జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Saturday, July 10, 2010

ఒక్కరికే ఓదార్పు పదినిమిషాలు... మిగతా... జైత్రయాత్రే , 'ఓదార్పు'లో రాజకీయం లేదనడం అవివేకం: మందా., జగన్ యాత్రలో స్థానికేతర నేతలదే హవా

'ఓదార్పు యాత్ర'లో రెండో రోజైన శుక్రవారం ఒక్క కుటుంబానికే ఓదార్పు లభించింది. ఉదయం పదిన్నరకు టెక్కలిలో రెండో రోజు యాత్రను మొదలు పెట్టిన జగన్... రాత్రి ఏడు గంటల సమయంలో గార మండలం హుకుంపేట గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో మరువాడ జానకిరాం కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ పదినిమిషాలు గడిపారు.

లక్ష రూపాయల చెక్ ఉన్నట్లు చెబుతున్న కవర్‌ను కుటుంబ సభ్యులకు అందించారు. మిగిలిన సమయమంతా వివిధ ప్రాంతాల్లో ఉపన్యాసాలకు, రోడ్లకు ఇరువైపులా ఉన్న జనాన్ని పలకరించేందుకు, నేతల ఇళ్లలోకి వెళ్లి.. పరామర్శించేందుకు కేటాయించారు.

రెండో రోజు షెడ్యూల్‌లో రెండు కుటుంబాలను ఓదార్చాలని నిర్ణయించినా... యాత్ర ఆరు గంటల ఆలస్యంగా సాగుతున్నదన్న కారణంతో ఒక్క కుటుంబంతోనే సరిపెట్టారు. ఎల్ఎన్‌పేట మండలం యంబరాం గ్రామంలో కిలారి సరస్వతి కుటుంబాన్ని ఓదార్చడం ఈ రోజుకు సాధ్యం కాకపోవచ్చని జగన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

యాత్ర మరో రోజు పొడిగింపు:
శ్రీకాకుళం జిల్లాలో జగన్ యాత్రను మరో రోజు పొడిగిస్తున్నట్టు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. మొదట నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజులపాటు ఓదార్పు యాత్ర సాగించాల్సి ఉంది. కానీ కుటుంబాలను ఓదార్చడంతో పాటు.. విగ్రహావిష్కరణలు, నేతల ఇళ్లలో పలకరింపులు, అడిగిన చోటల్లా ఉపన్యాసాలతో మొదటిరోజు నుంచి యాత్రలో జాప్యం జరుగుతోంది.

ఫలితంగా కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం పూర్తి కావడంలేదు. దీంతో ఈ నెల 11న ఆదివారం ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఓదార్పు యాత్రను పూర్తి చేసి తర్వాత తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లడానికి జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

'ఓదార్పు'లో రాజకీయం లేదనడం అవివేకం: మందా

న్యూఢిల్లీ : జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర వెనుక రాజకీయ కోణం లేదనుకోవడం తెలివి తక్కువతనమని కాంగ్రెస్ ఎంపీ మందా జగన్నాథం వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధిష్ఠానం ఓదార్పు యాత్ర వద్దనలేదని అన్నారు. ఆర్భాటాలతో చేస్తున్న యాత్ర వల్ల జరగబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వారించిందన్నారు.

వైఎస్ కుమారుడిగా జగన్‌ను పార్టీ, ప్రజలు గుర్తించారన్నారు. అయితే ఆయన సీఎం కావాలని కోరుకున్నారని, వైఎస్ అకాల మరణం తర్వాత అధిష్ఠానం అన్ని కోణాల్లో ఆలోచించి రోశయ్యను పీఠంపై కూర్చోబెట్టిందని జగన్నాథం అన్నారు. జగన్ యాత్రలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొంటున్నారన్న దానిపై స్పందిస్తూ, వైఎస్ఆర్ కొడుకుగా ఆయనను చూడటానికి జనం రావడంలో విశేషమేమీ లేదన్నారు. 

జగన్ యాత్రలో స్థానికేతర నేతలదే హవా

రెండో రోజు స్థానికేతర నేతల హవా ప్రముఖంగా కన్పించింది. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తన అనుచరులతో 200 వాహనాల వరకు జగన్ కాన్వాయ్‌లో ఏర్పాటు చేయించారు. వీరితోపాటు రాయచోటి ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తదితరులు బలగాలను తెచ్చారు.

స్థానిక ప్రజలతో వీరు కలిసిపోవడంతో జగన్ అడుగుపెట్టిన చోటల్లా వేలాది మంది కన్పించారు. రెండో రోజు యాత్రలో జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాస్‌ల హవా బాగా కనిపించింది. ప్రసాదరావు కుమారుడు రామమనోహర్ హైదరాబాద్ నుంచి హుటాహుటిన టెక్కలి చేరుకొని యాత్ర పొడవునా జగన్‌తో ఉన్నారు.

నరసన్నపేట పట్టణంలో వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్‌ను ఆహ్వానిస్తున్నట్టుగా ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్‌ల ఫొటోలతో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఎలా జరుగుతోందంటూ నరసన్నపేటలో నాయకులకు కృష్ణదాస్ ఫోన్ చేసి ఆరా తీశారు. యాత్రలో కృష్ణదాస్ సతీమణి పద్మప్రియ, కుమారుడు రామలింగంనాయుడు కూడా పాల్గొన్నారు. 

బాధితుల కన్నా నేతలే మిన్న
జగన్ యాత్ర రెండో రోజూ అదే తీరు

అడిగిన చోట కాదనకుండా ఉపన్యాసాలు
వీధి వీధికీ వైఎస్ విగ్రహావిష్కరణలు
ఏడు కుటుంబాల కోసం గంట
ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో ఐదు గంటలు
శ్రీకాకుళం: బాధితుల ఇళ్లలో ఐదేసి నిమిషాలు.. నేతల ఇళ్లలో మాత్రం కనీసం అరగంట పాటు మంతనాలు! వందల కార్లతో కాన్వాయ్‌లు! అడిగిన చోటల్లా కదనకుండా ప్రసంగాలు.. వీధి వీధికీ వైఎస్ విగ్రహావిష్కరణలు! బాధితుల కన్నా నేతలే మిన్నగా సాగుతున్న జగన్ ఓదార్పు యాత్ర తీరు ఇది! తొలి రోజు ఆరు కుటుంబాలకు ఐదారు నిమిషాల పాటు కేటాయించిన జగన్.. రెండో రోజు కూడా అదే తీరులో పర్యటించారు.

స్థానిక నాయకుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం ప్రస్ఫుటమైంది. రెండో రోజు రెండు కుటుంబాలను ఓదార్చాలనుకున్నా... ఒక్క కుటుంబంతోనే సరిపెట్టారు. మొత్తంగా యాత్రలో పది శాతం సమయాన్ని కూడా బాధిత కుటుంబాల 'ఓదార్పు'నకు కేటాయించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గురువారం మధ్యాహ్నం ఇచ్ఛాపురంలో ప్రారంభించిన ఓదార్పు యాత్ర తొలిరోజును శుక్రవారం ఉదయం 8 గంటలకు టెక్కలితో ముగించారు. సుమారు 22 గంటలపాటు కంటి మీద కునుకు లేకుండా యాత్ర కొనసాగించినప్పటికీ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి కేటాయించింది గంట సమయం మాత్రమే! మిగిలిన సమయమంతా నేతలతో గడిపేందుకు, రోడ్డుపక్కల జనాన్ని పలకరించేందుకు వినియోగించారు.

టెక్కలిలో డీసీసీ అధ్యక్షురాలు, ఎంపీ కిల్లి కృపారాణి స్వగృహంలో శుక్రవారం ఉదయం రెండున్నర గంటలు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత ఉదయం 10.30 గంటలకు రెండోరోజు యాత్రను ప్రారంభించారు. 11 గంటలకు టెక్కలి రైల్వే గేటు వద్ద వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. 12 గంటలకు కోటబొమ్మాళిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.

మధ్యాహ్నం 3 గంటలకు నరసన్నపేటలో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడే పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాత్రి 7 గంటల సమయంలో గార మండలం హుకుంపేటకు చేరుకొని మరువాడ జానకిరాం కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ పది నిమిషాలు గడిపారు.

అడిగిన చోటల్లా ప్రసంగాలు
జగన్ ఓదార్పు యాత్రలో రెండో రోజు కూడా జనం కోరిన దగ్గరల్లా ప్రసంగాలు చేశారు. పాత ప్రసంగాలనే వల్లెవేసినప్పటికీ... తన తండ్రి చనిపోయిన 9 నెలల్లో రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా అట్టడుగుకు దిగజారిపోయాయని కాంగ్రెస్ పాలనపై సంచలన విమర్శలు గుప్పించడం ఇందులో కొత్తదనం. ఓదార్పు యాత్రను శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించగానే ఎక్కడికక్కడ వైఎస్ విగ్రహాలు పుట్టుకొచ్చేశాయి.

చాలా మంది ఫైబర్‌తో తయారైన తేలికపాటి రెడీమేడ్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. 3గంటల ఆలస్యంతో మొదలైన యాత్ర తొలి రోజు ముగిసే సరికి 12 గంటల ఆలస్యంతో ఉంది. శుక్రవారం నిర్ణీత సమయం కన్నా 6గంటల ఆలస్యంగా జరుగుతోంది.

నేతలకే సమయం
ఎక్కువ సమయం నేతల ఇళ్లలో గడపడానికి జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పీసీసీ సంయుక్త కార్యదర్శి నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాలా ఇళ్లలో అర గంట సమయం చొప్పున గడిపారు. మందస మండలం హరిపురంలో పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఇంటికి వెళ్లారు.

ఎమ్మెల్యే హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యులను పలకరించి అక్కడ అర గంట గడిపారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు పలాస- కాశీబుగ్గ చేరుకున్న జగన్ టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి ఇంటికి వెళ్లారు. ఆమె అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్లినప్పటికీ వారి కుటుంబ సభ్యులతో అరగంటపైన మాట్లాడారు.

జగన్‌తో కరచాలనం చేసేందుకు పలువురు ఎగబడ్డారు. నరసన్నపేటకు జలుమూరు, పోలాకి, సారవకోట, నరసన్నపేట మండలాల నుంచి ప్రజలను లారీలతో తీసుకువ చ్చారు. యాత్ర ఆలస్యమౌతున్న కొలదీ జనం పలచబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రెండో రోజూ కూడా చిన్న అపశ్రుతి దొర్లింది.

గారలో విద్యుత్ షాక్‌కు గురై సింహాచలం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఓదార్పు యాత్రతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని అర్థం వచ్చేవిధంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఉన్న ఇందిరా విజ్ఞాన భవన్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేశారు.


Friday, July 9, 2010

ఓదార్పు... ఓనర్ షిప్, జగన్‌కు ఎందరి మద్దతు? ఎమ్మెల్యేల యాత్ర ఓదార్పునకు క్యూ - జాబితాలో 24 మంది: వారిలో నలుగురు మంత్రులు

ఓదార్పు... ఓనర్ షిప్

... వై.ఎస్. వారసుడిగా, తండ్రి ఆస్తిపాస్తులు వచ్చినట్టే, ముఖ్యమంత్రి పదవి కూడా తనకే రావాలన్నది జగన్ పట్టుదల. కాంగ్రెస్ కనుక అలా సీఎం సీటును స్వచ్ఛందంగా అప్పగించడానికి సిద్ధపడకపోతే, వైఎస్ పేరు, 'సానుభూతి' మంత్రంతో, ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్‌నే హైజాక్ చేయాలన్నది ఆయన ఎత్తుగడ!...


ఆంధ్రప్రదేశ్‌లో కొన్నేళ్లుగా పట్టు 'చే'జారిన 'తన కాంగ్రెస్' పార్టీని, ఇకనైనా ఎలాగోలా మళ్లీ 'హస్త'గతం చేసుకోవాలన్నది సోనియాగాంధీ పట్టుదల. అందుకోసం ఎంతకైనా సిద్ధపడాలి, ఎవరినైనా వదులుకోవాలన్నది ఆమె ఆలోచన! ఇప్పుడు తలెత్తింది 'ఓదార్పు- అనుమతి' సమస్య కాదు! రాష్ట్ర కాంగ్రెస్‌పై 'ఓనర్‌షిప్ ఎవరిది' అన్న ప్రశ్న!.... 'ఆదిత్య' రాసిన 'సానుభూతి వ్యూహం' 

ఎమ్మెల్యేల యాత్ర ఓదార్పునకు క్యూ
జాబితాలో 24 మంది: వారిలో నలుగురు మంత్రులు

పిల్లి, పినిపె, బాలినేని, అహ్మదుల్లా
కొండ్రుతో కేవీపీ మంతనాలు
తూర్పుగోదావరి ఎమ్మెల్యేల భేటీ
యాత్రలో పాల్గొనాలని నిర్ణయం
వెళ్లకపోతే స్థానికంగా దెబ్బతింటామని భయం
అధిష్ఠానం వైఖరిపై నేతల్లో అయోమయం

కడప ఎంపీ జగన్ మలి విడత ఓదార్పు యాత్ర కాంగ్రెస్ శాసనసభ్యుల్లో కలకలం సృష్టిస్తోంది. యాత్రలో తాము పాల్గొనకపోయినా, ప్రజా స్పందన బాగుండడం, నియోజక వర్గాల్లోని ద్వితీయ శ్రేణి క్యాడర్ క్రియాశీల పాత్రను పోషించడం వారిని కలవర పెడుతున్నాయి. దీంతో అసెంబ్లీ సమావేశాల కారణంగా హైదరాబాద్‌లోనే ఉండిపోవాల్సి వచ్చిన శాసనసభ్యుల పరిస్థితి, మనసొక చోట, తనువొక చోట అన్నట్లుగా మారింది.

తమ నియోజకవర్గాల్లో, జగన్‌తో మమేకమై తిరుగుతున్న యువ నేతల వల్ల, భవిష్యత్తులో తమ రాజకీయ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. జగన్‌తోపాటు ఓదార్పు యాత్రలో పాల్గొనకుంటే... రాజకీయంగా తాము వెనకబడి పోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. కీలకమైన సమయంలో జగన్ వెంట తాము లేకుంటే బాగుండదని యువ ఎమ్మెల్యేలు కొందరు పేర్కొంటున్నారు.

అందుకే ముఖ్యమంత్రి, అధిష్ఠానం మనోగతం ఏమైనప్పటికీ, యాత్రలో పాల్గొనడానికే కొందరు సిద్ధపడుతున్నారు. దీంతో జగన్ యాత్రలో పాల్గొంటామని ప్రకటించే శాసన సభ్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు శుక్రవారంనాడు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో, జగ్గంపేట ఎమ్మెల్యే తోట వెంకట నరసింహులు నివాసంలో సమావేశమయ్యారు.

జగన్ యాత్రలో పాల్గొనే విషయంలో అందరిదీ ఒకే బాటగా ఉండాలని ఇందులో తీర్మానించారు. మెజారిటీ శాసనసభ్యుల అభిప్రాయం మేరకు, జిల్లాలోని ఎమ్మెల్యేలంతా యాత్రలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రాజా అశోక్‌బాబు (తుని), పి.సతీష్‌కుమార్ (ముమ్మడివరం), రేపాక వరప్రసాద్ (రాజోలు), పి.రాజేశ్వరి దేవి (గన్నవరం), ఎన్.శేషారెడ్డి (అనపర్తి), రౌతు సూర్యప్రకాశ్‌రావు (రాజమండ్రి) ఈ భేటీకి హాజరయ్యారు. ఎమ్మెల్యేలందరం ఒకే మాటపై ఉండాలని తీర్మానించినట్టు తోట నరసింహులు 'ఆన్‌లైన్'కు చెప్పారు.

యాత్రలో ఒకరు పాల్గొని, మరొకరు పాల్గొనకపోవడం సరికాదని నిర్ణయించామన్నారు. రాజమండ్రిలో జగన్‌కు స్వాగతం పలుకుతానని రౌతు సూర్యప్రకాశరావు చెప్పగా, వైఎస్ వల్లే తాను రాజకీయంగా ఎదిగానని, అందువల్ల యాత్రకు వెళతానని రేపాక వరప్రసాద్ అన్నారు. అందరిదీ ఒకే మాటగా ఉంటే, అధిష్ఠానం కూడా చర్య తీసుకునేందుకు వెనుకా ముందూ ఆలోచిస్తుందని ఎమ్మెల్యేలు భావించినట్టు తెలిసింది.

కాగా సొంత నియోజకవర్గంలో ఉన్న జగన్ సన్నిహిత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (కాకినాడ సిటీ) ఈ భేటీకి హాజరు కాలేదు. అయితే అక్కణ్నుంచే ఆయన 'ఆన్‌లైన్'తో మాట్లాడుతూ, యాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారు.


"శ్రీకాకుళం జిల్లాలో శాసనసభ్యులు ఓదార్పు యాత్రలో పాల్గొనకపోయినా నడుస్తుంది. కానీ తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం సాధ్యంకాదు. యాత్రలో పాల్గొనకుంటే ప్రజలు నిలదీస్తారు. మేం పాల్గొనకపోయినా, జిల్లా అంతా, అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ అభిమానులు ఏకమవుతారు. చివరికి మమ్మల్ని (ఎమ్మెల్యేలను) కూడా పట్టించుకోరు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపె విశ్వరూప్ జగన్ యాత్రలో పాల్గొనాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఓదార్పులో పాల్గొంటానని సుభాష్ చంద్రబోస్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం రోశయ్య స్పందన తర్వాత కూడా, తన వైఖరిలో మార్పేమీ లేదని బోస్ సన్నిహితుల వద్ద స్పష్టం చేశారు.

పాల్గొన వద్దని అధిష్ఠానం హుకుం జారీ చేస్తే, మంత్రి పదవి విడిచి పెట్టేందుకైనా సిద్ధమేనని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. జిల్లాలో జగన్ యాత్ర చేపట్టేందుకు ఇంకా సమయం ఉందని, తానేం చేయబోతున్నదీ అప్పుడే స్పష్టమవుతుందనీ పినిపె 'ఆన్‌లైన్'తో అన్నారు.

ఇతర ప్రాంతాల్లో...:
ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితిని పరిశీలిస్తే... ప్రస్తుతం యాత్ర జరుగుతున్న శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మార్గదర్శనం కోసం వారు మంత్రి ధర్మాన ప్రసాదరావు వైపు చూస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి యువ ఎమ్మెల్యేలు జోగి రమేశ్, ఉగ్ర నరసింహారెడ్డి, గుర్నాథరెడ్డి, అమర్నాథరెడ్డి, లబ్బి వెంకట స్వామి, సాయిప్రసాద్‌రెడ్డి తదితరులు తాము ఓదార్పు యాత్రలో పాల్గొంటామని స్పష్టం చేస్తున్నారు.

తనకు రెండు రోజుల పాటు సొంత పనులు ఉన్నాయని, అవి చక్కదిద్దుకొని, యాత్రలో పాల్గొంటానని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రాజేశ్ వివరించారు. శని, ఆదివారాల్లో అసెంబ్లీ సమావేశాలు లేనందున, ప్రభుత్వ విప్ కోండ్రు మురళి, జగన్ యాత్రలో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లాకు పయనమయ్యారు.

అంతకుముందు ఆయన అసెంబ్లీ ప్రాంగణంలోనే మరోవైపు వైఎస్ కుటుంబ సన్నిహితుడు, ఎంపీ కేవీపీ రామచంద్రరావుతో మాటామంతీ జరిపారు. వైఎస్ కుటుంబ బంధువు, ఒంగోలు జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే జగన్ వెంట నిలిచారు.

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పరిస్థితులకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో స్థితిగతులకు చాలా వైవిధ్యం ఉంటుందని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు చెబుతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ముఠా రాజకీయాలు ఎక్కువగా ఉన్నందున, ఏ గ్రూపునకు ఆ గ్రూపు, రాజకీయంగా బలోపేతం అయ్యేందుకు నిత్యం ప్రయత్నాలు నెరపుతుంటాయి.

ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేసే ఈ జిల్లాల కాంగ్రెస్ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి కాంగ్రెస్‌లో కన్పిస్తోంది. మిగతా ప్రాంతాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా యాత్రలో పాల్గొనాలా వద్దా అనే విషయంలో ఊగిసలాడుతున్నారు.

అధిష్ఠానం వైఖరిపై అయోమయం: జగన్ యాత్ర విషయంలో అధిష్ఠానం వైఖరి అర్థం కాక పార్టీ నేతలు అయోమయంలో పడుతున్నారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు, బుధవారం ఉదయం, ముఖ్యమంత్రి రోశయ్య విలేఖరులతో చెప్పిన మాటలకు, అదే రోజు సాయంత్రం ఢిల్లీలో విడుదల చేసిన లేఖకూ సారాంశంలో తేడా ఉందన్న అభిప్రాయం శాసనసభ్యుల్లో వ్యక్తమవుతోంది.

జగన్ యాత్ర మొదలై రెండు రోజులైనా అధిష్ఠానం నుంచి స్పష్టత రాలేదని, దీంతో ఓదార్పు పట్ల అధిష్ఠానం సుముఖతతో ఉందో, విముఖతతో ఉందో తెలియడం లేదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాలకు అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం కారణమని తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి ఒకరు అభిప్రాయపడ్డారు.

"జగన్ యాత్రపై అధిష్ఠానం ఇప్పటివరకూ స్పష్టమైన వైఖరిని వెల్లడించక పోవడం ఒక కారణమైతే, కీలకమైన ఇలాంటి సమయంలో రాష్ట్ర నాయకత్వం చురుకుగా స్పందించక పోవడం మరో కారణం. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ప్రజా ప్రతినిధుల్లో చిన్నపాటి సందేహం ఉన్నా, నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకత్వానిదే.

సీఎల్పీని పిలిచి, అందులో ఓదార్పు యాత్రపై అధిష్ఠానం వైఖరి ఏమిటో, రాష్ట్ర నాయకత్వం ఏమనుకుంటుందో స్పష్టం చేసి ఉంటే .. ఈ రోజు శాసనసభ్యుల్లో ధర్మ సందేహాలు వచ్చి ఉండేవి కావు. సీఎల్పీ సమావేశం కాకున్నా, కనీసం మంత్రివర్గాన్నైనా సమావేశపరిచి, వైఖరిని చెబితే బాగుండేది'' అని ఆ మంత్రి పేర్కొన్నారు.

మరికొందరు మంత్రులు కూడా ఇదేరకంగా అభిప్రాయపడడం విశేషం. మొత్తమ్మీద జగన్ యాత్ర- పరిణామాలు మున్ముందు కాంగ్రెస్‌లో కల్లోలానికి దారితీస్తాయేమోనన్న ఆందోళన శాసనసభ్యుల్లో కన్పిస్తోంది!

జగన్‌కు ఎందరి మద్దతు?

ఓదార్పు యాత్ర చేస్తున్న జగన్‌కు మద్దతు తెలుపుతూ, యాత్రలో పాల్గొంటామని చెబుతున్న మంత్రులు, శాసనభ్యుల పేర్లు ఇవీ...

1. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి,
2. మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్,
3. మంత్రి పినిపె విశ్వరూప్,
4. మంత్రి అహ్మదుల్లా,
5. పి. సతీష్‌కుమార్,
6. రేపాక వర ప్రసాద్,
7. పి. రాజేశ్వరీ దేవి,
8. ఎన్.శేషారెడ్డి,
9. రౌతు సూర్యప్రకాశరావు,
10. తోట నరసింహులు,
11. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి,
12. జోగి రమేష్,
13. ఉగ్ర నరసింహారెడ్డి,
14. గుర్నాథరెడ్డి,
15. అమర్‌నాథరెడ్డి,
16. లబ్బి వెంకటస్వామి,
17. సాయి ప్రసాద్‌రెడ్డి,
18. కోండ్రు మురళి,
19. రాజేశ్,
20. గురుమూర్తిరెడ్డి,
21. శివప్రసాదరెడ్డి,
22. శ్రీకాంతరెడ్డి,
23. దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి,
24. రాజా అశోక్‌బాబు

నాతో రండి ఏ మలుపు తీసుకున్న నా వెంట నిలవండి - వైఎస్ మరణాంతరం రాజకీయం దిగజారింది 'ఓదార్పు'లో జగన్ కొత్త మాట రెండో రోజే మారిన స్వరం

శ్రీకాకుళం: వ్యక్తిగత 'ఓదార్పు'లో రాజకీయం తొంగి చూసింది. యాత్ర రెండో రోజునే కడప ఎంపీ వైఎస్ జగన్ 'మనసులో మాట' కొంచెం కొంచెంగా బయటపడింది. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న జగన్ శుక్రవారం పలుచోట్ల అభిమాన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తన తండ్రి వైఎస్ మరణించిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో రాజకీయాలు అట్టడుగుకు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నరసన్నపేటలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఈ వ్యాఖ్య చేశారు. అంతటితో ఆగలేదు! "నేను రాజకీయాల్లో ఒంటరిని కాను. ఇంతమంది నా వెనుక ఉండగా... నేను ఒంటరినెలా అవుతాను! రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తీసుకున్నా, మీరంతా నావెంటే ఉంటారని ఆశిస్తున్నాను'' అంటూ అభిమానులకు కొత్త పిలుపు ఇచ్చారు. సరికొత్త సంకేతాలు పంపారు.

శ్రీకాకుళం జిల్లా ఓదార్పులో రెండో రోజుకే జగన్ ప్రసంగంలో తేడా రావడం గమనార్హం. మొదటి రోజు ఆయన ప్రసంగం ప్రజలు తన మీద కురిపిస్తున్న ప్రేమ, తన తండ్రిపై ఉన్న అభిమానానికే పరిమితమైంది. రెండో రోజు ప్రసంగంలో రాజకీయ కోణం తొంగి చూసింది. నరసన్నపేట తర్వాత భైరి జంక్షన్, గార మండలం హుకుంపేట, గార తదితర ప్రాంతాల్లో జగన్ ప్రసంగించారు.

"రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన వైఎస్ చనిపోలేదు. మీ అందరి గుండెల్లో ఇంకా చిరంజీవిగా ఉన్నారు. అందువల్లే నేను ఏ జిల్లాకు వెళ్లినా ఒక కొడుకులా ప్రేమ పంచుతున్నారు. సోదరునిలా ఆత్మీయతను అందిస్తున్నారు. నాతో ఎవరున్నా, లేకపోయినా మీరున్నారు. ఈ అభిమానాన్ని మరిచిపోలేను'' అని తెలిపారు. జగన్ ఓదార్పు యాత్రకు రెండో రోజు కూడా విశేష ఆదరణ లభించింది.

జగన్ కంటి మీద కునుకు లేకుండా యాత్రను కొనసాగించారు. ద్వితీయ శ్రేణి నాయకులు, వారి వెనుక ఉన్న ముఖ్య నేతల ప్రోత్సాహంతోనే యాత్ర విజయవంతమవుతోందన్న విషయాన్ని జగన్ కూడా గుర్తించారు. అందువల్లే ఈ జిల్లాలో లేకపోయినప్పటికీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు తనకు దూరం కాదనేలా వారి ఇళ్లకు వెళ్లడానికి ప్రాధాన్యం ఇచ్చారు.

Thursday, July 8, 2010

భవిష్యత్ నేత జగనే!

భవిష్యత్ నేత జగనే!
అధిష్ఠానాన్ని ఆయన గౌరవించాలి: సబిత

తాండూరు : భవిష్యత్ నాయకుడు వైఎస్ జగనేనని హోం మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు. గురువారం రాత్రి ఆమె తాండూరులో విలేఖరులతో మాట్లాడారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డికి కొడుకు కావడం వల్లే జగన్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మంత్రి చెప్పారు. అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించాలని.. తాను, వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి రెండుగంటలపాటు జగన్‌కు నచ్చజెప్పామని తెలిపారు.

తాము అధిష్ఠానాన్ని గౌరవిస్తూనే వైఎస్ కొడుకుగా జగన్‌నూ.. ఆదరిస్తామన్నారు. అధిష్ఠానం ఓదార్పు యాత్ర వద్దని చెప్పలేదనీ, తామే వద్దని నచ్చజెప్పామని ఆమె వివరించారు. జగన్ సేవలు పార్టీకి అవసరమని మంత్రి చెప్పారు.

శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్రలో కడప ఎంపీ జగన్

జగమంత కుటుంబం నాది
నాన్న నాకు అప్పగించి వెళ్లారు

ఆయన కలలను సాకారం చేయడానికే వచ్చా
ఓదార్పు యాత్రలో కడప ఎంపీ జగన్
  "మా నాన్న గారు వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోతూ నన్ను ఒంటరిని చేసి పోలేదు. ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఆత్మబంధువులుగా ఆయన నాకు అప్పగించారు'' అని కడప ఎంపీ వైఎస్ జగన్ మోహనరెడ్డి అన్నారు. ఆయన గురువారం ఉదయం 11.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఓదార్పు యాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రజాప్రస్థానం విజయవాటిక వద్ద హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నా చెల్లెమ్మలకు, అక్కయ్యలకు, వృద్ధులకు, నా సోదరులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ వైఎస్ తరహాలో ప్రసంగం సాగించారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ చిత్ర పటానికి పూల మాల వేసి.. నివాళులర్పించారు. ఇచ్ఛాపురంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

గత రెండు మూడు నెలలుగా తాను రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పర్యటించానని, ప్రతి చోటా ప్రజల హృదయం వైఎస్ అన్న పేరునే ప్రతిధ్వనిస్తోందని అన్నారు. "మీరు అందరూ నా కుటుంబ సభ్యులే. అతి పెద్ద కుటుంబాన్ని నాకు వైఎస్ అనుగ్రహించి వెళ్లిపోయారు. ఆయన కలలను సాకారం చేయడానికే మీ మధ్యకు వచ్చాను'' అని జగన్ చెప్పారు. తనను కొడుకులా, సోదరునిలా, ఆత్మీయునిగా ఆదరిస్తున్నారంటూ "మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుడినై ఉంటాను'' అని చెప్పారు.

ఆ తర్వాత కవిటి, జగతి, కంచిలి, సోంపేట తదితర ప్రాంతాల్లో ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఇదే విషయాలను తన ప్రసంగంలో పదేపదే ప్రస్తావించారు. జగన్ తన మాటల్లో ముఖ్య కాంగ్రెస్ నాయకుల పేర్లుగానీ, స్థానిక నాయకుల పేర్లు గానీ ప్రస్తావించలేదు. "నాన్న చనిపోయి పది నెలలైంది. నేను ఒంటరిగా ఉన్నాననుకొనేవాడిని. కానీ ఇప్పుడు తెలిసింది నాన్న చనిపోలేదని, మీ అందరి గుండెల్లోనే ఉన్నారని'' అంటూ జగన్ తన ప్రసంగాల్లో చెప్పారు. చిరునవ్వుతో సాగనంపండంటూ ప్రసంగాన్ని వడివడిగా ముగించారు.

నేతల ప్రస్తావనలేదు
ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనే 8 చోట్ల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించిన జగన్... ఎక్కడా మూడు నాలుగు నిమిషాలకు మించి మాట్లాడలేదు. దాదాపు ప్రతి చోటా ఒకే తరహాలో మాట్లాడిన జగన్... తన ప్రసంగాల్లో ఎక్కడా అధిష్ఠానంపైగానీ, ముఖ్యమంత్రి రోశయ్యపైగాని విమర్శలు చేయలేదు. కేవలం ఓదార్పు యాత్రకు వచ్చానంటూ క్లుప్తంగా ముగించేశారు.

మూడు గంటలు ఆలస్యంగా
ఓదార్పు యాత్ర తొలిరోజు నిర్ణీత సమయం కన్నా 3గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు ఉదయం 8 గంటలకు జగన్ చేరుకున్నారు. ఆర్అండ్‌బీ అతిథి గృహానికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకున్నారు. 9 గంటలకు ప్రజాప్రస్థానం విజయవాటిక వద్దకు చేరుకున్నారు. తన తండ్రి వైఎస్ చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సివుంది.

ప్రజాప్రస్థానం విజయవాటిక వద్ద తగినంత జనం లేకపోవడంతో జగన్‌ను అతిథి గృహంలోనే మూడు గంటలపాటు ఉండిపోయారు. ఆ తర్వాత క్రమేపీ జనం పెరగడంతో 11.30 గంటల సమయంలో జగన్ ప్రజాప్రస్థాన విజయవాటిక వద్దకు చేరుకున్నారు. తన తండ్రికి నివాళులర్పించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఆలస్యం అలా కొనసాగి మధ్యాహ్నం ఒంటి గంటకు సోంపేటలోని గాంధీ మండపం వద్ద జరగాల్సిన జగన్ ప్రసంగ కార్యక్రమం రాత్రి 9 గంటలకు మారింది.

అపశ్రుతులు
యాత్ర ప్రారంభంలోనే పలు అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద రైలు నుంచి దిగే జగన్‌ను చూడాలని ఆసక్తితో జనం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వారిలో కొంతమంది అక్కడున్న ఒక చెట్టును ఎక్కారు. జనభారాన్ని తట్టుకోలేక ఆ చెట్టు కూలిపోవడంతో పది మందికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. ఈలోగా జగన్ రైల్వే స్టేషన్‌లో దిగబోతుండగా తొక్కిసలాట జరిగింది, అందులో ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ లాభాల స్వర్ణమణిని నెట్టుకుంటూ జనం ముందుకు వచ్చారు. దాంతో ఆమె కిందపడిపోయారు.

వెనుక వస్తున్న జనం ఆమెను తొక్కుకుంటూ పరుగులు తీశారు. దీంతో ఆమె తీవ్రగాయాలపాలయ్యారు. ఓదార్పు యాత్రకు స్ధానికుల కన్నా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే అధికంగా వుండడంతో జనం కన్నా వాహనాల రద్దీ ఎక్కువైంది. దీనివల్ల ట్రాఫిక్ నియంత్రణ అస్తవ్యస్తమై జాతీయ రహదారి పొడవునా చాలా సమయం ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనిని సరిదిద్దడానికి పోలీసులు తంటాలు పడ్డారు.

ఇదీ ఓదార్పు!
జగన్ తన ఓదార్పు యాత్ర తొలి రోజున రాత్రి 12 గంటల సమయం వరకూ నాలుగు కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో ఇంట్లో సుమారు ఐదు నిమిషాల పాటు గడిపారు. రాత్రి 1గంట దాటే వరకూ జగన్ పరామర్శల షెడ్యూలు ఉంది. తొలుత ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టిలో పైల చంద్రమ్మ కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. అనంతరం కవిటి మండలం జగతి గ్రామంలో రెడ్డి అప్పన్న కుటుంబసభ్యులను పరామర్శించారు.

అక్కడి నుంచి కంచిలి మండలం కేశరపడ చేరుకొని పిలక గణపతి కుటుంబాన్ని ఓదార్చారు. ఆయా కుటుంబాల పెద్దలకు ఒక కవర్ అందజేశారు. అందులో ఎంత నగదు ఉన్నదనేది ఎవరికీ తెలియదు. దారి పొడవునా అభిమానులు ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను కూడా జగన్ ఆవిష్కరించారు. నత్తు రామారావు అనే కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో కాసేపు సేదతీరి.. మధ్యాహ్న భోజనం చేశారు. మాజీ ఎమ్మెల్యే లల్లూ అగర్వాల్ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారు.

నాడు వనం.. నేడు జనం

Ysrజులై 8...ఒక మహానేత జయంతి... జనం కోసమే జనించిన ఒక రాజకీయ రాజసయోధుడు..పేదల పక్షపాతి పుట్టిన రోజు.చరిత్ర మరవని చరితను సొంతం చేసుకున్న యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి..వైఎస్సార్‌ ఈ గడ్డపై అడుగిడిన రోజు. పుట్టిన రోజును జరుపుకోవడానికి ఆయన లేడు. కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇంకా ఉన్నాయి..ఉంటాయి కూడా... ఆయన మరణం తర్వాత భౌతికకాయాన్ని కడప జిల్లాలోని ఆయనకు ఇష్టమైన ప్రదేశం అయిన ఇడుపులపాయ ఎెస్టేట్‌లో ఖననం చేశారు. వైఎస్‌ బతికున్న రోజుల్లో ఎప్పుడు విడిది చేసినా ఇడుపులపాయలోనే గడిపేవారు.

ఆయనకు ఆ ప్రాంతం అంటే మక్కువ. ఆయన మరణం తర్వాత ఇడుపులపాయను వైఎస్‌ఆర్‌ ఎెస్టేట్‌గా పిలుస్తున్నారు. ఆ ప్రదేశంలో వైఎస్‌ స్థూపం ఏర్పాటుచేయడంతో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో కేవలం వైఎస్‌ కుటుంబ సభ్యులు మాత్రమే సందర్శించే ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ప్రతిరోజు వందలాది మంది వైఎస్‌ అభిమానులు సందర్శిస్తుండడంతో ఇడుపులపాయ పర్యాటక ప్రాంతాన్ని తలపిస్తోంది. మరోవైపు ఆయన మరణించిన నల్లమల ప్రాంతంలోనూ వైఎస్‌ స్మారక పార్కు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది.

పచ్చని పంట పొలాలతో....
nallamalaచుట్టూ ఎత్తయిన కొండలతో.. పచ్చని తివాచీ పరిచినట్లుండే ప్రాంతం ఇడుపులపాయ. సుమారు 100 ఎకరాల్లో విస్తరించి కడపజిల్లా పులివెందుల నియోజకవర్గానికి 40 కిలోమీటర్ల దూరంలో వెంపల్లి మండలంలో ఈ ప్రాంతం ఉంది. వైఎస్‌ బతికున్నన్ని రోజులూ కడపకు ఎప్పుడు వెళ్లినా... ఇడుపుల పాయను సందర్శించేవారు. గతంలో సుమారు 600 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎస్టేట్‌లో అసైన్డ్‌ భూములను వైఎస్‌ స్వయంగా పేదలకు పంచిపెట్టారు.

అభివృద్ధికి పెద్దపీట...
వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇడుపులపాయను అభివృద్ధి చేసేందుకు నడుం బిగించారు. దానిలో భాగంగానే రూ.1,300 కోట్లతో ట్రిపుల్‌ ఐటి, రూ.100 కోట్లతో యోగి వేమన విశ్వవి
ద్యాలయం వెస్ట్‌ క్యాంపస్‌, రూ.8 కోట్లతో ఎకోపార్కు వంటి నిర్మాణాలతో ఆ ప్రాంతం అభివృద్ధికి వైఎస్‌ కృషిచేశారు. దీనితోపాటు ఇడుపులపాయనుంచి జిల్లాలో ఏర్పాటు చేసిన యోగివేమన వర్సిటీ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేయాలని ప్రతి పాదిం
చారు. గోల్ఫ్‌ కోర్సు, ఇతర అభివృద్ధి పనులు కూడా జరగనున్నాయి. మరోవైపు వైఎస్‌ స్మారకార్థం ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మలిచేందుకు ప్రభుత్వం యోచితస్తోంది.

పార్కు నిర్మాణం....
jagan-janamఇడుపులపాయలో వైఎస్‌ ఘాట్‌ను నిర్మించడంతో పాటు ఆ ప్రాంతాన్ని ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. వైఎస్‌ ఉన్న సమయంలోనే నెమళ్ల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దానికోసం 67 నెమళ్లను కూడా ఆయన ఆర్డర్‌ చేశారు.ఆయన మరణానంతరం ఇక్కడ పార్కు నిర్మాణంతో పాటు విడిది ఏర్పాట్లను కూడా చేయాలనే ప్రతిపాదన ఉంది.

పావురాలగుట్టలోనూ...
సెప్టెంబర్‌2న వైఎస్‌ ప్రమాదంలో మరణించిన నల్లమల అడవిలోని పావురాలగుట్ట ప్రాంతాన్ని కూడా పర్యాటక ప్రాంతంగా మలిచేందుకు ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టిం ది. దీనికోసం 1,412 హెక్టార్ల నల్లమల రిజర్వ్‌ పారెస్ట్‌ ఏరియాను వైఎస్‌ స్మారక పార్కు నిర్మాణానికి కేటాయిస్తూ ప్రతిపాదనలు కూడా చేసింది. అలాగే నల్లమల అటవీప్రాంతానికి సమీపంలోని నల్లకాలువ గ్రామంలో రూ.3.15 కోట్ల వ్యయంతో వైఎస్‌ఆర్‌ స్మృతివనం ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది.

YSR-FAMILY-PHOTOSపావురాలగుట్టలో స్మారక స్థూప నిర్మాణం కూడా ఏర్పాటు చేయను న్నారు. ఈ ప్రాంతం పూర్తిగా అటవీ ప్రాంతం కావడం, ఇక్కడే వన్యప్రాణి సంరక్షణ ప్రదే శం కావడంతో పార్కు నిర్మా ణం మూలంగా వన్యప్రా ణులకు ఎలాం టి ఇబ్బందులు కలగకుం డా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలు అనుమతిస్తే వెంటనే ఈ ప్రాజెక్టును ప్రారం భించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ బృహత్తర పథకం ప్రారంభమయితే ఈ ప్రాంతం రాష్ట్ర ప్రఖ్యాత పర్యాటక కేంద్రా లలో ఒకటి గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.