జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, May 3, 2012

మహాసంగ్రామానికి నాంది

*ఉప ఎన్నికలపై జగన్ వ్యాఖ్య
*ఈ ఎన్నికల్లో వేసే ఓటుతో ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలగాలి
* వైఎస్ చనిపోయాక గాలేరు-నగరి పనులు ఎక్కడికిపోయాయో తెలీదు
*కాంగ్రెస్ వాళ్లు ప్రచారానికొస్తే నీటి సమస్యపై నిలదీయండి
*వైఎస్ బతికున్నప్పుడు తిరుపతిలో పేదలకు 27 వేల ఇళ్లు కట్టించారు
* ఆయన చనిపోయాక ఒక్కటంటే ఒక్క ఇల్లూ ఇవ్వలేదేమని కాంగ్రెస్ వారిని ప్రశ్నించండి




 ‘ఈ కాంగ్రెస్ పెద్దలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను ఎంతగా దిగజార్చారూ అంటే.. విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థాలను టార్చిలైట్ వేసి వెతికినా కనిపించే పరిస్థితి లేదు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తేవాలి.. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావాలి.. విలువలను తిరిగి తేవాలి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చేలా జరగబోతున్న ఈ ఉప ఎన్నికలు.. రేపు జరుగబోయే మహా సంగ్రామానికి నాంది పలకనున్నాయి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్రంలో రైతు, పేదవాడు ఎలా బతుకుతున్నాడో పట్టించుకోని ఈ పాలకులకు వారి బాధను తెలియజెప్పేలా ఉప ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు.



‘రాష్ట్ర పాలకులకు, వారిని ఢిల్లీ నుంచి రిమోట్‌తో నడిపిస్తున్న పెద్దలకు ఉప ఎన్నికల తీర్పుతో కనువిప్పు కావాలి’ అని జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న భూమన కరుణాకరరెడ్డి తరఫున జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నిర్వహించిన ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే సువర్ణయుగంలో అవకాశముంటే టీటీడీ కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తాం. వారికి కనీస వేతనం అందేలా కృషి చేస్తాం. వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా గృహాలు నిర్మించుకునేందుకు కృషి చేస్తాం’ అని జగన్ హామీ ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

చిరంజీవి తిరుపతి ప్రజల్ని గాలికొదిలేశారు..

పేదోడికి, రైతన్నకు అండగా నిలబడినందుకు 17 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురయ్యారు. ఇప్పుడు వారి స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే తిరుపతిలో ఉప ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయీ అంటే.. మొన్న చిరంజీవే స్వయంగా చెప్పారు.. ఆయనకు సోనియా గాంధీ ప్రమోషన్ ఇచ్చారట.. రాజ్యసభకు పంపారట.. అందుకని ఆయన తిరుపతి ప్రజలను గాలికి వదిలేశారట. ఇంకా బాధాకరమైన విషయమేంటంటే.. రాజ్యసభకు వెళ్లే వ్యక్తి ఎక్స్ ఆఫీషియో సభ్యత్వానికి తిరుపతి నగరాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నా.. ఆయన మాత్రం హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేసుకున్నారు.

అలా ఆయన గాలికి వదిలేసిన పరిస్థితిలో తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తిరుపతి తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం మహానేత వైఎస్ గాలేరు-నగరి ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఆ మహానేత చనిపోయాక గాలేరు-నగరి ప్రాజెక్టు పనులు ఎక్కడికి పోయాయో తెలియడం లేదు. గాలేరు-నగరి పనులు జరగలేదనో, ఇక్కడున్న అక్క చెల్లెళ్లు నాలుగురోజులకొకసారి నీటి కష్టాలు పడుతున్నారనో చిరంజీవి రాజీనామా చేసుంటే సెల్యూట్ చేసుండేవాణ్ణి.

కాంగ్రెస్ వారిని నిలదీయండి: కాంగ్రెస్ వాళ్లు ఇక్కడికి(తిరుపతికి) ప్రచారానికి వస్తే ఒక మాట అడగండి. తిరుపతి నగరంలో నాలుగు రోజులకోసారిగాని ఐదు రోజులకోసారిగాని నీళ్లు దొరకని పరిస్థితిలో మేం బతుకుతున్నాం.. మీరేం చేస్తున్నారని అడగండి. ఆ మహానేత బతికి ఉన్నప్పుడు ఇక్కడ పేదలకు 27 వేల ఇళ్లు కట్టిస్తే.. ఆయన చనిపోయాక ఒక్కటంటే ఒక్క ఇల్లూ కట్టివ్వలేదేమని ప్రశ్నించండి. సాగు చేయడం కంటే ఆత్మహత్యే మేలనుకునే పరిస్థితిలో రైతు వ్యవసాయం చేస్తున్నా కూడా అతడిని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీయండి.

సంవత్సరమైపోయింది.. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు ఇప్పటికీ విడుదల చేయలేదు.. ప్రభుత్వం ఆ బకాయిలు కడుతుందో కట్టదో తెలియని పరిస్థితిలో చదువుతున్నాం మేం అని ప్రతి విద్యార్థీ కాంగ్రెస్ వాళ్లను నిలదీయండి. అనారోగ్యంతో ఉన్న పేదవాడు 108కు ఫోన్ చేస్తే 20 నిముషాల్లో రావాల్సిన అంబులెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో బతుకుతున్నామని నిలదీయండి. ఆరోగ్యశ్రీని ఎందుకు కుదించారని ప్రశ్నించండి. కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ అర్హత వయసును రెండేళ్లకే కుదించారు.. రెండేళ్లలోపు మూగ, చెవుడు గుర్తించలేకపోతే.. వాడి జీవితమేమైపోవాలని నిలదీయండి.

చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు ఎంతగా కుమ్మక్కయ్యారంటే..,
ఇలాంటి పరిస్థితిలో పోనీ ప్రతిపక్షమైనా ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతుందని చూస్తే.. మన ఖర్మకొద్దీ ఆ ప్రతిపక్ష స్థానంలో చంద్రబాబు ఉన్నారు. దేశ చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో ఆయన కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కయ్యారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు చెందిన వ్యక్తికి హైదరాబాద్ నడిబొడ్డున అమీర్‌పేటలో ఐదెకరాల భూమిని స్వయంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులే ధారాదత్తం చేశారంటే వారి కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీళ్లిద్దరి కలయిక ఎంత నిస్సిగ్గుగా ఉందో తెలుసుకోవాలంటే.. వైఎస్‌పైన, చంద్రబాబుపైన సీబీఐ చేస్తున్న దర్యాప్తు తీరు చూస్తే చాలు.

వెనుకబడిన మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పరిశ్రమలు తేవాలని, ఉపాధి కల్పించాలని తలచి మహానేత.. ఎకరా 8 లక్షల చొప్పున 75 ఎకరాలను 25 ఏళ్లపాటు లీజుకిస్తే సీబీఐ తప్పు పడుతోంది. అక్కడ ఎకరా రూ.15 లక్షల రేటు పలుకుతోందీ అంటోంది. ఎమ్మార్ కేసులోనూ సీబీఐ దర్యాప్తు చేస్తోంది.. అయితే అందులో చంద్రబాబు చేసిన తప్పు వారికి కనబడడం లేదట. వైఎస్ ఉపాధి కల్పించడానికి ఎకరాలను పరిశ్రమలకు కేటాయిస్తే.. చంద్రబాబు పెద్దలు గోల్ఫ్ ఆడుకోవడానికి, విలాసవంతమైన విల్లాలు కట్టుకోవడానికి హైదరాబాద్ నడిబొడ్డున 535 ఎకరాలను ఎమ్మార్‌కు ధారాదత్తం చేశారు. అక్కడ ఎకరా రూ.3 నుంచి రూ.4 కోట్లు పలుకుతా ఉంటే.. ఆయన ఎకరా రూ.29 లక్షల చొప్పునఎమ్మార్‌కు ఇచ్చేస్తే... ఎందుకయ్యా ఇలా చేశావూ అని సీబీఐ కనీసం అడగనైనా అడగడం లేదు.

జోరువానలోనూ.. జనప్రవాహం
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పళణి థియేటర్ సర్కిల్ రోడ్‌షోలో ప్రసంగిస్తుండగానే వర్షం మొదలైంది. అయినా జనం కట్టుకదల్లేదు.. అంత వానలో ఉద్వేగంగా జగన్ ప్రసంగిస్తుంటే.. అంతే ఆత్రుతగా అభిమానులు వింటూ వర్షాన్నే మరచిపోయారు. తర్వాత జగన్ ముత్యాలరెడ్డిపల్లె బహిరంగ సభకు చేరుకున్నారు. అక్కడా జోరు వానలో తడుస్తూనే ప్రసంగించారు. జనం కూడా వర్షాన్ని లెక్కచేయకుండా జగన్‌మోహన్ రెడ్డి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. వర్షం పడుతున్న సమయంలో ఆయన ఆకాశం వైపు చూసి రెండు చేతులెత్తి వరుణ దేవునికి నమస్కరించుకున్నారు.

ఆ దృశ్యాన్ని చూసిన జనం ‘వాళ్ల నాన్న లాగే వర్షం అంటే జగన్‌మోహన్‌రెడ్డికి కూడా ఎంతో ఇష్టం’ అంటూ మాట్లాడుకున్నారు. ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని తిరుపతి చేరుకున్న అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి 11.35 గంటలకు నగర శివార్లలోని ఆటోనగర్ నుంచి రెండో రోజు ప్రచారాన్ని ప్రారంభించారు. నగరంలో 10 జంక్షన్లలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆయన్ను చూసేందుకు ఎండను లెక్కచేయక మిద్దెలపైన, భవనాల పైన కూడా గంటలకొద్దీ జనం వేచి ఉన్నారు. రోడ్‌షోలో తన ప్రసంగం వినడానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి.. పచ్చ చీర రంగు అవ్వా.. కళ్లద్దాల అవ్వా.. చెల్లెమ్మా.. అంటూ జననేత పిలుస్తుంటే జనం పులకించిపోయారు. కాగా బుధవారం సాయంత్రం తిరుపతి ప్రచారం ముగించుకున్న జగన్.. తర్వాత కడప వెళ్లారు. గురువారం ఉదయం నుంచి ఆయన రాజంపేటలో ప్రచారం నిర్వహిస్తారు.

Wednesday, May 2, 2012

పేదవారి గురించి తపనే నా కులం : వైఎస్ జగన్



తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ఉద్ఘాటన
* ఒక నాయకుడి మతం, కులంపై మాట్లాడే స్థాయికి రాజకీయాలు దిగజారాయి
* పేదలు, రైతులకు అండగా ఉన్నందుకే 17 చోట్ల ఉప ఎన్నికలు
* తన స్వార్థం కోసం చిరంజీవి తిరుపతి ప్రజలను గాలికొదిలేశారు
* ప్రజారాజ్యం పార్టీని హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మేశారు
* నన్ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించానంటున్నారు
* సంతకాలు చేయించే ఉంటే.. ఆనాడే చంద్రబాబులా వారిని వైస్రాయ్ హోటల్‌కు తీసుకెళ్లేవాడిని.. సీఎంగా ప్రమాణం చేసేవాణ్ణి
* నేను సీఎం కావాలని ఎవరు సంతకాలు పెట్టించారో చెప్పండి
* నాడు రోశయ్యను సీఎంగా ప్రతిపాదించింది నేను కాదా?


తిరుపతికి గాలేరు-నగరి తెస్తా

‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలాగా.. చనిపోయాక కూడా పేదవాడి గుండెల్లో నిలిచేలా బతకాలన్న తపన, తాపత్రయం నాలో ఉన్నాయి. అందుకే చెబుతున్నా రాబోయే సువర్ణయుగంలో తిరుపతికి గాలేరు-నగరి తెస్తా.. తాగునీటి సమస్య తీరుస్తా’’ - జగన్‌మోహన్‌రెడ్డి


‘గత రెండేళ్లుగా చూస్తున్నా.. టీడీపీ అధినేత చంద్రబాబుకుగాని, కాంగ్రెస్ పెద్దలకుగాని ప్రజలు, వారి సమస్యలూ కనిపించడం లేదు. రెండేళ్లుగా వీరు చేస్తున్నదేంటంటే.. జగన్‌ను, వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎలా అప్రతిష్టపాలు చేయాలీ.. వారిపై ఎలా బురదజల్లాలీ అని కుట్రలు పన్నడం మాత్రమే. చివరకు వీరు ఏ నీచస్థాయికి దిగజారిపోయారంటే.. జగన్ కులమేంటి? జగన్ మతమేంటి? అని నిస్సిగ్గుగా మాట్లాడే పరిస్థితికి వచ్చేశారు’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. పేదవాడు ఎలా బతుకుతున్నాడు..? వారికి ఎలా మేలు చేయాలీ అన్న ఆలోచనే మానేసి ఇలా దిగజారి మాట్లాడుతున్న చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు తమ వ్యక్తిత్వం గురించి తమను తాము ఒకసారి ప్రశ్నించుకోవాలని ఆయన సూచించారు. ‘‘ఇవాళ చెబుతున్నా.. నా మతం మానవత్వం. నా కులం ప్రతి పేదవాడి గురించి తపించే కులం’’ అని జగన్ ఉద్ఘాటించారు. ఉప ఎన్నికలు జరుగనున్న తిరుపతి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిభూమన కరుణాకరరెడ్డి తరఫున జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రచారం ప్రారంభించారు. ఆయన్ను చూసేందుకు.. చెమటలుకక్కే మండుటెండలో సైతం తిరుపతి రోడ్లపై జనం కిక్కిరిశారు. జనం పెద్ద ఎత్తున తరలి రావడంతో జగన్ కాన్వాయ్ ముందుకు కదలడం కష్టంగా మారింది. ఆయన ప్రసంగిస్తుంటే.. ఈలలు, తప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. తిమ్మినాయుడు పాళెం పంచాయతీ నుంచి ప్రచారం ప్రారంభించిన జగన్.. తొలిరోజు మొత్తం 13 జంక్షన్లలో ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా మే డే జరుపుకొంటున్న కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేశారు. ఈ పర్యటనలో జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

చిరంజీవి స్వార్థం వల్లే తిరుపతిలో ఉప ఎన్నికలు:
రైతన్నకు, పేదోడికి అండగా నిలబడితే పదవులు పోతాయని తెలిసినా.. నీతి, నిజాయతీతో కూడిన రాజకీయాలు చేసినందుకు 17 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురయ్యారు. అందువల్లే ఆ 17 చోట్ల ఉప ఎన్నికలు వచ్చాయి. కానీ తిరుపతిలో చిరంజీవి స్వార్థం కోసం ఉప ఎన్నికలు వచ్చాయి. చిరంజీవే స్వయంగా చెప్పారు.. సోనియా గాంధీ ఆయనకు ప్రమోషన్ ఇచ్చారట.. అందుకని ఇక్కడి ప్రజల్ని గాలికొదిలేసి ఆయన రాజ్యసభకు వెళ్తున్నారట. తిరుపతిలో నాలుగురోజులకోసారి నీళ్లు ఇస్తున్నారని, ప్రభుత్వం నీటి ఎద్దడి పరిష్కరించలేదని చిరంజీవి రాజీనామా చేసుంటే సంతోషించేవాళ్లం. ఆయనకు నేను కూడా సెల్యూట్ చేసి ఉండేవాణ్ణి. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు కుదించారని, 108కు ఫోన్ చేసినా వాహనం వచ్చే పరిస్థితి లేదని రాజీనామా చేసుంటే అభినందించేవాళ్లం. రంగారెడ్డి జిల్లాకు చెందిన వరలక్ష్మి లాంటి పేద అమ్మాయి చదువుకోలేక, ఫీజు కట్టలేక ఆత్మహత్యకు పాల్పడింది. అలాంటి వారిని ప్రభుత్వం పట్టించుకోలేదని రాజీనామా చేసుంటే గర్వపడుండేవాళ్లం. పదవి కోసం, కావాల్సిన వారికి మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు చిరంజీవి హోల్‌సేల్‌గా తన పార్టీని కాంగ్రెస్‌కు అమ్ముకున్నారు. ఇప్పుడు చెప్పండి స్వార్థపరుడు చిరంజీవా, నేనా?

చిరంజీవి ఎప్పుడూ నాపై నింద వేస్తూనే ఉన్నారు:
చిరంజీవి మాటిమాటికీ నా మీద ఏదో ఒక నింద వేస్తూనే ఉన్నారు. ఆ వేళ నాన్న చనిపోయినప్పుడు.. నన్ను సీఎంగా చెయ్యాలంటూ 150 మందికిపైగా ఎమ్మెల్యేలతో నేను సంతకాలు చేయించానని అంటున్నారాయన. ఆ 150 మందికిపైగా ఎమ్మెల్యేల్లో కొంతమంది చిరంజీవి వద్దకు బహిరంగంగా అందరికీ తెలిసేటట్లుగా వెళ్లి.. వాళ్లందరినీ(పీఆర్‌పీ ఎమ్మెల్యేలందరినీ) నాకు మద్దతు తెలపాలని అడిగినట్లు చిరంజీవి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. దీనిపై చిరంజీవిని మా పార్టీ వాళ్లు చాలాసార్లు ఎదురు ప్రశ్నించారు. ఆయన వద్దకు వచ్చిన వారెవరో చెప్పాలని పదే పదే అడిగారు. ‘సాక్షి’లో కూడా చాలాసార్లు ఈ విషయాన్ని వేస్తూ వచ్చారు. అయితే ఆ ప్రశ్నలకు చిరంజీవి సమాధానం చెప్పలేదు. ఇప్పుడేమో బాబు కూడా చిరంజీవి మాటే మాట్లాడుతున్నారు.

కొంచెమైనా జ్ఞానముందా చిరంజీవీ?: 
నన్ను సీఎంగా చేయాలని 150 మందికిపైగా ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించే దుర్బుద్ధే నాకు ఉంటే.. చంద్రబాబు నాయుడిలా వాళ్లందరినీ ఆ నాడే వైస్రాయ్ హోటల్‌కు తీసుకెళ్లిపోయేవాణ్ణి.. ఆ వెంటనే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేవాణ్ణి. అయ్యా చంద్రబాబూ.. ఆ రోజు ఎవరు సంతకాలు చేయించారో నాకు తెలీదు. మీకు తెలిస్తే మీరైనా చెబితే సంతోషిస్తాను. అయ్యా చిరంజీవిగారూ.. కొంతమంది ఎమ్మెల్యేలను మీ వద్దకు పంపించి మద్దతు కోరానని మీరు చాలాసార్లు అన్నారు. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నాకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేలను మీ దగ్గరకు అలా బహిరంగంగా పంపించానని సోనియాకు తెలిస్తే.. నన్ను ఎలా సీఎం చేస్తారయ్యా? నీకు కొంచెమైనా జ్ఞానముండాలి కదయ్యా చిరంజీవి ఆ మాట మాట్లాడ్డానికి.

ప్రజల చేత ఎన్నుకోబడిన సీఎంనవుతా: 
చంద్రబాబుకు, చిరంజీవికి ఇద్దరికీ చెప్తున్నా.. మీ మాదిరిగా నేను అధికారం కోసం ఏ గడ్డయినా తినేవాణ్ణికాదు. అధికారం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచే చరిత్ర నాకు లేదు చంద్రబాబూ! ఓటేసిన 70 లక్షల మంది ప్రజల్నీ స్వార్థం కోసం నట్టేట ముంచిన చరిత్ర నాదికాదయ్యా చిరంజీవి.. అది నీదేనయ్యా. అధికారం అనేది దేవుడు నా నుదుట రాసిపెడితే.. అదెలా ఉంటుందీ అంటే.. పేదవాడి కొరకు, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన సీఎంగా నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. నా నైజం, నా గుణగణాలు ఇవే. ఈ మాదిరిగా నేను సీఎం అవుతానేకాని... మీలాగా దొడ్డిదారిన పదవి చేపట్టాలని తాపత్రయపడను. ఇవాళ చంద్రబాబును నేను ఒక్క మాట అడుగుతున్నా.. ఆ వేళ నేనే కదయ్యా రోశయ్యను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిందీ అని అడుగుతున్నా.

అందరూ ఒక్కటై దాడి చేస్తున్నారు:
  ఇవాళ అధికారం కోసం వెంపర్లాడుతూ నా మీద రోజుకో మాట మాట్లాడుతున్నారు. రోజుకో నింద వేస్తున్నారు. నన్ను ఒక్కడిని చేశారు. అటు సోనియా గాంధీ వైపు నుంచి కాంగ్రెస్‌వాళ్లు, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ కాంగ్రెస్ వాళ్లతో కలిసి దాడి చేస్తున్నారు. వాళ్ల దగ్గర అధికారం ఉంది. వాళ్ల దగ్గర ఉన్న వ్యవస్థలను అడ్డగోలుగా నా మీదకు ఉసిగొల్పుతున్నారు. మరోవైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 అంతా కలిసి దాడి చేస్తున్నారు.. నన్ను ఒక్కడిని చేసి వీరందరూ ఒక్కటై దాడి చేస్తున్నారు. రోజుకో కట్టు కథ.. రోజుకో అబద్ధం. రోజూ చెప్పిందే చెప్పి దుష్ర్పచారం చేసి ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తున్నారు. నన్ను ఒక్కడిని చేసి మీరంతా ఏకం కావచ్చు. నా దగ్గర రాజ్యాలు లేకపోవచ్చు.. మద్దతిచ్చే రాజులు లేకపోవచ్చు.. నా దగ్గర గుర్రాలు లేకపోవచ్చు. కానీ పై నుంచి ఆ దేవుని ఆశీస్సులు, నాన్నను ప్రేమించే ప్రతి గుండే నా వెంటే ఉందని చెప్తున్నా.

మీ ఓటు మార్పునకు నాంది:
త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో పేదవాడు, రైతు ఓ వైపు.. కుళ్లు, కుతంత్రాలు మరోవైపు ఉండి పోటీ పడుతున్నాయి. మీరు వేసే ఓటుతో ఈ రాష్ట్రాన్ని రిమోట్‌తో పాలిస్తున్న ఢిల్లీ పాలకుల దిమ్మ తిరగాలి. మీరు వేసే ఓటు రాష్ట్రంలో మార్పు తేవాలి. ఆ మార్పుతో రాష్ట్రంలో త్వరలో మళ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు సువర్ణయుగం వస్తుంది. ప్రతి అక్క, అన్న.. తమ తమ్ముడు సీఎం అయ్యాడని, ప్రతి చెల్లెలు, ప్రతి తమ్ముడు తమ అన్న సీఎం అయ్యాడని.. ప్రతి అవ్వా, తాత తమ మనవడు సీఎం అయ్యాడని అనుకునే విధంగా, ప్రతి రైతు, పేదవాడు కాలర్ ఎగరేసేలా ఆ సువర్ణయుగం ఉంటుంది. ఏటా పేదలకు 10 లక్షల ఇళ్లు కట్టించే విధంగా పాలన ఉంటుంది.