకు నగర శివార్లలోని ఆటోనగర్ నుంచి రెండో రోజు ప్రచారాన్ని ప్రారంభించారు. నగరంలో 10 జంక్షన్లలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆయన్ను చూసేందుకు ఎండను లెక్కచేయక మిద్దెలపైన, భవనాల పైన కూడా గంటలకొద్దీ జనం వేచి ఉన్నారు. రోడ్‌షోలో తన ప్రసంగం వినడానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి.. పచ్చ చీర రంగు అవ్వా.. కళ్లద్దాల అవ్వా.. చెల్లెమ్మా.. అంటూ జననేత పిలుస్తుంటే జనం పులకించిపోయారు. కాగా బుధవారం సాయంత్రం తిరుపతి ప్రచారం ముగించుకున్న జగన్.. తర్వాత కడప వెళ్లారు. గురువారం ఉదయం నుంచి ఆయన రాజంపేటలో ప్రచారం నిర్వహిస్తారు.

Wednesday, May 2, 2012

పేదవారి గురించి తపనే నా కులం : వైఎస్ జగన్



తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ఉద్ఘాటన
* ఒక నాయకుడి మతం, కులంపై మాట్లాడే స్థాయికి రాజకీయాలు దిగజారాయి
* పేదలు, రైతులకు అండగా ఉన్నందుకే 17 చోట్ల ఉప ఎన్నికలు
* తన స్వార్థం కోసం చిరంజీవి తిరుపతి ప్రజలను గాలికొదిలేశారు
* ప్రజారాజ్యం పార్టీని హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మేశారు
* నన్ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించానంటున్నారు
* సంతకాలు చేయించే ఉంటే.. ఆనాడే చంద్రబాబులా వారిని వైస్రాయ్ హోటల్‌కు తీసుకెళ్లేవాడిని.. సీఎంగా ప్రమాణం చేసేవాణ్ణి
* నేను సీఎం కావాలని ఎవరు సంతకాలు పెట్టించారో చెప్పండి
* నాడు రోశయ్యను సీఎంగా ప్రతిపాదించింది నేను కాదా?


తిరుపతికి గాలేరు-నగరి తెస్తా

‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలాగా.. చనిపోయాక కూడా పేదవాడి గుండెల్లో నిలిచేలా బతకాలన్న తపన, తాపత్రయం నాలో ఉన్నాయి. అందుకే చెబుతున్నా రాబోయే సువర్ణయుగంలో తిరుపతికి గాలేరు-నగరి తెస్తా.. తాగునీటి సమస్య తీరుస్తా’’ - జగన్‌మోహన్‌రెడ్డి


‘గత రెండేళ్లుగా చూస్తున్నా.. టీడీపీ అధినేత చంద్రబాబుకుగాని, కాంగ్రెస్ పెద్దలకుగాని ప్రజలు, వారి సమస్యలూ కనిపించడం లేదు. రెండేళ్లుగా వీరు చేస్తున్నదేంటంటే.. జగన్‌ను, వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎలా అప్రతిష్టపాలు చేయాలీ.. వారిపై ఎలా బురదజల్లాలీ అని కుట్రలు పన్నడం మాత్రమే. చివరకు వీరు ఏ నీచస్థాయికి దిగజారిపోయారంటే.. జగన్ కులమేంటి? జగన్ మతమేంటి? అని నిస్సిగ్గుగా మాట్లాడే పరిస్థితికి వచ్చేశారు’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. పేదవాడు ఎలా బతుకుతున్నాడు..? వారికి ఎలా మేలు చేయాలీ అన్న ఆలోచనే మానేసి ఇలా దిగజారి మాట్లాడుతున్న చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు తమ వ్యక్తిత్వం గురించి తమను తాము ఒకసారి ప్రశ్నించుకోవాలని ఆయన సూచించారు. ‘‘ఇవాళ చెబుతున్నా.. నా మతం మానవత్వం. నా కులం ప్రతి పేదవాడి గురించి తపించే కులం’’ అని జగన్ ఉద్ఘాటించారు. ఉప ఎన్నికలు జరుగనున్న తిరుపతి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిభూమన కరుణాకరరెడ్డి తరఫున జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రచారం ప్రారంభించారు. ఆయన్ను చూసేందుకు.. చెమటలుకక్కే మండుటెండలో సైతం తిరుపతి రోడ్లపై జనం కిక్కిరిశారు. జనం పెద్ద ఎత్తున తరలి రావడంతో జగన్ కాన్వాయ్ ముందుకు కదలడం కష్టంగా మారింది. ఆయన ప్రసంగిస్తుంటే.. ఈలలు, తప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. తిమ్మినాయుడు పాళెం పంచాయతీ నుంచి ప్రచారం ప్రారంభించిన జగన్.. తొలిరోజు మొత్తం 13 జంక్షన్లలో ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా మే డే జరుపుకొంటున్న కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేశారు. ఈ పర్యటనలో జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

చిరంజీవి స్వార్థం వల్లే తిరుపతిలో ఉప ఎన్నికలు:
రైతన్నకు, పేదోడికి అండగా నిలబడితే పదవులు పోతాయని తెలిసినా.. నీతి, నిజాయతీతో కూడిన రాజకీయాలు చేసినందుకు 17 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురయ్యారు. అందువల్లే ఆ 17 చోట్ల ఉప ఎన్నికలు వచ్చాయి. కానీ తిరుపతిలో చిరంజీవి స్వార్థం కోసం ఉప ఎన్నికలు వచ్చాయి. చిరంజీవే స్వయంగా చెప్పారు.. సోనియా గాంధీ ఆయనకు ప్రమోషన్ ఇచ్చారట.. అందుకని ఇక్కడి ప్రజల్ని గాలికొదిలేసి ఆయన రాజ్యసభకు వెళ్తున్నారట. తిరుపతిలో నాలుగురోజులకోసారి నీళ్లు ఇస్తున్నారని, ప్రభుత్వం నీటి ఎద్దడి పరిష్కరించలేదని చిరంజీవి రాజీనామా చేసుంటే సంతోషించేవాళ్లం. ఆయనకు నేను కూడా సెల్యూట్ చేసి ఉండేవాణ్ణి. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు కుదించారని, 108కు ఫోన్ చేసినా వాహనం వచ్చే పరిస్థితి లేదని రాజీనామా చేసుంటే అభినందించేవాళ్లం. రంగారెడ్డి జిల్లాకు చెందిన వరలక్ష్మి లాంటి పేద అమ్మాయి చదువుకోలేక, ఫీజు కట్టలేక ఆత్మహత్యకు పాల్పడింది. అలాంటి వారిని ప్రభుత్వం పట్టించుకోలేదని రాజీనామా చేసుంటే గర్వపడుండేవాళ్లం. పదవి కోసం, కావాల్సిన వారికి మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు చిరంజీవి హోల్‌సేల్‌గా తన పార్టీని కాంగ్రెస్‌కు అమ్ముకున్నారు. ఇప్పుడు చెప్పండి స్వార్థపరుడు చిరంజీవా, నేనా?

చిరంజీవి ఎప్పుడూ నాపై నింద వేస్తూనే ఉన్నారు:
చిరంజీవి మాటిమాటికీ నా మీద ఏదో ఒక నింద వేస్తూనే ఉన్నారు. ఆ వేళ నాన్న చనిపోయినప్పుడు.. నన్ను సీఎంగా చెయ్యాలంటూ 150 మందికిపైగా ఎమ్మెల్యేలతో నేను సంతకాలు చేయించానని అంటున్నారాయన. ఆ 150 మందికిపైగా ఎమ్మెల్యేల్లో కొంతమంది చిరంజీవి వద్దకు బహిరంగంగా అందరికీ తెలిసేటట్లుగా వెళ్లి.. వాళ్లందరినీ(పీఆర్‌పీ ఎమ్మెల్యేలందరినీ) నాకు మద్దతు తెలపాలని అడిగినట్లు చిరంజీవి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. దీనిపై చిరంజీవిని మా పార్టీ వాళ్లు చాలాసార్లు ఎదురు ప్రశ్నించారు. ఆయన వద్దకు వచ్చిన వారెవరో చెప్పాలని పదే పదే అడిగారు. ‘సాక్షి’లో కూడా చాలాసార్లు ఈ విషయాన్ని వేస్తూ వచ్చారు. అయితే ఆ ప్రశ్నలకు చిరంజీవి సమాధానం చెప్పలేదు. ఇప్పుడేమో బాబు కూడా చిరంజీవి మాటే మాట్లాడుతున్నారు.

కొంచెమైనా జ్ఞానముందా చిరంజీవీ?: 
నన్ను సీఎంగా చేయాలని 150 మందికిపైగా ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించే దుర్బుద్ధే నాకు ఉంటే.. చంద్రబాబు నాయుడిలా వాళ్లందరినీ ఆ నాడే వైస్రాయ్ హోటల్‌కు తీసుకెళ్లిపోయేవాణ్ణి.. ఆ వెంటనే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేవాణ్ణి. అయ్యా చంద్రబాబూ.. ఆ రోజు ఎవరు సంతకాలు చేయించారో నాకు తెలీదు. మీకు తెలిస్తే మీరైనా చెబితే సంతోషిస్తాను. అయ్యా చిరంజీవిగారూ.. కొంతమంది ఎమ్మెల్యేలను మీ వద్దకు పంపించి మద్దతు కోరానని మీరు చాలాసార్లు అన్నారు. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నాకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేలను మీ దగ్గరకు అలా బహిరంగంగా పంపించానని సోనియాకు తెలిస్తే.. నన్ను ఎలా సీఎం చేస్తారయ్యా? నీకు కొంచెమైనా జ్ఞానముండాలి కదయ్యా చిరంజీవి ఆ మాట మాట్లాడ్డానికి.

ప్రజల చేత ఎన్నుకోబడిన సీఎంనవుతా: 
చంద్రబాబుకు, చిరంజీవికి ఇద్దరికీ చెప్తున్నా.. మీ మాదిరిగా నేను అధికారం కోసం ఏ గడ్డయినా తినేవాణ్ణికాదు. అధికారం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచే చరిత్ర నాకు లేదు చంద్రబాబూ! ఓటేసిన 70 లక్షల మంది ప్రజల్నీ స్వార్థం కోసం నట్టేట ముంచిన చరిత్ర నాదికాదయ్యా చిరంజీవి.. అది నీదేనయ్యా. అధికారం అనేది దేవుడు నా నుదుట రాసిపెడితే.. అదెలా ఉంటుందీ అంటే.. పేదవాడి కొరకు, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన సీఎంగా నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. నా నైజం, నా గుణగణాలు ఇవే. ఈ మాదిరిగా నేను సీఎం అవుతానేకాని... మీలాగా దొడ్డిదారిన పదవి చేపట్టాలని తాపత్రయపడను. ఇవాళ చంద్రబాబును నేను ఒక్క మాట అడుగుతున్నా.. ఆ వేళ నేనే కదయ్యా రోశయ్యను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిందీ అని అడుగుతున్నా.

అందరూ ఒక్కటై దాడి చేస్తున్నారు:
  ఇవాళ అధికారం కోసం వెంపర్లాడుతూ నా మీద రోజుకో మాట మాట్లాడుతున్నారు. రోజుకో నింద వేస్తున్నారు. నన్ను ఒక్కడిని చేశారు. అటు సోనియా గాంధీ వైపు నుంచి కాంగ్రెస్‌వాళ్లు, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ కాంగ్రెస్ వాళ్లతో కలిసి దాడి చేస్తున్నారు. వాళ్ల దగ్గర అధికారం ఉంది. వాళ్ల దగ్గర ఉన్న వ్యవస్థలను అడ్డగోలుగా నా మీదకు ఉసిగొల్పుతున్నారు. మరోవైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 అంతా కలిసి దాడి చేస్తున్నారు.. నన్ను ఒక్కడిని చేసి వీరందరూ ఒక్కటై దాడి చేస్తున్నారు. రోజుకో కట్టు కథ.. రోజుకో అబద్ధం. రోజూ చెప్పిందే చెప్పి దుష్ర్పచారం చేసి ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తున్నారు. నన్ను ఒక్కడిని చేసి మీరంతా ఏకం కావచ్చు. నా దగ్గర రాజ్యాలు లేకపోవచ్చు.. మద్దతిచ్చే రాజులు లేకపోవచ్చు.. నా దగ్గర గుర్రాలు లేకపోవచ్చు. కానీ పై నుంచి ఆ దేవుని ఆశీస్సులు, నాన్నను ప్రేమించే ప్రతి గుండే నా వెంటే ఉందని చెప్తున్నా.

మీ ఓటు మార్పునకు నాంది:
త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో పేదవాడు, రైతు ఓ వైపు.. కుళ్లు, కుతంత్రాలు మరోవైపు ఉండి పోటీ పడుతున్నాయి. మీరు వేసే ఓటుతో ఈ రాష్ట్రాన్ని రిమోట్‌తో పాలిస్తున్న ఢిల్లీ పాలకుల దిమ్మ తిరగాలి. మీరు వేసే ఓటు రాష్ట్రంలో మార్పు తేవాలి. ఆ మార్పుతో రాష్ట్రంలో త్వరలో మళ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు సువర్ణయుగం వస్తుంది. ప్రతి అక్క, అన్న.. తమ తమ్ముడు సీఎం అయ్యాడని, ప్రతి చెల్లెలు, ప్రతి తమ్ముడు తమ అన్న సీఎం అయ్యాడని.. ప్రతి అవ్వా, తాత తమ మనవడు సీఎం అయ్యాడని అనుకునే విధంగా, ప్రతి రైతు, పేదవాడు కాలర్ ఎగరేసేలా ఆ సువర్ణయుగం ఉంటుంది. ఏటా పేదలకు 10 లక్షల ఇళ్లు కట్టించే విధంగా పాలన ఉంటుంది.

Friday, January 27, 2012

సర్కారు కళ్లు తెరిపిద్దాం! * గుంటూరు ఓదార్పులో జగన్ పిలుపు

*వస్త్ర వ్యాపారులకు అండగా నిలుద్దాం
*వ్యాట్ విధింపుపై ఆరు నెలలుగా పోరాటం చేస్తున్నా చలనం లేదు
*ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి.. చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా తయారైంది

  ‘‘వస్త్రాలపై వ్యాట్ తగ్గించాలని చిన్న చిన్న వ్యాపారులు కూడా దుకాణాలు మూసివేసి సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు.. ఈ పాలకుల కళ్లు తెరిపించేందుకు ప్రజలు సిద్ధం కావాలి..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పేద వ్యాపారులకు తోడుగా నిలుద్దామని అన్నారు. గురువారం గుంటూరు జిల్లా గురజాల పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి జగన్... 58వ రోజు ఓదార్పు యాత్రను ప్రారంభించారు.

గురజాల నియోజకవర్గం దాచేపల్లి, గురజాల మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జగన్నాథపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాను బొడ్డపాటి అంజిరెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. మొత్తం ఏడు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ప్రసంగించారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...


చెవిటివాని ముందు శంఖం ఊదినట్టుగా..

పెంచిన వ్యాట్ తగ్గించాలని వస్త్ర వ్యాపారులు దుకాణాలు మూసేశారు. ఆరు నెలల నుంచి ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తూనే ఉన్నారు. చిన్నచిన్న దుకాణాల వాళ్లు కూడా షాపులు మూసి సమ్మె చేస్తున్న పరిస్థితులు ఉన్నా... వారిని పట్టించుకునే నాథుడే లేడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి... చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా తయారైంది. ఈ చిన్నచిన్న దుకాణాల వాళ్లకు మద్దతుగా నిలబడటం కోసం శుక్రవారం రోజున (నేడు) నరసరావుపేటలో ధర్నా చేయబోతున్నాం. దుకాణదారులకు మద్దతుగా ప్రజలంతా ఈ ధర్నాలో పాలుపంచుకోవాలని కోరుతున్నా. నేను కూడా మీతో పాటుగా అక్కడ ధర్నాలో పాలు పంచుకుంటాను.

మాట వదిలేస్తే బతకటమే అనవసరం..
మాటంటూ ఇస్తే ఎన్నికల వేళ ప్రజలను మోసం చేయడానికి కాదు.. కష్టమైనా.. నష్టమైనా ఇచ్చిన మాట తప్పకూడదని.. మడమ తిప్పకూడదని.. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం తెచ్చిన దివంగత వైఎస్సారే నాకు స్ఫూర్తి. ప్రజల గుండె చప్పుడు వినాలని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మండుటెండలో కాలినడకన 1500 కిలోమీటర్లు ప్రయాణించిన ఆ మహానేత అడుగుజాడల్లోనే నా పయనం. నాడు నల్లకాలువ సంతాప సభలో పాల్గొన్నప్పుడు నా మనసు నిండా బాధ ఉంది. తండ్రిని పోగొట్టుకున్న బాధ ఎలా ఉంటుందో తెలిసింది.

దివంగత నేత కోసం ఎవరెవరు చనిపోయారో ఆ ప్రతి కుటుంబాన్నీ కలిసి పరామర్శిస్తానని అప్పుడే మాట ఇచ్చాను. అది నువ్వు ఎందుకు చెప్పావని ఎవరైనా అడిగితే.. నేను సమాధానం చెప్పలేను. దేవుడు ఆ మాట నా చేత ఎందుకు చెప్పించాడో తెలియదు. ఎలాంటి రాజకీయాలు లేని ఆ వేళ నేను కల్మషం లేని మనస్సుతో ఆ మాట చెప్పాను. నేను ఇచ్చిన ఆ మాటను గాలికి వదిలేయమన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. అలా నేను చేయలేనని చెప్పాను. కారణం ఏమిటంటే.. ఇచ్చిన మాటను వదిలేస్తే నేను బతికి ఉండటం కూడా అనవసరం అనిపించే ఆ మాట చెప్పా.

మాట తప్పనందుకే సీబీఐ విచారణ..
ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నందుకు ఇవాళ నా మీద సీబీఐ విచారణ వేశారు. ఇన్‌కంటాక్స్ కేసులు పెట్టారు. ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టరేట్‌తో నా మీద దాడులు చేయించారు. అన్నీ జరిగాయి. కానీ ఆ మాటపై నిలబడినందుకు నేను ఇవాళ కొన్ని వేల కిలోమీటర్లు తిరిగాను. 600 గుడిసెల్లోకి వెళ్లాను.. ప్రతి పేదవాడు పడుతున్న కష్టాన్ని దగ్గర నుంచి చుశాను.. ఆ మాటను గాలికి వదిలేసి ఉంటే బహుశా ఎప్పటికి కూడా నేను ఇవ న్నీ చూసి ఉండక పోయేవాణ్నేమో.

Tuesday, January 17, 2012

రైతుల కళ్లలో కన్నీళ్లు - పట్టించుకున్న నాథుడే లేడు : జగన్

గుంటూరు ఓదార్పులో వైఎస్ జగన్ ఆవేదన
అన్నదాత అధోగతిలో ఉన్నా.. 10 నెలలుగా రాష్ట్రంలో
వ్యవసాయ మంత్రి లేరు
వ్యవసాయం చేయడం కన్నా ఉరి వేసుకోవడం మేలనే మాట వినిపిస్తోంది



రాష్ట్రంలో రైతన్నల ముఖాల్లో కన్నీళ్లే కనిపిస్తున్నాయని, దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత రాష్ట్రంలో రైతుల గురించి పట్టించుకునే నాథుడు ఒక్కరంటే ఒక్కరూ కనిపించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత అధోగతిలో ఉన్నా.. ఈ రాష్ట్రానికి 10 నెలలుగా వ్యవసాయ శాఖ మంత్రి కూడా లేరని ప్రభుత్వంపై మండిపడ్డారు. పండించిన ఏ పంటకూ మార్కెట్లో సరైన ధర దక్కక రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు.

మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలోని దిడుగు గ్రామంలో ఓదార్పు యాత్రను వై.ఎస్.జగన్ పునఃప్రారంభించారు. జిల్లాలో 49వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన పెదకూరపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆరు వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూపూడి, పెదకూరపాడు సహా పలుచోట్ల ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...


‘‘ఐదు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మూడ్రోజులపాటు రైతు దీక్ష చేసి ఇక్కడకు వచ్చాను. రైతన్నల ముఖాన ఈవేళ కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వరి వేసుకున్న రైతులను అడిగితే బస్తా రూ.750కు కూడా అమ్మలేని పరిస్థితుల్లో ఉన్నామన్న సమాధానం వచ్చింది.

మిరప రైతులను కలిస్తే.. క్వింటాలుకు రూ.4 వేలు కూడా గిట్టని స్థితిలో ఉన్నామని సమాధానమిచ్చారు. పత్తికి క్వింటాలుకు రూ.3,500 కూడా అందడంలేదు. వ్యవసాయం చేసుకోవడం కంటే ఉరివేసుకోవడం మేలనే మాట వినవస్తోంది. ఇక్కడకు వచ్చే ముందు దారిలో నడిరోడ్డుపై పరిచిన ఉల్లిపాయలను రైతులు నాకు చూపిం చారు. ఎకరాకు రూ.40 వేల నుంచి 50 వేలు ఖర్చుచేశాం. అమ్ముదామంటే కిలోకు రెండు రూపాయలు కూడా సరిగా గిట్టని పరిస్థితులున్నాయని రైతులు చెబుతున్నపుడు బాధనిపించింది.

దివంగత మహానేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి ఉన్నపుడు ఇవే ఉల్లిపాయలు కిలో రూ.16కు అమ్మిన రోజులు గుర్తుకు వస్తున్నాయని ప్రతి రైతు చెబుతున్నపుడు.. ఆ సువర్ణయుగం అన్నదాతలకు రోజూ గుర్తుకు వస్తూనే ఉంటుంది. జూపూడి గ్రామం వచ్చేముందు కొందరు మిర్చి రైతులు నాతో మాట్లాడారు. మిర్చి పంటను చూపిస్తూ.. మొన్న వర్షమొచ్చింది.. బొబ్బర వైరస్ వచ్చి 20-25 క్వింటాళ్లు పండాల్సిన పంట.. 10 క్వింటాళ్లకు మించి పండే పరిస్థితి కనిపించడం లేదు. మార్కెట్‌కు వెళితే క్వింటాలు రూ.4 వేలకు మించి రాదు.. ఎకరాకు రూ.70 వేలు నష్టం వ చ్చే పరిస్థితులు కనబడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వంక ఆశగా చూస్తున్నా.. పట్టించుకోని పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి బతికివుంటే పరిస్థితులు ఈ మాదిరిగా ఉండేవి కావనే మాట ప్రతి రైతు నోటా వినిపిస్తోంది. రాముడి రాజ్యమైతే చూడలేదు గానీ, రాజశేఖరుడి సువర్ణపాలన చూశామని అందరూ గర్వంగా చెబుతున్నారు.


పనుల కోసం జిల్లాలు దాటి వలసలు...


దారిలో చాలామంది అక్కాచెల్లెళ్లతో మాట్లాడాను. పొలాల్లో పనిచేస్తున్నారు. నన్ను చూసి వారంతా నా దగ్గరకు వచ్చి ఆప్యాయత చూపించారు. వారిలో కర్నూలు నుంచి కూడా వచ్చిన అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ‘తల్లీ...అక్కడ పనులు లేవా?...ఇక్కడదాకా వచ్చారు?’ అని అడిగితే.. ‘అక్కడ రోజుకు రూ.70-80 కూడా గిట్టడం లేదు. మిరప తోటలకెళితే రూ.120-130 గిడతాయని వచ్చామన్నా’ అని అన్నారు. అక్కడ్నుంచి వలసలు వచ్చారు. చిన్నపిల్లలను చంకన వేసుకుని పొలాల్లో పనిచేస్తున్న వారిని చూసి బాధనిపించింది.

రెండు నెలల్లో విద్యాసంవత్సరం ముగియనున్న పరిస్థితుల్లో విద్యార్థులకు ఈ ఏడాదికి సంబంధించి రావల్సిన రీయింబర్స్‌మెంట్ బకాయిల గురించి అడిగే నాథుడే కరువయ్యాడు. ఇల్లు కట్టుకోవడం అటుంచి వైఎస్ బతికి ఉన్నప్పుడు కట్టుకున్న ఇళ్లకు డబ్బులు రాని పరిస్థితి. పేదవాడు అనారోగ్యం పాలైనప్పుడు ఆదుకున్న 108 అంబులెన్సులకు ఫోనుచేస్తే అందుబాటులేని దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడుపుతున్న పెద్దలను చూస్తే బాధనిపిస్తోంది.’’

చనిపోయిన మహానేతకు ఓ న్యాయమట..
బతికున్న బాబుకు ఇంకొక న్యాయమట..


‘ఇవాళ రాష్ట్రంలోనయినా, కేంద్రంలోనయినా సోనియాగాంధీ రాజ్యమేలుతున్నారంటే.. దానికి కారణం వై.ఎస్.రాజశేఖరరెడ్డి. అలాంటి నేత చనిపోయాడని తెలిసీ, తిరిగి రాడని తెలిసీ, బతికి ఉన్నపుడు ఒక మాటా మాట్లాడని ఇదే కాంగ్రెస్ నేతలు.. ఆయన చనిపోయాక అప్రతిష్టపాలు చేయాలని, నైతిక విలువలన్నీ పక్కనపెట్టి చివరకు చంద్రబాబునాయుడుతో కలిశారు. కుళ్లు, కుతంత్రాలు పన్ని కోర్టులకు వెళ్లి.. కేసులు వేసి చనిపోయిన ఆ మహానేతను అప్రతిష్టపాలు చేయాలని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రజలను, ప్రజా సమస్యలను గాలికొదిలేశారు. విలువలు లేని, విశ్వసనీయత లేని, న్యాయం లేని, ధర్మం లేని రాజకీయాలను వీరు కలసికట్టుగా చేస్తున్నారు. చనిపోయిన మహానేతకు ఒక న్యాయమట.. బతికివున్న చంద్రబాబునాయుడుకు ఇంకొక న్యాయమట! ఇలాంటి అన్యాయమైన వ్యవస్థను చూసి బాధనిపిస్తుంది.’

Thursday, January 12, 2012

ఇకనైనా కళ్లు తెరవండి - లేదంటే మేమే తెరిపిస్తాం * రైతు దీక్షలో సర్కారుకు జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరిక

రైతు పరిస్థితి దయనీయంగా ఉంది
కరువు రైతులను ఆదుకోండి
రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయండి

‘‘ఈ దీక్షను చూసి ఇప్పటికైనా కళ్లు తెరవండి.. లేకుంటే మేమే తెరిపిస్తాం.. రైతు సమస్యలపై కదలండి.. జగన్ దీక్ష చేశాడని కుళ్లుకోకుండా.. ఇది రైతులంద రూ చేసిన దీక్షగా చూడండి..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర సర్కారుకు హితవు పలికారు. రైతుల కష్టాలు తీర్చాలంటూ ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని నిరాహారదీక్షలు చేసినా.. ప్రభుత్వ వైఖరి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగానే ఉందని నిప్పులు చెరిగారు. కరువు ప్రాంతాల్లోని రైతులను, రైతు కూలీలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని, పంటలన్నీ నష్టపోవడంతో వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మూడు రోజులపాటు చేపట్టిన రైతు దీక్షను ఆయన గురువారం సాయంత్రం విరమించారు. అనంతరం ముగింపు సభలో ఉద్వేగంగా ప్రసంగించారు. రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. విశ్వసనీయత, విలువలు లేని రాజకీయాలను చీల్చి చెండాడారు. రైతు దీక్ష వేదికగా నాలుగు ప్రధాన డిమాండ్లను సర్కారు ముందుంచారు. రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, రైతులు పండించిన పంటలను గిట్టుబాటయ్యే రేట్లకు కొనుగోలు చేయాలని, వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా చేయాలని, కరువు మండలాల్లోని రైతులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని నినదించారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే ప్రాణహిత-చేవెళ్ల, ఎల్లంపల్లి, నెట్టెంపాడు, బీమా-1, బీమా-2 నుంచి పోలవరం వరకు ప్రతి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 

ఆద్యంతం రైతులు, రైతు కూలీల కష్టాలను ప్రస్తావిస్తూ సాగిన జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...

పెట్టుబడి ఖర్చులు మూడు రెట్లు.. రాబడి మూడోవంతు..

రాష్ట్రంలో రైతుల పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంత దయనీయంగా ఉంది. వ్యవసాయంలో పెట్టుబడుల ఖర్చులు మూడింతలు పెరిగాయి.. కానీ రాబడి మాత్రం మూడో వంతుకు పడిపోయింది. పసుపు రైతులు తమ గోడు చెపుతుంటే నాకు చాలా బాధ కలిగింది. ఎకరానికి రూ.1.20 లక్షల పెట్టుబడి పెడితే వర్షాల్లేక దిగుబడి భారీగా తగ్గిపోయింది. 15 క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు. ఇప్పుడు మార్కెట్లో క్వింటాలు పసుపుకు రూ.4000కు మించి రాని పరిస్థితులు ఉన్నాయి. పంటను అమ్ముకుంటే ఆ రైతన్నకు రూ.60 వేలు వస్తాయి. మరో రూ.60 వేలు నష్టం వచ్చే పరిస్థితి ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో పసుపు పంట క్వింటాలుకు రూ.16 వేలు ధర ఉంటే.. నిరుడు అది రూ.12 వేలకు పడిపోయింది. నిన్ననే ఓ రైతు నా దగ్గరికొచ్చాడు. పసుపును నిరుడు ఇదే సమయానికి రూ.13,700కు అమ్ముకుంటే... ఈ ఏడాది రూ.4,200కే అమ్ముకోవాల్సి వచ్చిందని మార్కెటు స్లిప్పులు తెచ్చి నాకు చూపించాడు. ఒక్క పసుపే కాదు. వరి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక్క బస్తా అమ్ముకుంటే రూ.750కి మించి రావడం లేదు. వ్యవసాయం చేయటం కంటే ఉరి పోసుకోవటమే మేలు.. అన్న సామెత ప్రతిచోటా వినిపిస్తోంది.గిట్టుబాటు ధరల్లేక పత్తి, చెరకు రైతులు కూడా తల్లడిల్లుతున్నారు. మార్కెట్లో చక్కెర ధర కిలోకు రూ. 34 ఉంటే... చెరకు పండించిన రైతులకు మాత్రం టన్నుకు రూ.2000 గిట్టడం లేదు. నిరుడు రూ.12 వేలు పలికిన మిర్చికి ఇప్పుడు రూ. 5 వేలకు కాస్త అటుఇటు గా ఉంది. అలాగే కిందటేడాది రూ.4 వేల ధర ఉన్న సజ్జకు ఇప్పుడు రూ.2 వేలు మాత్రమే వస్తోంది. మహానేత వైఎస్ హయాంలో టన్ను రూ.18 వేలు పలికిన బత్తాయి ఇప్పుడు రూ.6 వేలకు కూడా అమ్ముడుపోవడం లేదు. టమాటా ధర అయితే అర్ధ రూపాయికి పడిపోయింది. ఉల్లి రెండు రూపాయలకు కిలో అమ్ముకోవాల్సిన దుర్భర దుస్థితి ఉంది.


పంట చేతికొచ్చేసరికి రేట్లు పడిపోతున్నాయి..

కరెక్టుగా పంట రైతన్న చేతికి వచ్చే సమయానికి మార్కెట్లో రేట్లు తగ్గిపోతున్నాయి. తీరా ఆ పంట వ్యాపారుల చేతికి వెళ్లిపోయాక రేట్లు పెరిగిపోతున్నాయి. అప్పుల బాధలు పడలేక, ఎంతో కొంత రేటుకు రైతన్న తన పంటలను అమ్ముకుంటున్నాడు. ఎరువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. వైఎస్ ఉన్నప్పుడు రూ.430 ఉన్న డీఏపీ ఎరువు రేటు... ఇప్పుడు రూ.1,050కి పెరిగింది. రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చేందుకు ఇప్పటికే గల్లీ నుంచి ఢిల్లీ దాకా చాలా దీక్షలు చేశాం.. నిరాహార దీక్షలు చేశాం.. కలెక్టరేట్లను, మండల కార్యాలయాలను ముట్టడించాం. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్ని చేసినా ఈ ప్రభుత్వ వైఖరి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉంది.
రైతును చూసి జాలిపడుతున్న కూలీ...

రాష్ట్రంలో కూలీల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. రోజు కు కనీసం రూ.100లు కూడా గిట్టడం లేదని వారు చెబుతున్నారు. ‘‘కానీ.. పాపం... రైతన్నలే కష్టాలు, నష్టాల్లో ఉన్నారు. ఇంకా మాకేం ఇవ్వగలుగుతారు’’ అని వారు రైతుల పట్ల జాలి చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఇంతటి దయనీయ పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. బహుశా దేశచరిత్రలోనే మొదటిసారి అనుకుంటా.. రాష్ట్రంలోని రైతులు ఏకంగా క్రాప్ హాలిడే ప్రకటించి సమ్మె చేసే పరిస్థితి వచ్చింది. రైతులను, రైతులను నమ్ముకున్న కూలీలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది.
‘మీ నాన్న వల్లే చిరునవ్వు..’ అన్నప్పుడు ఆనందమేసింది..

తొలిరోజున అంకాపూర్‌కు చెందిన రైతు మోహన్‌రెడ్డి నన్ను కలిశాడు. ‘‘రాష్ట్రమంతటా కరువు ఉంటే చిరునవ్వుతో మేమెందుకున్నామంటే.. మీ నాన్న గుత్ప, అలీసాగర్ ప్రాజెక్టులు మాకిచ్చారు. అంతకుముందు ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. చూసి వెళ్లి పోయారు. ఎన్నికలప్పుడు వచ్చి ఏదో చేస్తామన్నారు. కానీ మీ నాన్న మా ఊరికొచ్చారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేసి మమ్మల్ని ఆదుకున్నాడు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతోనే మాకు నీళ్లొచ్చాయి. రూ.230 కోట్లతో గుత్ప, రూ.270 కోట్లతో అలీసాగర్ నిర్మించారు..’’ అని మోహనన్న చెప్పినప్పుడు ఆనందమైంది. రైతుల బాధలు అర్థం చేసుకున్న వ్యక్తి దివంగత నేత వైఎస్ ఒక్కరే. అందుకే వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రాజకీయాల్లో విలువలకు అర్థం తెచ్చి.. విశ్వసనీయతకు అద్దంపట్టిన నాయకుడు వైఎస్. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట... అధికారపక్షం లో ఉన్నప్పుడు ఇంకోమాట మాట్లాడుతూ.. ఎన్నికలప్పు డు మాత్రమే ప్రాజెక్టులకు టెంకాయలు కొడుతున్నారు.
ఆ 17 మంది విలువలు, విశ్వసనీయత వైపు నిలిచారు..

నాకు తల్లి లాంటిది, మన అక్కసురేఖను చూసి గర్వపడుతున్నా. కారణమేమిటంటే... విలువలు, విశ్వసనీయత లేక చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను కాదని ఆమెతోపాటు 17 మంది ఎమ్మెల్యేలు మాత్రం నిఖార్సుగా పేదల పక్షాన నిలిచారు. ప్రజలందరూ మనవైపు చూస్తున్నారు.. రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు.. పేద విద్యార్థి చదవలేని పరిస్థితి.. పేదలు బతకలేకపోతున్నారు.. ఈ చెడిపోయిన వ్యవస్థలో మార్పు తీసుకురావటానికి మనల్ని చూస్తున్నారు. చంద్రబాబు ఏ దురుద్ధేశపూర్వకంగా అవిశ్వాసం ప్రవేశపెట్టినా కూడా.. మనం మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందే.. అని నేను వారికి చెప్పా. ఈ రాజ కీయ వ్యవస్థలో విలువలు కావాలి.. విశ్వసనీయత ఉండాలి అని, ప్రతి ఒక్కరూ రైతుల కోసం నిలబడాలని, పేద ప్రజల కోసం పోరాడాలని అని నేను చెప్పిన మాటను గౌరవించి వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. త్వరలోనే ఎన్నికలు కూడా జరగబోతాయి. ఆ రోజు ఎమ్మెల్యేలందరూ భయపడ్డారు కూడా. ఎందుకంటే అధికార పక్షంతో పోటీ. వాళ్లు కోట్లతో కుమ్మరిస్తారు. మంత్రులంతా నియోజకవర్గాల్లో మకాం వేస్తారు. పోలీసు యంత్రాంగం కూడా వారి చెప్పుచేతల్లో ఉంటుంది. కానీ.. వారికి నేనొక్కటే చెప్పా.. విలువలు, విశ్వసనీయతకు కట్టుబడదామని. మొట్టమొదటిసారి రైతుల కోసం పేదల కోసం ఎన్నికలు జరగబోతున్నాయి.. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికలు జరగబోతున్నాయి.

బిల్లులు కట్టని రైతులను జైల్లో పెట్టాలన్నది బాబే...!
జీవో 89, 99 ప్రతులను వేదికపై చూపిన జగన్


కరెంటు బిల్లులు కట్టని రైతులను జైల్లో పెట్టాలంటూ చంద్రబాబు తన హయాంలో ఇచ్చిన జీవో కాపీలను రైతు దీక్ష వేదికపై జగన్‌మోహన్‌రెడ్డి చూపారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మించి మరో వ్యక్తి ఉన్నాడు. ఆయనే చంద్రబాబునాయుడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ నేతకైనా విశ్వసనీయత, విలువలు అంటే అర్థం తెలిసిఉండాలి. ఆయ న చేసే పనులు ఏవీ కూడా రైతులు, పేదలపై ప్రేమతో కాదు. ‘‘నాకేంటి లాభం..?’’ అన్న ఆలోచనతోనే చేస్తున్నారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు బట్టలారేసుకునేందుకే ఉపయోగపడతాయన్న చంద్రబాబు.. ఇప్పుడు నిస్సిగ్గుగా తానే తొమ్మిది గంటల కరెంటు ఇస్తానని అబద్ధాలు చెబుతున్నారు. రైతులు కరెంటు బిల్లులు కట్టకుంటే వారిని జైల్లో పెట్టేందుకు, శిక్షించేందుకు ఆయన జీవో నం.89, జీవో నం.99లు జారీ చేశారు. జీవో 89లో... కరెంటు బిల్లులు కట్టని రైతులను వారెం టు కూడా లేకుండా అరెస్టు చేయండి అని చెప్పారు.


అంతటితో ఆగకుండా బిల్లులు చెల్లించని రైతులకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించాలి.. అని ఇదే జీవోలో చెప్పారు. కరెంటు బిల్లులు కట్టని రైతులను శిక్షించేందుకు స్పెషల్ కోర్టును ఏర్పాటు చేస్తూ జీవో 99 తెచ్చారు. రైతులపై బాబుకు ఉన్న ప్రేమ ఇదీ..! అంతకుముందు రూ.50 ఉన్న హార్స్‌పవర్ విద్యుత్తు బిల్లును రూ.650కి పెంచిన పెద్దమనిషి కూడా చంద్రబాబే. వైఎస్ ఐదేళ్లపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును అమలు చేసి చూపించిన తర్వాత.. ఎన్నికలకు పోయినప్పుడు నేను కూడా ఇస్తా అంటూ బాబు చెప్పారు. మళ్లీ ఇటీవల కరీంనగర్ సభకు వెళ్లినప్పుడు.. ‘‘విద్యుత్తు తీగలు చూపిస్తూ.. చూశారా... ఆ రోజే నేను చెప్పా. ఉచితంగా కరెంటిస్తే బట్టలారేసుకోవాల్సి వస్తుంది.. అదే నిజమైంది..’’ అని ఇదే చంద్రబాబు అన్నారు. ఒక మనిషి ఏ మాత్రం విలువలు, విశ్వసనీయత లేకుండా మాట మార్చుకుంటూ పోతాడో చెప్పేందుకు చంద్రబాబే ఒక ఉదాహరణ’’ అని జగన్ అన్నారు.


ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆత్మహత్యలు

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకమే కారణం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో రైతుల పరిస్థితి ఎంతో మెరుగుపడింది, వ్యవసాయం ఆశాజనకంగా ఉండేది. వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రంలో 134 లక్షల టన్నుల ధాన్యం ఉత ్పత్తులుంటే, ఆయన సీఎం అయ్యాక 220 లక్షల టన్నులకు ఉత్పత్తులు పెరిగాయి. కానీ మహానేత మరణం తరువాత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పండించిన పంటల పరిస్థితి ఇలా ఉంటే... తినడానికి సరైన తిండిలేకపోవడంతో దేశంలో 42 శాతం పిల్లలు పౌష్టికాహార లోపంతో ఎదుగుదల లేకపోయిందని స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించారు. దీన్నిబట్టి దేశంలో, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో స్పష్టమవుతోంది. వైఎస్సార్ నాటి స్వర్ణయుగం రావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం. రైతుల పక్షాన అనేక ఉద్యమాలు, దీక్షలు చేస్తున్న జగన్ చరిత్ర సృష్టిస్తున్నారు. ప్రతి ఒక్కరూ జగన్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలి.
- మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ

రైతు దీక్షతో ప్రభుత్వానికి హెచ్చరిక


రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులపాటు అకుంఠిత దీక్ష చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక పంపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం నిద్ర వీడడం లేదు. అందుకే జగన్ రైతుల పక్షాన పోరాడుతూ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. తొమ్మిదేళ్ల హయాంలో రైతుల జీవితాలతో చెలగాటమాడిన చంద్రబాబు చేస్తున్న రైతుపోరును చూసి జనం నవ్వుకుంటున్నారు. విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించాలని కోరినందుకు ముగ్గురు తెలంగాణ బిడ్డలను కాల్చి చంపిన ఘనత చంద్రబాబుదే. కానీ వైఎస్సార్ అధికారంలోకి రాగానే విద్యుత్ బకాయిలు మాఫీ చేశారు. ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంతోపాటు పంటకు గిట్టుబాటు ధర అందించారు. ఆయన తనయుడు జగన్ అధికారంలోకి వస్తేనే రైతుల జీవితాలు బాగు పడతాయి.
- కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే

తెలంగాణపై జగన్‌కు స్పష్టమైన వైఖరి ఉంది

తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్పష్టమైన వైఖరి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి ఏడాది ప్లీనరీలోనే తెలంగాణ ప్రజల మనోభీష్టాన్ని గౌరవిస్తున్నామని చెప్పి, తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలపబోమని స్పష్టంగా ప్రకటించారు. తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతం అవలంబిస్తున్న టీడీపీ... తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది తామేనంటున్న కాంగ్రెస్ తెలంగాణపై స్పష్టమైన వైఖరిని వెల్లడించకుండా ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నాయి. జగన్ తెలంగాణకు రావద్దనడానికి ఆ పార్టీలకు సిగ్గుండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రెండు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుంది, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పునాదులు కదిలి పోతాయి. జగన్ రైతుదీక్షకు మద్దతు తెలిపిన వేలాదిమంది రైతులకు కృతజ్ఞతలు.
- బాజిరెడ్డి గోవర్ధన్, వైఎస్సార్‌సీపీ నేత

వైఎస్ హయాంలో ముస్లింలకు న్యాయం

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లిం లకు న్యాయం జరిగింది. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది వైఎస్సారే. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చిరంజీవి అరకులో గిరిజనులతో కలిసి డ్యాన్స్‌లు చేస్తున్నారు. జగన్‌ను ఎదుర్కొనే సత్తా లేక చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకమయ్యారు. కిరణ్ కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు చివరి కిరణం. చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు.
- ఎంఏ రెహమాన్, మాజీ ఎమ్మెల్సీ

జగన్‌కు నిమ్మరసం ఇవ్వడం ఆనందంగా ఉంది

  రైతు సమస్యలపై మూడు రోజులుగా దీక్ష చేసిన రైతు బాంధవుడు వైఎస్ జగన్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేయడం ఆనందం గా ఉందని ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన నక్కల భూమారెడ్డి అనే రైతు సంతోషం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం భూమారెడ్డి తన చేతులతో జగన్‌కు నిమ్మరసం తాగించి రైతుదీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో పథకాలు చేపట్టి రైతులకు మేలు చేశారని, వ్యవసాయ రుణ మాఫీ కింద తనకు ఒక లక్ష రూపాయలు మాఫీ అయినట్లు గుర్తుచేసుకున్నారు. కరెంటు బకాయిలు కూడా మాఫీ అయ్యాయని చెప్పారు. మూడ్రోజులుగా దీక్ష ప్రాంగణంలోనే ఉన్నానన్నారు.
- రైతు నక్కల భూమారెడ్డి స్పందన

తరలివచ్చిన పల్లెలు * రెండో రోజూ ‘రైతు దీక్ష’కు అదే ఆదరణ


వైఎస్ జగన్‌ను చూడ్డానికి తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన కర్షకులు, వృద్ధులు, మహిళలు, కార్యకర్తలు
ఉదయం నుంచే పోటెత్తిన జనం.. రాత్రి దాకా బారులు
ఎండిన పంటలు తీసుకొచ్చి గోడు చెప్పుకొన్న రైతన్న
దీక్ష వద్ద న్యూడెమోక్రసీ కార్యకర్తల ఆందోళన
నేటితో ముగియనున్న మూడు రోజుల రైతు దీక్ష
సాయంత్రం నాలుగు గంటలకు ముగింపు సభ ప్రారంభం

అదే ఆదరణ.. అదే అభిమానం.. అపూర్వ నీరాజనం.. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని పెర్కిట్ వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘రైతు దీక్ష’కు రెండో రోజూ పల్లె జన ప్రవాహం వెల్లువెత్తింది. దీక్ష జరుగుతున్న వైఎస్సార్ ప్రాంగణం జన జాతరను తలపించింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు జన ప్రవాహం పోటెత్తింది. ‘ఒక్కసారి జగనన్నను చూడాలి.. మా గోడు చెప్పుకోవాలి..’ అంటూ కర్షకులు, కార్మికులు, వృద్ధులు, విద్యార్థులు, పిల్లాపాపలతో మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తెలంగాణలోని అన్ని పల్లెల నుంచీ అత్యధిక సంఖ్యలో దీక్షా ప్రాంగణానికి చేరుకున్న రైతన్నలు ఉదయం నుంచి రాత్రి వరకు బారులు తీరి కనిపించారు. అన్నదాతలతో పాటు అన్ని వర్గాలూ మద్దతు పలకటంతో దీక్షకు అంచనాలకు మించిన స్పందన లభించింది.

తెల్లవారుజాము నుంచే..

మొదటి రోజున జగన్ ఆలస్యంగా ఆర్మూరుకు చేరుకోవటం.. రాత్రి ఎనిమిదిన్నరకు దీక్ష ప్రారంభం కావటంతో... చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది రైతులు మంగళవారం ఆయనను కలుసుకోలేకపోయారు. వారిలో కొందరు రాత్రిపూట చలిని సైతం లెక్కచేయకుండా ఇక్కడే జాగారం చేశారు.. చలి మంటలతో కాలక్షేపం చేసి.. ఉదయాన్నే తమ అభిమాన నేతను కలుసుకోడానికి క్యూలో నిలబడ్డారు. దీంతో తెల్లారుజాము నుంచే దీక్షా ప్రాంగణంలో రైతు జాతర మొదలైంది. ఉదయం నాలుగున్నరకే నిద్రలేచిన జగన్‌మోహన్‌రెడ్డి ఆరున్నర గంటల నుంచి రైతులను పలకరించారు. రాత్రి వరకు నిర్విరామంగా తనను కలిసేందుకు వచ్చిన రైతులతోనే ఎక్కువ సమయం గడిపారు. వారందరితో ఓపికగా మాట్లాడి కరువు తెచ్చిన కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు.

వైఎస్ మరణించాక..

నిజామాబాద్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి రైతులు దీక్షకు తరలివచ్చారు. తమ కన్నీటి కరువు గోడును జగన్‌తో చెప్పుకునేందుకు పోటీ పడ్డారు. గంటల తరబడి క్యూలో నిలబడి తమ కష్టనష్టాలను విన్నవించుకున్నారు. తమను పట్టించుకునేవారెవరూ లేరని, వైఎస్‌ఆర్ మరణం తర్వాత తమ బతుకు దుర్భరంగా మారిందని కొందరు పసుపు రైతులు జగన్ ఎదుట కంటతడి పెట్టారు. ఎండిన పంటలను వెంట తెచ్చి.. తమ కష్టాలను కళ్లకు కట్టారు. రైతులు చెప్పినదంతా సావధానంగా ఆలకించిన జననేత.. ఏం చేస్తే.. సమస్య పరిష్కారమవుతుందని వారినే అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కష్టాలు తీరే మంచి రోజులు వస్తాయని.. మనో నిబ్బరం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు.

ఇంటికి ఒకరు చొప్పున..

ఆర్మూరు మండలంలోని మంథని గ్రామం నుంచి ఇంటికి ఒకరు చొప్పున గ్రామస్థులంతా దీక్షా స్థలికి వచ్చారు. గ్రామాభివృద్ధి కమి టీ తీర్మానం మేరకు.. వారందరూ ఇలా సామూహికంగా దీక్షకు తరలివచ్చారు. ఆ గ్రామ ప్రజలను వైఎస్ జగన్ అప్యాయంగా పలకరించి తన ఆత్మీయతను పంచుకున్నారు. మరోవైపు అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన పార్టీ నేతలు, స్వచ్ఛందంగా వచ్చిన వలంటీర్లతో దీక్షా ప్రాంగణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయి. జగన్‌కు తమ సంఘీభావం తెలి పేందుకు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వందలాదిగా పార్టీ ముఖ్య నేతలు తరలి వచ్చారు. ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఎం.ప్రసాదరాజు, పి.రామకృష్ణారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జంగా కృష్ణమూర్తి, రఘురామిరెడ్డి, మర్రి రాజశేఖర్, బోడ జనార్ధన్, ఎడ్మ కృష్ణారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు, వైఎస్‌ఆర్ మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మలాకుమారి, యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ వినయ్‌రెడ్డితో పాటు జిల్లాల పార్టీ కన్వీనర్లు దీక్షలో పాల్గొన్నారు.

చూస్తే చాలని వచ్చాం..

వేలాది మంది రైతులతో పాటు ఆర్మూరు, పెర్కిట్ పరిసర మండలాల నుంచి పిల్లా పాపలను వెంటేసుకొని మహిళలు, వృద్ధులు తరలిరావటం దీక్షలో ప్రత్యేకం. ‘జగన్‌ను చూస్తే చాలనుకుని వచ్చాం. ఆయన్ను కలిసే అవకాశం దక్కింది.. మా పిల్లలను ఆత్మీయంగా పలకరించాడు. ఎంతో ఆనందంగా ఉంది..’ అంటూ పెర్కిట్‌కు చెందిన లావణ్య ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈమె తన రెండేళ్ల చిన్నారి నందినిని ఎత్తుకొని, అయిదేళ్ల నవ్యశ్రీని చేత్తో పట్టుకొని దీక్షా స్థలికి వచ్చారు. ఈమెతోపాటు పొరుగున ఉన్న మరో మహిళ జ్యోతి కూడా తన చిన్నారిని దీక్షకు తీసుకొచ్చారు. ఆమె వెంట బుడిబుడి అడుగులేస్తూ ఆ చిన్నారి వర్షిణి అందరినీ ఆకర్షించింది.

వైఎస్‌ను కలవాలనుకున్నా..

‘వైఎస్‌ఆర్‌ను కలవాలనుకున్నా.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు చెప్పాలనుకున్నా. దురదృష్టవశాత్తూ ఆ కల చెదిరిపోయింది. అప్పట్నుంచీ జగన్‌ను కలవాలనుకున్నాం. ఈ రోజు మా కల ఫలించింది..’ అంటూ నిర్మల్ నుంచి తన తల్లి లక్ష్మిని వెంట పెట్టుకొని వచ్చినయువతి బండారి ప్రవీణ తమ కుటుంబానికి వైఎస్‌పై ఉన్న వీరాభిమానాన్ని చాటుకున్నారు. తెల్లవారుజామునే ఆమె దీక్షా ప్రాంగణంలో జగన్‌ను కలిసే వంతు ఎప్పుడొస్తుందా అని నిరీక్షించారు. ‘నా పీజీ పూర్తయింది. మా కుటుంబం అంతా వైఎస్‌ఆర్ వీరాభిమానులే. ఇడుపులపాయలో వైఎస్ సమాధిని చూడాలనేది మా అమ్మ కోరి క. రెండు రోజుల్లో అక్కడికి వెళతాం..’ అని ఆమె చెప్పారు.

న్యూడెమోక్రసీ ఆందోళన


తెలంగాణపై జగన్ తన స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని న్యూడెమోక్రసీ కార్యకర్తలు రెండుసార్లు దీక్షాస్థలి వద్ద ఆందోళనకు ప్రయత్నించారు. మొదటిసారి దీక్షా ప్రాంగణం చేరుకోకముందే పోలీసులు వారిని అడ్డగించారు. కార్యకర్తలు ప్రతిఘటించటంతో పోలీసులు వారిని లాఠీలతో చెదరగొట్టారు. వాహనాల్లోకి ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. మరో రెండు గంటల అనంతరం నలుగురు కార్యకర్తలు ఎర్రజెండాలు చేతిలో పట్టుకొని దీక్షాప్రాంగణంలోని గ్యాలరీలోకి చేరుకున్నారు. వారు ఒక్కసారిగా నినాదాలు మొదలుపెట్టడం.. ఆ వెంటనే పోలీసులు వారిని అదుపుచేయడానికి యత్నించడం.. అసలేం జరుగుతుందో తెలియక కాసేపు గందరగోళం ఏర్పడింది. పోలీసులు వారిని అదుపులోనికి తీసుకొని ఆర్మూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

గురువారం ముగింపు సభ

మంగళవారం ప్రారంభించిన మూడు రోజుల రైతు దీక్ష గురువారంతో ముగియనుంది. ‘రైతు దీక్ష’ ముగింపు సభ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు.

తమ కోసం దీక్ష చేపట్టిన జననేతను చూసేందుకు రైతులు బారులు దీరారు. తమ కన్నీళ్లు తుడిచేందుకు వచ్చిన రాజన్న బిడ్డను కలుసుకునేందుకు ఊళ్లకు ఊళ్లు తరలి వచ్చాయి. సర్కారు వ్యవ‘సాయం’పై చిన్నచూపు చూస్తోందని, ఆరుగాలం కష్టపడ్డా ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయని అన్నదాతలు జగన్‌తో ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాక రైతులు, అభిమానులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలతో దీక్షా ప్రాంగణం జాతరను తలపించింది.
రైతు జాతర
పల్లె పల్లెనా... జనం దండు కదిలింది. వైఎస్ జగన్ తలపెట్టిన రైతు దీక్షకు ఊరూవాడా తరలివచ్చింది. జై తెలంగాణ... జై జగన్ నినాదాలు వెల్లువెత్తాయి. ఆర్మూర్ మండలం మం థని గ్రామం నుంచి ఇంటింటికి ఒకరు చొప్పున ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావటం రెండో రోజు ‘రైతుదీక్ష’లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిం ది. మరోవైపు కరువుతో పంట నష్టపోయిన రైతులు ఎండిన పంటలను వెంట తెచ్చి... జగన్‌కు చూపించి గోడు వెళ్లబోసుకున్న తీరు సాగు సంక్షోభానికి అద్దం పట్టింది. ఈ ప్రాంతంలో ప్రధానంగా సాగు చేసే పసుపు రైతుల ఇక్కట్ల ను తెలుసుకునేందుకు జగన్ ఎక్కువ సమయం వెచ్చించటం గమనార్హం. కరువుతో నష్టపోయామని తన వద్దకు వచ్చిన రైతుల బాధను పంచుకున్నారు. తమకు అండగా నిలిచేందుకు జగన్ తలపెట్టిన రైతుదీక్షకు అన్నదాతలు సంపూర్ణ మ ద్దతు ప్రకటించారు. జిల్లాలోని వివిధ ప్రాంతా ల నుంచి రైతులతో పాటు పిల్లలు, వృద్ధులు, మహిళలు పోటెత్తారు. వైఎస్‌ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను తలుచుకుంటూ... ‘మీ మేలు మరిచిపోం రాజన్నా’ అంటూ విద్యార్థులు, మహిళలు జగన్‌ను కలుసుకునేందుకు ఎగబడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కారణంగానే తాము చదువుకుంటున్నామంటూ వందలాది మంది విద్యార్థులు ముక్తకంఠంతో తెలిపారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌కు తామెంతో రుణపడి ఉన్నామని జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఆర్మూర్‌లోని వైఎస్‌ఆర్ ప్రాంగణంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు జన సందోహం వెల్లివిరిసింది. తమ అభిమాన నేతను కలిసి వెళ్లాలనే పట్టుదలతో రాత్రి వరకు జనం నిరీక్షించటంతో పాటు తమవంతు ఎప్పుడొస్తుందా... అని బారులు తీరటం విశేషం. ఉదయం 7గంటలకు దీక్షలో బైఠాయించిన జగన్ రాత్రి 9 గంటలకు వేదికపైనే నిద్రకు ఉపక్రమించారు. నిర్విరామంగా 14 గంటల పాటు దీక్ష చేపట్టడంతో పాటు తనను కలిసేందుకు వ చ్చిన ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించా రు. ఓపికగా వారి ఆవేదనను తెలుసుకునేందు కు ఆసక్తి ప్రదర్శించారు. కరువు కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని వెన్ను తట్టారు. మహానేత వైఎస్‌ఆర్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించేందుకు వచ్చిన జనం జా తరతో పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం పెల్లుబికింది. జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తరలిరావటం తో రాజకీయ సందడి అలుముకుంది. ఒక దశ లో వేదికపైకి వెళ్లి తమ నేతను కలుసుకునేం దుకు పార్టీ నేతలు సైతం పోటీ పడ్డారు.

జిల్లాలో పట్టున్న నేతలు బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు కొత్తగా చేరిన మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి, మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి, కెప్టెన్ కరుణాకర్‌రెడ్డిల ప్రభావంతో జిల్లా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉప్పొంగింది. దీక్షా ప్రాంగణంలో వంగపండు ఉష సారథ్యంలో వరంగల్ నుంచి వచ్చిన కళాబృందాల ఆటాపాటా అందరినీ ఆకట్టుకుంది. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు రైతు దీక్ష ముగింపు సభ జరుగనుంది. తెలంగాణపై జగన్ తన వైఖరి ప్రకటించాలని న్యూడెమోక్రసీ కార్యకర్తలు రెండుసార్లు ఆందోళనకు దిగటం కాసేపు అలజడి రేపింది.

పోలీసులు వారిని అదుపులోనికి తీసుకోవటంతో గొడవ సద్దుమణిగింది. రెండో రోజు దీక్షలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, అమరనాథ్ రెడ్డి, శ్రీనివాసులు, ప్రసాద్‌రాజు, రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు కొండ మురళి, మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కుంజ భిక్షం, చంద లింగయ్య, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, గట్టు రాంచందర్‌రావు, సినీ నటుడు విజయ్‌చందర్, పార్టీ జిల్లా కన్వీనర్ వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి బోడ జనార్ధన్, నాయకులు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, పెద్ద పట్లోల్ల సిద్దార్థరెడ్డి, కృష్ణారెడ్డి, మహిళావిభాగం అధ్యక్షురాలు నిర్మలకుమారి, మహిళా నాయకురాలు మమతారెడ్డి, సుజాత మంగిలాల్, సారథ్య కమిటీ సభ్యులు గాదె నిరంజన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, రాముల రవీందర్‌రెడ్డి, మదన్‌లాల్ నాయక్, గుత్త ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ శ్రవణ్‌రెడ్డి, జనక్ ప్రసాద్, మునిపల్లి సాయిరెడ్డి, మార చంద్రమోహన్‌రెడ్డి, మానాల మోహన్‌రెడ్డి, పండిత్ ప్రేమ్, పుట్ట మధు తదితరులు పాల్గొన్నారు.
 

Tuesday, January 10, 2012

సర్కార్ నిద్ర వదిలిద్దాం: వైఎస్ జగన్ * ‘రైతు దీక్ష’లో అన్నదాతలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు


రైతు దీక్ష డిమాండ్లివీ..

రైతు దీక్ష ప్రధాన డిమాండ్లను దీక్ష వేదికపై ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రకటించారు. అవి..

* పసుపు, చెరుకు, మిరప, వరి, పత్తి పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. వారికి గిట్టుబాటయ్యే మద్దతు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో తక్షణమే ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. అన్ని పంటలకు గిట్టుబాటు, మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం కొనుగోలు చేయాలి.

* వైఎస్ ప్రకటించిన 9 గంటల ఉచిత విద్యుత్ హామీని అమలు చేయని ఈ ప్రభుత్వం.. ప్రస్తుత ఏడు గంటల కరెంటులోనే ఎడాపెడా కోతలు విధిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు నాణ్యమైన విద్యుత్తును తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా, ఉచితంగా సరఫరా చేయాలి.

* రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించిన 800 పైచిలుకు మండలాల్లో రైతులకు పైసా సాయం అందించలేదు. తక్షణమే రైతులకు సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలి.


రైతులను విస్మరిం చి నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని, దానిని నడిపిస్తున్న ఢిల్లీ సర్కారును ఈ ‘రైతు దీక్ష’ ద్వారా మేల్కొలుపుదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అన్నదాతలకు పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మం డలం పెర్కిట్ శివారులోని వైఎస్‌ఆర్ ప్రాంగణంలో ‘రైతు దీక్ష’ను ప్రారంభించే ముందు ఆయన క్లుప్తంగా మాట్లాడారు. కొండెక్కిన ఎరువుల రేట్లు, కరెంటు కోతలు, కనీస మద్దతు ధర అందక అన్నదాత కుచేలుడైపోయిన నేపథ్యంలో.. ఆ రైతన్న కన్నీళ్లను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు జగన్ ఈ దీక్ష చేపట్టారు. ఇది మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభం కావాల్సి ఉండగా.. రాత్రి 8.00కుగానీ ఆయన అక్కడకు చేరుకోలేకపోయారు. హైదరాబాద్‌లో ఉదయం బయల్దేరింది మొదలు ప్రతి బాట లోనూ అభిమాన ప్రవాహం ఉప్పొంగడం.. రోడ్లన్నీ జనసంద్రాన్ని తలపించడం.. జెండా ఆవిష్కరణలు, పార్టీలో చేరికలు, మంగళహారతులు, కరచాలనాలు, పూలమాలలతో అభిమానులు ఉరకలెత్తడంతో ఆయన ఇక్కడకు చేరుకోవడం ఎనిమిది గంటల ఆలస్యమైంది. ఇంత ఆలస్యమైనా ఉదయం నుంచే అక్కడ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వేలాది మంది ప్రజల్లో విసుగుగాని, అలుపుగాని కనిపించలేదు. ఉదయం నుంచీ జై జగన్, జోహార్ వైఎస్సార్ అన్న నినాదాలు ఆ ప్రాంగణమంతా మార్మోగుతూనే ఉన్నాయి. జగన్ రాకతో అవి మిన్నంటాయి. కిటకిటలాడుతున్న జనహోరు మధ్య వేదిక మీదకొచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ దీక్ష కోరుతున్న మూడు ప్రధాన డిమాండ్లను ఎమ్మెల్యే కొండా సురేఖ ద్వారా చదివి వినిపించారు. వేదికపై సర్వమత పెద్దల ఆశీస్సులు.. ప్రాంగణంలో అన్నదాత రణన్నినాదాల మధ్య జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించారు. దీనికి ముందు ఆయన క్లుప్తంగా ప్రసంగించారు.

మరొక్కసారి మేల్కొలిపే ప్రయత్నమే..

‘‘రైతుల సమస్యల మీద ఎన్నో దీక్షలు చేశాం.. కలెక్టరేట్లను, ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడించాం.. నియోజకవర్గాలు, మండలాల్లో దీక్షలు చేపట్టాం.. గత రెండేళ్లుగా దీక్షల మీద దీక్షలు చేశాం, అయినా రైతుల గోడును ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరొక్కసారి రైతుల గోడు గట్టిగా వినిపించి సర్కారును మేల్కొలిపే ప్రయత్నమే ఈ దీక్ష’’ అని జగన్ పేర్కొన్నారు. దీక్ష జరిగే ఈ మూడు రోజుల్లో శిబిరంలో రైతు నాయకులు మాట్లాడతారని.. ‘మా రైతుల గోడు వినండయ్యా’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తారని అన్నారు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, పేదల వ్యతిరేక విధానాల మీద ప్రతి ఒక్కరూ గళం విప్పుతారని చెప్పారు. దీక్ష విరమించే సమయంలో రైతాంగ సమస్యలపై తాను సుదీర్ఘంగా మాట్లాడతానన్నారు. ‘మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన కార్యక్రమం రాత్రి 8.30కు జరుగుతున్నా ఒక్కరు కూడా ఆలస్యమైపోతోందని ఇంటికెళ్లిపోకుండా.. మరో పనులున్నాయని సాకులు చూపకుండా, చలిని లెక్కచేయకుండా.. ఎవ్వరి ముఖంలోనూ చికాకు కనిపించకుండా వేచి ఉన్నారు. నా కోసం చిన్న పిల్లలతో వేచి ఉన్న తల్లులకు, నడవలేని వయసులోనూ ఇక్కడకు వచ్చిన అవ్వలకు, తాతలకు, అన్నలకు, అక్కా చెల్లెళ్లకు అందరికీ పేరుపేరునాకృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను’ అని జగన్ అన్నారు.


కదలి వచ్చిన కర్షకలోకం: రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చేపట్టిన ఈ దీక్షకు కర్షక లోకం తరలి వచ్చింది. తమ ఆవేదనకు ప్రతిరూపమై దీక్షకు దిగిన ప్రియతమ నాయకుడిని చూడటానికి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి రైతులు ఉదయం ఏడు గంటల నుంచే దీక్ష ప్రాంగణానికి చేరుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వాహనాల్లో దీక్ష స్థలికి చేరుకున్నారు. ఆర్మూరు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలు మధ్యాహ్నానికి దీక్ష శిబిరానికి వచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకల్లా శిబిరం కిక్కిరిసిపోయింది. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరించాయి. ఆలస్యంగా జగన్ దీక్ష శిబిరానికి చేరుకున్నా రైతుల్లో నిరుత్సాహం ఏ కోశానా కనిపించలేదు. ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా అన్న ఆత్రుతే కనిపించింది. రాత్రి 8 గంటలకు దీక్ష శిబిరానికి చేరుకున్న జగన్‌కు రైతులు, నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆయన వేదికపైకి చేరుకోగానే జై జగన్, వైఎస్సార్ అమర్ రహే అనే నినాదాలు మారుమోగాయి.

వైఎస్ విగ్రహానికి పూల మాలవేసి..: దీక్ష శిబిరానికి చేరుకోగానే జగన్.. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. వైఎస్సార్ కాం గ్రెస్ కేంద్ర పాలకమండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడిన అనంతరం బోధన్ నాయకుడు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డిని జగన్.. పార్టీ కండువా వేసి ఆహ్వానిం చారు. మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి జగన్‌ను కలిశారు. అనంతరం ఎమ్మెల్యే కొండా సురేఖ జగన్‌కు తిలకం దిద్ది దీక్షను ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఆత్మహత్య చేసుకున్న అన్నదాతలకు శ్రద్ధాంజలి

ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు, తెలంగాణ అమరవీరులకు రైతు దీక్షలో శ్రద్ధాంజలి ఘటించారు. వారి ఆత్మ శాంతి కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల అనేక మంది రైతులు బలయ్యారని, తెలంగాణ కోసం వందలాది మంది ప్రాణాలు అర్పించారని సంతాపం తెలిపారు.

తరలి వచ్చిన నేతలు: దీక్ష శిబిరంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్సీలు కొండా మురళి, జూపూడి ప్రభాకర్‌రావు, పార్టీ అధికార ప్రతినిధులు గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ, మాజీ మంత్రులు బోడ జనార్ధన్, మారెప్ప, సినీ నటి రోజా, నేతలు జనక్ ప్రసాద్, చందా లింగయ్య, వెంకటరమణారెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, సోమిరెడ్డి, బట్టి జగపతి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతులను కాంగ్రెస్ మోసగిస్తోంది

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తోంది. రైతుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారి కష్టాలను గాలికి వదిలేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రైతులకోసం ఏమీ చేయడం లేదు. అందుకే రైతుల పక్షాన నిలిచిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేపట్టారు.
- మాజీ మంత్రి బోడ జనార్దన్

సంక్షేమమే లక్ష్యంగా..

ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా ప్రజల సంక్షేమంకోసం జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రైతులకోసం అంటూ శాసనసభలో ఉత్తుత్తి అవిశ్వాస తీర్మానం పెట్టారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కమాట మాట్లాడలేదు. కానీ జగన్ వర్గం ఎమ్మెల్యేలు మూడు ప్రాంతాల రైతులు తమకు సమానమేనంటూ రైతులపక్షాన నిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు.
- జనక్ ప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్

చిరంజీవి కొత్త బిచ్చగాడిలా...

చిరంజీవి కొత్త బిచ్చగాడిలా మంత్రి పదవి అడుగుతున్నాడు. సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స, ఉపముఖ్యమంత్రి రాజనర్సింహ మధ్య సమన్వయం కుదర్చడానికి ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానం తలకిందులవుతుంటే.. మరోవైపు చిరంజీవి మాత్రం మంత్రి పదవికోసం తిరుగుతున్నాడు. మంత్రి బాధ్యతలు కూడా నిర్వహించని కిరణ్ సీఎం కావడం మన దౌర్భాగ్యం.
- రోజా, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు