జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Sunday, March 13, 2011

జగమొండి ..... జగన్‌

YS-Jaganసినిమాలో సీతయ్యే కాదు. నిజ జీవితంలో మన జగనయ్య కూడా ఎవరి మాటా వినడని తేలిపోయింది. కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేసి, తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలన్న పట్టుదలతో శనివారం తన ఇడుపులపాయ ఎస్టేట్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఊపిరిపోసిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏకపాత్రాభినయ ప్రదర్శన చూసిన ఆయన సహ చరులు, అనుచరుల నుంచి సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే వినిపించడం విస్మయం కలిగిస్తోంది. పార్టీ పేరు, జెండా ప్రదర్శన అంతా కుటుంబానికే పరిమితమయింది. జగన్‌ పోకడ పరిశీలిస్తే.. ఆయన పార్టీపెట్టకముందునుంచే ఒంటెత్తు పోకడ అనుస రిస్తున్నారన్న అభిప్రాయం జగన్‌ చుట్టూ ఉన్న నేతల్లోనే మొదలు కావడం భవిష్యత్తు పరిణా మాలు ఇంకెలా ఉంటాయన్న అంశంపై అప్పుడే చర్చకు తెరలేచింది.

తన అభిమానులు, సహచ రులు, అనుచరుల సమక్షంలో పార్టీ పేరు ప్రకటిం చిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీరు ప్రారంభంలోనే విమర్శల పాలవుతోంది. నిజానికి జగన్‌ పార్టీ పేరును ఈనెల 20 తర్వాత ప్రకటిస్తారని ఆయన సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, రవీంద్ర నాధ్‌రెడ్డి, అంబటి రాంబాబు, గట్టు రామచంద్ర రావు వంటి నేతలు పలు సందర్భాల్లో మీడియాకు వెల్లడించారు. అయితే, హటాత్తుగా తూర్పుగోదా వరి జిల్లా జగ్గంపేటలో ఏర్పాటుచేసిన బహిరం గసభ వేదికపై తాను శనివారం వైఎస్‌ఆర్‌ పార్టీ పేరు ప్రకటించబోతున్నట్లు జగన్‌ చేసిన ప్రకటన ఆయన చుట్టూ రోజూ ప్రద ణలు చేసేవారిని విస్మయం కలిగించింది.

దీనితో.. జగన్‌కు సలహాదారులుగా ప్రచారంలో ఉన్న వారికి బయట జనంలో ఉన్న ఇమేజ్‌ పోయింది. చివరకు జగన్‌ వారికి సైతం తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటారని, ఆయన చుట్టూ ఉన్న వాళ్లంతా డమ్మీలేనన్న ప్రచారం మొదలయింది.పార్టీ పేరు ఎప్పుడు ప్రకటించాలన్న అంశంపై కనీసం తమతో మాటమాత్రం కూడా చర్చించకుండా హటాత్తుగా ఏక పక్ష నిర్ణయం తీసుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

జగన్‌ ఎవరిమాటా వినరని, తనకు తోచిందే చేస్తారని, తనకు అన్నీ తెలుసునని భావిస్తుంటారని, తనకు ఎవరు ఎదురుచెప్పినా సహించే అలవాటు లేదన్న ప్రచారం ఇప్పటికే జగన్‌ శిబిరంలోను, ఆయన గురించి బాగా తెలిసిన వర్గాల్లోనూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇలాంటి వ్యాఖ్యల్ని ఇప్పటివరకూ కొట్టిపారేస్తూ వచ్చిన జగన్‌ సహచరులు.. ఇప్పుడు సరిగ్గా అలాంటి చేదు అనుభవం త మకే ఎదురుకావడంతో బిత్తరపోవలసి వచ్చింది. ఫలితంగా ఇప్పుడే ఇక ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకెన్ని ఏకపక్ష నిర్ణయాలను వినవ లసి వస్తుందోనన్న ఆందోళన జగన్‌ శిబిరంలో మొదలయింది.

జగన్‌కు జనంలో బలం ఉందని, ఆయన పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్‌,తెలుగుదేశం పార్టీల నుంచి తామరతంపరగా నేతలు వస్తారన్న అంచనాతో చాలామంది కాంగ్రెస్‌ పెద్ద నేతలు ఆ పార్టీని వీడి జగన్‌ గూటికి చేరారు. మరికొందరు జగన్‌ పార్టీ పెట్టిన తర్వాత అందులో చేరదామన్న యోచనలో ఉన్నారు. ఇప్పుడు జగన్‌ మాత్రం తమతో మాట మాత్రం కూడా చర్చించకుండా, పార్టీ ప్రకటన తేదీని హటాత్తుగా ప్రకటించడంపై వారిలో భవిష్యత్తుకు సంబంధించిన బెంగ అప్పుడే మొదలవడం ప్రస్తావనార్హం. ఇది జగన్‌ పెట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ భవిష్యత్తుకు ఒక ప్రమాద సంకేతంలా కనిపిస్తోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో జగన్‌ తీసుకున్న ఒంటెత్తు నిర్ణయాలు పరిశీలిస్తే... ఆయన తన సహచరులను ఏ మాత్రం విశ్వాసంలోకి తీసుకోవడం లేదన్న వాస్తవం వెల్లడవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తన సహచరులను జగన్‌ నమ్మడం లేదన్న సంకేతాలు ఇడుపుల పాయ వ్యవహారం స్పష్టం చేస్తోందంటున్నారు. ‘నాయకుడనేవాడు అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలి. కానీ సొంతంగా నిర్ణయాలు తీసు కుని దానిని ప్రకటించడం ఏకపక్షమవుతుంది. దానివల్ల తమ నాయకుడు ఎవరినీ నమ్మరన్న సంకేతాలు వెళతాయి.

అది భవిష్యత్తులో మాకు మాత్రమే కాదు. వ్యక్తిగతంగా జగన్‌కూ నష్టమే. భవిష్యత్తులో పార్టీ టికెట్లు, ఇతర నిర్ణయాలు కూడా తమను సంప్రదించకుండా జగన్‌ ఒక్కరే తీసుకుంటారన్న అభిప్రాయం బలపడుతుంది. దీనివల్ల ఇతర పార్టీల నేతలు మా పార్టీలో చేరడానికి వెనుకంజ వేస్తార’ని జగన్‌కు సన్ని హితంగా వ్యవహరించే ఓ నేత వ్యాఖ్యానించారు. ఈ విషయంలో చంద్రబాబునాయుడు విధానాన్ని గుర్తు చేస్తున్నారు. ఒక అంశంపై చంద్రబాబు నాయుడు అనేక స్థాయుల్లో చర్చిస్తారని, చివరకు తాను అనుకున్నది చేసినప్పటికీ, దానిని మిగిలిన వారితో చర్చించే అలవాటు ఆయనకు ఉందని వివరిస్తున్నారు. దానివల్ల మిగిలిన నేతల్లో తమ నేత అందరితోనూ చర్చించి నిర్ణయం తీసుకుం టారన్న సానుకూల వాతావరణం ఏర్పడుతుం దంటున్నారు.

జగన్‌ చెబుతున్నట్లు.. ఎన్నికల కోడ్‌ నిబంధనలు అడ్డువస్తున్నందుకే హడావిడిగా పార్టీ పేరు ప్రకటించినప్పటికీ.. జగ్గంపేటలో కాకుండా ముందే తమతో చర్చించి ప్రకటించి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. దానివల్ల తాము కూడా సంతోషించేవాళ్లమని, తమ నేత తమను సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారని భావించేవాళ్లమని వివరిస్తున్నారు.ఇప్పటికే జగన్‌ వ్యవహారశైలి తెలిసిన వారు.. ఆయన ఎవరిమాట వినడని, తనకు ఎదురుచెబితే సహించరని, ఆవేశపరుడని, తాను చెప్పిందే వినాలన్న ధోరణితో ఉంటారన్న ప్రచారాన్ని ఏకపక్షంగా చేసిన పార్టీ ప్రకటన వ్యవహారం నిజం చేసినట్టయిందని ఆయన సన్నిహితులు వాపోతున్నారు.

Saturday, January 8, 2011

ఎంపిలను మనమిస్తే ప్రగతి వేరే రాష్ట్రాలకా? * ఎన్నాళ్లీ వివక్ష?

కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జగన్
ఇదెక్కడి న్యాయమని అడిగే నాథుడే లేడా?
వరదలో మునిగేది మనం.. మిగులు జలాలు వాళ్లకా?
65 శాతమే నీటి లభ్యతను తీసుకున్నా అడిగేవారేరీ?
పైన 100 టీఎంసీలు జలవిద్యుత్తుకు వాడుకుని సముద్రానికి మళ్లిస్తారా?
మనం రైలు అడిగితే బీహార్‌కో, బెంగాల్‌కో ఇస్తారు..
వ్యవసాయంలో నష్టం జరిగిందంటే ఆ శాఖ మంత్రి దగ్గరికి వెళ్లాలి... ఆయనేమో వేరే రాష్ట్రానికి చెందినవారు.. మనకు ప్రాధాన్యత ఇవ్వరు..



రాష్ట్రంపై వివక్ష ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఎంపీలను మనమివ్వాలి.. ప్రగతి మాత్రం వేరే రాష్ట్రాలకా? అంటూ దుయ్యబట్టారు. విశాఖ జిల్లాలో ఆరో రోజు ఓదార్పు యాత్రలో భాగంగా శనివారం రాత్రి కోటవురట్లలో పెద్ద ఎత్తున తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ‘ఒక పక్క దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల సువర్ణ పాలన చూశాం. ఆ తరువాత వైఎస్ రెండోసారి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించాక వంద రోజుల్లోనే మన మధ్య నుంచి వెళ్లిపోయారు. ఆయన లేని ఈ సమయంలో ఏం జరుగుతోందో ఒక్కసారి చూడండి. రెండేళ్లు కావస్తోంది. ఒక్క కొత్త రేషన్ కార్డూ ఇవ్వరు. ఒక్క కొత్త ఇల్లూ ఇవ్వరు. ఒక్క కొత్త పెన్షనూ ఇవ్వరు. అటువైపు చూస్తే పోలవరం ఆగిపోయింది. ఇటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి ఆలోచించిన నాథుడే లేడు. మరోవైపు కృష్ణా నదిలో మన నీటిని కట్టడి చేసే పరిస్థితి వస్తే అడిగే నాథుడే లేడు. ఆనాడు బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యతను ఆధారంగా తీసుకుంటే.. నేడు 65 శాతానికి కుదించి, మిగులు జలాల్లో వాటాను ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తుంటే.. ఇతర రాష్ట్రాల ప్రాజెక్టుల ఎత్తు పెంచుకునేందుకు అనుమతి ఇస్తుంటే అడిగే నాథుడే లేకపోతే రైతుల పరిస్థితి ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. కృష్ణా నదికి వరద వస్తే మనల్ని ముంచుతుంది. కానీ మిగులు జలాల్లో మిగిలిన రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని అంటుంటే.. ఇది అన్యాయం అని అడిగే నాథుడే లేడు.

ఒకవైపు నీటికోసం యుద్ధాలు జరుగుతున్నాయి. మహారాష్టల్రో కొయినా జలవిద్యుత్తు ప్రాజెక్టు కోసం 100 టీఎంసీలను వాడుకొని కిందికి రావాల్సిన నీటిని అటు పక్క సముద్రంలోకి వదిలిపెడితే ఇదేం న్యాయం అని అడిగే నాథుడే లేడు. ఇలా ఉంది మన పరిస్థితి. 33 మంది ఎంపీలను పంపిస్తే.. ఒక్క రైలు అడిగితే దాన్ని బీహార్‌కో.. బెంగాల్‌కో తీసుకెళతారు.. కానీ మన రాష్ట్రానికి రాదు. వ్యవసాయంలో నష్టపోయాం.. సాయం కావాలంటే వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి వెళ్లమంటారు. ఆయన ఏ మహారాష్టక్రో చెందినవారై ఉంటారు. మనకు ప్రాధాన్యం దక్కదు. ఎంపీలను మనమివ్వాలి.. ప్రగతి వేరే రాష్ట్రాలకా? ఇదేమి న్యాయం అని అడిగే నాథుడే లేడు. .’ అని జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఆకాశం వైపు చూస్తూ దేవుడా.. వైఎస్‌ను మళ్లీ పంపమని ప్రార్థిస్తున్నారు..’ అని పేర్కొన్నారు.

రైతులను మోసం చేసిన ప్రభుత్వం..

ఉదయం మన్యపురట్లలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం యువనేత మాట్లాడుతూ ‘ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. రైతు బాగుండాలని ఏడు గంటల కరెంటును తొమ్మిది గంటలకు పెంచుతామని వైఎస్ హామీ ఇచ్చి ప్రభుత్వాన్ని తెస్తే... దగ్గర దగ్గర రెండేళ్లయింది.. రైతులు ఏమైంది మా కరెంటు అని అడుగుతున్నారు. పేదలు బాగుండాలని 20 కిలోల బియ్యాన్ని 30 కిలోలకు పెంచుతామని వైఎస్ మాట ఇస్తే.. ఇప్పటి పాలకులు ఆ హామీని గాలికొదిలేశారు. ఎన్నికలయిపోయాయి కదా.. మోసం చేయొచ్చు.. మళ్లీ ఎన్నికలప్పుడు చూసుకోవచ్చు అని అనుకుంటున్నారు..’ అని విమర్శించారు.

ఏ సమస్యనూ తీర్చే పరిస్థితి లేదు: బాబూరావు

కోటవురట్ల సభలో పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావు మాట్లాడుతూ ‘వైఎస్ అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ మళ్లీ అమలు కావాలంటే యువనేతే ఆశాజ్యోతి. ప్రభుత్వం ఏ సమస్యల్నీ కూడా తీర్చే పరిస్థితి లేదు..’ అని పేర్కొన్నారు.

Thursday, January 6, 2011

చిన్నపల్లెలు పెద్దమనసుతో.. * మేమున్నామంటూ జగన్‌కు బాసట

ఏకమై ఎదురేగుతున్న ప్రజలు
దేవుడా.. మళ్లీ వైఎస్‌ను పంపండని జనం అంటున్నారు: యువనేత


అన్నీ చిన్న చిన్న పల్లెలే. కానీ మనసు పెద్దది. మహానేత మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన అభిమానుల కుటుంబాలను ఓదార్చేందుకు యువనేత జగన్ వస్తున్నాడన్న సమాచారం అందుకున్న పల్లెలన్నీ ఏకమై స్వాగతం పలుకుతున్నాయి. గురువారం విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధిలో సాగిన నాలుగో రోజు ఓదార్పు యాత్ర మార్గంలో ఒక్క పట్టణం కూడా లేకపోయినా.. పల్లెలన్నీ పట్టణాలను తలపించాయి. ఉదయం 10 గంటలకు చోడవరం నుంచి బయలుదేరిన జగన్.. తొలుత బుచ్చయ్యపేట మండలం రాజాం జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించి స్థానికుల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. 11.40కి తురకలపూడిలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత కరక జంక్షన్‌లో, సీతయ్యపేటలో విగ్రహావిష్కరణ చేశారు. అయితే మధ్య మధ్య కొన్ని చిన్నచిన్న పల్లెల్లో విగ్రహాలు లేకపోయినా.. జనం ఆపి మాట్లాడమని పట్టుబట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గొర్రెల పాలెంలో, అనంతరం తట్టబందలో దివంగత నేత విగ్రహాలను యువనేత ఆవిష్కరించారు. అక్కడి నుంచి రెండు గంటలకు గుడ్డిప చేరుకుని విగ్ర హం ఆవిష్కరించి ప్రసంగించారు.

ప్రతి వీధీ.. జనగోదారి


తరువాత గొంప గ్రామంలో విగ్రహం ఆవిష్కరించి వస్తుండగా.. పిల్లవాని పాలెం గ్రామస్తులు మెయిన్‌రోడ్డుపై అడ్డంగా బైఠాయించి తమ గ్రామానికి రావాలని పట్టుబట్టారు. దీంతో షెడ్యూలులో లేకపోయినా ఆ గ్రామానికి వెళ్లి వచ్చారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు రావికమతం చేరుకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది మండల కేంద్రమే అయినా పట్టణాన్ని తలపించింది. ఇక్కడి కూడలి, వీధుల్లో జనం పోటెత్తారు. భారీగా వచ్చిన జనాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ ‘ఇంతపెద్ద కుటుంబాన్ని నాన్న నాకు ఇచ్చారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను..’ అని చెబుతూ సెలవు తీసుకున్నారు. రావికమతం నుంచి కొత్తకోట వరకు దారులన్నీ జనంతో పోటెత్తాయి. మేడివాడలో కార్యక్రమం లేనప్పటికీ జనం పట్టుబట్టడంతో ఆగాల్సివచ్చింది. ఆర్జాపురంలో ఇదే పునరావృతమైంది. వీటివల్ల యాత్రలో ఆలస్యం చోటుచేసుకుంది.

ఇక దొండపూడిలో రెండు విగ్రహాలు ఏర్పాటుచేయడమే కాకుండా పల్లె అంతా ఏకమై జగన్‌కు స్వాగతం పలికింది. అయితే ప్రసంగించే సమయంలో విద్యుత్తు అంతరాయం చోటుచేసుకోవడంతో జగన్ మాట్లాడలేకపోయారు. అక్కడి నుంచి 6.30కు కొత్తకోట చేరుకున్నారు. ఇక్కడ ఎం.నారాయణమూర్తి కుటుంబాన్ని ఓదార్చారు. ఇదే గ్రామంలో మూడు వైఎస్ విగ్రహాలను ఏర్పాటుచేయడం జగన్‌ను ఉద్వేగానికి లోనుచేసింది. మూడు మూడు విగ్రహాలు ఏర్పాటుచేసి వైఎస్ మా గుండెల్లోనే ఉన్నారంటూ మీరు చూపిస్తున్న ఆప్యాయతకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేనని అన్నారు.
ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు..

రాత్రి ఏడున్నరకు కొత్తకోటలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఇక్కడికి భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ‘రెండోసారి ప్రభుత్వాన్ని తెచ్చిన వైఎస్ వంద రోజుల్లోనే చనిపోయారు. తర్వాత ఏంజరిగిందో ఒక్కసారి ఆలోచించండి.. రెండోసారి అధికారంలోకి రావడానికి ముందు రెండే రెండు వాగ్దానాలు చేశారు వైఎస్. ఇరవై కిలోల బియ్యాన్ని ముప్పై కిలోలకు పెంచడం.. ఏడు గంటల కరెంటును తొమ్మిది గంటలకు పెంచడం. మాట ఇస్తే కట్టుబడి ఉండాలని వైఎస్ చెబితే.. మరి ఈ పాలకులు ఏం చేస్తున్నారో చూడండి. ప్రభుత్వం ఏర్పాటై దగ్గర దగ్గర రెండేళ్లవుతోంది.


ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా.. వైఎస్ చెప్పినట్టు బియ్యం ముప్పై కిలోలకు ఎందుకు పెంచడం లేదూ
అని అడుగుతున్నా.. ఏడు గంటల కరెంటు తొమ్మిది గంటలకు ఎందుకు పెంచడం లేదూ అని అడుగుతున్నా.. మాట ఇచ్చేది ఎన్నికల కోసమేనా? అంటే ఎన్నికల తరువాత మాటనూ, ప్రజలనూ గాలికొదిలేయవచ్చన్న భావనలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు..’ అని జగన్ ధ్వజమెత్తారు. ‘ఐదేళ్లు సువర్ణ యుగం తెచ్చిన వ్యక్తి వైఎస్ అయితే ఇవాళ పాలకులు ఎలా ఉన్నారో చూడండి. ప్రజలు ఆకాశం వైపు చూస్తున్నారు. దేవుడా.. వైఎస్‌ను మళ్లీ పంపండి అని అడుగుతున్నారు.. అంత అధ్వానంగా సాగుతోంది ప్రస్తుత పాలన’ అని జగన్ పేర్కొన్నారు.

కొత్తకోట అనంతరం భోగాపురం, రోలుగుంట, కొమరవోలు, నిండుగొండ, చెట్టుపల్లిలలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించిన యువనేత రాత్రి 11.15 గంటలకు పెద్దబొడ్డేపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్కడితో గురువారం యాత్ర పూర్తయింది. అనంతరం జగన్ 11:30కు నర్సీపట్నంలో బసచేశారు.


నారాయణమూర్తి కుటుంబానికి ఓదార్పు


వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కొత్తకోట గ్రామానికి చెందిన ముప్పిన నారాయణమూర్తి కుటుంబాన్ని యువనేత జగన్ గురువారం సాయంత్రం ఓదార్చారు. నారాయణమూర్తి భార్య కన్నమ్మ, కుమారుడు రామన్నదొర, కోడలు నాగమణి, కుమార్తె పార్వతిలను ఆయన పేరుపేరునా పలకరించారు. అమ్మను బాగా చూసుకోమని రామన్నదొరకు సూచించారు. తన కొడుక్కి ఏదైనా పని చూపించమని కోరిన కన్నమ్మకు తాను ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని కుమారుడు రామన్నదొరకు సూచించారు. ఇంతటి గొప్ప వ్యక్తి తన ఇంటికి వచ్చి తమను ఓదార్చి కొండంత ధైర్యాన్నివ్వడం ఆనందంగా ఉందని నారాయణమూర్తి కుటుంబసభ్యులు ఆనందబాష్పాలతో తెలిపారు.

జగన్ వెంటే మన్యం * 11 మండలాల్లో శ్రేణులన్నీ జగన్ వెంటే

* ఏడుగురు జెడ్పీటీసీ సభ్యులకు ఆరుగురు ఇటే
* ఏడుగురు కాంగ్రెస్ ఎంపీపీలకు గాను ఐదుగురు ఇటే
* మండల కాంగ్రెస్ అధ్యక్షులూ యువనేతవైపే..
* పాడేరు, అరకు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఖాళీ
* దద్దరిల్లిన పాడేరు, హుకుంపేట సభలు
* ఏజెన్సీలో జగన్ సాహసం.. 9 గంటల పాటు ప్రయాణం


కాంగ్రెస్ పార్టీ జగన్‌ను ఒంటరి చేయాలని చూస్తే.. విశాఖలోనూ అది తారుమారైంది. ఆ పార్టీ శ్రేణులన్నీ జగన్ వెంటే సాగుతూ కాంగ్రెస్‌కు ఇక్కడ పెద్దదిక్కయిన మంత్రి బాలరాజును ఒంటరిని చేశాయి. మూడోరోజు ఓదార్పులో భాగంగా బుధవారం ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు, అరకు నియోజకవర్గాల్లో సాగిన జగన్ యాత్రకు మన్యం మొత్తం కదలివచ్చింది. నీవెంట మేమున్నామని, కాంగ్రెస్‌నూ, పదవులనూ తామూ వదిలిపెడతామని కాంగ్రెస్ శ్రేణులంతా యాత్రకు హాజరయ్యాయి. అడవులు, కొండలోయల్లో యువనేత చేసిన ఈ సాహస యాత్రకు గిరిపుత్రులు బ్రహ్మరథం పట్టారు. జగన్‌కు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చారు. రాత్రి 10 నుంచి బాగా పెరిగిన చలి విపరీతంగా వణుకుపుట్టించినప్పటికీ జనం భారీగా వచ్చారు.
ప్రజాప్రతినిధులంతా జగన్ బాటే..
మంత్రి బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పాడేరు నియోజకవర్గంతో పాటు, అరకు నియోజకవర్గాల్లో ఉన్న 11 ఏజెన్సీ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయ్యింది. ఈ మండలాల్లో కాంగ్రెస్ హస్తగతమైన ఏడు జెడ్పీటీసీ స్థానాల్లో ఆరుగురు ఆ పార్టీకి మంగళం పలికి యువనేతకు బాసటగా నిలిచారు. ముంచింగ్ పుట్ నుంచి జెడ్పీటీసీ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీ వైస్ చైర్మన్ పద్మ, పెదబయలు జెడ్పీటీసీ సభ్యుడు కె.సూర్యనారాయణ, చింతపల్లి-కళ్యాణి, జీకేవీధి-చందర్‌రావు, అనంతగిరి-గంగన్న దొర, హుకుంపేట-చిన్ని.. జగన్ వెంట నడిచారు. ఇక కాంగ్రెస్ హస్తగతమైన ఏడు ఎంపీపీల్లో.. ముంచింగ్‌పుట్ ఎంపీపీ-కె.కాసులమ్మ, పెదబయలు-కె.లీలావతి, అనంతగిరి-వీరభద్రరాజు, జీకేవీధి-వెంకాయమ్మ, హుకుంపేట-బాలన్నలు జగన్‌కు మద్దతు పలికారు. చింతపల్లి వైస్ ఎంపీపీ కృష్ణారావు కూడా సభలకు హాజరయ్యారు. ఇక పార్టీ మండలాధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, క్రియాశీలక కార్యకర్తలంతా యువనేత వెంట నడిచారు.

పాడేరుకు తరలివచ్చిన మన్యం..
ఉదయం మాడుగుల నుంచి బయలుదేరిన జగన్ తొలుత వంట్లమామిడిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి అడవిలో, కొండల్లో 55 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇసుకగరువులో మజ్జి కొండబాబు కుటుంబాన్ని పరామర్శించారు. సమీపంలోని లింగాపుట్ గ్రామస్తుల కోరిక మేరకు వారి ఊరికెళ్లారు. మట్టిరోడ్డులో అడవిలో 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి వారిని కలిసి వారితో మాట్లాడారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు పాడేరు చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. మన్యం జనం మొత్తం ఇక్కడికి తరలిరావడంతో పాడేరు సెంటర్ జనసంద్రాన్ని తలపించింది. అక్కడి నుంచి అరకు నియోజకవర్గ పరిధిలోని హుకుంపేటకు 4 గంటలకు చేరుకుని ఇక్కడ కూడా జగన్ ప్రసంగించారు. ఇక్కడికి కూడా జనం వేలాదిగా తరలివచ్చారు. కాంగ్రెస్ శ్రేణులన్నీ ఈ సభకు తరలివచ్చాయి. తిరిగి పాడేరు ఘాట్‌రోడ్డు మీదుగా కొండ ప్రాంతం దిగేసరికి ఏడయ్యింది.

కోడూరులో విగ్రహావిష్కరణ చేశాక కె.వల్లాపురంలలో మరో విగ్రహాన్ని ఆవిష్కరించి.. మల్లారపు కొండబాబు కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత వీరవల్లి అగ్రహారం, వడ్డాది జంక్షన్, 11:00కు బంగారు మెట్టలో విగ్రహాలు ఆవిష్కరించి వెళుతుండగా చిన్నప్పన్నపాలెం గ్రామస్తులు వైఎస్ విగ్రహాన్ని రోడ్డు మీదికి తెచ్చి జగన్ చేత పూలమాలలు వేయించి తీసుకెళ్లారు. 11:35కు దిబ్బిడిలో సుతాపల్లి జగన్నాథరావు కుటుంబాన్ని ఓదార్చిన యువనేత అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి బుచ్చయ్యపేట వెళ్లారు. ఇక్కడ 12:15కు వైఎస్ విగ్రహావిష్కరణ చేసి బుధవారం యాత్ర ముగించుకుని చోడవరంలో బస చేశారు.

సాహస యాత్ర
పాడేరు వెళ్లాలంటే 38 కిలోమీటర్లు ఘాట్‌రోడ్డులో దట్టమైన అడవుల మధ్య వెళ్లాలి. నక్సల్స్ ప్రాబల్యం బాగా ఉన్న ఈ ప్రాంతం మీదుగా ప్రయాణం సాహసమే. అయితే ఈ ప్రాంతంలో జగన్ పర్యటనకు ప్రభుత్వం తగినంత భద్రతా సిబ్బందిని ఏర్పాటుచేయలేదు. 40 కిలోమీటర్ల ఘాట్‌రోడ్డులో పది కిలోమీటర్లకు ఒకచోట చొప్పున నాలుగు చోట్ల మాత్రమే భద్రతా బృందాలు కనిపించాయి. మరోవైపు జగన్ ఇసుకగరువులో ఓ కుటుంబాన్ని ఓదార్చాక.. లింగాపుట్టు వెళ్లడం ఆందోళనకలిగించింది. మట్టిరోడ్డు, దట్టమైన అడవి ఉన్నా జగన్ వెళ్లి వారి బాధలు తెలుసుకున్నారు. తిరిగి పాడేరు చేరేవరకు జనంలో, శ్రేణుల్లో ఆందోళనే. ఓవైపు చీకటి, ఓవైపు భద్రతాసిబ్బంది లేమి మధ్య జగన్ సాహసోపేతమైన యాత్ర పూర్తిచేశారు.

మన్యం దైన్యంపై చలించిన జగన్

పాడేరు రూరల్, న్యూస్‌లైన్: ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ బుధవారం ఇసుకగరువులో ఓ కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా.. లింగాపుట్టులో డయేరియాతో మరణించిన కొండపల్లి రాజారావు, కొండపల్లి బాలన్న కుటుంబ సభ్యులు యువనేతను కలిసి వ్యాధులతో వల్లకాడుగా మారుతున్న తమ ఊరికి రావాలని కోరారు. వారి ఆవేదన, చెప్పిన కష్టాలు చూసి యువనేత చలించిపోయారు. వెంటనే లింగాపుట్టు గ్రామంలో మరణాలపై ఆరా తీశారు. తన యాత్రను పక్కనబెట్టి వెనువెంటనే ఆ గ్రామానికి తరలివెళ్లారు. అక్కడ గిరిజనుల మరణాలకు కారణమైన కలుషిత బావిని పరిశీలించి ప్రభుత్వ సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. 21 మంది చనిపోతే ఐదు కుటుంబాలకు మాత్రమే 5 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశారని గిరిజనులు చెప్పారు.

డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మంత్రి బాలరాజు లాంటి నేతలు వచ్చి పరామర్శించి వెళ్లారని, అయినా పూర్తిస్థాయిలో సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మాట్లాడుతూ.. 21 మంది చనిపోయిన పట్టని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. బాధిత కుటుంబాలందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేసేలా ప్రభుత్వంపైన, గిరిజన శాఖ మంత్రి బాలరాజుపైనా ఒత్తిడి తెస్తానన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునేంతవరకు తాను అండగా ఉంటానని జగన్ లింగాపుట్టు గ్రామస్థులకు హామీ ఇచ్చారు.

Tuesday, January 4, 2011

చలికే వణుకుపుట్టింది * అర్ధరాత్రి దాటినా యువనేతకు అదే నీరాజనం

మండే ఎండ.. ముసుగేసిన మంచు.. వణికిస్తున్న చలి.. ఇవేవీ వారిని నిలువరించలేకపోయాయి. తమ జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడిని కనీసం ఆయన కుమారుడిలోనైనా చూసుకోవాలని వారంతా తహతహలాడారు. వణికిస్తున్న చలిని సైతం ఖాతరు చేయలేదు. సోమవారం అర్ధరాత్రి విశాఖ జిల్లాలో జగన్ చేసిన ఓదార్పు యాత్రకు అశేషంగా తరలివచ్చిన జనం తమ అభిమానాన్ని చాటుకున్నారు. చలిగాలులు బలంగా వీస్తున్న నేపథ్యంలో పొద్దుగుంకగానే గ్రామీణులు ముసుగుతన్నుతున్నారు. ఏడైతే గడప దాటడం లేదు. అలాంటిది రెండుగంటలకుపైగా జగన్ ఆలస్యంగా వచ్చినా ఆరుబయట మంచుగాలిలో నిరీక్షించారు.

సబ్బవరం జంక్షన్ చేరుకునేసరికే రాత్రి 11:40 గంటలయింది. అయినా చెక్కుచెదరని జనం. జగన్‌ను చూసిన సంతోషంలో అన్నీ మరచిపోయామని భూలోకయ్య అనే వృద్ధుడు చెప్పాడు. చలిగిలి ఏమీ అనిపించలేదన్నాడు. 12:45కు యువనేత బంగారం పాలెం చేరుకున్నారు. ఆరిపాక నుంచి లింగాల తిరుగుడు వరకూ ఆ చలిరాత్రిలో దారిపొడవునా యువనేతకు జనం జేజేలు పలికారు. ఒంటిగంటన్నరకు అడ్డూరు చేరుకున్నా జనాన్ని ఏ మంచూ.. చలిగాలీ అడ్డుకోలేకపోయాయి. తర్వాత ఆయన చౌడువాడ.. గొండుపాలెం మీదుగా 2:20 గంటలకు కోటపాడు చేరుకున్నారు. మరో గంటన్నరలో తెల్లారిపోతుందని పల్లెవాసులు భావిస్తారు. అలాంటి సమయంలో కూడా దుప్పట్లు కప్పుకున్న జనంతో రోడ్లన్నీ నిండిపోయి కనిపించాయి.

మధ్నాహ్నం నుంచి సభలు.. విగ్రహావిష్కరణలతో అలసిపోయినా యువనేత ఏమాత్రం ఆ భావన దరిచేరనీయకుండా వారందరినుద్దేశించి మాట్లాడారు. రాజన్న గురించి చెబుతున్నప్పుడు జనావళిలో ఉత్సాహం పెల్లుబుకింది. జిల్లాకు తొలిసారి వచ్చిన దివంగత నేత కుమారుడితో చేయి కలపాలని వయోభేదం లేకుండా పోటీ పడ్డారు. అవకాశమున్నంతవరకూ ఆయనకూడా వారితో కరచాలనం చేశారు. మొత్తం మీద ఓదార్పుయాత్ర బాటలో చలిపులి పలాయనం చిత్తగిస్తోంది.. జగన్‌పై జనం కురిపిస్తున్న ప్రేమలో మంచు కరిగిపోతోంది.

జగన్‌ను కలిసిన నేతలు
విశాఖ జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు సంఘీభావం తెలిపేందుకు మంగళవారం పలువురు నేతలు వచ్చారు. ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబూరావు, ఆళ్ల నాని, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర్, సీనియర్ నేతలు గోనె ప్రకాశ్‌రావు, బాజిరెడ్డి గోవర్ధన్, సినీ నటుడు విజయ్‌చందర్ తదితరులు యాత్రలో పాల్గొన్నారు. ఓదార్పులో జగన్ వెంట ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యేలు నరేష్‌కుమార్ అగర్వాల్ (లల్లూ-ఇచ్ఛాపురం), గండి బాబ్జీ, పూడి మంగపతిరావు, మిలట్రీ నాయుడు, చిర్ల జగ్గారావు, మాజీ మంత్రి జి.మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి జక్కంపూడి రాంమోహన్‌రావు కుమారుడు రాజా, జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి విజయాదేవి, ఏపీటీఎస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్‌రెడ్డి, వరంగల్ జిల్లా జగన్ యువసేన అధ్యక్షుడు బి.సుధీర్‌రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా జగన్ యువసేన అధ్యక్షుడు తాడి విజయ్ భాస్కరరెడ్డి, వైఎస్సార్ ట్రస్టు రాష్ట్ర ఇన్‌చార్జి ఎస్.సత్యనారాయణ, జగన్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటరెడ్డి తదితరులు జగన్‌ను కలిశారు.

ఓదార్పుకు ‘తూర్పు’ సంఘీభావం 
జగన్ విశాఖ జిల్లాలో నిర్వహిస్తున్న ఓదార్పు యాత్రకు తూర్పు గోదావరి జిల్లా నుంచి మంగళవారం పెద్ద ఎత్తున నేతలు తరలివెళ్లారు. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, వివిధ పార్టీల నాయకులు అన్నవరం చేరుకున్నారు. అక్కడ కొంత దూరం పాదయాత్ర చేశారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో కొబ్బరి కాయలు కొట్టారు. అనంతరం ర్యాలీగా విశాఖకు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు.

మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, తోట గోపాలకృష్ణ, కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు, జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వరుపుల రాజా, రాష్ట్ర జెడ్పీటీసీ సభ్యుల అసోసియేషన్ అధ్యక్షుడు పడాల రామారెడ్డి, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్‌లు రెడ్డి ప్రసాద్, బైర్రాజు ప్రసాదరాజు, మిండగుదిటి మోహన్, మహిళా నేత కొల్లి నిర్మలాకుమారి, రాజమండ్రి నగర పాలక సంస్థ మాజీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ రాఘవబాబు, ఎంపీపీలు గుత్తుల సాయి, నున్న రామచంద్రరావు, చిరంజీవిరాజు, చిట్టిరాజు, గుబ్బల వెంకటేశ్వరరావు, సిరిపురపు శ్రీనివాసరావు, వివిధ పార్టీల నాయకులు టి.కె.విశ్వేశ్వరరెడ్డి, పి.కె.రావు, మానేపల్లి సురేష్, మోకా ఆనందసాగర్, మట్టా శైలజ, కర్రి పాపారాయుడు తదితరులు విశాఖ జిల్లా చోడవరం సమీపాన లక్కవరం గ్రామంలో యువనేతను కలిశారు.

జగన్ జిల్లా నేతలను ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ తూర్పు గోదావరి జిల్లా ఓదార్పు యాత్ర సందర్భంగా మీరు చూపించిన అభిమానాన్ని ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నాను. విశాఖకు కూడా వెన్నుదన్నుగా నిలిచిన మీకు, మీ జిల్లాకు రుణపడి ఉంటాను’ అని అన్నారు.

Monday, January 3, 2011

దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్ * జగన్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు

* దారులన్నీ అటువైపే
* స్తంభించిన ట్రాఫిక్


విశాఖ ఎయిర్‌పోర్టు.. సోమవారం ఎన్నడూ లేనంతగా జనప్రవాహంతో హోరెత్తింది. యువనేతకు స్వాగతం పలికేందుకు ఉవ్వెత్తున తరలివచ్చిన అభిమానులు, కాంగ్రెస్ నాయకత్వ మంత్రాంగాన్నీ పక్కనపెట్టి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో విమానాశ్రయం సందడిగా మారింది. ఇసుకేస్తే రాలే పరిస్థితే లేదు.మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. దారులన్నీ ఎయిర్‌పోర్టుకే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అన్నివైపుల నుంచీ అభిమానులు తమ ప్రియతమ యువనేతకు స్వాగతం పలకడానికి ప్రదర్శనగా అక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఎన్‌ఏడీ జంక్షన్‌ను కలిపే జాతీయ రహదారి జనంతో నిండిపోయింది. అడుగడుగునా.. యువనేతపై ప్రేమాభిమానాలు అంబరాన్నంటాయి. గిరిజన సంప్రదాయ థింసా నృత్యాలు, వాయిద్యాలు, బైక్‌లు, కార్ల ర్యాలీలతో రోడ్లు దద్దరిల్లాయి. జాతీయ రహదారి డివైడర్ మొత్తం జగన్‌కు స్వాగత కటౌట్లతో కొలువుదీరింది.

స్తంభించిన ట్రాఫిక్
ఉదయం 10 గంటల నుంచే విమానాశ్రయం కిక్కిరిసింది. 11 గంటల ప్రాంతంలో పాత టెర్మినల్‌కు వెళ్లే రెండు రహదారులు జనాలతో కిటకిటలాడాయి. టెర్మినల్ వద్ద స్థలం సరిపోక విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో జనం సర్దుకున్నారు. గాజువాక, ఎన్‌ఏడీ తదితర ప్రాంతాల్లో జనం ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ప్రముఖుల వాహనాలు టెర్మినల్ వద్దకు చేరుకోలేక ఆమడ దూరంలోనే ఆగిపోయాయి. గోనె ప్రకాశ్‌రావులాంటి ప్రముఖ నేతలు కూడా కాలినడకను ఆశ్రయించాల్సి వచ్చింది. జగన్‌ను చూడాలన్న తాపత్రయంతో యువత విమానాశ్రయంలోని చెట్లెక్కారు. జనహోరుతో గాజువాక లాంటి ప్రాంతాల్లో కొన్ని వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది.

అంతా ‘వైఎస్’మయం
విమానాశ్రయ ప్రాంగణం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి స్మృతులతో పులకరించింది. చేతిలో వైఎస్సార్, జగన్ చిత్రాలతో కూడిన జెండా, ముఖానికి వైఎస్సార్ మాస్క్, నుదుట జగన్ యువసేన బెల్ట్‌తో ఎక్కడ చూసినా.. అభిమానులే. కార్పొరేటర్ తిప్పల నాగిరెడ్డి అనుచరగణం, టీఎన్‌ఆర్ యువసేన తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో టెర్మినల్ నుంచి పావు కిలోమీటరున్న జాతీయ రహదారికి జగన్ చేరుకోవడానికి అరగంటపైనే పట్టింది. అక్కడి నుంచి జనం ఎన్‌ఏడీ జంక్షన్ వరకు జగన్ వెంట భారీ ర్యాలీగా బయలుదేరారు.

జగన్‌కే జైకొట్టిన నేతలు
* జిల్లా మంత్రి బెదిరింపులకు తలొగ్గని కేడర్ * విమానాశ్రయంలో యువనేతకు ఘన స్వాగతం * యాత్రలో భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు

 ఓదార్పు యాత్రలో పాల్గొనకుండా పార్టీ శ్రేణులను నిలువరించేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారి లక్ష్యం నెరవేరలేదు. ఎవరెన్ని మాటలు చెప్పినా తామంతా జగన్ వెంటే ఉంటామని పార్టీ శ్రేణులు స్పష్టంచేశాయి. యాత్రలో పాల్గొని నాయకులకు స్పష్టమైన సంకేతం పంపాయి. వారిని నిలువరించడానికి జిల్లా మంత్రి పి.బాలరాజు సకల యత్నాలు చేసినా విఫలమయ్యాయి. కొంతమంది నాయకుల్ని ఆయన ప్రభావితం చేసినప్పటికీ జగన్ వెంటే మేమంటూ కేడర్ ముందుకొచ్చారు. జగన్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. యాత్రలో యువనేత వెంటే నడిచారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం మరింత ఉత్సాహంతో ఓదార్పులో పాల్గొంటోంది.

వెల్లువెత్తుతున్న మద్దతు
ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, పెనుమత్స సాంబశివరాజు, పెద్దింటి జగన్‌మోహన్‌రావు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, కుంభా రవిబాబు, నరేష్‌కుమార్ అగర్వాల్, మిలట్రీ నాయుడు, పూడి మంగపతిరావు, హనుమంతు అప్పయ్యదొర, జడ్‌పీ చైర్మన్ రామ్మూర్తి నాయుడు, పీసీసీ కార్యదర్శి పీలా ఉమారాణి, జీవీఎంసీ కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోకు, కార్పొరేటర్లు తిప్పల నాగిరెడ్డి, జి.వి.రవిరాజు, చొప్పా నాగరాజు, చింతపల్లి పోతరాజు, ఉరుకూటి అప్పారావు, కండిపిల్లి అప్పారావు, కొవగాపు సుశీల, అంగ చంద్రకళ, ఎమిలీ జ్వాల తమ కేడర్‌తో విమానాశ్రయానికి తరలివచ్చి యువనేతకు ఘన స్వాగతం పలికారు.

ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఏపీటీసీ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్‌రెడ్డి, సినీ నటుడు విజయ్‌చందర్, స్థానిక నేత విళ్లా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీపీ ఎం.సన్యాసిరావు, మునగపాక నుంచి ఎం.సంజీవరావు, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ గోపాలరాజు, అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.కిశోర్, కొణతాల రామకృష్ణ సోదరుడు లక్ష్మీనారాయణ, లక్ష్మీ సిండికేట్ అధినేత ఆడారి రవికుమార్, ముస్లిం మైనార్టీ నేత సయ్యద్ ముస్తఫా తదితరులు యాత్రలో పాల్గొని మద్దతు పలికారు. విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు వెయ్యిమంది అనుచర గణంతో జగన్‌కు మద్దతు తెలిపారు. తిప్పల గురుమూర్తిరెడ్డి పినతండ్రి ఆదిరెడ్డి మురళి తన వర్గంతో విమానాశ్రయానికి చేరుకున్నారు. పాయకరావుపేట, కె.కోటపాడు, అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో నగరానికి వచ్చారు.