*ఉప ఎన్నికలపై జగన్ వ్యాఖ్య
*ఈ ఎన్నికల్లో వేసే ఓటుతో ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలగాలి
* వైఎస్ చనిపోయాక గాలేరు-నగరి పనులు ఎక్కడికిపోయాయో తెలీదు
*కాంగ్రెస్ వాళ్లు ప్రచారానికొస్తే నీటి సమస్యపై నిలదీయండి
*వైఎస్ బతికున్నప్పుడు తిరుపతిలో పేదలకు 27 వేల ఇళ్లు కట్టించారు
* ఆయన చనిపోయాక ఒక్కటంటే ఒక్క ఇల్లూ ఇవ్వలేదేమని కాంగ్రెస్ వారిని ప్రశ్నించండి
‘ఈ కాంగ్రెస్ పెద్దలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
ఇద్దరూ కలిసి రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను ఎంతగా దిగజార్చారూ అంటే..
విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థాలను టార్చిలైట్ వేసి వెతికినా
కనిపించే పరిస్థితి లేదు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తేవాలి..
విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావాలి.. విలువలను తిరిగి తేవాలి.
చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చేలా జరగబోతున్న ఈ ఉప ఎన్నికలు.. రేపు
జరుగబోయే మహా సంగ్రామానికి నాంది పలకనున్నాయి’ అని వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్రంలో రైతు,
పేదవాడు ఎలా బతుకుతున్నాడో పట్టించుకోని ఈ పాలకులకు వారి బాధను
తెలియజెప్పేలా ఉప ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు.
‘రాష్ట్ర
పాలకులకు, వారిని ఢిల్లీ నుంచి రిమోట్‌తో నడిపిస్తున్న పెద్దలకు ఉప
ఎన్నికల తీర్పుతో కనువిప్పు కావాలి’ అని జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
తిరుపతి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా
పోటీచేస్తున్న భూమన కరుణాకరరెడ్డి తరఫున జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం
నిర్వహించిన ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే సువర్ణయుగంలో అవకాశముంటే
టీటీడీ కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తాం. వారికి
కనీస వేతనం అందేలా కృషి చేస్తాం. వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా
గృహాలు నిర్మించుకునేందుకు కృషి చేస్తాం’ అని జగన్ హామీ ఇచ్చారు.
జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
చిరంజీవి తిరుపతి ప్రజల్ని గాలికొదిలేశారు..
పేదోడికి,
రైతన్నకు అండగా నిలబడినందుకు 17 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు
గురయ్యారు. ఇప్పుడు వారి స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే
తిరుపతిలో ఉప ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయీ అంటే.. మొన్న చిరంజీవే స్వయంగా
చెప్పారు.. ఆయనకు సోనియా గాంధీ ప్రమోషన్ ఇచ్చారట.. రాజ్యసభకు పంపారట..
అందుకని ఆయన తిరుపతి ప్రజలను గాలికి వదిలేశారట. ఇంకా బాధాకరమైన
విషయమేంటంటే.. రాజ్యసభకు వెళ్లే వ్యక్తి ఎక్స్ ఆఫీషియో సభ్యత్వానికి
తిరుపతి నగరాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నా.. ఆయన మాత్రం హైదరాబాద్
నగరాన్ని ఎంపిక చేసుకున్నారు.
అలా ఆయన గాలికి వదిలేసిన పరిస్థితిలో
తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తిరుపతి తాగునీటి శాశ్వత పరిష్కారం
కోసం మహానేత వైఎస్ గాలేరు-నగరి ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఆ మహానేత
చనిపోయాక గాలేరు-నగరి ప్రాజెక్టు పనులు ఎక్కడికి పోయాయో తెలియడం లేదు.
గాలేరు-నగరి పనులు జరగలేదనో, ఇక్కడున్న అక్క చెల్లెళ్లు నాలుగురోజులకొకసారి
నీటి కష్టాలు పడుతున్నారనో చిరంజీవి రాజీనామా చేసుంటే సెల్యూట్
చేసుండేవాణ్ణి.
కాంగ్రెస్ వారిని నిలదీయండి: కాంగ్రెస్ వాళ్లు
ఇక్కడికి(తిరుపతికి) ప్రచారానికి వస్తే ఒక మాట అడగండి. తిరుపతి నగరంలో
నాలుగు రోజులకోసారిగాని ఐదు రోజులకోసారిగాని నీళ్లు దొరకని పరిస్థితిలో మేం
బతుకుతున్నాం.. మీరేం చేస్తున్నారని అడగండి. ఆ మహానేత బతికి ఉన్నప్పుడు
ఇక్కడ పేదలకు 27 వేల ఇళ్లు కట్టిస్తే.. ఆయన చనిపోయాక ఒక్కటంటే ఒక్క ఇల్లూ
కట్టివ్వలేదేమని ప్రశ్నించండి. సాగు చేయడం కంటే ఆత్మహత్యే మేలనుకునే
పరిస్థితిలో రైతు వ్యవసాయం చేస్తున్నా కూడా అతడిని ఎందుకు పట్టించుకోవడం
లేదని నిలదీయండి.
సంవత్సరమైపోయింది.. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు
ఇప్పటికీ విడుదల చేయలేదు.. ప్రభుత్వం ఆ బకాయిలు కడుతుందో కట్టదో తెలియని
పరిస్థితిలో చదువుతున్నాం మేం అని ప్రతి విద్యార్థీ కాంగ్రెస్ వాళ్లను
నిలదీయండి. అనారోగ్యంతో ఉన్న పేదవాడు 108కు ఫోన్ చేస్తే 20 నిముషాల్లో
రావాల్సిన అంబులెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో బతుకుతున్నామని
నిలదీయండి. ఆరోగ్యశ్రీని ఎందుకు కుదించారని ప్రశ్నించండి. కాక్లియర్
ఇంప్లాంటేషన్ సర్జరీ అర్హత వయసును రెండేళ్లకే కుదించారు.. రెండేళ్లలోపు
మూగ, చెవుడు గుర్తించలేకపోతే.. వాడి జీవితమేమైపోవాలని నిలదీయండి.
చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు ఎంతగా కుమ్మక్కయ్యారంటే..,
ఇలాంటి
పరిస్థితిలో పోనీ ప్రతిపక్షమైనా ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతుందని
చూస్తే.. మన ఖర్మకొద్దీ ఆ ప్రతిపక్ష స్థానంలో చంద్రబాబు ఉన్నారు. దేశ
చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో ఆయన కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కయ్యారు.
చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు చెందిన వ్యక్తికి హైదరాబాద్
నడిబొడ్డున అమీర్‌పేటలో ఐదెకరాల భూమిని స్వయంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులే
ధారాదత్తం చేశారంటే వారి కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వీళ్లిద్దరి కలయిక ఎంత నిస్సిగ్గుగా ఉందో తెలుసుకోవాలంటే.. వైఎస్‌పైన,
చంద్రబాబుపైన సీబీఐ చేస్తున్న దర్యాప్తు తీరు చూస్తే చాలు.
వెనుకబడిన
మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పరిశ్రమలు తేవాలని, ఉపాధి కల్పించాలని తలచి
మహానేత.. ఎకరా 8 లక్షల చొప్పున 75 ఎకరాలను 25 ఏళ్లపాటు లీజుకిస్తే సీబీఐ
తప్పు పడుతోంది. అక్కడ ఎకరా రూ.15 లక్షల రేటు పలుకుతోందీ అంటోంది. ఎమ్మార్
కేసులోనూ సీబీఐ దర్యాప్తు చేస్తోంది.. అయితే అందులో చంద్రబాబు చేసిన తప్పు
వారికి కనబడడం లేదట. వైఎస్ ఉపాధి కల్పించడానికి ఎకరాలను పరిశ్రమలకు
కేటాయిస్తే.. చంద్రబాబు పెద్దలు గోల్ఫ్ ఆడుకోవడానికి, విలాసవంతమైన విల్లాలు
కట్టుకోవడానికి హైదరాబాద్ నడిబొడ్డున 535 ఎకరాలను ఎమ్మార్‌కు ధారాదత్తం
చేశారు. అక్కడ ఎకరా రూ.3 నుంచి రూ.4 కోట్లు పలుకుతా ఉంటే.. ఆయన ఎకరా రూ.29
లక్షల చొప్పునఎమ్మార్‌కు ఇచ్చేస్తే... ఎందుకయ్యా ఇలా చేశావూ అని సీబీఐ
కనీసం అడగనైనా అడగడం లేదు.
జోరువానలోనూ.. జనప్రవాహం వైఎస్
జగన్‌మోహన్ రెడ్డి పళణి థియేటర్ సర్కిల్ రోడ్‌షోలో ప్రసంగిస్తుండగానే
వర్షం మొదలైంది. అయినా జనం కట్టుకదల్లేదు.. అంత వానలో ఉద్వేగంగా జగన్
ప్రసంగిస్తుంటే.. అంతే ఆత్రుతగా అభిమానులు వింటూ వర్షాన్నే మరచిపోయారు.
తర్వాత జగన్ ముత్యాలరెడ్డిపల్లె బహిరంగ సభకు చేరుకున్నారు. అక్కడా జోరు
వానలో తడుస్తూనే ప్రసంగించారు. జనం కూడా వర్షాన్ని లెక్కచేయకుండా
జగన్‌మోహన్ రెడ్డి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. వర్షం పడుతున్న సమయంలో
ఆయన ఆకాశం వైపు చూసి రెండు చేతులెత్తి వరుణ దేవునికి నమస్కరించుకున్నారు.
ఆ
దృశ్యాన్ని చూసిన జనం ‘వాళ్ల నాన్న లాగే వర్షం అంటే జగన్‌మోహన్‌రెడ్డికి
కూడా ఎంతో ఇష్టం’ అంటూ మాట్లాడుకున్నారు. ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం
చేసుకుని తిరుపతి చేరుకున్న అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి 11.35 గంటలకు నగర
శివార్లలోని ఆటోనగర్ నుంచి రెండో రోజు ప్రచారాన్ని ప్రారంభించారు. నగరంలో
10 జంక్షన్లలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆయన్ను చూసేందుకు ఎండను
లెక్కచేయక మిద్దెలపైన, భవనాల పైన కూడా గంటలకొద్దీ జనం వేచి ఉన్నారు.
రోడ్‌షోలో తన ప్రసంగం వినడానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి.. పచ్చ చీర రంగు
అవ్వా.. కళ్లద్దాల అవ్వా.. చెల్లెమ్మా.. అంటూ జననేత పిలుస్తుంటే జనం
పులకించిపోయారు. కాగా బుధవారం సాయంత్రం తిరుపతి ప్రచారం ముగించుకున్న
జగన్.. తర్వాత కడప వెళ్లారు. గురువారం ఉదయం నుంచి ఆయన రాజంపేటలో ప్రచారం
నిర్వహిస్తారు.
|
|
No comments:
Post a Comment