జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Tuesday, January 10, 2012

సర్కార్ నిద్ర వదిలిద్దాం: వైఎస్ జగన్ * ‘రైతు దీక్ష’లో అన్నదాతలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు


రైతు దీక్ష డిమాండ్లివీ..

రైతు దీక్ష ప్రధాన డిమాండ్లను దీక్ష వేదికపై ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రకటించారు. అవి..

* పసుపు, చెరుకు, మిరప, వరి, పత్తి పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. వారికి గిట్టుబాటయ్యే మద్దతు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో తక్షణమే ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. అన్ని పంటలకు గిట్టుబాటు, మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం కొనుగోలు చేయాలి.

* వైఎస్ ప్రకటించిన 9 గంటల ఉచిత విద్యుత్ హామీని అమలు చేయని ఈ ప్రభుత్వం.. ప్రస్తుత ఏడు గంటల కరెంటులోనే ఎడాపెడా కోతలు విధిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు నాణ్యమైన విద్యుత్తును తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా, ఉచితంగా సరఫరా చేయాలి.

* రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించిన 800 పైచిలుకు మండలాల్లో రైతులకు పైసా సాయం అందించలేదు. తక్షణమే రైతులకు సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలి.


రైతులను విస్మరిం చి నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని, దానిని నడిపిస్తున్న ఢిల్లీ సర్కారును ఈ ‘రైతు దీక్ష’ ద్వారా మేల్కొలుపుదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అన్నదాతలకు పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మం డలం పెర్కిట్ శివారులోని వైఎస్‌ఆర్ ప్రాంగణంలో ‘రైతు దీక్ష’ను ప్రారంభించే ముందు ఆయన క్లుప్తంగా మాట్లాడారు. కొండెక్కిన ఎరువుల రేట్లు, కరెంటు కోతలు, కనీస మద్దతు ధర అందక అన్నదాత కుచేలుడైపోయిన నేపథ్యంలో.. ఆ రైతన్న కన్నీళ్లను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు జగన్ ఈ దీక్ష చేపట్టారు. ఇది మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభం కావాల్సి ఉండగా.. రాత్రి 8.00కుగానీ ఆయన అక్కడకు చేరుకోలేకపోయారు. హైదరాబాద్‌లో ఉదయం బయల్దేరింది మొదలు ప్రతి బాట లోనూ అభిమాన ప్రవాహం ఉప్పొంగడం.. రోడ్లన్నీ జనసంద్రాన్ని తలపించడం.. జెండా ఆవిష్కరణలు, పార్టీలో చేరికలు, మంగళహారతులు, కరచాలనాలు, పూలమాలలతో అభిమానులు ఉరకలెత్తడంతో ఆయన ఇక్కడకు చేరుకోవడం ఎనిమిది గంటల ఆలస్యమైంది. ఇంత ఆలస్యమైనా ఉదయం నుంచే అక్కడ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వేలాది మంది ప్రజల్లో విసుగుగాని, అలుపుగాని కనిపించలేదు. ఉదయం నుంచీ జై జగన్, జోహార్ వైఎస్సార్ అన్న నినాదాలు ఆ ప్రాంగణమంతా మార్మోగుతూనే ఉన్నాయి. జగన్ రాకతో అవి మిన్నంటాయి. కిటకిటలాడుతున్న జనహోరు మధ్య వేదిక మీదకొచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ దీక్ష కోరుతున్న మూడు ప్రధాన డిమాండ్లను ఎమ్మెల్యే కొండా సురేఖ ద్వారా చదివి వినిపించారు. వేదికపై సర్వమత పెద్దల ఆశీస్సులు.. ప్రాంగణంలో అన్నదాత రణన్నినాదాల మధ్య జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించారు. దీనికి ముందు ఆయన క్లుప్తంగా ప్రసంగించారు.

మరొక్కసారి మేల్కొలిపే ప్రయత్నమే..

‘‘రైతుల సమస్యల మీద ఎన్నో దీక్షలు చేశాం.. కలెక్టరేట్లను, ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడించాం.. నియోజకవర్గాలు, మండలాల్లో దీక్షలు చేపట్టాం.. గత రెండేళ్లుగా దీక్షల మీద దీక్షలు చేశాం, అయినా రైతుల గోడును ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరొక్కసారి రైతుల గోడు గట్టిగా వినిపించి సర్కారును మేల్కొలిపే ప్రయత్నమే ఈ దీక్ష’’ అని జగన్ పేర్కొన్నారు. దీక్ష జరిగే ఈ మూడు రోజుల్లో శిబిరంలో రైతు నాయకులు మాట్లాడతారని.. ‘మా రైతుల గోడు వినండయ్యా’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తారని అన్నారు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, పేదల వ్యతిరేక విధానాల మీద ప్రతి ఒక్కరూ గళం విప్పుతారని చెప్పారు. దీక్ష విరమించే సమయంలో రైతాంగ సమస్యలపై తాను సుదీర్ఘంగా మాట్లాడతానన్నారు. ‘మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన కార్యక్రమం రాత్రి 8.30కు జరుగుతున్నా ఒక్కరు కూడా ఆలస్యమైపోతోందని ఇంటికెళ్లిపోకుండా.. మరో పనులున్నాయని సాకులు చూపకుండా, చలిని లెక్కచేయకుండా.. ఎవ్వరి ముఖంలోనూ చికాకు కనిపించకుండా వేచి ఉన్నారు. నా కోసం చిన్న పిల్లలతో వేచి ఉన్న తల్లులకు, నడవలేని వయసులోనూ ఇక్కడకు వచ్చిన అవ్వలకు, తాతలకు, అన్నలకు, అక్కా చెల్లెళ్లకు అందరికీ పేరుపేరునాకృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను’ అని జగన్ అన్నారు.


కదలి వచ్చిన కర్షకలోకం: రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చేపట్టిన ఈ దీక్షకు కర్షక లోకం తరలి వచ్చింది. తమ ఆవేదనకు ప్రతిరూపమై దీక్షకు దిగిన ప్రియతమ నాయకుడిని చూడటానికి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి రైతులు ఉదయం ఏడు గంటల నుంచే దీక్ష ప్రాంగణానికి చేరుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వాహనాల్లో దీక్ష స్థలికి చేరుకున్నారు. ఆర్మూరు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలు మధ్యాహ్నానికి దీక్ష శిబిరానికి వచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకల్లా శిబిరం కిక్కిరిసిపోయింది. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరించాయి. ఆలస్యంగా జగన్ దీక్ష శిబిరానికి చేరుకున్నా రైతుల్లో నిరుత్సాహం ఏ కోశానా కనిపించలేదు. ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా అన్న ఆత్రుతే కనిపించింది. రాత్రి 8 గంటలకు దీక్ష శిబిరానికి చేరుకున్న జగన్‌కు రైతులు, నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆయన వేదికపైకి చేరుకోగానే జై జగన్, వైఎస్సార్ అమర్ రహే అనే నినాదాలు మారుమోగాయి.

వైఎస్ విగ్రహానికి పూల మాలవేసి..: దీక్ష శిబిరానికి చేరుకోగానే జగన్.. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. వైఎస్సార్ కాం గ్రెస్ కేంద్ర పాలకమండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడిన అనంతరం బోధన్ నాయకుడు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డిని జగన్.. పార్టీ కండువా వేసి ఆహ్వానిం చారు. మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి జగన్‌ను కలిశారు. అనంతరం ఎమ్మెల్యే కొండా సురేఖ జగన్‌కు తిలకం దిద్ది దీక్షను ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఆత్మహత్య చేసుకున్న అన్నదాతలకు శ్రద్ధాంజలి

ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు, తెలంగాణ అమరవీరులకు రైతు దీక్షలో శ్రద్ధాంజలి ఘటించారు. వారి ఆత్మ శాంతి కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల అనేక మంది రైతులు బలయ్యారని, తెలంగాణ కోసం వందలాది మంది ప్రాణాలు అర్పించారని సంతాపం తెలిపారు.

తరలి వచ్చిన నేతలు: దీక్ష శిబిరంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్సీలు కొండా మురళి, జూపూడి ప్రభాకర్‌రావు, పార్టీ అధికార ప్రతినిధులు గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ, మాజీ మంత్రులు బోడ జనార్ధన్, మారెప్ప, సినీ నటి రోజా, నేతలు జనక్ ప్రసాద్, చందా లింగయ్య, వెంకటరమణారెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, సోమిరెడ్డి, బట్టి జగపతి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతులను కాంగ్రెస్ మోసగిస్తోంది

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులను మోసం చేస్తోంది. రైతుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారి కష్టాలను గాలికి వదిలేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రైతులకోసం ఏమీ చేయడం లేదు. అందుకే రైతుల పక్షాన నిలిచిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేపట్టారు.
- మాజీ మంత్రి బోడ జనార్దన్

సంక్షేమమే లక్ష్యంగా..

ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా ప్రజల సంక్షేమంకోసం జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రైతులకోసం అంటూ శాసనసభలో ఉత్తుత్తి అవిశ్వాస తీర్మానం పెట్టారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కమాట మాట్లాడలేదు. కానీ జగన్ వర్గం ఎమ్మెల్యేలు మూడు ప్రాంతాల రైతులు తమకు సమానమేనంటూ రైతులపక్షాన నిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు.
- జనక్ ప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్

చిరంజీవి కొత్త బిచ్చగాడిలా...

చిరంజీవి కొత్త బిచ్చగాడిలా మంత్రి పదవి అడుగుతున్నాడు. సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స, ఉపముఖ్యమంత్రి రాజనర్సింహ మధ్య సమన్వయం కుదర్చడానికి ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానం తలకిందులవుతుంటే.. మరోవైపు చిరంజీవి మాత్రం మంత్రి పదవికోసం తిరుగుతున్నాడు. మంత్రి బాధ్యతలు కూడా నిర్వహించని కిరణ్ సీఎం కావడం మన దౌర్భాగ్యం.
- రోజా, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు

No comments:

Post a Comment