జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Monday, January 3, 2011

దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్ * జగన్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు

* దారులన్నీ అటువైపే
* స్తంభించిన ట్రాఫిక్


విశాఖ ఎయిర్‌పోర్టు.. సోమవారం ఎన్నడూ లేనంతగా జనప్రవాహంతో హోరెత్తింది. యువనేతకు స్వాగతం పలికేందుకు ఉవ్వెత్తున తరలివచ్చిన అభిమానులు, కాంగ్రెస్ నాయకత్వ మంత్రాంగాన్నీ పక్కనపెట్టి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో విమానాశ్రయం సందడిగా మారింది. ఇసుకేస్తే రాలే పరిస్థితే లేదు.మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. దారులన్నీ ఎయిర్‌పోర్టుకే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అన్నివైపుల నుంచీ అభిమానులు తమ ప్రియతమ యువనేతకు స్వాగతం పలకడానికి ప్రదర్శనగా అక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఎన్‌ఏడీ జంక్షన్‌ను కలిపే జాతీయ రహదారి జనంతో నిండిపోయింది. అడుగడుగునా.. యువనేతపై ప్రేమాభిమానాలు అంబరాన్నంటాయి. గిరిజన సంప్రదాయ థింసా నృత్యాలు, వాయిద్యాలు, బైక్‌లు, కార్ల ర్యాలీలతో రోడ్లు దద్దరిల్లాయి. జాతీయ రహదారి డివైడర్ మొత్తం జగన్‌కు స్వాగత కటౌట్లతో కొలువుదీరింది.

స్తంభించిన ట్రాఫిక్
ఉదయం 10 గంటల నుంచే విమానాశ్రయం కిక్కిరిసింది. 11 గంటల ప్రాంతంలో పాత టెర్మినల్‌కు వెళ్లే రెండు రహదారులు జనాలతో కిటకిటలాడాయి. టెర్మినల్ వద్ద స్థలం సరిపోక విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో జనం సర్దుకున్నారు. గాజువాక, ఎన్‌ఏడీ తదితర ప్రాంతాల్లో జనం ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ప్రముఖుల వాహనాలు టెర్మినల్ వద్దకు చేరుకోలేక ఆమడ దూరంలోనే ఆగిపోయాయి. గోనె ప్రకాశ్‌రావులాంటి ప్రముఖ నేతలు కూడా కాలినడకను ఆశ్రయించాల్సి వచ్చింది. జగన్‌ను చూడాలన్న తాపత్రయంతో యువత విమానాశ్రయంలోని చెట్లెక్కారు. జనహోరుతో గాజువాక లాంటి ప్రాంతాల్లో కొన్ని వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది.

అంతా ‘వైఎస్’మయం
విమానాశ్రయ ప్రాంగణం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి స్మృతులతో పులకరించింది. చేతిలో వైఎస్సార్, జగన్ చిత్రాలతో కూడిన జెండా, ముఖానికి వైఎస్సార్ మాస్క్, నుదుట జగన్ యువసేన బెల్ట్‌తో ఎక్కడ చూసినా.. అభిమానులే. కార్పొరేటర్ తిప్పల నాగిరెడ్డి అనుచరగణం, టీఎన్‌ఆర్ యువసేన తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో టెర్మినల్ నుంచి పావు కిలోమీటరున్న జాతీయ రహదారికి జగన్ చేరుకోవడానికి అరగంటపైనే పట్టింది. అక్కడి నుంచి జనం ఎన్‌ఏడీ జంక్షన్ వరకు జగన్ వెంట భారీ ర్యాలీగా బయలుదేరారు.

జగన్‌కే జైకొట్టిన నేతలు
* జిల్లా మంత్రి బెదిరింపులకు తలొగ్గని కేడర్ * విమానాశ్రయంలో యువనేతకు ఘన స్వాగతం * యాత్రలో భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు

 ఓదార్పు యాత్రలో పాల్గొనకుండా పార్టీ శ్రేణులను నిలువరించేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారి లక్ష్యం నెరవేరలేదు. ఎవరెన్ని మాటలు చెప్పినా తామంతా జగన్ వెంటే ఉంటామని పార్టీ శ్రేణులు స్పష్టంచేశాయి. యాత్రలో పాల్గొని నాయకులకు స్పష్టమైన సంకేతం పంపాయి. వారిని నిలువరించడానికి జిల్లా మంత్రి పి.బాలరాజు సకల యత్నాలు చేసినా విఫలమయ్యాయి. కొంతమంది నాయకుల్ని ఆయన ప్రభావితం చేసినప్పటికీ జగన్ వెంటే మేమంటూ కేడర్ ముందుకొచ్చారు. జగన్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. యాత్రలో యువనేత వెంటే నడిచారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం మరింత ఉత్సాహంతో ఓదార్పులో పాల్గొంటోంది.

వెల్లువెత్తుతున్న మద్దతు
ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, పెనుమత్స సాంబశివరాజు, పెద్దింటి జగన్‌మోహన్‌రావు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, కుంభా రవిబాబు, నరేష్‌కుమార్ అగర్వాల్, మిలట్రీ నాయుడు, పూడి మంగపతిరావు, హనుమంతు అప్పయ్యదొర, జడ్‌పీ చైర్మన్ రామ్మూర్తి నాయుడు, పీసీసీ కార్యదర్శి పీలా ఉమారాణి, జీవీఎంసీ కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోకు, కార్పొరేటర్లు తిప్పల నాగిరెడ్డి, జి.వి.రవిరాజు, చొప్పా నాగరాజు, చింతపల్లి పోతరాజు, ఉరుకూటి అప్పారావు, కండిపిల్లి అప్పారావు, కొవగాపు సుశీల, అంగ చంద్రకళ, ఎమిలీ జ్వాల తమ కేడర్‌తో విమానాశ్రయానికి తరలివచ్చి యువనేతకు ఘన స్వాగతం పలికారు.

ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఏపీటీసీ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్‌రెడ్డి, సినీ నటుడు విజయ్‌చందర్, స్థానిక నేత విళ్లా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీపీ ఎం.సన్యాసిరావు, మునగపాక నుంచి ఎం.సంజీవరావు, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ గోపాలరాజు, అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.కిశోర్, కొణతాల రామకృష్ణ సోదరుడు లక్ష్మీనారాయణ, లక్ష్మీ సిండికేట్ అధినేత ఆడారి రవికుమార్, ముస్లిం మైనార్టీ నేత సయ్యద్ ముస్తఫా తదితరులు యాత్రలో పాల్గొని మద్దతు పలికారు. విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు వెయ్యిమంది అనుచర గణంతో జగన్‌కు మద్దతు తెలిపారు. తిప్పల గురుమూర్తిరెడ్డి పినతండ్రి ఆదిరెడ్డి మురళి తన వర్గంతో విమానాశ్రయానికి చేరుకున్నారు. పాయకరావుపేట, కె.కోటపాడు, అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో నగరానికి వచ్చారు.

No comments:

Post a Comment