కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జగన్
ఇదెక్కడి న్యాయమని అడిగే నాథుడే లేడా?
వరదలో మునిగేది మనం.. మిగులు జలాలు వాళ్లకా?
65 శాతమే నీటి లభ్యతను తీసుకున్నా అడిగేవారేరీ?
పైన 100 టీఎంసీలు జలవిద్యుత్తుకు వాడుకుని సముద్రానికి మళ్లిస్తారా?
మనం రైలు అడిగితే బీహార్‌కో, బెంగాల్‌కో ఇస్తారు..
వ్యవసాయంలో నష్టం జరిగిందంటే ఆ శాఖ మంత్రి దగ్గరికి వెళ్లాలి... ఆయనేమో వేరే రాష్ట్రానికి చెందినవారు.. మనకు ప్రాధాన్యత ఇవ్వరు..
రాష్ట్రంపై వివక్ష ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఎంపీలను మనమివ్వాలి.. ప్రగతి మాత్రం వేరే రాష్ట్రాలకా? అంటూ దుయ్యబట్టారు. విశాఖ జిల్లాలో ఆరో రోజు ఓదార్పు యాత్రలో భాగంగా శనివారం రాత్రి కోటవురట్లలో పెద్ద ఎత్తున తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ‘ఒక పక్క దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల సువర్ణ పాలన చూశాం. ఆ తరువాత వైఎస్ రెండోసారి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించాక వంద రోజుల్లోనే మన మధ్య నుంచి వెళ్లిపోయారు. ఆయన లేని ఈ సమయంలో ఏం జరుగుతోందో ఒక్కసారి చూడండి. రెండేళ్లు కావస్తోంది. ఒక్క కొత్త రేషన్ కార్డూ ఇవ్వరు. ఒక్క కొత్త ఇల్లూ ఇవ్వరు. ఒక్క కొత్త పెన్షనూ ఇవ్వరు. అటువైపు చూస్తే పోలవరం ఆగిపోయింది. ఇటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి ఆలోచించిన నాథుడే లేడు. మరోవైపు కృష్ణా నదిలో మన నీటిని కట్టడి చేసే పరిస్థితి వస్తే అడిగే నాథుడే లేడు. ఆనాడు బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యతను ఆధారంగా తీసుకుంటే.. నేడు 65 శాతానికి కుదించి, మిగులు జలాల్లో వాటాను ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తుంటే.. ఇతర రాష్ట్రాల ప్రాజెక్టుల ఎత్తు పెంచుకునేందుకు అనుమతి ఇస్తుంటే అడిగే నాథుడే లేకపోతే రైతుల పరిస్థితి ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. కృష్ణా నదికి వరద వస్తే మనల్ని ముంచుతుంది. కానీ మిగులు జలాల్లో మిగిలిన రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని అంటుంటే.. ఇది అన్యాయం అని అడిగే నాథుడే లేడు.
ఒకవైపు నీటికోసం యుద్ధాలు జరుగుతున్నాయి. మహారాష్టల్రో కొయినా జలవిద్యుత్తు ప్రాజెక్టు కోసం 100 టీఎంసీలను వాడుకొని కిందికి రావాల్సిన నీటిని అటు పక్క సముద్రంలోకి వదిలిపెడితే ఇదేం న్యాయం అని అడిగే నాథుడే లేడు. ఇలా ఉంది మన పరిస్థితి. 33 మంది ఎంపీలను పంపిస్తే.. ఒక్క రైలు అడిగితే దాన్ని బీహార్‌కో.. బెంగాల్‌కో తీసుకెళతారు.. కానీ మన రాష్ట్రానికి రాదు. వ్యవసాయంలో నష్టపోయాం.. సాయం కావాలంటే వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి వెళ్లమంటారు. ఆయన ఏ మహారాష్టక్రో చెందినవారై ఉంటారు. మనకు ప్రాధాన్యం దక్కదు. ఎంపీలను మనమివ్వాలి.. ప్రగతి వేరే రాష్ట్రాలకా? ఇదేమి న్యాయం అని అడిగే నాథుడే లేడు. .’ అని జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఆకాశం వైపు చూస్తూ దేవుడా.. వైఎస్‌ను మళ్లీ పంపమని ప్రార్థిస్తున్నారు..’ అని పేర్కొన్నారు.
రైతులను మోసం చేసిన ప్రభుత్వం..
ఉదయం మన్యపురట్లలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం యువనేత మాట్లాడుతూ ‘ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. రైతు బాగుండాలని ఏడు గంటల కరెంటును తొమ్మిది గంటలకు పెంచుతామని వైఎస్ హామీ ఇచ్చి ప్రభుత్వాన్ని తెస్తే... దగ్గర దగ్గర రెండేళ్లయింది.. రైతులు ఏమైంది మా కరెంటు అని అడుగుతున్నారు. పేదలు బాగుండాలని 20 కిలోల బియ్యాన్ని 30 కిలోలకు పెంచుతామని వైఎస్ మాట ఇస్తే.. ఇప్పటి పాలకులు ఆ హామీని గాలికొదిలేశారు. ఎన్నికలయిపోయాయి కదా.. మోసం చేయొచ్చు.. మళ్లీ ఎన్నికలప్పుడు చూసుకోవచ్చు అని అనుకుంటున్నారు..’ అని విమర్శించారు.
ఏ సమస్యనూ తీర్చే పరిస్థితి లేదు: బాబూరావు
కోటవురట్ల సభలో పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావు మాట్లాడుతూ ‘వైఎస్ అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ మళ్లీ అమలు కావాలంటే యువనేతే ఆశాజ్యోతి. ప్రభుత్వం ఏ సమస్యల్నీ కూడా తీర్చే పరిస్థితి లేదు..’ అని పేర్కొన్నారు.
No comments:
Post a Comment