జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Showing posts with label Vijayamma. Show all posts
Showing posts with label Vijayamma. Show all posts

Sunday, March 13, 2011

జగమొండి ..... జగన్‌

YS-Jaganసినిమాలో సీతయ్యే కాదు. నిజ జీవితంలో మన జగనయ్య కూడా ఎవరి మాటా వినడని తేలిపోయింది. కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేసి, తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలన్న పట్టుదలతో శనివారం తన ఇడుపులపాయ ఎస్టేట్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఊపిరిపోసిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏకపాత్రాభినయ ప్రదర్శన చూసిన ఆయన సహ చరులు, అనుచరుల నుంచి సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే వినిపించడం విస్మయం కలిగిస్తోంది. పార్టీ పేరు, జెండా ప్రదర్శన అంతా కుటుంబానికే పరిమితమయింది. జగన్‌ పోకడ పరిశీలిస్తే.. ఆయన పార్టీపెట్టకముందునుంచే ఒంటెత్తు పోకడ అనుస రిస్తున్నారన్న అభిప్రాయం జగన్‌ చుట్టూ ఉన్న నేతల్లోనే మొదలు కావడం భవిష్యత్తు పరిణా మాలు ఇంకెలా ఉంటాయన్న అంశంపై అప్పుడే చర్చకు తెరలేచింది.

తన అభిమానులు, సహచ రులు, అనుచరుల సమక్షంలో పార్టీ పేరు ప్రకటిం చిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీరు ప్రారంభంలోనే విమర్శల పాలవుతోంది. నిజానికి జగన్‌ పార్టీ పేరును ఈనెల 20 తర్వాత ప్రకటిస్తారని ఆయన సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, రవీంద్ర నాధ్‌రెడ్డి, అంబటి రాంబాబు, గట్టు రామచంద్ర రావు వంటి నేతలు పలు సందర్భాల్లో మీడియాకు వెల్లడించారు. అయితే, హటాత్తుగా తూర్పుగోదా వరి జిల్లా జగ్గంపేటలో ఏర్పాటుచేసిన బహిరం గసభ వేదికపై తాను శనివారం వైఎస్‌ఆర్‌ పార్టీ పేరు ప్రకటించబోతున్నట్లు జగన్‌ చేసిన ప్రకటన ఆయన చుట్టూ రోజూ ప్రద ణలు చేసేవారిని విస్మయం కలిగించింది.

దీనితో.. జగన్‌కు సలహాదారులుగా ప్రచారంలో ఉన్న వారికి బయట జనంలో ఉన్న ఇమేజ్‌ పోయింది. చివరకు జగన్‌ వారికి సైతం తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటారని, ఆయన చుట్టూ ఉన్న వాళ్లంతా డమ్మీలేనన్న ప్రచారం మొదలయింది.పార్టీ పేరు ఎప్పుడు ప్రకటించాలన్న అంశంపై కనీసం తమతో మాటమాత్రం కూడా చర్చించకుండా హటాత్తుగా ఏక పక్ష నిర్ణయం తీసుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

జగన్‌ ఎవరిమాటా వినరని, తనకు తోచిందే చేస్తారని, తనకు అన్నీ తెలుసునని భావిస్తుంటారని, తనకు ఎవరు ఎదురుచెప్పినా సహించే అలవాటు లేదన్న ప్రచారం ఇప్పటికే జగన్‌ శిబిరంలోను, ఆయన గురించి బాగా తెలిసిన వర్గాల్లోనూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇలాంటి వ్యాఖ్యల్ని ఇప్పటివరకూ కొట్టిపారేస్తూ వచ్చిన జగన్‌ సహచరులు.. ఇప్పుడు సరిగ్గా అలాంటి చేదు అనుభవం త మకే ఎదురుకావడంతో బిత్తరపోవలసి వచ్చింది. ఫలితంగా ఇప్పుడే ఇక ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకెన్ని ఏకపక్ష నిర్ణయాలను వినవ లసి వస్తుందోనన్న ఆందోళన జగన్‌ శిబిరంలో మొదలయింది.

జగన్‌కు జనంలో బలం ఉందని, ఆయన పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్‌,తెలుగుదేశం పార్టీల నుంచి తామరతంపరగా నేతలు వస్తారన్న అంచనాతో చాలామంది కాంగ్రెస్‌ పెద్ద నేతలు ఆ పార్టీని వీడి జగన్‌ గూటికి చేరారు. మరికొందరు జగన్‌ పార్టీ పెట్టిన తర్వాత అందులో చేరదామన్న యోచనలో ఉన్నారు. ఇప్పుడు జగన్‌ మాత్రం తమతో మాట మాత్రం కూడా చర్చించకుండా, పార్టీ ప్రకటన తేదీని హటాత్తుగా ప్రకటించడంపై వారిలో భవిష్యత్తుకు సంబంధించిన బెంగ అప్పుడే మొదలవడం ప్రస్తావనార్హం. ఇది జగన్‌ పెట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ భవిష్యత్తుకు ఒక ప్రమాద సంకేతంలా కనిపిస్తోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో జగన్‌ తీసుకున్న ఒంటెత్తు నిర్ణయాలు పరిశీలిస్తే... ఆయన తన సహచరులను ఏ మాత్రం విశ్వాసంలోకి తీసుకోవడం లేదన్న వాస్తవం వెల్లడవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తన సహచరులను జగన్‌ నమ్మడం లేదన్న సంకేతాలు ఇడుపుల పాయ వ్యవహారం స్పష్టం చేస్తోందంటున్నారు. ‘నాయకుడనేవాడు అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలి. కానీ సొంతంగా నిర్ణయాలు తీసు కుని దానిని ప్రకటించడం ఏకపక్షమవుతుంది. దానివల్ల తమ నాయకుడు ఎవరినీ నమ్మరన్న సంకేతాలు వెళతాయి.

అది భవిష్యత్తులో మాకు మాత్రమే కాదు. వ్యక్తిగతంగా జగన్‌కూ నష్టమే. భవిష్యత్తులో పార్టీ టికెట్లు, ఇతర నిర్ణయాలు కూడా తమను సంప్రదించకుండా జగన్‌ ఒక్కరే తీసుకుంటారన్న అభిప్రాయం బలపడుతుంది. దీనివల్ల ఇతర పార్టీల నేతలు మా పార్టీలో చేరడానికి వెనుకంజ వేస్తార’ని జగన్‌కు సన్ని హితంగా వ్యవహరించే ఓ నేత వ్యాఖ్యానించారు. ఈ విషయంలో చంద్రబాబునాయుడు విధానాన్ని గుర్తు చేస్తున్నారు. ఒక అంశంపై చంద్రబాబు నాయుడు అనేక స్థాయుల్లో చర్చిస్తారని, చివరకు తాను అనుకున్నది చేసినప్పటికీ, దానిని మిగిలిన వారితో చర్చించే అలవాటు ఆయనకు ఉందని వివరిస్తున్నారు. దానివల్ల మిగిలిన నేతల్లో తమ నేత అందరితోనూ చర్చించి నిర్ణయం తీసుకుం టారన్న సానుకూల వాతావరణం ఏర్పడుతుం దంటున్నారు.

జగన్‌ చెబుతున్నట్లు.. ఎన్నికల కోడ్‌ నిబంధనలు అడ్డువస్తున్నందుకే హడావిడిగా పార్టీ పేరు ప్రకటించినప్పటికీ.. జగ్గంపేటలో కాకుండా ముందే తమతో చర్చించి ప్రకటించి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. దానివల్ల తాము కూడా సంతోషించేవాళ్లమని, తమ నేత తమను సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారని భావించేవాళ్లమని వివరిస్తున్నారు.ఇప్పటికే జగన్‌ వ్యవహారశైలి తెలిసిన వారు.. ఆయన ఎవరిమాట వినడని, తనకు ఎదురుచెబితే సహించరని, ఆవేశపరుడని, తాను చెప్పిందే వినాలన్న ధోరణితో ఉంటారన్న ప్రచారాన్ని ఏకపక్షంగా చేసిన పార్టీ ప్రకటన వ్యవహారం నిజం చేసినట్టయిందని ఆయన సన్నిహితులు వాపోతున్నారు.

Tuesday, December 7, 2010

45 నుంచి 60 రోజుల్లో మన పార్టీ: జగన్

ఇడుపులపాయలో నాన్న సమాధి సాక్షిగా ఆవిర్భవిస్తుంది....
కడప, పులివెందుల ఉప ఎన్నికలు సెమీ ఫైనల్స్.. 2014 ఎన్నికలు ఫైనల్స్
మూడేళ్లు ఓర్చుకుంటే 30 ఏళ్లు వైఎస్ సువర్ణ పాలన అందిస్తా...
మన జెండా పైనే వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ
ఇది విలువలు, విశ్వసనీయత, తెలుగింటి ఆత్మగౌరవానికి...
కుళ్లు, కుతంత్రాలకు మధ్య పోటీ కాంగ్రెస్‌లో ఎన్నో అవమానాలకు గురిచేశారు

కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన మహానేత కుటుంబాన్ని చీల్చేందుకు తెగించారు

నీచ రాజకీయాలకు పాల్పడ్డారు
ఆత్మగౌరవం చంపుకోలేకబయటకు వచ్చేశా
పులివెందుల నియోజకవర్గ కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటీ


‘మరో 45 నుంచి 60 రోజుల్లో మన పార్టీ వస్తుంది. ఇడుపులపాయలో నాన్న సమాధి సాక్షిగా ఇది ఆవిర్భవిస్తుంది. మన పార్టీ జెండాపైనే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఈ ఎన్నికలు సెమీ ఫైనల్స్. 2014 ఎన్నికలు ఫైనల్స్’ అని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ‘నాతోపాటు నడిచే వారికి మూడేళ్లు కష్టాలుంటాయి. మూడేళ్లు ఓపికపడితే వైఎస్ సువర్ణరాజ్యాన్ని 30 ఏళ్లు అందిస్తా. మీరు నాన్నను దీవించినట్లే నన్ను దీవించాలి.. మీ అభిమానం, ఆప్యాయత, అనురాగాలు ఉప్పెనలా పొంగాలి’ అని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. జగన్ మంగళవారం కడప జిల్లా పులివెందులలోని వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో నియోజకవర్గ కార్యకర్తలతో మండలాలవారీగా సమావేశమయ్యారు. ఉదయం సింహాద్రిపురం, తొండూరు, మధ్యాహ్నం లింగాల, సాయంత్రం వేముల మండలాల నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. నల్లకాలువ సభలో ఇచ్చిన మాట మేరకు తాను ఓదార్పుయాత్ర చేపట్టడం, కాంగ్రెస్ అధిష్టానం వద్దనడం, రకరకాల ఆటంకాలు కల్పించడం, పార్టీకి రాజీనామా చేసే పరిస్థితులు కల్పించడం..చివరకు కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారణమైన మహానేత కుటుంబంలోనే చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించడాన్ని వివరిస్తూ జగన్ ఆద్యంతం ఉద్వేగభరితంగా మాట్లాడారు.

‘నల్లకాలువ సంతాప సభకు లక్షలాదిమంది గుండెబరువుతో తరలి వచ్చారు. నాన్న మరణాన్ని భరించలేక ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరెంతోమంది ఆవేదనతో రోజుల తరబడి అన్నం మానేసి చనిపోయారు. అప్పుడనిపించింది. నాన్న నా ఒక్కడి మనిషే కాదు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఉన్నాడని. నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయాడని. ఆ నల్లకాలువ సభలో నేను మాటిచ్చాను. నాన్న కోసం చనిపోయిన వారి ఇళ్ల తలుపులు తట్టి వారి కుటుంబాన్ని ఓదార్చి వారికి అండగా ఉంటానని. కానీ అధిష్టానం ఓదార్పు వద్దంది. నేను, భర్త చనిపోయిన బాధలోనూ ఆత్మగౌరవం చంపుకుని అమ్మ.. సోనియా గారి వద్దకెళ్లి ఒప్పించేందుకు ప్రయత్నించాం. అయినా ఆమె మనసు కరగ లేదు. జిల్లాకో సభ పెట్టి అందరినీ అక్కడికి పిలిచి సహాయం చేయమన్నారు. అసలు నాన్న కోసం చనిపోయిన కుటుంబాలు నా సహాయం ఏమైనా అడిగాయా? లేదే?

నాన్న చెప్పినట్లే నడుచుకున్నా..

ఎవరైనా చనిపోతే వారింటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించడం.. వారి కష్టసుఖాలు పంచుకోవడం తెలుగింటి సంప్రదాయం. నాన్న కోసం చనిపోయినవారు నా ఆత్మబంధువులని మనసావాచా నమ్మా. అందుకే ముందడుగు వేశా. అప్పుడు కూడా బాగా ఆలోచించా. అప్పుడు నాకు నాన్న నేర్పిన మాట గుర్తొచ్చింది. ‘మాట ఇస్తే కష్టమైనా, నష్టమైనా మడమ తిప్పకుండా ముందుకుపోవాలని. ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదు.. బతికినన్నాళ్లూ ఎలా బతికామన్నది ముఖ్యమని’. నాన్న చెప్పిన మాట ప్రకారం ఆ బాటలోనే ముందుకు వెళ్లా. యాత్రను సోనియాగారు వద్దన్నప్పుడు నా ముందున్నది రెండే మార్గాలు. సోనియాగాంధీ చెప్పినట్లు..ఇచ్చిన మాటను మరిచి ఆత్మగౌరవం చంపుకుని రాజకీయ భవిష్యత్తు చూసుకోవడం ఒకటైతే.. నాన్న చనిపోయారనే బాధతో గుండె పగిలిన వారి కుటుంబాల వద్దకు వెళ్లి నేనున్నానని ఓదార్చడం, సచ్ఛీలతను, వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం రెండవది. నేను రెండవ బాటనే ఎంచుకున్నాను. అదే నేరమైంది. నాకు తోడుగా నిలిచినవారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కష్టనష్టాలకు గురిచేశారు. ఓదార్పులో పాల్గొనకుండా ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. సీఎంలతో, మంత్రులతో చెప్పించారు. వైఎస్ కోసం చనిపోయినవారు, వారి కుటుంబాలు ఓట్లేస్తేనే కదా.. మీరు గెలిచింది అని నేను ఎమ్మెల్యేలను కూడా అడిగా.

అడుగడుగునా అవమానించారు..

అడుగడుగునా నన్ను, నా కుటుంబాన్ని అవమానించారు. నా ఇంటిపై, సాక్షిపై పోలీసులతో దాడులు చేయించారు. సొంత పార్టీ వారినే ఉసిగొలిపారు. బీజేపీయో, టీడీపీనో అలా చేస్తే నేను రోడ్డెక్కి ధర్నా చేసేవాడిని. సొంత పార్టీవారే చేస్తే ఎవరికి చెప్పుకోవాలి. అన్నీ సహించా. చివరకు రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న పిల్లవాడిని అడిగినా రేపోమాపో జగన్‌ను పార్టీ నుంచి బయటకు పంపిస్తారు అని సమాధానం చెప్పేలా చేశారు. మా కుటుంబాన్ని కూడా చీల్చే కుట్రకు పాల్పడ్డారు. ఎవరి కుటుంబాన్ని వారు చీల్చాలనుకుంది? కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా, మండుటెండలో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన మహానేత వైఎస్ కుటుంబాన్ని. పేదల సంక్షేమం కోసం దేశంలో మరెక్కడాలేని విధంగా వినూత్నరీతిలో పథకాలు చేపట్టి రాష్ట్రంలో రెండోసారి పార్టీని అధికారంలోకి తేవడంతో పాటు 33 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపి కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారణమైన వ్యక్తి కుటుంబాన్ని. అమ్మ సోనియా అపాయింట్‌మెంట్ అడిగితే నెలరోజులు తర్వాత ఇచ్చారు. చిన్నాన్నను ఢిల్లీకి పిలిచి రెండురోజుల్లోనే అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కుటుంబాన్ని చీల్చేందుకు ప్రయత్నించారు. అప్పుడనిపించింది. రాజకీయాల కోసం వీరు ఎంతకైనా తెగిస్తారని.. వెన్నుపోటు పొడవడానికి కూడా వెనుకాడరని.

విలువలు లేనిచోట ఇమడటం నావల్ల కాదనిపించింది...

కనీస మానవత్వం, విలువలు లేని చోట ఇమడటం నావల్ల కాదనిపించింది. రాజీనామా చేశా. ఈ ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్రంతో పాటు దేశం చూపు ఉప ఎన్నికలపై ఉంది. మరో 45-60 రోజుల్లో ఇడుపులపాయలో నాన్న సమాధి సాక్షిగా మన పార్టీ వస్తుంది. మనజెండా మీదే ఎన్నికలకు వెళతాం. ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం దశ, దిశ ఎలా మార్చవచ్చో చేసి చూపించిన మహానేత వైఎస్సార్. రామ రాజ్యం నేను చూడలేదు కానీ.. రాజశేఖరుని సువర్ణ రాజ్యం చూశా. వైఎస్ రాజ్యం ఎలా ఉండేదో ఆదినారాయణరెడ్డి లాంటి ఎమ్మెల్యేలు కొందరు చెప్పారు. నాతోపాటు నడిచే వారికి మూడేళ్లు కష్టాలుంటాయి. కానీ మీరు మూడేళ్లు ఓపికపడితే వైఎస్ సువర్ణరాజ్యాన్ని 30 ఏళ్లు అందిస్తా. కాంగ్రెస్ పార్టీ పక్కకెళ్లి పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంత నీచమైన రాజకీయాలైనా చేయవచ్చు. చిన్నాన్నను పావుగా వాడుకునే కుతంత్రాలకు కూడా దిగొచ్చు. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలు సెమీ ఫైనల్స్. 2014లో జరగబోయే ఎన్నికలు ఫైనల్స్. ఈ ఎన్నికల్లో ఒకవైపు సచ్ఛీలత, విలువలు, విశ్వసనీయత, తెలుగింటి ఆత్మగౌరవం నిలబడితే.. మరోవైపు కుళ్లూకుతంత్రం, కుటిల రాజకీయాలు పోటీ పడబోతున్నాయి.

మీ ఆప్యాయత, అనురాగాలు
ఈ పులివెందుల బిడ్డపై ఉప్పొంగాలి



దేవుని దయ, నాన్న ఆశీస్సులు, మీ ఆదరాభిమానాలే నన్ను రాష్ట్రం వైపు నడిపిస్తాయి. నాన్న కోసం ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలెన్నిటినో ఇంకా ఓదార్చాల్సి ఉంది. నేను రాష్ట్రంవైపు చూస్తున్నప్పుడు, జిల్లాల్లో ఉన్నప్పుడు అమ్మ విజయమ్మ పులివెందులలో ఉంటారు. నేను ఎక్కడ ఉన్నా నా గుండె పులివెందులలోనే ఉంటుంది. అక్కగా, మహానేత సతీమణిగా, పేదల ఆడపడుచుగా నియోజకవర్గవాసులు అమ్మను ఆదరించాలి. మీకు ఏ సమస్య వచ్చినా చిన్నాన్న వైఎస్ భాస్కర్‌రెడ్డి, మామ గంగిరెడ్డి లాంటి వారుంటారు. నాన్నను ఏ విధంగా ఆదరించి ఉన్నత స్థాయికి పంపారో, అదే ప్రేమ.. ఆప్యాయతలు ఉప్పెనలా ఈ పులివెందుల బిడ్డపై పొంగాలి. నన్ను దీవించాలి. ప్రతి ఇంటి మీద మన పార్టీ జెండా ఎగరాలి. నన్ను ఆశీర్వదించి పంపండి.’ అని జగన్‌మోహన్‌రెడ్డి వినమ్రంగా కార్యకర్తల హర్షధ్వానాల మధ్య చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాల్లో వైఎస్‌ఆర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కె సురేష్‌బాబు, జెడ్పీ చైర్‌పర్సన్ జ్యోతిరెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాలుగు మండలాల నుంచి వేలాది మంది కార్యకర్తలు, గ్రామ నాయకులు తరలివచ్చారు.
టార్గెట్‌ - 2014 ?
Jagan-srii
సొంత పార్టీ స్థాపనకు రంగం సిద్ధం చేసు కుంటున్న జగన్‌ పరుగెత్తి పాలుతాగకుండా, నిలబడి నీళ్లుతాగేలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర రాజ కీయాల్లో పాతుకుపోవాలంటే తాత్కాలిక ఆరాటం కాకుండా, సుదీర్ఘ లక్ష్యం అవసరమని గ్రహించిన జగన్‌, ఆ మేరకు తన రాజకీయ భవితవ్యాన్ని ఇప్పటినుంచే జాగ్రత్తగా ఆచితూచి చక్కదిద్దుకుంటున్నారు. మంగళ వారం తన అనుచరులతో ఏర్పాటుచేసిన సమావేశంలో జగన్‌ ప్రసంగాన్ని నిశితంగా పరిశీలిస్తే.. ఆయన రాజకీయ భవిష్యద్దర్శనమేమిటన్నది స్పష్టమవుతుంది.

మరో రెండు నెలల్లో సొంత పార్టీ స్థాపనకు రంగం సిద్ధం చేసుకుంటున్న జగన్‌ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడా తొందరపడుతున్నట్లు కాకుండా, దీర్ఘకాలిక లక్ష్యం, వ్యూహంతో ముందుకు వెళ్లనున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మేరకు ఆయన తన బాడీలాంగ్వేజ్‌, స్టైల్‌ను కూడా మార్చుకున్నట్లు కనిపిం చింది. గతంలో తండ్రి వైఎస్‌ మాదిరిగా ప్రతిదానికీ దీర్ఘాలు తీస్తూ, ఆయనను అనుకరించిన జగన్‌, నేటి సమావేశంలో మాత్రం ఆర్థ్రత, ఆవేదన, హందాతనాన్ని కలగలిపి ప్రసంగం చేయటం ప్రస్తావనార్హం. తనపై సాధ్యమయినంత ఎక్కువ సానుభూతి మిగిలించుకునే రీతిలో ఆయన ప్రసంగం కొనసాగింది.

ఇక.. కాంగ్రెస్‌ సర్కారును కూల్చే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదన్న విషయాన్ని జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ప్రభుత్వం తనంతట తాను కూలిపోతే అందుకు తన బాధ్యత లేదని, తాను మాత్రం అధికారం కోసం వెంప ర్లాడటం లేదని, తనకు ఓ సుదీర్ఘమైన రాజకీయ లక్ష్యం ఉందని పరోక్షంగా స్పష్టం చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యేలలో తిరుగుబాటు వచ్చి ప్రభుత్వం పడిపోతుం దన్న అంచనా కూడా లేకపొలేదు. 2014లో జరిగే ఎన్నికల్లో తన పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం, ధీమా ఆయన మాటల్లో స్పష్టమయింది.

మూడేళ్లు కష్టాలుంటాయని, ఆ తర్వాత వందేళ్లు సుఖంగా ఉండవచ్చని చేసిన వ్యాఖ్యలు.. మూడేళ్ల వరకూ తనను నమ్ముకుని ఉన్న వారంతా సుఖాలు త్యాగం చేయడంతోపాటు, ప్రభుత్వం నుంచి ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొని, తనకు అండగా నిలవాలని జగన్‌ తన వర్గీ యులకు చెప్పకనే చెప్పారు.అంటే ప్రభుత్వం తతపై, తన అనుచరవర్గంపైక సాధింపులకు దిగుతుందని జగన్‌ ముందుగానే ఊహించి, ఆ మేరకు తన అనుచరులను మానసికంగా సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఎమ్మెల్యేలను చీల్చి, ఆ తర్వాత ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా తాను ఇప్పటికిప్పుడు సీఎం కావాలన్న తొందర తనకేమీ లేదని జగన్‌ విస్పష్టమైన సంకేతాలిచ్చి, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, సంస్థాగ తంగా కాంగ్రెస్‌ నాయకత్వానికి ఊరట కలిగించారు. అయితే, పార్టీ స్థాపించిన తర్వాత తనుమద్దతుదారు లయిన ఎమ్మెల్యేలు తన గూటిలోకి వస్తే.. అప్పుడు జరిగే సంక్షోభంలో ప్రభుత్వం పతనమవుతే దానికి తన బాధ్యత లేద న్న సంకేతాలు కూడా జగన్‌ సందేశంలో లేకపోలేదు.

ముందు సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేసుకుని, క్షేత్ర స్థాయిలో పార్టీని విస్తరించడం ద్వారా.. కాంగ్రెస్‌, టీడీపీ లకు ధీటుగా ఎన్నికల యుద్ధరంగంలో నిలవాలన్న లక్ష్యం తోనే జగన్‌ ఎక్కడా తొందరపడకుండా నిర్ణయాలు తీసు కుంటున్నారు. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగాలని నిర్ణయిం చుకున్నందున తన అడుగులు, నిర్ణయాలు, వ్యవహారశైలి కూడా వ్యూహాత్మకంగా, తొందరపాటులేకుండా ఉండా లని భావిస్తున్నారు. జగన్‌ తన ప్రతర్థిగా కాంగ్రెస్‌ పార్టీనే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ.. కాంగ్రెస్‌ పార్టీని రెండుసార్లు ప్రాణా లొడ్డి అధికారంలోకి తెచ్చిన తన తండ్రి వైఎస్‌ కుటుంబాన్ని చీల్చేందుకు ప్రయత్నించారన్న ప్రచారం ద్వారా ఆమెపై ఇప్పటివరకూ మహిళలో ఉన్న సానుకూలతను చెరిపివేసి, దానిస్థానంలో వ్యతిరేక ముద్రను ప్రతిష్ఠింపచేయాలన్నదే జగన్‌ అసలు వ్యూహంలా కనిపిస్తోంది.

Wednesday, August 18, 2010

ఎవరేమన్నా నా దారి నాదే! మీరు నాకు చెప్పేంత వాళ్లా? మీ స్థాయి ఏంటి? ప్రకాశం ఎమ్మెల్యేలపై జగన్ ఫైర్


నా ఉనికి నాకు ముఖ్యం.. నాతోనే జనం
నా సర్వేలు నాకున్నాయి.. మీరు చెబితే నేను వినాలా?
అది నాన్నకిచ్చిన మాట...
పార్టీకి లాభమా? నష్టమా? ఆలోచించను
ఇప్పటికే ప్రయాణం ప్రారంభించా..
ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది
మీరెవరూ ఓదార్పు యాత్రకు రానక్కర్లేదు: కడప ఎంపీ
రాహుల్‌లా నమ్రతగా ఉండండి.. ఎమ్మెల్యేల విజ్ఞాపన లేఖ
"మీరు నాకేమీ బోధించనక్కర్లేదు. మీకంత స్థాయి లేదు. మీరు చెబితే నేను వినాలా? మీరు అంత పెద్దవారా? మీరు నాకు చెప్పేదేంటి? పావురాల గుట్టలో నాన్నకిచ్చిన మాట అది. నెరేవేర్చడం నా ధర్మం. ఓదార్పు కొనసాగించి తీరుతాను. పార్టీకి లాభమా.. నష్టమా.. అనేది ఆలోచించను'' ఇవీ కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అధిష్ఠానం కాదంటున్నా వచ్చే నెల 3న ఓదార్పు యాత్రను చేపట్టేందుకు జగన్ సన్నాహాల నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుగురు శాసనసభ్యులు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు.

జగన్‌ను ఆయన నివాసంలో రాత్రి పది గంటల తర్వాత కలుసుకుని, భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మనసు మార్చేందుకు ఎమ్మెల్యేలు విఫలయత్నం చేశారు. అంతకు ముందే ఓదార్పు యాత్రకు వెళ్లొద్దంటూ కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ నుంచి క్లాస్ తీసుకుని వచ్చిన జగన్... కొద్ది సేపటికే తనను ఒప్పించేందుకు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు రావడంతో అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి సీనియర్‌లు ఆ బృందంలో ఉన్నా.. గమనించనట్లు.. గేటు దగ్గరే ఆవేశం కట్టలు తెంచుకున్నారు.

జగన్‌తో భేటీ సందర్భంగా పది ప్రశ్నలతో కూడిన ఒక లేఖను ఆయనకు ఎమ్మెల్యేలు అందించారు. దాన్ని ఆయన పూర్తిగా చదవకుండానే అలా పైపైన చూసి పక్కన పడేసినట్లు తెలిసింది. "మీరు చెబితే నేను వినాలా? మీరు అంత పెద్దవారా? అంటూ జగన్ ఆగ్రహంగా మాట్లాడినట్లు ఒక ఎమ్మెల్యే చెప్పారు. "దివాకర్ రెడ్డి మాట విని మీరు ఢిల్లీ రావడమేమిటి? ప్రకాశం జిల్లాకూ ఆయనకూ సంబంధమేమిటి?'' అని ప్రశ్నించినట్లు తెలిసింది.

"మిమ్మల్ని యాత్రకు రమ్మని నేను కోరలేదు. మీరు వచ్చినా, రాకపోయినా, ఫర్వాలేదు. నా దారి నాదే. ఎవరి కోసమో ఓదార్పు యాత్ర ఆగదు'' అని జగన్ వారికి స్పష్టంగా చెప్పారు. జగన్‌ను కలిసిన వారిలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఉగ్రనరసింహారెడ్డి, కృష్ణమోహన్, మహీధర్‌రెడ్డి, గొట్టిపాటి రవి, జీవీ శేషు, సురేశ్ ఉన్నారు. అత్యంత విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం వీరితో జగన్ సంభాషణ ఇలా ఉంది.....

ఎమ్మెల్యేలు: అధిష్ఠానం చెప్పినట్లు నడుచుకోండి. అది మీకూ మాకూ పార్టీకీ మంచిది. అధిష్ఠానం ఆదేశాలు ధిక్కరిస్తే మీకూ మాకూ నష్టమే. జగన్: నేను సరైన మార్గంలోనే వెళుతున్నా. నా సర్వేలు నాకున్నాయి. జనం నా వెంట ఉన్నారు. నా ఉనికి నాకు ముఖ్యం. పార్టీకి నష్టమా? లాభామా? అనేది నేను పట్టించుకోను. ఇప్పటికే ప్రయాణం ప్రారంభించాను. కొనసాగిస్తాను. ఏది మంచో ఏది చెడో మీరు నాకు చెప్పనక్కరలేదు. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది.

ఎమ్మెల్యేలు: పార్టీ కూడా ముఖ్యమే కదా?
జగన్: పార్టీ గురించి తర్వాత. నన్ను ఇబ్బంది పెట్టేందుకే కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా ఎస్పీని మార్చారు.

ఎమ్మెల్యేలు: (ఒక సీనియర్ ఎమ్మెల్యే కల్పించుకుని) మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి చాలా జరిగాయి. మాకు తెలియకుండానే మా జిల్లాకు సంబంధించినఎన్నో నిర్ణయాలు తీసుకునేవారు. మేమేమీ వ్యతిరేకించలేదు. రాజకీయాల్లో ఇవి మామూలే. పాలనా పరంగా అధికారుల బదిలీలు జరుగుతుంటాయి. డీఎల్ రవీంద్రారెడ్డి, జేసీ దివాకరరెడ్డిలను దృష్టిలో పెట్టుకుని మీరు వ్యవహరించడం సమంజసంగా లేదు. పార్టీని ధిక్కరించే విధంగా సిద్ధమవుతున్నారు. మా ఆలోచనలను ఈ లేఖలో పొందుపరిచాం. పరిశీలించండి. మీ చర్యల వల్ల పార్టీ బలహీనపడడంతో పాటు టీడీపీ బలపడేలా ఉంది.
జగన్: అవన్నీ నాకు అనవసరం.

ఎమ్మెల్యేలు: ఎమ్మెల్యేలను కూడగడుతున్నారని.. సొంత పార్టీ పెడతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ మీరు కనీసం ఖండించలేదు. జగన్: అలా ఖండించాల్సిన అవసరం నాకు లేదు.ఎమ్మెల్యేలు: పదవుల విషయంలో రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్‌లో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఓదార్పు యాత్ర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలిగేలా కిందిస్థాయి కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వారు ఎమ్మెల్యేలతో విబేధించేలా చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యేలకు కూడా నష్టదాయకం. పార్టీకీ నష్టమే.
జగన్: (అవేమీ పట్టనట్లుగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ..) నా చర్యల వల్ల పార్టీకి లాభమా నష్టమా? అని ఆలోచించే పరిస్థితిలో నేను లేను. ఆ విషయాన్ని నేను పట్టించుకోను. ఓదార్పు యాత్ర కొనసాగిస్తాను. అధిష్ఠానం యాత్ర పట్ల మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంది. నాన్నకిచ్చిన మాట మేరకు ఓదార్పు కొనసాగించి తీరుతాను.

మేమే ఢిల్లీ వచ్చాం: ఆమంచి
తమను దివాకర్ రెడ్డి ఢిల్లీకి తీసుకురాలేదని, తమంతట తామే వచ్చామని ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. ఓదార్పు యాత్రపై పార్టీలో అయోమయం తొలగిపోయేందుకు ఢిల్లీ వచ్చామని, జగన్ వైఖరిని, అధిష్ఠానం అభిప్రాయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలని భావించామని వారు చెప్పారు.

ఎంపీలకు అధిష్ఠానం తమ వైఖరిని స్పష్టంగా చెప్పిందని తెలిసిందని, తాము కూడా అధిష్ఠానంతో మాట్లాడి స్పష్టత ఏర్పర్చుకోవాలని భావిస్తున్నామని వారు తెలిపారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని శిరసావహిస్తామని, పార్టీ శ్రేణులకు కూడా ఓదార్పు యాత్రలో పాల్గొన వద్దని చెబుతామని కృష్ణమోహన్ చెప్పారు.

Wednesday, July 14, 2010

జగన్‌ ఆర్థికమూలాలపై ఉక్కుపాదం ?


తనను లెక్కచేయకుండా, సొంత ఇమేజ్‌ పెంచుకుని, పార్టీని చీల్చే దిశగా అడుగులు వేస్తున్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ వ్యవ హారంలో కీలెరిగి వాతపెట్టాలన్న నిర్ణయానికి అధిష్ఠానం వచ్చి నట్లు తెలిసింది. అందులో భాగంగా.. సహజంగా రాయల సీమ ఫ్యాక్షన్‌ నేతల వ్యూహాన్నే కాంగ్రెస్‌ అధిష్ఠానం కూడా అనుసరిస్తోంది. అంటే.. జగన్‌, ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారుల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు తన వద్ద ఉన్న మార్గాలను అన్వేషించడం ప్రారంభించినట్లు సమా చారం. గత రెండు రోజుల నుంచి ఢిల్లీ పార్టీ వర్గాల్లో ఇదే అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితి సృష్టించడానికి సిద్ధ మయిన జగన్‌ వ్యవహారాన్ని సీరియస్‌గానే తీసుకోవాలని నాయకత్వం నిర్ణయించినట్లు కనిపిస్తోంది.

తొలుత ఆయన వ్యవహారంపై వేచిచూసే ధోరణి అవలంబించాలని భావించి నప్పటికీ, జగన్‌ ఓదార్పు యాత్ర నుంచి వస్తున్న నివేదికలు పరిశీలించి తర్వాత జగన్‌కు ఎంత త్వరగా చెక్‌ పెడితే పార్టీ పరిస్థితి అంత త్వరగా చక్కబడుతున్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సొంత పార్టీకి చెందిన దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు2 ఎంపీలు జగన్‌ను అనుసరించాలన్న ప్రాథమిక సమాచారం తెలుసుకున్న నాయకత్వం.. ఆ మేరకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని, నష్ట నివారణ చర్యలు ప్రారంభించాలని నిర్ణయించింది.
అందులో భాగంగా.. జగన్‌, ఆయన కుటుంబభ్యులు, ఆయనకు దన్నుగా నిలస్తున్న ప్రముఖుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా దానినో హెచ్చరిక సంకేతంలా పంపించాలని భావిస్తున్నట్లు సమాచారం. వైఎస్‌ అల్లుడు బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ప్రధాన భాగస్వామిగా ఉన్నారని భావిస్తోన్న బయ్యారం గనులపై దృష్టి సారించడం అందులో భాగమేనంటున్నారు. ఈ వ్యవహారంపై సభాసంఘం వేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. దాని ద్వారా.. ‘జగన్‌ కుటుంబ సభ్యులపైనే దాడులు జరుగుతుంటే ఇక తమకు ఎవరు అండగా ఉంటారన్న’ భయాన్ని ఆయన మద్దతుదారుల్లో కలిగించడమే అధిష్ఠానం వ్యూహంగా కనిపిస్తోంది.

కాగా, ముఖ్యమంత్రుల సమావేశానికి మంగళవారం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రోశయ్యకు అధిష్ఠానం ఆ మేరకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. జగన్‌, ఆయన కుటుంబసభ్యులు, మద్దతుదారుల విషయంలో అనుసరించవలసిన వ్యూహాన్ని రోశయ్యకు వివరించేందుకు నాయకత్వం సిద్ధంగా ఉంది. రోశయ్య ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత సభా సంఘాన్ని ఏర్పాటుచేసేందుకు అంగీకరించవచ్చంటున్నారు. ఆ తర్వాత విజిలెన్స్‌ విభాగాన్ని జగన్‌ కంపెనీలు, ఆయన మద్దతుదారుల ఆర్థిక వ్యవహారాలపై దృష్టి సారించేలా చర్యలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఢిల్లీ పార్టీ వర్గాల సమాచారం. వైఎస్‌ అల్లుడు అనిల్‌కుమార్‌ బయ్యారం గనులపై విచారణ సమయంలోనే.. జగన్‌కు చెందిన పరిశ్రమలపైనా దృష్టి సారించేందుకు నాయకత్వం ప్రణాళిక రూపొందించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఆయనకు దన్నుగా నిలుస్తున్న కర్నాటక బిజెపి మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలపైనా కన్నేయనున్నట్లు చెబుతున్నారు. తొలిదశగా భాగంగా.. మైనింగ్‌ వాహనాల వల్ల దెబ్బతింటోన్న రోడ్ల నష్టానికి సంబంధించి, కర్నాటక రాష్ట్రం కంటే రెట్టింపు రోడ్‌ టాక్స్‌ విధించాలని నిర్ణయం తీసుకోనుంది. గాలి నైతిక మద్దతు, నిధులతోనే జగన్‌ సొంతపార్టీ పెట్టి కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే నాయకత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఇదిలాఉండగా.. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లినా నాయకత్వం దానికి పెద్దగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు లేదని, పార్టీ నాయకత్వం దృష్టంతా ఎంపీలు వెళ్లకుండా నిరోధించడంపైనే ఉంద ని గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్‌ ఎంపీ వెల్లడించారు. తమ నాయకత్వానికి రాష్ట్రాలు, ఎమ్మెల్యేల కన్నా ఎంపీలే ముఖ్యమని చెప్పారు. జగన్‌ ఓదార్పు యాత్రకు సంబంధించి రాష్ట్ర మీడియాలో వస్తున్న ప్రచారం అంతా ఏకపక్షంగా ఉందని , క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని ఆ ఎంపీ నాయకత్వానికి తాజాగా నివేదిక కూడా ఇచ్చినట్లు తెలిసింది.

Tuesday, July 13, 2010

అంతొద్దు! వాడి తగ్గించాలన్న మొయిలీ - ‘ఓదార్పు ’ వివాదానికి విరుగుడు మంత్రం మెయిలీ బాణం !

విజయమ్మ, కేవీపీలకు ఫోన్
జగన్ సంయమనానికి అదే కారణం?
సీఎం ఢిల్లీ యాత్రపై నేతల్లో ఆసక్తి
 
శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్రలో వాడి వేడి వ్యాఖ్యలు చేసిన కడప ఎంపీ వైఎస్ జగన్ తూర్పు గోదావరిలో ఎందుకు సంయమనం పాటిస్తున్నారు? పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మొయిలీ రంగంలోకి దిగి... జగన్ తల్లి విజయలక్ష్మి, వైఎస్ సన్నిహితుడైన కేవీపీ రామచంద్రరావులకు చేసిన సూచనలే దీనికి కారణమని తెలుస్తోంది.

జగన్ ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అధిష్ఠానం ఆయనకు షోకాజ్ నోటీసు ఇస్తుందనే ప్రచారం సోమవారం విస్తృతంగా జరిగింది. ఇది జగన్ వర్గంలో కలవరం పుట్టించింది. తన వర్గంలో ధైర్యం నూరిపోసేందుకైనా జగన్ మరిన్ని పదునైన వ్యాఖ్యలు చేస్తారేమోనని కొందరు భావించారు. అయితే.. జగన్ నుంచి ఎలాంటి స్పందన కన్పించలేదు. జగన్ ప్రసంగాల్లో వాడి తగ్గించాలని, లేనిపక్షంలో అధిష్ఠానం కఠినంగా వ్యవహరిస్తుందని వైఎస్ సతీమణి విజయలక్ష్మికి మొయిలీ ఫోన్‌లో వివరించారని సమాచారం.

అదేవిధంగా జగన్‌కు అధిష్ఠానం నిర్ణయం ఏమిటో వివరించాలని, సంయమనంతో మాట్లాడాల్సిందిగా సూచించాలని కేవీపీ రామచంద్రరావును మొయిలీ కోరినట్లు సమాచారం. ఇటు తల్లి విజయమ్మ, అటు కేవీపీల సూచనల మేరకే తూర్పు గోదావరి జిల్లాలో జగన్ కాస్త సంయమనం పాటిస్తున్నట్లు అంటున్నారు. మొయిలీ సోమవారం, మంగళవారం ముఖ్యమంత్రి రోశయ్యతోకూడా మాట్లాడినట్లు తెలిసింది. జగన్ వ్యాఖ్యల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఢిల్లీ మనసులో మాటేమిటి?
రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ అధిష్ఠానం మనోగతం ఏమిటి? 'ఓదార్పు వేడి'పై పార్టీ పెద్దలు ఏమనుకుంటున్నారు? భవిష్యత్ ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ పర్యటన తర్వాతైనా ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లభిస్తాయని పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరప్ప మొయిలీ సోనియాకు ఎలాంటి నివేదిక ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

జూనియర్లకు మంత్రుల క్లాస్!
మంత్రులు, ముఖ్యనేతలను కలుస్తున్న జగన్ అనుకూల జూనియర్ ఎమ్మెల్యేలకు వారి నుంచి పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సంగతులేమిటని ప్రశ్నిస్తూనే.. ఓదార్పు యాత్ర, ప్రజా స్పందన తదితర అంశాలను సీనియర్లు ఆరా తీస్తున్నారు. ఆ తర్వాత... జగన్ పార్టీలో కొనసాగుతారా, లేక వేరే కుంపటి పెడతారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వేరుకుంపటి పెడితే, మధ్యంతర ఎన్నికలు వస్తే పార్టీలో ఎంతమంది గెలుస్తారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి జగన్ వర్గీయుల నుంచి సరైన సమాధానం రావడం లేదంటున్నారు.

జగన్ ఓదార్పు యాత్రలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా 'ఒత్తిడి వ్యూహం' అమలవుతోంది. యాత్ర జరిగే నియోజకవర్గాల్లో జగన్ వర్గీయులు ముందస్తుగా కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు యాత్రలో పాల్గొనేలా ఒత్తిడి తెస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇదే వ్యూహాన్ని అమలు చేశారు.

స్థానిక ఎమ్మెల్యేలు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తావించినప్పుడు... "ఆ ఎన్నికల గురించి తర్వాత! ముందు జగన్ యాత్రలో పాల్గొంటున్నారా లేదా?'' అని కార్యకర్తలతో అడిగించారు. ఈ సమావేశంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, వారి అనుచరులు పాల్గొన్నారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన శాసనసభ్యుడొకరు వివరించారు.

రోశయ్యను కలిసిన శ్రీకాకుళం ఎంపీ కిల్లి కృపారాణి
సీఎంను శ్రీకాకుళం ఎంపీ కిల్లి కృపారాణి మంగళవారం కలిశారు. ఓదార్పు యాత్రలో తన భర్త పా ల్గొనడం, ఇతర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. యాత్ర గురించి సీఎం ప్రస్తావించలేదని ఆమె వివరించారు. 
‘ఓదార్పు ’ వివాదానికి విరుగుడు మంత్రం మెయిలీ బాణం !
MOHILI ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరగుతున్న అవాంఛనీయ పరిణామాలకు కళ్లెం వేసే పనిలో పడింది. కడప ఎంపీ జగన్‌ ఓదార్పు యాత్రతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి కల్లోల కడలిగా మారిం దని అధిష్టానం భావిస్తోంది. ఓదార్పు యాత్రను నిలువరించేందుకు అధిష్టానం ఎంతగా ప్రయత్నించినా జగన్‌ తన దారిన తాను యాత్రకు వెళ్లడంతో రాష్ట్ర కాంగ్రెన్‌లో రెండు శిబిరాల వాతావరణం ఏర్పడు తున్నది. దీన్ని మొగ్గ దశలోనే నివారించకపోతే ఇది వికటించి మరింత గందరగోళం నెలకొనవచ్చని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ అధిష్టానం దృష్టికి తెచ్చినట్లు తెలియవచ్చింది.

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలను నేరుగా ఢిల్లీ నుంచే నిర్వహించాల్సిన సమయం ఆసన్న మైందన్నది ఆయన భావనగా చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు డి శ్రీని వాస్‌ ఉప ఎన్నికల్లో తానే ఒక అభ్యర్ధిగా బరిలో ఉండటంతో అధిషా ్టనానికి రాష్ట్ర కాంగ్రెస్‌కు మధ్య అనుసంధానం లేకుండా పోయింది. ప్రస్తుత అవాంఛనీయ పరిణామాలకు ఇది కూడా ఒక కారణంగా అధిష్టానం భావిస్తోంది. అందుకే వీరప్ప మొయిలీ మంగళవారం స్వయంగా రంగప్రవేశం చేశారు. ఉప ఎన్నికలకు పార్టీ తరపున బరువు బాధ్యతలను పంచుతూ ఆయన పార్టీ నాయకులకుఆదేశాలిచ్చారు.

ప్రతి ఒక్కర్నీ భాగస్వాములను చేస్తూ విడివిడిగా అందరికీ స్వయంగా లేఖలు పంపారు. ముఖ్యంగా చీటికీ మాటికీ పత్రికల్లోను, చానళ్లలోనూ పార్టీ వ్యవహారాలపై వ్యాఖ్యానాలు చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న వారికి ఉప ఎన్నికల బాధ్యతలు అప్పగించడం అధిష్టానం కొత్త వ్యూహంలో భాగం అంటున్నారు. మంత్రులతో బాటు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ఈ బాధ్యతలు అప్పగించారు. వీరిలో కొందరు అధిష్టానానికి వీర విధేయులుగా ఉంటున్నట్లు రుజువు చేసుకునే ఉద్దేశంతో ప్రతి చిన్న సమస్య మీదా చానళ్ల ముందుకొచ్చి స్పందిం చడం కేంద్ర పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇదంతా సామాన్య ప్రజల దృష్టిలో క్రమశిక్షణ రాహి త్యంగా ముద్ర పడుతుందని అధిష్టానం భయపడుతోంది. అందుకే జగన్‌ ఓదార్పు యాత్ర దరిమిలా ఏర్పడ్డ రాజకీయ అయోమయం నుంచి పార్టీని కాపాడేందుకు అందరి దృష్టినీ మళ్లించే కార్యక్రమంలో అధిష్టానం పడింది.

ఉప ఎన్నికలకు ఇంకా రెండు వారాలే వ్యవధి ఉన్న నేపథ్యంలో యావత్‌ పార్టీ శ్రేణుల దృష్టి ని అటు మళ్లించే కార్యక్రమాన్ని వీరప్ప మొయిలీ చేపట్టారు. ఇందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను బాధ్యులను చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నిజానికి మొదట్లో కాంగ్రెస్‌ పార్టీ ఈ ఉప ఎన్నికలను అంత సీరియస్‌గా తీసుకోదల్చుకోలేదు. అందుకే ముఖ్యమంత్రి రోశ య్య కూడా ఒకటి రెండు సందర్భాల్లో తమకు ఒకటి వచ్చినా అదనమే అంటూ ఎన్నికలను తేలిగ్గా తీసుకుంటున్న సంకేతాలిచ్చారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులకు గట్టి వ్యాపకం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది.

లేకుంటే జగన్‌ వ్యవహారంతో రాజకీయ వాతావరణమే కలుషితం అవుతున్నట్లు అధిష్టానం గుర్తించింది. అందుకే వీరప్ప మొయిలీకి ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు పంపింది. అంతే కాదు. జగన్‌ సృష్టించిన రాజకీయ కల్లోలం నుంచి పార్టీ రాష్ట్ర శాఖను గట్టెక్కించే బాధ్యతను కూడా మొయిలీకే అధిష్టానం అప్పగించింది. అందులో భాగంగా ఇకపై పార్టీ నాయకులెవరూ జగన్‌ ఓదార్పు యాత్రను ఒక అంశంగా గాని ఒక వివాదంగా గాని చేయకుండా కట్టడి చేయ బోతున్నారు. జగన్‌ మీద చర్యలు తీసుకోబోతున్నారంటూ పుకార్లు లేవదీసి, ఆ వెంటనే జగన్‌ నుంచి ఆవేశపూరిత ప్రకటనలను ఆశించే కొన్ని శక్తులు కావాలని ప్రయత్నాలు చేస్తున్నాయని వీరప్ప మొయిలీ భావిస్తున్నారు.

అలాంటి చర్యల వల్ల వాతావరణం దెబ్బతిని మరింత క్షీణించడం మినహా మరేమీ జరగదని, ఈ తరహా దుష్ట యత్నాలకు గండి కొట్టాల్సిన అవసరం ఉందని మొయిలీ అంటున్నారు. జగన్‌ వ్యవహారం అధిష్టానం చేతిలో ఉన్నందున ఇకెవరూ దాని మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడరాదంటూ మొయిలీ అలిఖిత ఆదేశాలిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రానున్న రెండు వారాల పాటు ఉప ఎన్నికల మీదనే అందరి దృష్టీ కేంద్రీకృత మయ్యేలా చేయడమే మొయిలీ తక్షణ కర్తవ్యంగా చెబుతున్నారు. ఆయన వ్యూహం ఫలించి జగన్‌ అంశం ఏ స్ధాయిలో మరుగున పడుతుందో వేచి చూడాల్సిందేనని రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులు అంటున్నాయి.

మొత్తం మీద రాష్ట్ర వ్యవహారాలను కేంద్ర అధిష్టానం పూర్తిగా మొయిలీకే వదిలేసినట్లు తెలుస్తోంది. సోమవారం పార్టీ అధికార ప్రతినిధులు ఎవ్వరు మాట్లాడినా వీరప్ప మొయిలీయే చూసుకుంటారంటూ సంకేతాలు పంపారు. అందుకు తగ్గట్లే మొయిలీ ఢిల్లీ వచ్చిన కొద్ది గంటల్లోనే వాతావరణంలో మార్పు కనిపించింది. తొలుత జగన్‌కు అధిష్టానం షోకాజ్‌ నోటీసు ఇవ్వబోతున్నదంటూ పుకార్లు వచ్చినా మొయిలీ వెంటనే కలగజేసుకుని వాటిని ఖండించి మరింత నష్టం జరగకుండా నివారించారు. అదే సమయంలో అటు జగన్‌ కూడా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు.

దాంతో వేడెక్కిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రస్తుతం ఉభయ శిబిరాల్లోనూ కాల్పుల విరమణ లాంటి ప్రశాంత పరిస్థితి ఉన్నట్లే భావిస్తున్నారు. జగన్‌ని తన దారిన తనను వదిలేసి ఊరుకోవాలన్నది మొయిలీ అభిప్రాయంగా ఉంది. ఆయన సోమవారం ఢిల్లీ వచ్చిరాగానే ఇదే విషయాన్ని అధినేత్రి సోనియా గాంధీకి నివేదించినట్లు తెలిసింది. అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేయగా మొయిలీ ఇతరత్రా కాంగ్రెస్‌ శ్రేణులకు సోమవారం రాత్రికల్లా ఆ సందేశాన్ని పంపినట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికలయ్యేదాకా వాతావరణం విషమించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధిష్టానం మొయిలీకి సూచించినట్లు తెలుస్తోంది.
జోరు తగ్గిన జగన్‌
jagna-hand తూర్పుగోదావరి జిల్లాలో జగన్‌ ఓదార్పు యాత్ర రోజు రోజుకూ జోరు తగ్గిపోతోంది. జగన్‌ పేలవమైన ప్రసం గాలు, రొటీన్‌ డైలాగులు ఆయన అనుచరులు, అభిమాను లను సైతం నిరాశకు గురిచేస్తున్నాయి. తన ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చి, తానేమిటో నిరూపించుకుని యువతలో ఉత్సాహం నింపుతారని ఆశించిన పార్టీ నేతల ఆశలు ప్రతి సభలోనూ నీరుగారి పోతున్నాయి. శ్రీకాకు ళంలో చేసిన ప్రసంగాలనే తూర్పు లోనూ వినిపిస్తుం డటంతో.. ఇప్పటికే వాటిని పత్రికలు, చానెళ్లలో చూసిన ప్రజలు జగన్‌ సభకువచ్చేందుకు పెద్దగా ఆసక్తి ప్రదర్శిం చడం లేదని స్పష్టంగా కనిపించింది. ఇవన్నీ జగన్‌ జోరు తగ్గిందన్న అభిప్రాయానికి వీలు కలిగించాయి.

రెండోరోజు ఓదార్పు యాత్ర సందర్భంగా మంగళ వారం తుని, కోటనందూరు మండలాల్లోని 13 గ్రామాల్లో జగన్‌ పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన వ్యూహ బృందం సోమవారం నాటి కార్య్రమాలు పేలవంగా ముగి సిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి కొత్త పంథా అనుసరించింది. స్కూలు పిల్లలు, డ్వాక్రా మహిళ లను భారీ సంఖ్యలో తరలించింది. దానితో వారు దారి పొడవునా భారీ క్యూగా రోడ్డుకిరువైపులా నిల బడటంతో జనం బాగా వచ్చినట్లు కనిపిం చింది. ఫలితంగా నిన్నటితో పోలిస్తే నేడు సభలు కొంత కళకళలాడాయి.

ఇదే వ్యూహాన్ని జగన్‌ అనుచర బృందం అన్ని ప్రాంతాల్లోనూ అనుసరించింది. చిన్నయ్యపాలెం గ్రామంలో సంత పక్కనే ఓదా ర్పు యాత్ర ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో జనం వచ్చినట్లు చూపించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా.. తొలిరోజు చేదు అనుభవా లను దృష్టిలో ఉంచుకుని జగన్‌ తన ప్రసంగానికి పదు ను పెడతారని భావించిన ఆయన వర్గీయు లకు ఆ ప్రసంగాల తీరు మొహం మొత్తేలా చేసింది. తరచూ చేస్తున్న అంశాలే అందులో ఉండటంతో జనం ఆయన ప్రసంగాన్ని వినేం దుకు కాకుండా, కేవలం జగన్‌ను చూసేందుకే పరిమిత మవుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీలోని తన ప్రత్యర్థులు తనపై చేస్తున్న ఆరోపణలను గట్టిగా సమాధానం ఇస్తారని భావించిన వారికి సైతం జగన్‌ మౌనం నిరాశ పరిచింది. జగన్‌ మౌనంగా ఉన్నా రంటే దాని వెనుక ఏదో సర్దుబాటు జరిగి ఉంటుందని, లేకపోతే తన తండ్రి సేవలను కూడా తప్పుపడుతున్న నేతలకు జగన్‌ సభాముఖంగా ఎందుకు జవాబు ఇవ్వరని సామాన్య జనం అభిప్రాయపడ్డారు.

యువకులు కూడా జగన్‌ తన ప్రత్యర్థులకు సభ ద్వారా గట్టి జవాబు ఇచ్చి, సవాల్‌ చేస్తారని ఆశించే సభలకు వస్తున్నట్లు వెల్లడయింది. అయితే, జగన్‌ సభలను అనుస రిస్తున్న వారికి.. ప్రతి సభలోనూ రొటీన్‌ ప్రసంగాలు వినిపి స్తుండటంతో వారంతా ఆయనను అనుసరించకుండా అక్కడితో ఆగిపోతు న్నారు. రెండోరోజు కూడా జగన్‌ సభలు, ప్రసంగాలు పేలవంగా ఉండటంతో మీడియా కూడా హడావుడి, ప్రాధాన్యం తగ్గించింది. సాయంత్రం వేళల్లో గ్రామాల్లో జనం ఒకచోట చేరతారని గ్రహించిన జగన్‌ వ్యూహ బృందం తన యాత్రను నిదానంగా, నింపాదిగా సాయంత్రం వరకూ కొనసా గిస్తున్నట్లు కనిపిస్తోంది. తుని పట్టణం లో ఈ వ్యూహం అనుసరించినందుకే జనాలు వచ్చారు.

ఇదిలా ఉండగా..జగన్‌ తన ఓదార్పు యాత్ర లక్ష్యాన్ని ప్రజల వద్దకు చేర్చడానికి కొత్త పంథా అనుసరిస్తున్నట్లు ఆయన వర్గీయుల తాజా వ్యూహం స్పష్టం చేస్తోంది. జగన్‌ హాజరయ్యే గ్రామానికి ముందు కొంత హడావుడి వాతావరణాన్ని సృష్టించి, వాటిని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజల్లోకి పంపించే సరికొత్త ప్రచార వ్యూహానికి తెర లేపారు. అక్కడ కొందరు యువకులు, మహిళలు వేదికపె ైకి ఎక్కి, రోశయ్య సర్కారుపై ధ్వజ మెత్తడం, మధ్యలో కాబోయే సీఎం జగన్‌ జిందాబాద్‌ అన్న నినాదాలు చేయ డం, జగన్‌ కోసం ప్రాణాలర్పిస్తాం అన్న రొటీన్‌ నినాదాలు, దృశ్యాలు ఆయా సభల్లో దారిపొడవునా కనిపించాయి.

అదేవిధంగా, స్థానిక కాంగ్రెస్‌ నేతలే స్థానిక గ్రామ మహి ళలు, యువకులను ఇంటర్వ్యూలు చేయడం, వారంతా రోశయ్య ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం, జగనన్నను సీఎం చేసే వరకూ విశ్రమించమని శపథాలు చేయటం, అవి జగన్‌ అనుకూల చానెళ్లలో ప్రత్యక్ష ప్రసా రాలు కావ డం ఫార్సుగా మారాయి. వీటిని నిశితంగా పరిశీలిస్తే.. ఒక పథకం ప్రకారం జగన్‌ను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారని స్పష్టమవుతోంది. మరోవైపు.. అందుకు తగినట్లుగానే రోశ య్య ప్రభు త్వంపై వివిధ గ్రామాల్లోని బడుగు, బలహీన వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయనను వైఎస్‌తో పోల్చుకోలేకపోతున్నామని, ఆయన వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని వారు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేయ డం ప్రస్తానార్హం.

అన్ని సంక్షేమ పథకాలనూ రోశయ్య ప్రభుత్వం తొలగించి వేస్తోందని, ఆయన మానవత్వంతో కాకుండా అన్నీ ‘లెక్కలతో పరిపాలన’ చేస్తున్నారని మహిళలు పెద్ద సంఖ్యలో అసహనం వ్యక్తం చేస్తుండటం ‘సూర్య’ పరిశీలనలో కనిపించింది. ‘ఆ బాబు బతికుంటే మా పింఛన్లు తప్పనిసరిగా ఆగకుండా వస్తాయన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం లేకుం డా పోయింది. ఆఫీసుకు వెళితే మా ముసలోళ్లను పట్టిం చుకునే దిక్కు లేదు. ఈ అబ్బాయికి (జగన్‌) పిల్లలు ఉన్నా రా? ఉంటే ఆ బాబు చల్లగా ఉండాలి. మా లాంటి పేదవాళ్ల కు రెండొందలు పించన్లు ఇచ్చిన వాళ్ల నాయన ఆశీస్సులు, మా ఆశీస్సులు అబ్బాయికి ఉంటాయ’ని 90 ఏళ్ల వృద్ధురా లొకరు ‘సూర్య’ ప్రతినిధి వద్ద వ్యాఖ్యాచింది.

రోశయ్యను తాము సీఎంగా లెక్కలోకి తీసుకోవడం లేదని, పేదవారికి అమలు చేసిన పథకాలన్నీ రోశయ్య తొలగిస్తున్నారని, తమ గ్రామాల్లో లెక్కలేనన్ని తెల్లకా ర్డులను ఈ ప్రభుత్వం తొలగించిందని మహిళలు మండి పడటం కనిపించింది. నేరుగా ఎన్నికయితే ప్రజల కష్టాలు తెలుస్తాయని మరికొందరు చదువుకున్న మహిళలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

వైఎస్‌ పథకాలను కొనసాగించడం రోశ య్యతో సాధ్యం కాదని, జగన్‌ వల్లే అది సాధ్యమని మహిళలు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మరికొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఎంపీటీసీ స్థాయి నేతలు వైఎస్‌కు రోశయ్య ద్రోహం చేస్తున్నారని, ఆయన దయతో సీఎం అయిన రోశయ్య.. జగన్‌ ఎవరని ప్రశ్నించటం విశ్వాసఘాతుకమేనని ధ్వజమెత్తారు. జగన్‌ సీఎం కావడం ఖాయమన్నారు. జగన్‌ హాజరయ్యే మరికొన్ని సభల్లో.. వైఎస్‌ ఆత్మ ముఖ్యమంత్రి రోశయ్యను తూర్పారపడుతున్నట్లు మిమిక్రీల ద్వారా వినిపించారు.