జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Saturday, July 10, 2010

కౌంట్ డౌన్ మధ్యంతరానికి సై అంటున్న హై కమాండ్ సెప్టెంబర్ 2 లక్ష్యంగా జగన్


'సెప్టెంబర్ 2' వైఎస్ తొలి వర్ధంతి! ఆరోజున తన పంథా ప్రకటించేందుకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారా?అధిష్ఠానంతో, రాష్ట్ర నాయకత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న ఆయన...వేరుబాట పట్టేందుకు 'కౌంట్ డౌన్' మొదలుపెట్టారా? జగన్ తప్పులను కాంగ్రెస్ అధిష్ఠానం లెక్కపెడుతోందా? శిశుపాలుడి తప్పులు లెక్కపెడుతున్న శ్రీకృష్ణుడిలా వ్యవహరిస్తోందా? 'చర్యలు తీసుకోండి చూద్దాం' అంటూ జగన్ సవాలు విసురుతున్నట్లు భావిస్తోందా? చర్యల దిశగా 'కౌంట్‌డౌన్' మొదలుపెట్టిందా?

లక్ష్మణ రేఖలు ఎప్పుడో చెరిగిపోయాయి. విభజన రేఖలు బలపడుతున్నాయి. రాజీకి అవకాశం లేనంతగా పరిణామాలు సంక్లిష్టమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకీ, కడప ఎంపీ జగన్‌కూ మధ్య అగాథం పూడ్చలేనంతగా పెరుగుతోంది. రోజు రోజుకూ పదునెక్కుతున్న యువనేత స్వరాన్ని అధిష్ఠానం నిశితంగా గమనిస్తోంది.

ఏదిఏమైనా, సర్కారు పడిపోయినా, మధ్యంతరమే వచ్చినా... జగన్ ఒత్తిడికి లొంగరాదనే అది కృత నిశ్చయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ విషయంలో కఠిన వైఖరి ప్రదర్శించాలన్నదే అధిష్ఠానం ఆలోచన. 'మొక్కై వంగనిది మానైవంగదు. ఇలా వదిలేస్తే పార్టీని హైజాక్ చేస్తారు' అని అధిష్ఠానం వర్గాలు భావిస్తున్నాయి.

ఓదార్పు యాత్ర ధిక్కారంగా భావించేంత తీవ్రమైన విష యం కాదని ముఖ్యమంత్రి రోశయ్య చెబుతున్నప్పటికీ... జగన్ బహిరంగ సభల్లో చేసే వ్యాఖ్యలను మాత్రం అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంటోంది. సోనియా గాంధీ రాష్ట్ర పరిణామాలపై వస్తున్న వార్తలను నిశితంగా పరిశీలిస్తున్నారు. "జగన్ తప్పులను లెక్కపెడుతున్నాం. ఆయన తనను తాను పార్టీకి అతీతంగా భావిస్తున్నారు.

సరైన సమయంలో అధిష్ఠానం తగిన చర్య తీసుకుంటుంది'' అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. జగన్ మలి విడత ఓదార్పు యాత్ర పూర్తయిన తర్వాత పార్టీ నేతలు సమీక్షించి, ఆయనపై ఏ చర్య తీసుకునేదీ నిర్ణయిస్తారని చెబుతున్నారు.

"పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ సోమవారం రాత్రి లండన్ నుంచి తిరిగి వస్తారు. మంగళ లేదా బుధవారాల్లో ఆయనతో పార్టీ సీనియర్ నేతలు పరిస్థితిని సమీక్షిస్తారు. రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్న జగన్ ఈలోపు మరిన్ని వ్యాఖ్యలు చేసే అవకాశముంది. తూర్పు గోదావరిలో ఓదార్పు ప్రారంభమయ్యే నాటికి పరిస్థితి మరింత వేడెక్కుతుంది'' అని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఏం జరుగుతోంది?
జగన్ ఓదార్పు యాత్ర, రోజురోజుకూ పదునెక్కుతున్న విమర్శలు, ఇతర వివరాలపై కాంగ్రెస్ అధిష్ఠానానికి ప్రతిరోజూ సాయంత్రానికల్లా నివేదిక అందుతోంది. జగన్ పత్రికలో వస్తున్న వార్తలు, విశ్లేషణల అనువాదాలు కూడా ఢిల్లీకి చేరుతున్నాయి.

ఆయన బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు తీసుకున్న సమయం ఎంత? రాజకీయ చర్యలకు కేటాయించిన సమయం ఎంత? ఓదార్చింది ఎవరిని? ఓదార్పును విజయవంతం చేయడానికి ఎవరు, ఎన్ని రోజులు శ్రమించారు? ఏయే ఏర్పాట్లు చేశారు? ఈ వివరాలను ఒకరిద్దరు నేతలు అదేపనిగా అధిష్ఠానానికి నివేదిస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగే యాత్రకోసం అనంతపురం, కడప నుంచి వచ్చిన నేతలు తీసుకున్న చర్యలు కూడా అధిష్ఠానం దృష్టికి వచ్చాయి.
ఈ బలం నిజం కాదా?
'జగన్ చర్యలను ప్రతికూల ధోరణిలో చూడటం ఎందుకు? ఆయనకు జనంలో ఉన్న ఆదరణను పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు కదా?' అనే వాదనలకు అధిష్ఠానం తనదైన శైలిలో సమాధానం చెబుతోంది. "వైఎస్ వల్ల ఆర్థికంగా బాగుపడ్డవారు, ఇప్పుడు జగన్‌కు ఉన్న ఆర్థిక బలం వల్ల యాత్రకు ప్రతిస్పందన లభిస్తున్న మాట నిజమే.

వైఎస్ చనిపోయిన ఏడాదిలోపే వస్తున్న ఆయన కుమారుడు జగన్‌ను చూసేందుకు కొందరు జనం కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. అంతమాత్రాన జగన్‌కు ప్రజల్లో చాలా బలం ఉందని చెప్పలేం. శ్రీకాకుళంలో జూనియర్ ఎన్టీఆర్ రోడ్‌షోలకు ఇంతకంటే ఎక్కువగా జనం వచ్చారు. చిరంజీవి సభకు వచ్చినంత జనం మరెవరికీ రాలేదు'' అనే వాదన వినిపిస్తోంది.

"ఇవన్నీ పక్కనపెట్టినా... జగన్ అధిష్ఠానానికి విధేయంగా ఉంటేనే ఆయనను పార్టీ కోసం ఉపయోగించుకోగలం. ఆయన తగిన రాజకీయ అనుభవం లేకుండానే ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. రోశయ్య సర్కారును ఇరుకునపెడుతూ... తద్వారా అధిష్ఠానం నిర్ణయాన్నే ప్రశ్నిస్తున్నారు. అటువంటప్పుడు జగన్ పట్ల పార్టీ అనుకూలంగా వ్యవహరించే అవకాశమెక్కడిది?'' అని ప్రశ్నిస్తున్నారు.

జగన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా జనాన్ని ఆకర్షించే సత్తా ఉందనే వాదనతో కొంత ఏకీభవిస్తూనే... ఆ వ్యక్తిగత ఆకర్షణ తమకు అవసరం లేదని అధిష్ఠానం చెబుతోంది. "వైఎస్ తర్వాత పార్టీలో కొంత రాజకీయ శూన్యత ఏర్పడిన మాట నిజమే. కానీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పూర్తిగా వ్యక్తులపై ఆధారపడి మనుగడ సాగించలేదు. అవకాశం లభిస్తే ఎవరైనా నాయకుడు కాగలరు.

కాంగ్రెస్‌లో అన్ని వర్గాల్లో అనుభవజ్ఞులు, యువ నాయకులు ఇప్పటికీ ఉన్నారు. వారిని క్రమంగా పైకి తేవచ్చు. అయినా... జగన్ ఇప్పుడే అధిష్ఠానం మాట వినడం లేదు. ఆయన బెదిరింపులకు లొంగితే... భవిష్యత్తులో ఏకు మేకు కావడం ఖాయం. హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా కుమారుడు కూడా వేల కోట్లు గుమ్మరించి ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుని తనకే ముఖ్యమంత్రి పదవి కావాలని కోరితే ఏం చెప్పాలి?'' అని ప్రశ్నిస్తున్నారు.

మధ్యంతరం తథ్యమా?
అధిష్ఠానం లెక్కలు ఎలా ఉన్నా... ప్రస్తుత పరిణామాలు మధ్యంతరం దిశగా నడిచే అవకాశాలే అధికమని విశ్లేషకులు చెబుతున్నారు. అధిష్ఠానం వైఖరిని వ్యతిరేకిస్తూ జగన్ 'సెప్టెంబర్ 2'న కొత్త పార్టీ పెడితే, ఆయన వెంట 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు నడిస్తే... రోశయ్య ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు అనివార్యమవుతాయన్నద వీరి అంచనా.

ఓదార్పు దండయాత్రలా, జైత్రయాత్రలా ఉండొద్దన్నది అధిష్ఠానం సూచన. కానీ... ఇందుకు పూర్తి భిన్నంగానే ఓదార్పు జరుగుతోంది. యాత్రను క్రమంగా వేడెక్కించడం ద్వారా ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేలా జగన్ వ్యూహం రచిస్తున్నారని అంటున్నారు. జగన్ వ్యాఖ్యలు 'పార్టీ వేరు, నేను వేరు' అనేలా ఉన్నాయని భావిస్తున్నారు.

ఓదార్పులో బాధిత కుటుంబాలను పరామర్శించడంకంటే... వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ, భారీ వాహన శ్రేణితో ర్యాలీలు, బహిరంగ సభల్లో ప్రసంగాలకే అధిక సమయం పోతోంది. ఇదంతా జగన్ రాజకీయంగా తన బలాన్ని, బలగాన్ని ప్రదర్శించేలా ఉందని చెబుతున్నారు. ఆయన భవిష్యత్ కార్యాచరణకు ఇవి స్పష్టమైన సంకేతాలేనని అంటున్నారు.
లెక్కల చిక్కులు
ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి 156 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు, ఏడుగురు ఎంఐఎం సభ్యులు కాంగ్రెస్ పార్టీనే బలపరుస్తున్నారు. ఇక ప్రజారాజ్యం ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారా అనే అంశంపై సందేహాలున్నాయి.

జగన్ కుటుంబంతో బంధుత్వం కారణంగా పీఆర్పీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కాంగ్రెస్‌కు సహకరించవచ్చు. పీఆర్పీలో కచ్చితంగా కాంగ్రెస్ వైపు ఉండేవారు, ఎంఐఎం, ఇండిపెండెంట్లను కలిపితే 25 మంది ఎమ్మెల్యేలు అవుతారు. అంటే... జగన్ వెంట 30 మంది వెళ్లినా రోశయ్య ప్రభుత్వం మైనారిటీలోకి వెళుతుంది. కానీ... జగన్‌కు రోశయ్య సర్కార్‌ను దెబ్బతీసేంత శక్తి ఉందని అధిష్ఠానం భావించడం లేదు.

జగన్ అనుయాయులు అధిష్ఠానాన్ని «ధిక్కరిస్తే శాసన సభ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఒకవేళ జగన్ నిజంగా రోశయ్య సర్కారును పడగొట్టేంత బలం సంపాదిస్తే... అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేందుకే సిద్ధం కావాలని అధిష్ఠానం భావిస్తోంది. జగన్‌కు మాత్రం లొంగరాదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. "కేంద్ర ప్రభుత్వానికి నాలుగేళ్ల దాకా ఢోకా లేదు.

రాష్ట్రంలో మధ్యంతరం వచ్చి మరోపార్టీకి అధికారం లభించినా... ప్రస్తుత రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలను ఆ పార్టీ తట్టుకోలేదు. మళ్లీ కాంగ్రెస్ పార్టీయే తిరిగి అ«ధికారంలోకి వస్తుంది'' అని విశ్లేషించుకుంటున్నారు. అన్నింటికంటే మించి... ప్రభుత్వ మనుగడకు ముప్పు వస్తే నష్టపోయేది జగన్ వర్గమే అని అధిష్ఠానం చెబుతోంది. నాలుగేళ్ల వరకు జగన్ తన బలాన్ని స్థిరంగా ఉంచుకుంటారని పార్టీ భావించడం లేదు.

రాత్రి 9 గంటల వరకు ఇద్దరికి ఓదార్పు

ఎమ్మెల్యేలు ఇళ్లలో లేకపోయినా.. జగన్.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వస్తున్నారు. సీతంపేటలో ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు ఇంట్లో జగన్ దాదాపు 30 నిమిషాలు గడిపారు. వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేరు.

(శ్రీకాకుళం) : కడప ఎంపీ జగన్ ఓదార్పు యాత్ర ఆలస్యంగా సాగుతోంది. మూడో రోజైన శనివారం ఏడు కుటుంబాలను జగన్ ఓదార్చాల్సి ఉన్నప్పటికీ... రాత్రి 9 గంటల వరకూ కేవలం రెండు కుటుంబాలకే ఓదార్పు లభించింది. ఎల్ఎన్‌పేట మండలం యంబరాం గ్రామానికి ఉదయం ఐదు గంటలకు చేరుకొని కిలారి సరస్వతి కుటుంబాన్ని ఓదార్చారు.

ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి జీవన స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. పది నిమషాల పాటు వారితో గడిపి లక్ష రూపాయల చెక్కు ఉన్న కవర్‌ను అందజేశారు. సాయంత్రం 6 గంటలకు వీరఘట్టం మండలం కంబర గ్రామానికి చేరుకొని అరసాడ శ్రావణ్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో పావు గంట గడిపారు. లక్ష రూపాయల చెక్కుగల కవరును అందజేశారు.

షెడ్యూలు ప్రకారం ఇంకా రేగిడి మండలం ఆముదాలవలసలో మేకా ప్రసాదరావు కుటుంబాన్ని, రాజాం మండలం దోసరిలో గొర్లె సూర్యనారాయణ కుటుంబాన్ని, జి.సిగడాం మండలం ముషినివలసలో దేవగుప్తాపు నర్సింగరావు కుటుంబాన్ని, పొందూరు మండలం నందివాడలో మజ్జి దాలినాయుడు కుటుంబాన్ని, లావేరు మండలం బుడుమూరులో పరసాన నర్సింహులు కుటుంబాన్ని జగన్ ఓదార్చాల్సి ఉంది. ఓదార్పు యాత్ర 12 గంటలు ఆలస్యంగా జరుగుతుండడంతో బాధిత కుటుంబాలు నిద్రాహారాలు మాని జగన్ కోసం ఎదురుచూస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పుయాత్ర

కెవిపి రామచంద్రరావుకు ఇప్పుడు పెద్ద పరీక్ష


వైయస్ ఆప్త మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావుకు ఇప్పుడు జీవన్మరణ సమస్య ఎదురైంది. అధిష్ఠానం వద్దంటున్నా వినకుండా ఓదార్పు యాత్రకు వెళ్లిన జగన్‌ వ్యవహారశైలిని నాయకత్వం ఓ వైపు నిశితంగా పరిశీలిస్తోంది. యాత్రపై పూర్తి స్థాయి నిఘా పెట్టింది. మరోవైపు సోనియా, రోశయ్య తీరుపై జగన్‌ వర్గీయుల నుంచి విమర్శల దాడి ఉధృతమ వుతోంది. ఈ క్రమంలో జగన్‌ కాంగ్రెస్‌ (వైయస్‌) పార్టీని స్థాపించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ కు ఆత్మబంధువుగా ముద్ర ఉన్న కేవీపీ ఎటువైపు నిలుస్తారన్న అంశంపై పార్టీలో చర్చ ప్రారంభమయింది. వైయస్‌ మృతి చెందిన తర్వాత కేవీపీ హవా తగ్గిపోతుందని, రోశయ్య ఆయనను పక్కకుబెడతారని తొలుత ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే కేవీపీ కూడా రోజూ జగన్‌ నివాసానికి వెళ్లి మంత్రాంగం నడపడం అలాంటి ప్రచారానికి బలం చేకూర్చింది. అయితే, ఆశ్చర్యకరంగా..రోశయ్య మునుపటి మాదిరిగానే కేవీపీకి ప్రాధాన్యం కొనసాగించారు. ఇరిగేషన్‌ కాంట్రాక్టర్లకు బిల్లుల మంజూరు, ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, ఇతర వ్యవహారాల్లో వైయస్‌ ఉన్నప్పుడు ఏ స్థాయిలో హవా సాగించారో ఇప్పుడూ దానినే కొనసాగిస్తున్నారు. పార్టీ వ్యవహారాల్లో కూడా ఆయన ప్రభ ఇంకా వెలుగుతూనే ఉంది.

రోశయ్య కూడా ‘అన్ని వ్యవహారా ల్లో’ కేవీపీపైనే ఆధారపడి, ఆయనకు అందరి కన్నా ఎక్కువే ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాస్తవం స్పష్టమవుతోంది. ‘అధిష్ఠానం అవస రాలు తీర్చే’ అంశంలో కేవీపీ పాత్రను కొన సాగించాలన్న ఢిల్లీ సంకేతాల మేరకే ఆయనకు పాత ప్రాధాన్యం ఇస్తున్నారన్నది పార్టీ సీనియర్ల ఉవాచ. ముఖ్యమంత్రి కూడా కేవీపీ వ్యవహారంలో లౌక్యంగా వ్యవహరించారు. వైయస్‌ మృతి చెందిన తర్వాత కూడా కేవీపీకి ప్రాధాన్యం ఇవ్వడంపై తెలంగాణ [^] సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సీఎం మాత్రం లౌక్యంగా ఎవరికి ఇవ్వవలసిన ప్రాధాన్యం వారికి ఇస్తానని సర్దిచెప్పారు. ఆ విధంగా అటు జగన్‌ వ్యతిరేకవర్గంతో, ఇటు జగన్‌ అనుకూలుడైన కేవీపీతోనూ పని తీసుకుంటున్న వ్యూహాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

జగన్‌ పార్టీ నుంచి వెళ్లిపోతున్నారన్న ప్రచారం జరుగుతున్నందున..ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురుచూసి, ఆ లక్ష్యసాధన కోసం పనిచేస్తున్న తన ఆప్తమిత్రుడి తనయుడు జగన్ ‌కు బాసటగా నిలుస్తారా లేదా అని నేతలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. తన మిత్రుడు వైయస్‌ సీఎం కావాలన్న తన కోరికను నెరవేర్చుకున్న కేవీపీ.. మిత్రుడి కుమారుడు కూడా సీఎం కావాలని కోరుకోరా అని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అదే నిజమయి జగన్‌ స్థాపించే పార్టీలో కేవీపీ చేరితే.. కాంగ్రెస్‌ వల్ల సంక్రమించిన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? అదే సమయంలో వైయస్‌ మాదిరిగానే తనకు అధిక ప్రాధాన్యం ఇస్తూ తనను గౌరవిస్తోన్న రోశయ్యను వదులుకుంటారా?..మిగిలిన వారంతా జగన్‌ పార్టీలో చేరితే..కేవీపీ ఒక్కరే దూరంగా ఉంటే వచ్చే విమర్శలను ఏవిధంగా ఎదుర్కొంటారు?

'ఓదార్పు' లో వైయస్ జగన్ సెంటిమెంట్ కు కళ్ళనీళ్ళు పెడుతున్న జనం

నరసన్నపేట (శ్రీకాకుళం జిల్లా): జగన్ యాత్రకు మంచి స్పందన కనిపిస్తోంది. ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్‌ జగన్ శుక్రవారం నరసన్నపేటలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి [^] విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 'నాన్న చనిపోతూ ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయారు. ఇంత పెద్ద కుటుంబంలో నన్ను ఒక కొడుకుగా దీవిస్తున్నారు, తమ్ముడిలా ఆదరిస్తున్నారు.


మీ గుండెల్లో నాన్న ఉన్నాడు కాబట్టే మీరు ఆదరణ ఆప్యాయతలు చూపిస్తున్నారు.' అంటూ జగన్‌ ప్రసంగించారు. ఆయన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారందరికి జగన్‌ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

ఓదార్పు యాత్రపై అధిష్ఠానం మౌనం

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాన్ని పెడచెవిన బెట్టి దివంగత నేత వైఎస్‌ తనయుడు, కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించిన 'ఓదార్పు యాత్ర'కు పెద్దగా ప్రాధాన్యతనివ్వరాదనే అధిష్టానం ఇప్పటికీ భావిస్తోంది.
వైఎస్‌ పుట్టినరోజునాడు గురువారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమైన జగన్‌ యాత్ర విజయవంతంగా రెండవరోజుకు చేరుకొన్నప్పటికీ దీనిపై స్పందించేందుకు అధిష్ఠానం ప్రతినిధులు ముందుకు రావడం లేదు.
పెద్దసంఖ్యలో ప్రజల భావోద్వేగాలతో ముడివడిన ఈ యాత్ర గురించి ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయకుండా వేచిచూడాలనే వైఖరినే ఎఐసిసి అధికార ప్రతినిధులు కూడా అవలంబిస్తున్నారు. జగన్‌ ఓదార్పు యాత్ర గురించి తనకేమీ తెలియదని, ఒక కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యుడు సాగిస్తున్న ఈ యాత్రపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడైన కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని మాత్రమే అడగాలని శుక్రవారంనాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికాగోష్ఠిలో మాట్లాడిన ఎఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్‌ షకీల్‌ అహ్మద్‌ విలేఖరుల ప్రశ్నలను తప్పించుకొనే ప్రయత్నం చేశారు. జగన్‌ కొత్త పార్టీ పెడుతున్నారనే వార్తలపై మీ అభిప్రాయమేమిటన్న విలేఖరుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చేందుకు నిరాకరించారు. పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి నాయకత్వంపై దండయాత్ర మాదిరిగా ఆయన సాగిస్తున్న వోదార్పు యాత్ర రెండవ రోజుకు చేరినా స్పందించరా అన్న ప్రశ్నలకు 'యాత్ర గురించి నాకెలాంటి సమాచారం లేదు, యాత్రకు అధిష్ఠానం అనుమతి ఉన్నదా లేదా కూడా నాకు తెలియదు, యాత్ర సందర్భంగా ఆయన పార్టీపై ధ్వజమెత్తినట్లు కూడా ఎలాంటి సమాచారం లేదు' అన్న మాటలే ఆయన నుండి సమాధానంగా లభించాయి.
అయితే, అంతకుముందు కేరళలో వామపక్ష కూటమితో చేతులు కలపాలన్న యుపిఎ భాగస్వామ్యపక్షంఎన్‌సిపిలో చోటుచేసుకొంటున్న పరిణామాల గురించి, బీహర్‌ పరిణామాల గురించి వివరించిన ఆయనపై విలేఖరులు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌లో చోటుచేసుకొంటున్న పరిణామాలపై ఎందుకు వ్యాఖ్యానించరంటూ విరుచుకుపడినా ఆయన మౌనం వీడలేదు. కాకపోతే, ఒక దశలో ఓదార్పు యాత్రను పార్టీ జాగ్రత్తగా గమనిస్తోందని, ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ తిరిగి వచ్చాక సమర్పించే నివేదిక ఆధారంగానే అధిష్ఠానం ఏ నిర్ణయమైనా తీసుకొంటుందని మాత్రం వివరించారు.
  • మొయిలీ నివేదికపైనే ఏ నిర్ణయమైనా : షకీల్‌ అహ్మద్‌ ప్రకటన
కాంగ్రెస్‌లో ఒక వ్యక్తికి సంబంధించిన అంశంపై పెద్దగా ఆందోళన అనవసరమని, కాలక్రమేణా అన్ని సమస్యలు పరిష్కారమౌతాయన్న ధీమాను మరో సీనియర్‌ ఎఐసిసి నాయకుడు వ్యక్తం చేశారు.

నాన్న పోయాక రాజకీయాలు దిగజారాయి !

crowd ‘‘రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా రాజకీయాలు అట్టడుగు స్థాయికి దిగజారాయి. నాన్న చనిపోయిన తరువాత నన్ను ఒంటరి వాడుగా చూశారు. నేను చిరునవ్వే సమాధానంగా చెప్పాను. ఇప్పుడు మీ అందరి ప్రేమాభిమానాలు చూసిన తరువాత మీ అండదండలు నాకున్నాయని భావిస్తున్నాను. అదే నాకు గొప్ప గౌరవం. రాజకీయంగా ఎవరూ నాతో ఉన్నా లేకున్నా మీరందరూ నాతో ఉన్నారు. మండుటెండలో మీరు చూపిస్తున్న ఆదరణ నేను ఒంటరివాడిని కాదని రుజువు చేస్తోంది’’ అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనయుడు, కడప ఎంపి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పేరొన్నారు. రెండవ రోజైన శుక్రవారం జగన్‌ ఓదార్పు యాత్ర శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నుంచి ప్రారంభమైంది.

vechiles ఈ యాత్రలో భాగంగా జగన్‌ తన ప్రసంగంలో ఈసారి రాజకీయాలను ముడిపెట్టి మాట్లాడారు.అంతటితో ఆగక అధిష్టానానికి కూడా చురకలంటించారు. రాజకీయాలు దిగజారిపోయాయని కోటబొమ్మాళి బహిరంగసభలో ప్రస్తావించి అధిష్టా నం తప్పులను ఎత్తి చూపారు. తన తండ్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహా న్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ, మీ అందరినీ చూస్తుంటే అంతులేని అభిమానం పుట్టుకొస్తోం దన్నారు. రాజకీయంగా ఎవరు నాతో ఉన్నా లేకున్నా మీరందరూ ఉన్నారని అంటూ, మీ ఆదరణ, ఆప్యాయతే నా ఉన్నతికి పునాదులని చెప్పుకొచ్చారు. నరసన్నపేటలో ధర్మాన సోదరుడు, స్థానిక ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ హాజరుకాకపోయినా పెద్ద ఎత్తున జనం జగన్‌కు నీరాజనం పట్టారు.

ఓదార్పులో ఇతర జిల్లాల నాయకుల హవా
శ్రీకాకుళం, మేజర్‌న్యూస్‌: జగన్‌ ఓదార్పు యాత్రలో ఇతర జిల్లాల నాయకుల హవా కనిపిస్తోంది. అదీకూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. గురువారం జరిగిన జగన్‌ ఓదార్పు యాత్రలో ఇతర జిల్లాల నాయకులు పల్చగా కన్పించినా రెండోరోజు ఆ లోటు పూర్తిగా తీరింది. మాజీ మంత్రి మారెప్ప మొదటి రోజు హాజరుకాగా, రెండోరోజు పక్క జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మందీ మార్బలంతో వచ్చారు. దాదాపు వంద వాహనాలతో జగన్‌ కాన్వాయిలో ఆయన అనుచరగణం కన్పించారు.

womenవీటికి తోడు కృష్ణా, నెల్లూరు, రాయల సీమ జిల్లాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎక్కువ సంఖ్యలో వాహనాలతో రావడం కన్పించింది. వీరందరూ జగన్‌ ఓదార్పు యాత్రకు బాహాటంగా మద్దతు పలుకుతున్నారు. ప్రత్యేకంగా వీరందరు తమ నాయకుడు ఎదుగుదలను చూసి ముచ్చటపడుతూనే కాన్వాయ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్‌ భవిష్యత్తు ఉన్న నాయకుడిగా వారు కొనియాడడం, అధిష్టానం తీరు మార్చుకోక తప్పదని మాట్లాడుకోవడం కన్పించింది. దారిపొడుగునా కాన్వాయిలో ఇతర జిల్లాలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున జగన్‌ వెంట రావడంతో తెర వెనుక ఏదో జరుగుతున్నట్టు కన్పిస్తోంది.

దిగివచ్చిన వారసులు
శ్రీకాకుళం జిల్లాలో జగన్‌ ప్రారంభించిన ఓదార్పు యాత్రకు మంత్రులు, ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నా వారి అనుచరులు, వారసులు మాత్రం పాల్గొన్నారు. జగన్మోహన్‌రెడ్డికి ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. వారసులు కీలక పాత్ర పోషించడంతో నరసన్నపేట సభ విజయవంతమైంది. మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు కృష్ణదాస్‌ అసెంబ్లీ సమావేశంలో ఉండడతో వారు రాలేకపోయినా లోపాయికారిగా అన్ని పనులు చక్కదిద్దారు. ధర్మాన కృష్ణదాస్‌ సతీమణి పద్మప్రియ, ఆమె కుమారుడు రామలింగంనాయుడు, రెవిన్యూమంత్రి ధర్మాన కుమారుడు రామ్‌మనోహర్‌ నాయుడు జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం వాళ్లు వెంటరాగా నరసన్నపేటలో వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని జగన్‌ ఆవిష్కరించారు. ధర్మాన కుటుంబ సభ్యులను చూసి జగన్‌ మరింత ఉత్సాహంతో మాట్లాడారు. ఈసం దర్భంగా ఎమ్మెల్యే కృష్ణదాస్‌ సతీమణి పద్మప్రియ మాట్లాడి జగన్‌బాబు రావడం వల్ల మీరంతా ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన్నారు.మొత్తం మీద జగన్‌ నరసన్నపేట వచ్చేసరికి పార్టీ తోడు లేనట్టు ఎవరూ ఊహించలేదు.

జగన్‌ కోసం ఎంపి కృపారాణి ఎదురు చూపు
శ్రీకాకుళం, మేజర్‌న్యూస్‌: కడప ఎంపి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మొదటి రోజు పర్యటన రాత్రంతా జరిగింది. షెడ్యూల్‌ ప్రకారం గురువారం సాయంత్రం 6.30గంటలకు టెక్కలి చేరుకోవాల్సి ఉండగా తెల్లవార్లు ఓదార్పు కొనసాగింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు జగన్‌ కోసం పార్లమెంటు సభ్యురాలు కిల్లి కృపారాణి తన స్వగృహంలో ఎదురు చూశారు. కేవలం రెండు గంటల సమయం గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకున్న జగన్‌ తిరిగి ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. ఎచ్చెర్ల ఎంపిపి బల్లాడ హేమమాలిని రెడ్డి హారతులతో రెండవ రోజు యాత్ర ప్రారంభమైంది. మొదటి రోజు , రెండవ రోజు కూడా ఎంపి కృపారాణి భర్త కిల్లి రామ్మోహన్‌రావు జగన్‌ పక్కనే ఉండి అన్ని వ్యవహారాలు చూస్తున్నారు.

అంత డబ్బెక్కడిది? కాంగ్రెస్‌ది పదవుల కోసం ఆరాటం: బాబు - ‘దేశం’ పై జ‘గన్‌’!

వైఎస్ కొడుకు కావడం తప్ప
జగన్‌కు ఉన్న అర్హత ఏమిటి?
వేటగాడిలా పథకాల ఎర వేశారు
వేల కోట్లు పిండుకున్నారు
మాది ప్రజల కోసం పోరాటం
'రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, ప్రకృతి వైపరీత్యాల మరణాల సమయంలో నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వాలే ముందూ వెనకా చూసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఇవ్వలేనంత డబ్బు జగన్ ఎలా ఇవ్వగలుగుతున్నారు?' ఇది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రశ్న. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 'ఓదార్పు' గురించి ప్రస్తావించారు.

'వైఎస్ చనిపోయినప్పుడు ఆవేదనతో మరణించారంటూ 700 మందిని లెక్కగట్టి తలా రూ. లక్ష చొప్పున ఇస్తున్నారు. అంటే రూ.7 కోట్లు పంచుతున్నారు. జగన్‌కు ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది?' అని ప్రశ్నించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత ముద్దు కృష్ణమ నాయుడు జోక్యం చేసుకున్నారు.

'బాధిత కుటుంబాలకు ఇస్తున్నది ఏడుకోట్ల రూపాయలైతే, పరామర్శ పేరుతో జరుపుతున్న యాత్రకు పెడుతున్న ఖర్చు వంద కోట్లు' అని తెలిపారు. 'వైఎస్ ముఖ్యమంత్రికాక ముందు జగన్ ఆదాయం ఎంత? ఆస్తులెన్ని? ఇప్పుడు ఎన్ని? అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సొంత పత్రిక సాక్షికి ఏడాదిలో రూ.250 కోట్ల నష్టం చూపించారు. అంత నష్టం భరించేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?' అని బాబు ప్రశ్నించారు.

వివాదాలకు, నెగెటివ్ అంశాలకు ప్రచారం ఎక్కువ వస్తుందని, జగన్ యాత్ర విషయంలో అదే జరుగుతోందని చెప్పారు. తాము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు పదవులు, అధికారం కోసం పోరాడుకొంటున్నారన్నారు.

జగన్ పార్టీ పెడితే రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీల మధ్యే కీలక పోరు ఉంటుందా అని ప్రశ్నించగా. 'రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీలు కొత్త కాదు. చాలామంది పెట్టారు. తర్వాత అవి కనిపించలేదు'' అని అన్నారు.

చతికిలబడుతున్న రోశయ్య
దివంగత ముఖ్యమంత్రి కుమారుడు కావడం మినహా జగన్‌కు ఉన్న అర్హత, ప్రత్యేకత ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. "వేటగాళ్లు పక్షులకు ఎర వేసినట్లుగా వైఎస్ రేషన్ కార్డులు, పింఛన్లు, ఆరోగ్య శ్రీ కార్డులు వంటి పథకాలు విసిరి ప్రజలను ఆకట్టుకున్నారు. వాటిచాటున రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోపిడీ చేశారు. ఆ తర్వాత రోశయ్యకు జాక్‌పాట్ తగిలి వచ్చారు. కానీ, ఏమీ చేయలేక చతికిలబడుతున్నారు' అని అన్నారు.

వారంపాటు తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని రోశయ్య చేసిన ప్రకటనను తేలిగ్గా తోసిపుచ్చారు. 'సీఎం పదవి నాకేమైనా కొత్తా? రోశయ్య మాకు ఇచ్చేదేమిటి? కాంగ్రెస్ అధిష్ఠానం ఇస్తే ఆయన తీసుకున్నారు. మాకు ప్రజలే అధిష్ఠానం. ఇస్తే వాళ్లే ఇస్తారు'' అని అన్నారు.
‘దేశం’ పై జ‘గన్‌’!
chandruకాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి, సొంత పార్టీ పెట్టాలని యోచి స్తున్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే లక్ష్యంతో వ్యూహరచన చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలతో విసిగెత్తిపోయిన వారిని తన పార్టీలో చేర్చుకోవాలని జగన్‌ పావులు కదుపుతున్నట్లు సమాచారం. పార్టీలో సగానికి పైగా బాబుపై అవిశ్వాసంతో ఉన్నట్లు గమనించిన జగన్‌ దానిని సద్వినియోగం చేసు కునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. దీనికోసం 10 వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో చంద్రబాబునాయుడును తీవ్రంగా వ్యతి రేకిస్తున్న కర్నాటక మైనింగ్‌ కింగ్‌ ఒకరు ప్రధాన సూత్రధారిగా పనిచేస్తున్నారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో కీలకమైన నేతలను గుర్తించి వారి అవసరాలను తీర్చి, తన పార్టీలో చేర్చుకోవాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా, ఆ పార్టీకి అత్యంత కీలకమైన నాయకులకు 25 కోట్ల రూపాయల చొప్పున ఆఫర్‌ చేసి, వారిని పార్టీ వైపు ఆకర్షించాలని భావిస్తున్నారు. ఈ విషయంలో సీనియారిటీ బట్టి రేటు నిర్ణయిస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగా అనంతపురం, వరంగల్‌, గుంటూరు, విశాఖ, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన కొందరు నేతలను గుర్తించారు.

టీడీపీలో యువకులు నిరాశగా ఉన్నారని, నమ్ముకున్న వారికి చంద్రబాబునాయుడు న్యాయం చేయడం లేదని, బీసీ నేతలకూ సరైన న్యాయం చేయడం లేదని, ఎన్నికల వరకూ ఆ పార్టీలో ఎంత మంది ఉంటారో తెలియని పరిస్థితి ఉందని జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కోసం అంకితభావంతో పనిచేస్తున్న సీనియర్లు కూడా ఆయన తమకు న్యాయం చేయ రన్న అపనమ్మకంతో ఉన్న వాతావరణాన్ని సద్వినియోగిం చేసు కోవాలని భావిస్తున్నారు. వారి ఆర్థిక అవసరాలుతీర్చడం ద్వారా వారందరినీ పెద్ద సంఖ్యలో తీసుకుని టీడీపీని దెబ్బతీయాలన్నది జగన్‌ అసలు లక్ష్యమంటున్నారు. వైఎస్‌ మృతి చెందడ ంతో ఇక తానే ముఖ్యమంత్రినన్న మితిమీరిన ఆత్మవిశ్వా సంతో ఉన్న బాబు తమను లెక్కచేయడం లేదన్న అసంతృప్తిని వినియోగించుకుని ఏవిధంగానైనా తన వైపు తీసుకురావాలన్నది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.

అదే విధంగా, కాంగ్రెస్‌తో పాటు టీడీపీలో కూడా వృద్ధతరం నేతలే ఎక్కువయ్యారని, వాళ్లు పార్టీలో ఉన్నంతకాలం తమకు భవిష్యత్తు లేదన్న అసంతృప్తితో ఉన్న యువ నేతలను కూడా లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిసింది. సదరు యువ నేతలు కూడా జగన్‌ వెంట యువకులే ఎక్కువగా ఉన్నందున తాము కూడా ఆయన పార్టీలోకి వెళ్లా లని యోచిస్తున్న సమాచారం అందిందని తెలి సింది. బాబు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తాను అనుకున్నదే చేస్తుండటంతో పార్టీకి, తమకు భవిషత్తు లేదని యువనాయకులు భావిస్తున్నం దున, వారిని గుర్తించి వారి ఆర్థిక అవసరాలు తీర్చ డం ద్వారా జగన్‌ వైపు చేర్చాలని ఆయన వర్గీ యులు వ్యూహరచన చేస్తున్నారు. ఇదిలాఉండగా, జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కర్నాటక మైనింగ్‌ కింగ్‌ ఒకరు దేశవ్యాప్తంగా ఉన్న వేదపండితులను పిలిపించి వారితో సుదర్శనయాగం బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ లక్ష్యం కోసం పనిచేస్తున్న సదరు ప్రముఖుడు కాంగ్రెస్‌ను కాకుండా ప్రధానంగా చంద్రబాబునాయుడును దెబ్బతీసేందుకే వ్యూహరచన చేస్తున్నారు.