* ఏడుగురు కాంగ్రెస్ ఎంపీపీలకు గాను ఐదుగురు ఇటే
* మండల కాంగ్రెస్ అధ్యక్షులూ యువనేతవైపే..
* పాడేరు, అరకు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఖాళీ
* దద్దరిల్లిన పాడేరు, హుకుంపేట సభలు
* ఏజెన్సీలో జగన్ సాహసం.. 9 గంటల పాటు ప్రయాణం
కాంగ్రెస్ పార్టీ జగన్‌ను ఒంటరి చేయాలని చూస్తే.. విశాఖలోనూ అది తారుమారైంది. ఆ పార్టీ శ్రేణులన్నీ జగన్ వెంటే సాగుతూ కాంగ్రెస్‌కు ఇక్కడ పెద్దదిక్కయిన మంత్రి బాలరాజును ఒంటరిని చేశాయి. మూడోరోజు ఓదార్పులో భాగంగా బుధవారం ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు, అరకు నియోజకవర్గాల్లో సాగిన జగన్ యాత్రకు మన్యం మొత్తం కదలివచ్చింది. నీవెంట మేమున్నామని, కాంగ్రెస్‌నూ, పదవులనూ తామూ వదిలిపెడతామని కాంగ్రెస్ శ్రేణులంతా యాత్రకు హాజరయ్యాయి. అడవులు, కొండలోయల్లో యువనేత చేసిన ఈ సాహస యాత్రకు గిరిపుత్రులు బ్రహ్మరథం పట్టారు. జగన్‌కు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చారు. రాత్రి 10 నుంచి బాగా పెరిగిన చలి విపరీతంగా వణుకుపుట్టించినప్పటికీ జనం భారీగా వచ్చారు.
ప్రజాప్రతినిధులంతా జగన్ బాటే..
మంత్రి బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పాడేరు నియోజకవర్గంతో పాటు, అరకు నియోజకవర్గాల్లో ఉన్న 11 ఏజెన్సీ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయ్యింది. ఈ మండలాల్లో కాంగ్రెస్ హస్తగతమైన ఏడు జెడ్పీటీసీ స్థానాల్లో ఆరుగురు ఆ పార్టీకి మంగళం పలికి యువనేతకు బాసటగా నిలిచారు. ముంచింగ్ పుట్ నుంచి జెడ్పీటీసీ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జెడ్పీ వైస్ చైర్మన్ పద్మ, పెదబయలు జెడ్పీటీసీ సభ్యుడు కె.సూర్యనారాయణ, చింతపల్లి-కళ్యాణి, జీకేవీధి-చందర్‌రావు, అనంతగిరి-గంగన్న దొర, హుకుంపేట-చిన్ని.. జగన్ వెంట నడిచారు. ఇక కాంగ్రెస్ హస్తగతమైన ఏడు ఎంపీపీల్లో.. ముంచింగ్‌పుట్ ఎంపీపీ-కె.కాసులమ్మ, పెదబయలు-కె.లీలావతి, అనంతగిరి-వీరభద్రరాజు, జీకేవీధి-వెంకాయమ్మ, హుకుంపేట-బాలన్నలు జగన్‌కు మద్దతు పలికారు. చింతపల్లి వైస్ ఎంపీపీ కృష్ణారావు కూడా సభలకు హాజరయ్యారు. ఇక పార్టీ మండలాధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, క్రియాశీలక కార్యకర్తలంతా యువనేత వెంట నడిచారు.
పాడేరుకు తరలివచ్చిన మన్యం..
ఉదయం మాడుగుల నుంచి బయలుదేరిన జగన్ తొలుత వంట్లమామిడిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి అడవిలో, కొండల్లో 55 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇసుకగరువులో మజ్జి కొండబాబు కుటుంబాన్ని పరామర్శించారు. సమీపంలోని లింగాపుట్ గ్రామస్తుల కోరిక మేరకు వారి ఊరికెళ్లారు. మట్టిరోడ్డులో అడవిలో 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి వారిని కలిసి వారితో మాట్లాడారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు పాడేరు చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. మన్యం జనం మొత్తం ఇక్కడికి తరలిరావడంతో పాడేరు సెంటర్ జనసంద్రాన్ని తలపించింది. అక్కడి నుంచి అరకు నియోజకవర్గ పరిధిలోని హుకుంపేటకు 4 గంటలకు చేరుకుని ఇక్కడ కూడా జగన్ ప్రసంగించారు. ఇక్కడికి కూడా జనం వేలాదిగా తరలివచ్చారు. కాంగ్రెస్ శ్రేణులన్నీ ఈ సభకు తరలివచ్చాయి. తిరిగి పాడేరు ఘాట్‌రోడ్డు మీదుగా కొండ ప్రాంతం దిగేసరికి ఏడయ్యింది.
కోడూరులో విగ్రహావిష్కరణ చేశాక కె.వల్లాపురంలలో మరో విగ్రహాన్ని ఆవిష్కరించి.. మల్లారపు కొండబాబు కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత వీరవల్లి అగ్రహారం, వడ్డాది జంక్షన్, 11:00కు బంగారు మెట్టలో విగ్రహాలు ఆవిష్కరించి వెళుతుండగా చిన్నప్పన్నపాలెం గ్రామస్తులు వైఎస్ విగ్రహాన్ని రోడ్డు మీదికి తెచ్చి జగన్ చేత పూలమాలలు వేయించి తీసుకెళ్లారు. 11:35కు దిబ్బిడిలో సుతాపల్లి జగన్నాథరావు కుటుంబాన్ని ఓదార్చిన యువనేత అక్కడ వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి బుచ్చయ్యపేట వెళ్లారు. ఇక్కడ 12:15కు వైఎస్ విగ్రహావిష్కరణ చేసి బుధవారం యాత్ర ముగించుకుని చోడవరంలో బస చేశారు.
సాహస యాత్ర
పాడేరు వెళ్లాలంటే 38 కిలోమీటర్లు ఘాట్‌రోడ్డులో దట్టమైన అడవుల మధ్య వెళ్లాలి. నక్సల్స్ ప్రాబల్యం బాగా ఉన్న ఈ ప్రాంతం మీదుగా ప్రయాణం సాహసమే. అయితే ఈ ప్రాంతంలో జగన్ పర్యటనకు ప్రభుత్వం తగినంత భద్రతా సిబ్బందిని ఏర్పాటుచేయలేదు. 40 కిలోమీటర్ల ఘాట్‌రోడ్డులో పది కిలోమీటర్లకు ఒకచోట చొప్పున నాలుగు చోట్ల మాత్రమే భద్రతా బృందాలు కనిపించాయి. మరోవైపు జగన్ ఇసుకగరువులో ఓ కుటుంబాన్ని ఓదార్చాక.. లింగాపుట్టు వెళ్లడం ఆందోళనకలిగించింది. మట్టిరోడ్డు, దట్టమైన అడవి ఉన్నా జగన్ వెళ్లి వారి బాధలు తెలుసుకున్నారు. తిరిగి పాడేరు చేరేవరకు జనంలో, శ్రేణుల్లో ఆందోళనే. ఓవైపు చీకటి, ఓవైపు భద్రతాసిబ్బంది లేమి మధ్య జగన్ సాహసోపేతమైన యాత్ర పూర్తిచేశారు.
మన్యం దైన్యంపై చలించిన జగన్
పాడేరు రూరల్, న్యూస్‌లైన్: ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ బుధవారం ఇసుకగరువులో ఓ కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా.. లింగాపుట్టులో డయేరియాతో మరణించిన కొండపల్లి రాజారావు, కొండపల్లి బాలన్న కుటుంబ సభ్యులు యువనేతను కలిసి వ్యాధులతో వల్లకాడుగా మారుతున్న తమ ఊరికి రావాలని కోరారు. వారి ఆవేదన, చెప్పిన కష్టాలు చూసి యువనేత చలించిపోయారు. వెంటనే లింగాపుట్టు గ్రామంలో మరణాలపై ఆరా తీశారు. తన యాత్రను పక్కనబెట్టి వెనువెంటనే ఆ గ్రామానికి తరలివెళ్లారు. అక్కడ గిరిజనుల మరణాలకు కారణమైన కలుషిత బావిని పరిశీలించి ప్రభుత్వ సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. 21 మంది చనిపోతే ఐదు కుటుంబాలకు మాత్రమే 5 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశారని గిరిజనులు చెప్పారు.
డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మంత్రి బాలరాజు లాంటి నేతలు వచ్చి పరామర్శించి వెళ్లారని, అయినా పూర్తిస్థాయిలో సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మాట్లాడుతూ.. 21 మంది చనిపోయిన పట్టని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. బాధిత కుటుంబాలందరికీ పూర్తిస్థాయిలో న్యాయం చేసేలా ప్రభుత్వంపైన, గిరిజన శాఖ మంత్రి బాలరాజుపైనా ఒత్తిడి తెస్తానన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునేంతవరకు తాను అండగా ఉంటానని జగన్ లింగాపుట్టు గ్రామస్థులకు హామీ ఇచ్చారు.
No comments:
Post a Comment