
బుధవారం ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశానికి కడప ఎంపీ వైఎస్ జగన్ డుమ్మా కొట్టడం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనతో పాటు నెల్లూరు ఎంపీ మేకపాటి కూడా జగన్ బాటనే అనుసరించి, ఏఐసీసీ భేటీకి వెళ్లకుండా డుమ్మా కొట్టడంతో జగన్ ఇక అధిష్ఠానంపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఏఐసీసీ సమావేశానికి హాజరుకావాలన్నది సహజంగా ప్రతి ఒక్క నాయకుడి కలగా ఉంటుంది. అయితే, వచ్చిన అవకాశాన్ని ‘కావాలని జారవిడుచుకున్న’ జగన్ ధిక్కారధోరణిపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
అధిష్ఠానం తనను అణచివేయడానికే ప్రయత్నిస్తోందని, ముఖ్యమంత్రి రోశయ్య-మొన్నటి వరకూ తన వెంట నిలిచిన కేవీపీ రామచంద్రరావు కూడా అధిష్ఠానానికి సహకరిస్తున్నారన్న ఆగ్రహంతో ఉన్న జగన్.. తనకు ఏఐసీసీ సమావేశం, పార్టీ అధినేత్రి దిశానిర్దేశం కంటే.. తన తండ్రి మృతి తర్వాత ‘ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రూపొందించిన ఓదార్పు యాత్రను కొనసాగించడమే’ ముఖ్యమన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన ధోరణి స్పష్టం చేస్తోంది. ఆ మేరకు అధిష్ఠానం నుంచి ఎదురయ్యే ఎలాంటి కఠిన పరిణామాలయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న మానసిక స్థైర్యం, మొండితనం ఆయనలో కనిపిస్తోంది. జగన్‌కు తోడుగా నెల్లూరు ఎంపీ మేకపాటి కూడా ఢిల్లీకి వెళ్లకుండా డుమ్మా కొట్టడం, త్వరలో జగన్ ఓదార్పు యాత్రకు విశాఖలో సన్నాహాలు చేస్తున్న అనకాపల్లి ఎంపీ సబ్బంహరి కూడా జగన్ దారిలో నడిచే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదిలాఉండగా.. జగన్ వ్యవహారశైలి, ధిక్కారధోరణి పరిశీలిస్తే సొంత పార్టీ పెట్టే ఆలోచనను తీవ్రతరం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఏఐసీసీకి గైర్హాజరు కావడం ఆయనలోని నిర్యక్ష్యాన్ని, పార్టీ అంటే లెక్కలేని తనాన్ని సూచిస్తోందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. పూర్తి తెగింపు ధోరణి, అధిష్ఠానంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయినందుకే ఆయన ఇలాంటి నిర్ణయానికి వచ్చారని విశ్లేషిస్తున్నారు. గతంలో ఓదార్పు సమయంలో పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు జగన్ దానికి విరామం ఇచ్చి పార్లమెంటు సమావేశాలకు వెళ్లి అణుబిల్లుపై ఓటు వేసిన విషయం తెలిసిందే.
అప్పుడు విప్ ఉన్నందున తప్పనిసరి పరిస్థితిలో వెళ్లవలసి వచ్చిందని, ఇప్పుడు పార్టీకి సంబంధించి ప్రతిష్ఠాత్మకమైన ఏఐసీసీకి ఆహ్వానం ఉన్నా, కావాలని వెళ్లకపోవడం బట్టి.. అధిష్ఠానాన్ని ఖాతరు చేయవలసిన అవసరం లేదన్న నిర్లక్ష్య ధోరణి జగన్ వ్యవహారశైలి స్పష్టం చేస్తోందని ఆయన ప్రత్యర్థి వర్గం చెబుతోంది.నిజంగా జగన్‌కు పార్టీపై అభిమానం, పార్టీలో కొనసాగాలన్న ఆలోచన ఉన్నట్టయితే ఓదార్పు యాత్రకు ఒకరోజు విరామం ఇచ్చి ఢిల్లీకి వెళ్లవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రలో అనారోగ్యానికి గురయిన సందర్భంలో దానికి విరామం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు కూడా ఢిల్లీకి వెళ్లాలన్న చిత్తశుద్ధి ఉంటే ఓదార్పు యాత్రకు ఒకరోజు విరామం ఇచ్చి ఉండేవారని, ఆయనకు అలాంటి అభిప్రాయం, పార్టీపై గౌరవం లేనందుకే ఏఐసీసీ సమావేశానికి వెళ్లలేదని విశ్లేషిస్తున్నారు. జగన్ ఈ వ్యవహారంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. తాను పార్టీ నాయకత్వాన్నయినా ధైర్యంగా ఎదిరిస్తానన్న సంకేతాలు పార్టీ యువ కార్యకర్తలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దాని ద్వారా.. జగన్ పార్టీ యువ కార్యకర్తల్లో హీరోయిజం ప్రదర్శించుకునే ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు.
వైఎస్ మాదిరిగా అనుకున్నది చేయడంలో జగన్ ఎంతకయినా తెగిస్తారని, తండ్రి మాదిరిగా ఎవరినీ లెక్కచేయరన్న ముద్ర వేయించుకునే ప్రయత్నం చేసి నట్లు కనిపిస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, జగన్ గైర్హాజరుపై అధి ష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రతి నిధుల హాజరులో ప్రత్యేక ఆహ్వానితుడి జాబితాలో ఉన్న జగన్ హాజరు కాకపోవడాన్ని మోతీలాల్ ఓరా ప్రత్యేకించి ప్రస్తావించినట్లు పార్టీ వర్గాల సమాచారం
No comments:
Post a Comment