జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, September 9, 2010

నాకు అన్నీ తెలుసు * ఎలాంటి అయోమయం లేదు * ఎవరిని ఎలా నియంత్రించాలో తెలుసు


చర్యలు తీసుకుంటున్నాం
డీఎల్‌తో సోనియా స్పష్టీకరణ
జగన్‌పై ఆగ్రహం!
రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు
వేలకోట్లు తరలించేశారు
వ్యవస్థలు నాశనం చేశారు
ఎమ్మార్‌పై సీబీఐ విచారణ జరపండి

సోనియాకు డీఎల్ వినతి

'మాకు అన్నీ తెలుసు. ఏం చేయాలో, ఎవరిని ఎలా కట్టడి చేయాలో తెలుసు'... ఇది మేడమ్ సోనియా గాంధీ మాట! రాష్ట్రంలో పరిస్థితులపై తమలో ఎలాంటి అయోమయం లేదని ఆమె స్పష్టం చేసినట్లు తెలిసింది. గురువారం తనను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మైదుకూరు ఎమ్మెల్యే రవీంద్రారెడ్డితో, మహిళా నేతలతో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.

రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సోనియా గాంధీలో ఎలాంటి అయోమయం లేదని రవీంద్రా రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇక్కడి విషయాల గురించి తనకంటే ఆమెకే ఎక్కువగా తెలుసన్నారు. మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి సోనియా పిలుపు కోసం నిరీక్షిస్తున్న డీఎల్... ఎట్టకేలకు గురువారం ఆమెతో భేటీ అయ్యారు.

ఒక్కో అంశాన్ని వివరిస్తున్నప్పుడు... తనకంటే ముందు సోనియానే ఆయా అంశాలను ప్రస్తావించడంతో డీఎల్ ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తనకు తెలుసునని, పరిస్థితి చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని సోనియా చెప్పినట్లు తెలిసింది. ఎమ్మార్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన సోనియా గాంధీని కోరారు.

రాష్ట్రంలో వేల కోట్ల భూ కుంభకోణాలు జరిగాయని, ప్రభుత్వంలోని పెద్దలే భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని, చట్టాలను, రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా... పెద్దలు, వారి అస్మదీయులు ఇష్టారాజ్యంగా వేల కోట్లు స్వాహా చేశారని ఆయన ఫిర్యాదు చేశారు. "ఎమ్మార్ మాత్రమే కాదు, రాష్ట్రంలో కేటాయించిన ప్రతి ప్రాజెక్టులో పెద్దలకు వాటాలున్నాయి.

దుబాయ్ వంటి దేశాల్లో ఆస్తులను సంపాదించుకున్నారు. నిధులను తరలించేశారు'' అంటూ పలు డాక్యుమెంట్లను ఆమె ముందుంచారు. రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని చెప్పారు. డీఎల్‌తో భేటీ సందర్భంగా జగన్ వ్యవహారం పట్ల సోనియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో నేతలు తన వద్ద ఒక తీరుగా, బయట మరో తీరుగా మాట్లాడుతున్నట్లు కటువుగా అన్నట్లు సమాచారం. సోనియాతో భేటీ అనంతరం డీఎల్ విలేకరులతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలు, ఆయన ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి....

సోనియా గాంధీకి ఏయే అంశాలు వివరించారు?
రాష్ట్రంలో పరిస్థితులు అన్నీ వివరించాను. ఆమె నేను చెప్పిందంతా విన్నారు. రాష్ట్రంలో పరిస్థితుల గురించి నాకు తెలిసిన దానికన్నా ఆమెకే ఎక్కువ తెలుసు. మా పార్టీకి విషయాలను, అధ్యక్షురాలితో చెప్పిన ఇతర అంశాల గురించి ఇంతకు మించి ఏమీ బయటకు చెప్పలేను.

ప్రధానంగా ఏయే అంశాలను ప్రస్తావించారు?
రాజకీయ, ఆర్థిక, పాలనా పరమైన ఇబ్బందుల గురించి వివరించాను. ఎమ్మార్ కుంభకోణం గురించి చెప్పాను. సీబీఐ విచారణ జరిపించాల్సిన అవసరాన్ని వివరించాను. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమై పోయాయని చెప్పాను. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరంపై చర్చించాను. ప్రత్యేక దృష్టిసారించాల్సిన కొన్ని అంశాల గురించి మాట్లాడాను

మేడమ్ ప్రతిస్పందన ఏమిటి?
అన్ని అంశాలు తన దృష్టికి వచ్చాయని మేడమ్ చెప్పారు. వ్యవస్థలను సరిదిద్దే క్రమంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. 'ఐ యామ్ అట్ ఇట్'.. అని చెప్పారు. సంతోషకరమైన విషయం ఏమంటే... ఆమె అన్ని విషయాలు చక్కగా ఆకళింపు చేసుకున్నారు. పరిస్థితులు ఆమెకు బాగా అర్థమయ్యాయి.

జగన్ ఓదార్పు యాత్ర గురించి ప్రస్తావించారా?
దాని గురించి నేను చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు అన్ని విషయాలు బాగా తెలుసు.

ఈ విషయంలో అధిష్ఠానం ఏ చర్యలు తీసుకుంటారనే దానిపై పార్టీలో, నేతల్లో అయోమయం ఉందికదా?
మీరూ, మేమూ మాత్రమే అయోమయంలో ఉన్నాము. మేడమ్ ఏమీ ఆయోమయంలో లేరు. త్వరలో ఈ విషయం అందరికీ అర్థమవుతుంది.

మేడమ్‌తో సమావేశం ఎలా జరిగిందనుకుంటున్నారు?
చాలా సంతృప్తికరంగా జరిగింది. నేను అనుకుకున్న విధంగానే మేడమ్‌కు అన్ని విషయాలు వివరించగలిగాను. ఆమెకు అన్ని విషయాలు తెలిశాయనే సంతోషంతో వెళుతున్నాను.

No comments:

Post a Comment