జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, September 9, 2010

నాకు అన్నీ తెలుసు * ఎలాంటి అయోమయం లేదు * ఎవరిని ఎలా నియంత్రించాలో తెలుసు


చర్యలు తీసుకుంటున్నాం
డీఎల్‌తో సోనియా స్పష్టీకరణ
జగన్‌పై ఆగ్రహం!
రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు
వేలకోట్లు తరలించేశారు
వ్యవస్థలు నాశనం చేశారు
ఎమ్మార్‌పై సీబీఐ విచారణ జరపండి

సోనియాకు డీఎల్ వినతి

'మాకు అన్నీ తెలుసు. ఏం చేయాలో, ఎవరిని ఎలా కట్టడి చేయాలో తెలుసు'... ఇది మేడమ్ సోనియా గాంధీ మాట! రాష్ట్రంలో పరిస్థితులపై తమలో ఎలాంటి అయోమయం లేదని ఆమె స్పష్టం చేసినట్లు తెలిసింది. గురువారం తనను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మైదుకూరు ఎమ్మెల్యే రవీంద్రారెడ్డితో, మహిళా నేతలతో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.

రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సోనియా గాంధీలో ఎలాంటి అయోమయం లేదని రవీంద్రా రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇక్కడి విషయాల గురించి తనకంటే ఆమెకే ఎక్కువగా తెలుసన్నారు. మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి సోనియా పిలుపు కోసం నిరీక్షిస్తున్న డీఎల్... ఎట్టకేలకు గురువారం ఆమెతో భేటీ అయ్యారు.

ఒక్కో అంశాన్ని వివరిస్తున్నప్పుడు... తనకంటే ముందు సోనియానే ఆయా అంశాలను ప్రస్తావించడంతో డీఎల్ ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తనకు తెలుసునని, పరిస్థితి చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని సోనియా చెప్పినట్లు తెలిసింది. ఎమ్మార్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన సోనియా గాంధీని కోరారు.

రాష్ట్రంలో వేల కోట్ల భూ కుంభకోణాలు జరిగాయని, ప్రభుత్వంలోని పెద్దలే భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని, చట్టాలను, రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా... పెద్దలు, వారి అస్మదీయులు ఇష్టారాజ్యంగా వేల కోట్లు స్వాహా చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. "ఎమ్మార్ మాత్రమే కాదు, రాష్ట్రంలో కేటాయించిన ప్రతి ప్రాజెక్టులో పెద్దలకు వాటాలున్నాయి.

దుబాయ్ వంటి దేశాల్లో ఆస్తులను సంపాదించుకున్నారు. నిధులను తరలించేశారు'' అంటూ పలు డాక్యుమెంట్లను ఆమె ముందుంచారు. రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని చెప్పారు. డీఎల్‌తో భేటీ సందర్భంగా జగన్ వ్యవహారం పట్ల సోనియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో నేతలు తన వద్ద ఒక తీరుగా, బయట మరో తీరుగా మాట్లాడుతున్నట్లు కటువుగా అన్నట్లు సమాచారం. సోనియాతో భేటీ అనంతరం డీఎల్ విలేకరులతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలు, ఆయన ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి....

సోనియా గాంధీకి ఏయే అంశాలు వివరించారు?
రాష్ట్రంలో పరిస్థితులు అన్నీ వివరించాను. ఆమె నేను చెప్పిందంతా విన్నారు. రాష్ట్రంలో పరిస్థితుల గురించి నాకు తెలిసిన దానికన్నా ఆమెకే ఎక్కువ తెలుసు. మా పార్టీకి విషయాలను, అధ్యక్షురాలితో చెప్పిన ఇతర అంశాల గురించి ఇంతకు మించి ఏమీ బయటకు చెప్పలేను.

ప్రధానంగా ఏయే అంశాలను ప్రస్తావించారు?
రాజకీయ, ఆర్థిక, పాలనా పరమైన ఇబ్బందుల గురించి వివరించాను. ఎమ్మార్ కుంభకోణం గురించి చెప్పాను. సీబీఐ విచారణ జరిపించాల్సిన అవసరాన్ని వివరించాను. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమై పోయాయని చెప్పాను. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరంపై చర్చించాను. ప్రత్యేక దృష్టిసారించాల్సిన కొన్ని అంశాల గురించి మాట్లాడాను

మేడమ్ ప్రతిస్పందన ఏమిటి?
అన్ని అంశాలు తన దృష్టికి వచ్చాయని మేడమ్ చెప్పారు. వ్యవస్థలను సరిదిద్దే క్రమంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. 'ఐ యామ్ అట్ ఇట్'.. అని చెప్పారు. సంతోషకరమైన విషయం ఏమంటే... ఆమె అన్ని విషయాలు చక్కగా ఆకళింపు చేసుకున్నారు. పరిస్థితులు ఆమెకు బాగా అర్థమయ్యాయి.

జగన్ ఓదార్పు యాత్ర గురించి ప్రస్తావించారా?
దాని గురించి నేను చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు అన్ని విషయాలు బాగా తెలుసు.

ఈ విషయంలో అధిష్ఠానం ఏ చర్యలు తీసుకుంటారనే దానిపై పార్టీలో, నేతల్లో అయోమయం ఉందికదా?
మీరూ, మేమూ మాత్రమే అయోమయంలో ఉన్నాము. మేడమ్ ఏమీ ఆయోమయంలో లేరు. త్వరలో ఈ విషయం అందరికీ అర్థమవుతుంది.

మేడమ్‌తో సమావేశం ఎలా జరిగిందనుకుంటున్నారు?
చాలా సంతృప్తికరంగా జరిగింది. నేను అనుకుకున్న విధంగానే మేడమ్‌కు అన్ని విషయాలు వివరించగలిగాను. ఆమెకు అన్ని విషయాలు తెలిశాయనే సంతోషంతో వెళుతున్నాను.

అదను చూసి పంజా ఇది సోనియా నైజం.. జగన్‌పై మేడమ్ ఆగ్రహం


ఆయనపై చర్య ఖాయం.. సరైన సమయంలో అనూహ్య నిర్ణయం
మధ్యే మార్గానికి అవకాశం శూన్యం
పార్టీ వర్గాల స్పష్టీకరణ
ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎలాంటి సంకేతాలు పంపినా పట్టించుకోని కడప ఎంపీ వైఎస్ జగన్‌పై అధిష్ఠానం వైఖరి ఏమిటి? ఆయనకు ఎలాంటి హానీ తలపెట్టబోరనే వాదనలో నిజం ఎంత? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ వైఖరినే సమాధానంగా చూపిస్తున్నారు. "అదను చూసి పంజా విసరడం ఆమె నైజం. జగన్ విషయంలోనూ ఇదే జరుగుతుంది' అని చెబుతున్నారు.

జగన్ పట్ల సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసినప్పటికీ ఆమె నుంచి తగిన ఆదేశాలు రానందునే ఇప్పటిదాకా 'ఓర్పు' ప్రదర్శిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. "జగన్ విషయంలో మేమేమీ చేయలేం. బంతి సోనియా కోర్టులో ఉంది. ఆమె జగన్ పట్ల ఏ చర్య తీసుకోవాలో నిర్దేశించేదాకా ఈ విషయంలో ఏమీ చెప్పలేం'' అని ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. జగన్‌పట్ల మేడమ్ చాలా ఆగ్రహంగా ఉన్నారని తమకు తెలుసని... ఆయనను క్షమించే అవకాశమే లేదని కూడా తెలుసని చెప్పారు.

"అదను చూసి పంజా విసరడమే సోనియా తత్వం. తగిన సమయంలో ఆమె సంకేతాలు ఇస్తారు'' అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తామే కాదు, జగన్ స్వయంగా వచ్చి వివరణ ఇచ్చినా సోనియా వినిపించుకునే పరిస్థితి లేదని... మధ్యేమార్గానికి అవకాశం లేనే లేదని ఏఐసీసీ నేతలు అంటున్నారు. "జగన్ వలలో పడవద్దు. జాగ్రత్తగా ఉండండి. నాకు తెలుసు మీరు ఓదార్పు యాత్రకు జనాన్ని పంపించారు'' అని సోనియా పార్లమెంట్ సమావేశాల సమయంలో ఒక ఎంపీని హెచ్చరించడం ఆమె ఆలోచనా విధానానికి అద్దం పడుతుందని ఒక నేత చెప్పారు.

ఏ చర్య, ఎప్పుడు, ఏ సమయంలో తీసుకోవాలనే దానిపై అధిష్ఠానం ఒక స్పష్టతతో ఉందని... సరైన సమయంలో అనూహ్యమైన చర్యలుంటాయని ఒక సీనియర్ నాయకుడు అన్నారు. ఈ అంశంపై ఎవరైనా ప్రశ్నించినప్పుడు "మాకు లేని తొందర మీకెందుకు? చర్యలు ఎప్పుడు తీసుకోవాలో మాకు బాగా తెలుసు'' అని ఆయన అంటున్నారు. అయితే, ప్రస్తుతానికి మాత్రం టెన్ జనపథ్‌లో కదలిక కనపడకపోవడంతో ఏఐసీసీ నేతలు కూడా అయోమయంలో ఉన్నారని, అందుకే విలేకరులు అడిగిన వివిధ ప్రశ్నలకు రకరకాల సమాధానాలు చెబుతున్నారని పేర్కొంటున్నారు.

వైఎస్ మరణానంతరం ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పార్టీయే సహాయం చేయాలనడం, ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని చెప్పడం సోనియా ఆదేశాలకు అనుగుణంగానే జరిగిందని... పార్టీ నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్లడంతో జగన్ యాత్రకు పార్టీ శ్రేణుల రాక తగ్గిందని పేర్కొంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర తర్వాత అధిష్ఠానం మాట వింటానని జగన్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీకి చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

జగన్‌పై తీసుకోవాల్సిన చర్యలపై అధిష్ఠానం ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో పాటు ఒకరిద్దరు నేతలతో చర్చించింది. జగన్ వ్యాపార లావాదేవీలు, ఆయన, ఆయన ఆనుచరుల ఆర్థిక సంబంధాల గురించి సమగ్రమైన సమాచారమూ అధిష్ఠానం వద్ద పూర్తిగా ఉంది. ఒకరిద్దరు రాష్ట్ర మంత్రులు, గవర్నర్ నరసింహన్, కొందరు అధికారులు రాష్ట్రంలో పరిస్థితుల గురించి, జగన్ వ్యవహారాల గురించి కేంద్రానికి, పార్టీ పెద్దలకు పూర్తి సమాచారాన్ని అందించినట్లుతెలుస్తోంది.

Tuesday, September 7, 2010

'యువరాజా' వారి రాజభవనం

అదే సమయంలో పార్టీకి నష్టమే
ఆయనను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు: ఏఐసీసీ వర్గాలు
తివాచీలా పరుచుకున్న పచ్చదనం! ఆ మధ్యలో వెలిగిపోతున్న శ్వేత సౌధం! ఇది కడప ఎంపీ వైఎస్ జగన్ నివాసం. తెలుగుదేశం వర్గాలు ఈ భవంతి వివరాలను సేకరించాయి. బెంగళూరు శివారులోని యలహంక రోడ్‌లో ఉన్న ఈ భవంతి విశేషాలు అన్నీ ఇన్నీ కావు. దీని మొత్తం విస్తీర్ణం 31 ఎకరాలు.

జగన్ సోదరి షర్మిల నివాసం కూడా ఇదే ఆవరణలో ఉంటుంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగానే దీని గృహ ప్రవేశం జరిగింది. వైఎస్‌కు అత్యంత సన్నిహితులు, బంధువులైన సుమారు వందమందికి మాత్రమే అప్పట్లో ఆహ్వానం లభించింది. గృహ ప్రవేశం తర్వాత వైఎస్ మూడు రోజులపాటు అక్కడే బస చేశారు.

ఈ భవనం శత్రు దుర్భేద్యం. దీనికి మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ ఒక్కో షిఫ్ట్‌లో 200 మంది చొప్పున, మూడు షిఫ్టుల్లో మొత్తం 600 మంది సెక్యూరిటీ సిబ్బంది పని చేస్తున్నారు. వీరి నివాసాలు కూడా ఇక్కడే. కొత్త వాళ్లను ఆ భవంతి ఛాయలకు కూడా రానివ్వరు. మీడియాకు అస్సలు ప్రవేశం ఉండదు. జగన్ సొంత పత్రిక, చానెల్ ప్రతినిధులను పిలిపించినా... రెండో గేటు వరకే ప్రవేశం ఉంటుంది.

ఇతర ముఖ్యులను కూడా ఆ గేటు వద్ద ఉన్న గదిలోనే జగన్ కలుస్తారు. అత్యంత ముఖ్యులకు మాత్రమే లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. వైఎస్ సన్నిహిత కుటుంబ సభ్యులను మినహాయిస్తే... ఈ భవంతి లోపలికి వెళ్లి, కళ్లారా చూసిన వారి సంఖ్య చాలా తక్కువ. వైఎస్ మరణం తర్వాత వీరప్ప మొయిలీ ఒకసారి ఈ భవంతిలో, జగన్‌తో భేటీ అయినట్లు తెపలుస్తోంది. అత్యంత ముఖ్యులతో, అత్యంత కీలకమైన అంశాలపై చర్చించేందుకు ఈ భవంతిలో ఒక ప్రత్యేక గది ఉన్నట్లు చెబుతారు.

Sunday, September 5, 2010

ప్రకాశంలో ఓదార్పునకు ప్రజాప్రతినిధులు దూరం * బెడిసికొట్టిన జగన్ వర్గం వ్యూహం * ‘ఓదార్పు’ లో ‘ధిక్కారం’

odarpu 
అధిష్టానంపైనే యుద్ధం
మింగుడుపడని తాజా పరిణామాలు
బయటకు వస్తున్న మనసులోని మాటలు
ఎమ్మెల్యేల కంటే ప్రజలు పెద్ద మద్దతుదారులన్న జగన్
వారిని కట్టడి చేసినా నష్టమేమి లేదని పరోక్ష హెచ్చరిక
జగన్ నాయకత్వం కావాలన్న మంత్రి బాలనేని
‘ఓదార్పు’ లో ‘ధిక్కారం’ 
కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఓదా ర్పు క్రమంగా ధిక్కార యాత్రగా మారు తోంది. రాష్ట్ర మంత్రి, వైఎస్‌ సమీప బంధు వయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఓదార్పు యాత్ర వేదిక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ రాష్ట్రానికి జగన్‌ ముఖ్య మంత్రి అయితే తప్ప వైఎస్‌ ప్రారంభించిన సంక్షేమ పథకాలు కొనసాగవని విస్పష్టంగా ప్రకటించారు. ఇది నేరుగా రోశయ్యపై జగన్‌ వర్గం ప్రారంభించిన దాడిగానే స్పష్టమవు తోంది.

ప్రకాశం జిల్లాలో జరుగుతున్న జగన్‌ ఓదార్పు యాత్ర ముఖ్యమంత్రి రోశయ్యను ధిక్కరించే వేదికగా మారుతోంది. గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాను రోశయ్యను ముఖ్యమంత్రిగా పరిగణించడం లేదని, తనకు కాంగ్రెస్‌ వల్ల కాకుండా వైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్లే మంత్రి పదవి వచ్చిందని చెప్పకనే చెప్పడం సంచలనం సృష్టించింది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం వైఎస్‌ ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలు అమలుకావన్న పరోక్ష వ్యాఖ్యలు చర్చనీ యాంశంగా మారాయి. ఇవి తిరుగుబాటు దిశగా సాగుతున్న ఆలోచన లుగానే సీని యర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్‌కు మద్దతుదారుగా ఉన్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఓదార్పు ఇకపై ధిక్కారయాత్రగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్‌ వెంట ఉన్న వారిపై వేటు వేయడం ద్వారా, జగన్‌ను నిర్వీర్యం చేయాలన్న అధిష్ఠానం ఆలోచనను పసిగట్టిన ఆయన అనుచరులు, దేనికయినా సిద్ధంగా ఉన్నామన్న తెగింపు సంకేతాలు బాలినేని వ్యాఖ్యల బట్టి స్పష్టమ వుతున్నాయి. ‘నా పదవి పోయినా ఫర్వా లేదు. జగన్‌ మాత్రం సీఎం కావాల’ని బాలి నేని విస్పష్టంగా వ్యాఖ్యానించడం బట్టి.. జగన్‌ అనుచరులయిన మంత్రులు, ఎమ్మె ల్యేలు ఎంతవరకూ తెగించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతోంది. గతంలో మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలి కూడా ఇలాగే కనిపించింది.

ప్రజలు రోశయ్యను ముఖ్యమంత్రిగా చూడ లేకపోతు న్నారని, తాను ఆయన ముఖం చూడలేకపోతున్నానంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆమె మంత్రివర్గం నుంచి వైదొలగారు. ఇప్పుడు బాలినేని వ్యవహారశైలి అదేవిధంగా ఉన్నప్పటికీ.. తనను ముఖ్యమంత్రే తొలగించాలన్న ధోరణి ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌ నాయకత్వం తమపై ఎందాకా వెళుతుందో చూసే వైఖరిని జగన్‌ వర్గం ప్రదర్శి స్తోంది. లేకపోతే ఇంకా మంత్రిగా కొనసాగుతున్న బాలినేని, ముఖ్యమంత్రిపై అంతఘాటు వ్యాఖ్యలు చేయలేరని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కాగా.. తూర్పు గోదావరి జిల్లా యాత్రలో జన సమీరకణకు అంతగా ప్రాధాన్యం ఇవ్వని జగన్‌ వర్గం, ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టగానే తన వ్యూహం పూర్తిగా మార్చుకుంది. భారీ జన సమీకరణపెనేై ప్రధానంగా దృష్టి సారించింది. ద్వితీయ స్థాయి నేతలను సమీకరించి, కింది స్థాయి కార్యకర్తలను రోడ్లపై నింపే వ్యూహానికి తెరలేపారు. వైఎస్‌ బంధువు వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో, మంత్రి బాలినేని స్వీయ దర్శకత్వంలో తరలింపు వ్యవహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు జనసమీకరణ స్పష్టం చేస్తోంది.
ప్రకాశం జిల్లాలో జగన్‌ యాత్ర ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకూ మునుపటి మాదిరిగానే ఎక్కడా సోనియా ప్రస్తావన గానీ, పార్టీ పలుకు గానీ వినిపించకపోవడం ప్రస్తావనార్హం.

పార్టీ పేరు, అధ్యక్షురాలు సోనియాగాంధీ సమర్థతను ప్రస్తావించాలని మొయిలీ విధించిన షరతులు ఓదార్పు యాత్రలో ఎక్కడా కనిపించకపోవడం బట్టి.. పూర్తిగా తెగించడానికే సిద్ధమయినట్లు జగన్‌ వ్యవహారశైలి చెప్పకనే చెబుతోంది. జగన్‌ తన యాత్రలో చేస్తున్న ప్రసంగాల్లో తండ్రి వైఎస్‌ కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలు, తన గురించి చెప్పుకోవడానికే పరిమితమవుతున్నారు. కాగా జగన్‌ ఓదార్పు యాత్ర సందర్భంగా ఆయన ఆవిష్కరిస్తున్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు, వాటిని ఏర్పాటుచేసే ద్వితీయ శ్రేణి నేతలకు గిరాకీ పెరిగింది.

విగ్రహంతో పాటు.. అవి ఏర్పాటు చేసే నాయకులకు లక్ష రూపాయల చొప్పున నగదు ఇస్తుండటంతో నేతల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా.. అరి లోమీటరులో రెండేసి విగ్రహాలు వెలుస్తున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఇక వీటికి అనుమతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అటు మునిసిపాలిటీలు గానీ, ఇటు పంచాయతీలు గానీ ఎవరూ అభ్యంతరం పెట్ట పోవడంతో విగ్రహాల ఏర్పాటు కోసం నేతల మధ్య పోటీ పెరిగింది.
కడప ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి వర్గం అధిష్ఠానంపై ధిక్కార స్వరానికి దిగుతోంది. ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రలో అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు గైర్హాజరు కావడం ఆ వర్గానికి మింగుడు పడడం లేదు. ద్వితీయ శ్రేణి నేతల ద్వారా ప్రజాప్రతినిధులను కట్టడి చేయాలన్న వ్యూహమూ పూర్తిగా బెడిసికొట్టింది. దీంతో మనసులోని భా వాలను క్రమంగా బయటకు వెల్లడిస్తున్నారు. ప్రకాశం ఓదా ర్పు యాత్రలో భాగంగా ఆదివారం జగన్ మాట్లాడుతూ.. ఎ మ్మెల్యేల కంటే ప్రజలే తనకు అతిపెద్ద మద్దతుదారులని వ్యా ఖ్యానించారు.

"నన్ను మీ సోదరుడిగా, కుమారుడిగా ఆశీర్వదిస్తున్నారు. నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపుతున్నారు. ఇదంతా చూసిన తర్వాత కూడా జగన్ ఒంటరి అని ఎవరైనా అనగలరా? మద్దతు అంటే ఒక్క ఎమ్మెల్యేలేనా!?'' అని ప్ర శ్నించారు. తద్వారా, ప్రజాప్రతినిధులను కట్టడి చేసినా తనకు వచ్చే నష్టమేమీ లేదంటూ అధిష్ఠానానికి జగన్ పరోక్ష హెచ్చరికలు చేశారని పార్టీవర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే సమయంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైఎస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్ నాయకత్వం కావాలని చెప్పడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు.

అధిష్ఠానం బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రోశయ్య సమర్థంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నారని చెప్పడమే ఇందులోని మర్మమని వారు వివరించారు. దీనికితోడు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సమర్థుడైన నా యకుడు లేడని వ్యాఖ్యానించడం ద్వారా పార్టీకి జగన్ తప్ప మరో దిక్కు లేదని చెప్పడమేనని విశ్లేషించారు. తన సందేశాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రోశయ్యే మంత్రి బాలినేనికి స్పష్టం చేసినా.. ఆయన బేఖాతరు చేయడంపై అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మరో వారం రోజుల్లో ఆయనపై వేటు పడే అవకాశం ఉందన్న కథనాలూ వచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో, తనపై వేటు తప్పదన్న అభిప్రాయానికి వచ్చినందునే మంత్రి బాలినేని పైవిధంగా వ్యాఖ్యానించారని అంటున్నారు. ఇక, జగన్ వర్గానికే చెందిన మరో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు అధిష్ఠానాన్ని ధిక్కరించేవిగానే ఉన్నాయంటున్నారు. అధిష్ఠానానికి భయపడి జగన్ వెంట ప్రజాప్రతినిధులు రావడం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఇందుకు ఉదాహరిస్తున్నారు. వాస్తవానికి, ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రకు ప్రజాప్రతినిధుల నుంచి ఈస్థాయిలో సహాయ నిరాకరణ ఎదురవుతుందని జగన్ వర్గం ఊహించలేదు.

జిల్లాలో ద్వితీయ శ్రేణి నేతల ద్వారా ఒత్తిడి పెంచితే ఎమ్మెల్యేలు దిగివస్తారని, జగన్ యాత్రలో పాల్గొంటారని ఊహించారు. కానీ, అధిష్ఠానాన్ని తక్కువగా అంచనా వేస్తూ ఈ తరహా వ్యూహాలను అమలు చేసినా ఫలించలేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఒక బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలో అధిష్ఠానం మాట జవదాటి ప్రజాప్రతినిధులు పాల్గొంటారేమోనని కొందరు భావించారు. ఈ జిల్లా యాత్రపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరూ ఉత్కంఠతో చూశారు. అయితే అధిష్ఠానం గీసిన లక్ష్మణ రేఖను దాటకుండా ప్రజాప్రతినిధులు ఉన్నారు.

దీంతో మిగిలిన జిల్లాల్లోనూ ప్రధానంగా, పొరుగున ఉన్న నెల్లూరు జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఒక మార్గదర్శకాన్ని చూపినట్లయిందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే ఒరవడి నెల్లూరు జిల్లాలోనూ కొనసాగుతుందని చెబుతున్నాయి. దీనికితోడు, జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న వారు ఎవరు? వారు ఎక్కడెక్కడ నుంచి వాహనాలను తరలించారు? వాటిని ఎవరు బుక్ చేశారు? తదితర సమాచారాన్ని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అధిష్ఠానం తెప్పించుకుంటోంది. అలాగే, తన మాటను ధిక్కరించే వారిపై చర్యలకు కూడా అధిష్ఠానం రంగం సిద్ధం చేస్తోందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

రాష్ట్ర పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న అధిష్ఠానం త్వరలోనే తన నిర్ణయాలకు పదునుపెట్టే అవకాశం ఉందని వివరించాయి. మొత్తానికి అధిష్ఠానానిదే పైచేయిగా కనిపిస్తుండడంతో జగన్ వర్గం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీనిప్రభావం వారి ప్రకటనల ద్వారా బహిర్గతమవుతోంది. అధిష్ఠానం కూడా ఇదే కోరుకుంటోందని, జగన్ వర్గం అసహనమే ఢిల్లీకి ఆయుధంగా మారుతుందని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. మొత్తానికి ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్ర నేపథ్యంలో జగన్ బలమేమిటో, అధిష్ఠానం శక్తియుక్తులేమిటో తేటతెల్లమయ్యాయని చెప్పారు.

ఇకముందు అధిష్ఠానం మాటను జవదాటే అవకాశం తగ్గుతుందని, ఇది జగన్ వర్గంలో కలవరం పుట్టిస్తోందని.. ఫలితంగా అధిష్ఠానంపై విమర్శలు గుప్పించడం మొదలైందని వివరించారు. వీటి ఫలితం ఏవిధంగా ఉంటుందో త్వరలోనే అధిష్ఠానం స్పష్టం చేస్తుందని ఆయన తెలిపారు. అధిష్ఠానం కూడా సందర్భోచితంగా వ్యవహరిస్తుందని, మరో వారం రోజుల్లో చోటుచేసుకోనున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా ఉంటాయని చెప్పారు.

Saturday, September 4, 2010

పదవిస్తారా పంపిస్తారా!: కడప ఎంపీ వైఎస్ జగన్ కు షోకాజ్‌ ?

ముఖ్యమంత్రిని చేయడమో, బయటకు పంపడమో!
అదిష్ఠానం ముందు రెండే దారులు...
దేనికైనా సిద్ధం
ఓదార్పపై మరో మాట లేదు..
సన్నిహితులకు జగన్ స్పష్టీకరణ
ఆర్భాటంగా 'ప్రకాశం ఓదార్పు'.. 250 వాహనాలతో కదిలిన కడప ఎంపీ
'కాబోయే సీఎం' నినాదాల జోరు...
8 మంది ఎమ్మెల్యేలు యాత్రకు దూరం
పీసీసీ నివేదిక కోరిన అదిష్ఠానం?.. దాని ద్వారానే చర్య
'ఒకటి నన్ను సీఎంను చేయడం! రెండు... పార్టీ నుంచి బయటకు పంపడం!'
కాంగ్రెస్ అధిష్ఠానానికి కడప ఎంపీ వైఎస్ జగన్ ఇచ్చిన ఆప్షన్లు ఇవి! అంతేకాదు... తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని కూడా జగన్ మోహన్ రెడ్డి తన సన్నిహితులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం...

శుక్రవారం ఇడుపులపాయ నుంచి ప్రకాశం జిల్లాకు బయలు దేరే ముందు జగన్ కొందరు సన్నిహితులతో మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణపై తన మనసులో మాట బయటపెట్టారు. ఓదార్పుపై మరో మాటకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తనకు సంబంధించి అధిష్ఠానం ముందు రెండే రెండు మార్గాలున్నాయని తెలిపారు. ఒకటి సీఎం పదవి అప్పగించడమైతే... రెండో మార్గం పార్టీ నుంచి పంపించడమని వివరించారు. పార్టీ నేతలంతా తన వెంట నడిస్తేనే మంచిదని జగన్ పేర్కొన్నట్లు తెలిసింది.

పీసీసీ ద్వారా చర్యకు శ్రీకారం?
పార్టీని ధిక్కరిస్తున్న వైఎస్ జగన్‌తోపాటు మరికొందరు పార్టీ నేతలపై పీసీసీ నుంచి నివేదిక తెప్పించుకున్న తర్వాత చర్య తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. జగన్ వైఖరితోపాటు ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న నేతల గురించి నివేదిక ఇవ్వాల్సిందిగా అధిష్ఠానం పీసీసీని కోరినట్లు సమాచారం. ఢిల్లీలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో జగన్ విషయమై పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అధిష్ఠానం కూడా ఒక పథకం ప్రకారం జగన్‌పై చర్యకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్ర పూర్తయిన తర్వాతే ఇతర ప్రాంతాల్లో పర్యటించే విషయం పరిశీలిస్తానని జగన్ వీరప్ప మొయిలీకి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం చర్య తీసుకోకుండా కొద్ది కాలం ఆగితే... బలం పుంజుకోవచ్చని జగన్ ఈ ఎత్తుగడ వేశారని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ అధిష్ఠానం ప్రదర్శించిన మౌనం వల్ల ఏదైనా కీడు జరిగిందో లేదో తెలియదని, ఇక ముందు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే మాత్రం పార్టీకి ప్రమాదమని రాష్ట్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.

అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటున్న ప్రజా ప్రతినిధులపై జగన్ వర్గం నుంచి ఒత్తిడి పెరుగుతోందని.. ఈ సమయంలో అధిష్ఠానం ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించకపోతే.. తమకు రాజకీయంగా నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే... అధిష్ఠానం ఇప్పటికే దీనిపై వ్యూహ రచన చేస్తోందని.. తన వైఖరిని వెల్లడిస్తుందని మరికొందరు నేతలు అంటున్నారు.

250 వాహనాలతో ఓదార్పు 'యాత్ర'
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ హితోక్తులు జగన్‌ను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయని స్పష్టమైపోయింది. ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రను జగన్ గతంలోకంటే అట్టహాసంగా ప్రారంభించారు. జగన్‌తోపాటు ఇడుపులపాయ నుంచి 250కి పైగా వాహనాలు కదిలాయి. ముందుకు కదిలేకొద్దీ వాహనాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో.. వీటి సంఖ్య 750 వరకూ చేరిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ వాహనాల్లోని వారి సంఖ్యే 3750 మంది వరకూ ఉంటుందని చెబుతున్నారు. స్థానికంగానూ భారీగానే జన సమీకరణ జరిగినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలు దూరం
అధిష్ఠానం ఆదేశాలు కచ్చితంగా తెలిసిన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన వైఖరిని బయటపెట్టారు. తొలి రోజు యాత్రలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, దర్శి ఎమ్మెల్యే శివప్రసాద రెడ్డి మాత్రమే యాత్రలో పాల్గొన్నారు. మిగిలిన 8 మంది... దగ్గుబాటి వెంకటేశ్వర రావు (పర్చూరు), ఎ.సురేశ్ (ఎర్రగొండపాలెం), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), ఆమంచి కృష్ణ మోహన్ (చీరాల), బీఎన్ విజయకుమార్ (సంతనూతలపాడు), మహీధర్ రెడ్డి (కందుకూరు), జీవీ శేషు (కొండెపి), ఉగ్ర నరసింహారెడ్డి (కనిగిరి) ఓదార్పు యాత్రకు దూరంగా ఉన్నారు. అధిష్ఠానంతో నేరుగా భేటీ అయినందున ప్రకాశం జిల్లాలో మెజారిటీ ప్రజా ప్రతినిధులు ఓదార్పు యాత్రకు దూరంగా ఉంటారని జగన్ వర్గం ముందే ఓ అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ ఏ జిల్లాలోనూ జరగనంత జన సమీకరణ ఈ జిల్లాలో జరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు.

సొంత బాటే..
జగన్ తన ప్రసంగంలో ఎప్పట్లాగానే అధిష్ఠానం ప్రస్తావన తీసుకురాలేదు. అధిష్ఠానం స్వయంగా ప్రకటించిన 'ఓదార్పు' గురించి కూడా మాట్లాడలేదు. ఫ్లెక్సీలలో సోనియా ఫొటోలు కనిపించలేదు. జగన్ కూడా తన ప్రసంగాల్లో సోనియా మాటెత్తలేదు. 'కాబోయే సీఎం జగన్' అనే నినాదాలు గతంలోకంటే ఎక్కువగా మిన్నంటాయి. జగన్ ఈ నినాదాలను ఆపే ప్రయత్నం చేయలేదు. 
జగన్‌కు షోకాజ్‌ ?
jagan--odaru
కడప ఎంపీ వైఎస్‌ జగ న్మోహన్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు జారీ చేసేందుకు ఏఐసీసీ లో రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో అతనికి నోటీసు ఇచ్చే అవకాశాలున్నట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం. అధిష్ఠానం ఆదేశాలను సైతం ధిక్క రిస్తూ జగన్‌ ఓదార్పు యాత్రకు బయలు దేరడంపై ఢిల్లీలో పార్టీ పెద్దలు, ప్రధానంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహా రాల ఇన్‌చార్జీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ఓదార్పుకు వెళ్ళొద్దని స్వయంగా నచ్చజెప్పినా వినకుండా జగన్‌ యాత్రకు బయలు దేరాడు. దీంతో హైకమాండ్‌ ఇక అతని విషయంలో ఏ మాత్రం ఉపేక్షించడం మంచిది కాద నే నిర్ణయానికి వచ్చినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.

రెండు, మూడు రోజుల్లో జగన్‌పై వేటు వేయడం ఖాయ మని హస్తిన వాతావరణం ద్వారా స్పష్టమవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ ఎ.ె .ఆంటోని, సభ్యులు మోతీలాల్‌వోరా తదితరులు రెండు రోజుల్లో సమావేశమై జగన్‌ పై వేటు వేసే విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దాని కంటే ముందు పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌, రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్‌ నేతల అభిప్రాయాన్ని కూడా పార్టీ తెలుసుకుంటుందని వినిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, శాసన సభలో పార్టీ నేత, మంత్రి జె.గీతారెడ్డి 24 గంటలు గడవక ముందే శుక్రవారం మరో సారి ఢిల్లీ బయలు దేరి వెళ్ళారు. నాలుగవ సారి పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఎన్నికైనందుకు ఆమెకు అభినందనలు తెలియ జేసేందుకు వీరు ఢిల్లీ వెళ్ళినట్లు బయటికి చెబుతున్నప్పటికీ, అసలు జగన్‌పై చర్యలు తీసుకునే విషయంలో చర్చించేందుకే వారిని పార్టీ హైకమాండ్‌ హుటా హుటిన పిలిపించినట్లు ఎఐసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఓదార్పు యాత్ర పట్ల అధినేత్రి అగ్రహంతో ఉన్నారని, వైఎస్‌ బాధితులను పార్టీ పరంగా ఓదార్చి ఆర్ధిక సహాయం అందజేస్తామని ప్రకటించినందున ఇక ఓదార్పు యాత్ర మానుకోవాలని గురువారం ఇడుపుల పాయలో వైఎస్‌ వర్ధంతిలో పాల్గొనేందుకు ఎఐసీసీ దూతగా వచ్చిన మొయిలీ జగన్‌కు నచ్చజెప్పారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్లు సైతం అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జగన్‌కు హితవు పలికారు. పార్టీ అధినేత్రి సోనియా వ్యతి రేకంగా ఉన్నా, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీ మొయిలీ వద్దని వారించినా వినిపించుకో కుండా జగన్‌ శుక్రవారం ఉదయం నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర కు బయలు దేరారు. ఎఐసీసీ నేతలు జగన్‌ వద్దకు మొయిలీ రూపంలో రాయ బారం పంపించినా ఫలితం లేక పోవడంతో ఇక అతనిపై చర్యలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర ద్వారా బలప్రదర్శనకు జగన్‌ సిద్ధం కావడంతో హైకమాండ్‌ అతనిపై సీరియస్‌గా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

నేడు డిఎస్‌, గీతాతో భేటి కానున్న సోనియా

పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నిక కావడంతో అభినందనలు తెలియజేయడానికి వచ్చే పార్టీ నేతలతో శుక్రవారం బిజీ బిజీగా ఉన్న సోనియా శనివారం నుంచి రాష్ట్రాల వారిగా పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు ఎఐసీసీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షురాలిగా గెలిచిన తరువాత ఆయా రాష్ట్రాల పీసీసీ అధ్య క్షులు, ముఖ్యమంత్రులు, సిఎల్పీ నేతలతో సోనియా సమావేశం కావడం సంప్రదాయంగా వస్తుంది. అందులో భాగంగానే శనివారం పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, గీతారెడ్డిలతో సోనియా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జగన్‌ వ్యవహారం, రోశయ్య ఆరోగ్య పరిస్థితులు వంటి ఆంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జగన్‌పై చర్యలు తీసు కుంటే రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు ఎలా ఉంటాయి? తదితర విషయాలను చర్చించే అవకాశం ఉన్నట్లు ఎఐసీసీవర్గాల ద్వారా తెలు స్తోంది. రాష్ట్ర నేతలు సోనియాకు సమర్పించే నివేదిక ద్వారా ఎఐసీసీ క్రమశిక్షణ సంఘం జగన్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేసే అవకాశాలుంటాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Thursday, September 2, 2010

ఇక ఫైనల్స్ * ఓదార్పు ఆపేందుకు జగన్ ససేమిరా * ఫలించని మొయిలీ రాయబారం * యువనేత ససేమిరా !

నా కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.. నేతలూ నాతో వస్తేనే మంచిది
యాత్రతో పార్టీకి ప్రయోజనమే.. మొయిలీకి కడప ఎంపీ స్పష్టీకరణ
ప్రకాశం టూరు తర్వాత అయితే ఆలోచిస్తానని ఉద్ఘాటన
చర్యలేమీ ఉండవంటూ ఎమ్మెల్యేలకు అభయం.. యాత్రకు రప్పించే యత్నాలు
యువ ఎంపీ స్పందనపై అదిష్ఠానం ఆగ్రహం..
ఏక్షణమైనా షోకాజ్ జారీ!ఇక నా చేతుల్లో ఏమీ లేదు: మొయిలీ..
హెలిప్యాడ్ వద్ద జగన్‌తో ఆలింగనం
నేగి నుంచే ప్రకాశంలో ఓదార్పు.. గిద్దలూరు నుంచి ప్రారంభం
వైఎస్ కుటుంబం కోసం పదవి పోయినా బాధ పడను : బాలినేని
యాత్న ఆపితే సోనియాకే అవమానం : అంబటి
క్లైమాక్స్‌కు సర్వం సిద్ధమైంది. అధిష్ఠానం ఇచ్చి న ఆఖరి అవకాశాన్నీ కడప ఎంపీ జగన్ కాదన్నారు. ఓదార్పును ఆపేందుకు ససేమిరా అనేశారు. అధిష్ఠానం దూతగా ఇడుపులపాయకు వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ వీరప్ప మొయిలీ మాటను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో ఓ దార్పు యాత్రను ప్రారంభించి తీ రుతానని జగన్ స్పష్టంచేశారు. మాట తప్పడం.. మడమ తిప్పడం తమ ఇంటా వంటా లేదంటూ తెగేసి చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు తన యాత్రలో పాల్గొంటేనే మంచిదంటూ.. పార్టీ యావత్తూ తన బాటలోకే రావాలని పరోక్షంగా సూచించారు.

కావాలంటే ఆ తర్వాత పార్టీతో కలిసి ఓదార్పులో పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తానంటూ ముక్తాయించారు. పైగా తన ఓదార్పుతో పార్టీకి ప్రయోజనమేనంటూ సూత్రీకరించారు. ఇప్పటిదాకా యాత్రలో పాల్గొన్న వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోని విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రకాశం,నెల్లూరు జిల్లా నేతలను యాత్రకు రప్పించేందుకు జగన్ వర్గం ప్రయత్నాలు ప్రారంభించడం మరో కీలకాంశం.

మొత్తానికి జగన్ స్పందన అధిష్ఠానానికి తీవ్ర ఆగ్రహం కలిగించినట్టు తెలిసింది.ఎంత చెప్పినా జగన్ వినిపించుకోకపోవడంతో.. 'ఐ యామ్ హెల్ప్‌లెస్. ఇక నా చేతుల్లో ఏమీ లేదు' అంటూ, వీరప్ప మొయిలీ నిట్టూర్చారు. జగన్‌ను ఒక్కసారి గట్టిగా ఆలింగనం చేసుకొని హెలికాప్టర్‌లో బెంగళూరు బయల్దేరి వెళ్లిపోయారు. ఇదీ గురువారంనాటి సీన్. ఇక అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరం. యాత్ర ప్రారంభిస్తే ఏ క్షణమైనా షోకాజ్ ఇచ్చేందుకు అది సిద్ధమవుతోందన్నది తాజా సమాచారం! 
యువనేత ససేమిరా !
Jagan-yuva
అధిష్ఠానం మాట వినకుండా సొంత దారిలో వెళుతున్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌కు నచ్చచెప్పి, పార్టీ దారిలో తెచ్చుకునేందుకు అధిష్ఠానం వీరప్ప మొయిలీ ద్వారా పంపిన రాజీ సూత్రాన్ని జగన్‌ తిరస్కరించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్రమంత్రి వీరప్పమొయిలీ గురువారం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపుల పాయకు వచ్చి వైఎస్‌ సమాధి వద్ద నివాళులర్పిం చారు. ఆ తర్వాత జగన్‌, ఆయన తల్లి ఎమ్మెల్యే విజయలక్ష్మితో పావుగంట సేపు చర్చలు జరిపారు. మొయిలీ మాట్లాడుతున్నప్పుడు జగన్‌ మధ్యలో ఎక్కడా అడ్డుపడకుండా మౌనంగా విన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం... తాను సోనియాగాంధీ దూతగానే ఇక్కడికి వచ్చానని, మీ కుటుంబంపై సోనియాకు అభిమానం ఉన్నం దుకే ఆమె తనను హైదరాబాద్‌లో జరిగే అధి కారిక కార్యక్రమానికి కాకుండా, వైఎస్‌ కుటుం బం అమితంగా ప్రేమించే ఇడుపులపాయకు పంపిస్తే వచ్చానని మొయిలీవివరించారు. వైఎస్‌ కాంగ్రెస్‌ పార్టీకి చేసిన సేవలను సోనియాగాంధీ ఇప్పటికీ ప్రస్తావిస్తుంటారని, కానీ జగన్‌ వ్యవహారశైలి ఆమెలో ఉన్న ఆ సానుభూతి స్థానంలో ఆగ్రహానికి కారణమవుతోందని వారికి స్పష్టం చేశారు. తాను వద్దన్నా వినకుండా ఓదార్పు యాత్రకు వెళ్లడాన్ని ఆమె సహించలేకపోతున్నారని, అదీగాకుండా జగన్‌ తన యాత్రలో ఎక్కడా పార్టీ పేరు ప్రస్తావించ కుండా, రాజకీయ అంశాలు ప్రస్తావించడంపై సోనియా ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఎంతో భవిష్యత్తు ఉన్న జగన్‌ ఈవిధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో విచారించి, నచ్చచెప్పి సరైన దారిలో వెళ్లేలా చూడాలని తనను ఆదేశించినట్లు వారికి వివరించారు.

amma
ఓదార్పు యాత్రలో సోనియాగాంధీ, పార్టీ పేరు, వైఎస్‌కు పార్టీ ఇచ్చిన అవకాశాలను ప్రస్తావించడం ద్వారా సోనియా ఆగ్రహాన్ని చల్లార్చాలని మొయిలీ సూచించారు. పార్టీకి విధేయత ప్రకటించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తును కాపాడుకోవాలని జగన్‌కు సలహా ఇచ్చారు. మీకు మద్దతుదారుగా ఉన్నట్లు తనపై కూడా దుష్ర్పచారం జరుగుతోందని మొయిలీ వాపోయారు. ప్రస్తుతం పార్టీలో మీకు వ్యతిరేక వాతావరణం ఉందని, దానిని విధేయ వైఖరితో సానుకూలంగా మార్చుకోవాలని సలహా ఇచ్చారు. ఒకవేళ కాదని, ఓదార్పు యాత్రకు వెళితే అధిష్ఠానం చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో ఉందని, క్రమశిక్షణ కమిటీ కూడా కేవలం మీ యాత్ర, అందులో మీరు అనుసరించే వ్యవహారశైలి కోసమే ఎదురుచూస్తోం దని స్పష్టం చేశారు. అయితే, తాను పార్టీపై తిరుగుబాటు చేయడం లేదని, ఓదార్పు యాత్రకు వస్తానని తన తండ్రి మృతి చెందిన రోజు నల్లకాలువ వద్ద ప్రకటించిన విషయాన్ని జగన్‌ ఆయన వద్ద గుర్తు చేశారు.

పార్టీ కార్యకర్తలు మృతి చెందిన సమయంలో వారిని పరామర్శించడం తప్పెలా అవుతుందని, దానిని నాయకత్వం కూడా తన ప్రత్యర్థుల మాటలు విని తనను అణచివేసే విధంగా వ్యవహరించడం సరైంది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం కూడా పోటీ ఓదార్పు యాత్రను ప్రారంభించడాన్ని జగన్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలకు అన్నీ తెలుసు అని మాత్రమే వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రోశయ్య తనను అణచివేయడమే పనిగా పెట్టుకున్నారని, తన ప్రత్యర్థులు ప్రతిరోజూ ఆయనను కలుస్తున్నారని, సీఎంను కలిసిన తర్వాత వారు తనపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారని, మళ్లీ సీఎంను కలుసుస్తున్నారని ఫిర్యాదు చేశారు. తన యాత్రకు వెళ్లవద్దని ఎమ్మెల్యేలకు స్వయంగా ఫోన్లు చేయటంపెద్ద మనిషి లక్షణమా అని అసహనంతో ప్రశ్నించారు.

ఇప్పటికే నాలుగు జిల్లాల్లో ఓదార్పు యాత్ర పూర్తి చేసినందున, మిగిలిన జిల్లాల్లో కూడా పర్యటించి, బాధిత కుటుంబాలను ఓదార్చ వలసిన బాధ్యత తనపై ఉందన్నారు. మడమ తిప్పని యోధుడిగా పేరున్న రాజశేఖరరెడ్డి తనయుడిగా ఇచ్చిన మాట నెరవేర్చడం తన ధర్మమని వాదించారు. ఓదార్పు రాజకీయాలతో సంబంధం లేని యాత్ర అని, తాను వెళ్లేది ఖాయమని తేల్చిచెప్పారు. ‘మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు సహకరించండి. నేను ఓదార్పు తర్వాత పార్టీ అధ్యక్షురాలిని వచ్చి కలుస్తా. ఆలోగా మీరు చర్యలు తీసుకోవాలంటే మీ ఇష్టం. నేను అన్ని ంటికీ సిద్ధమయ్యే ఉన్నా. మీరు వ్యక్తిగతంగా నాపై చూపిన అభిమానానికి, మా కుటుంబంపై చూపిన ప్రేమకు కృతజ్ఞత’లని జగన్‌ చెప్పారు. ఆ తర్వాత మొయిలీ వెళ్లే సమయంలో వారిద్దరూ ఆలింగం చేసుకున్నారు.