జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, January 6, 2011

చిన్నపల్లెలు పెద్దమనసుతో.. * మేమున్నామంటూ జగన్‌కు బాసట

ఏకమై ఎదురేగుతున్న ప్రజలు
దేవుడా.. మళ్లీ వైఎస్‌ను పంపండని జనం అంటున్నారు: యువనేత


అన్నీ చిన్న చిన్న పల్లెలే. కానీ మనసు పెద్దది. మహానేత మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన అభిమానుల కుటుంబాలను ఓదార్చేందుకు యువనేత జగన్ వస్తున్నాడన్న సమాచారం అందుకున్న పల్లెలన్నీ ఏకమై స్వాగతం పలుకుతున్నాయి. గురువారం విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధిలో సాగిన నాలుగో రోజు ఓదార్పు యాత్ర మార్గంలో ఒక్క పట్టణం కూడా లేకపోయినా.. పల్లెలన్నీ పట్టణాలను తలపించాయి. ఉదయం 10 గంటలకు చోడవరం నుంచి బయలుదేరిన జగన్.. తొలుత బుచ్చయ్యపేట మండలం రాజాం జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించి స్థానికుల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. 11.40కి తురకలపూడిలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత కరక జంక్షన్‌లో, సీతయ్యపేటలో విగ్రహావిష్కరణ చేశారు. అయితే మధ్య మధ్య కొన్ని చిన్నచిన్న పల్లెల్లో విగ్రహాలు లేకపోయినా.. జనం ఆపి మాట్లాడమని పట్టుబట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గొర్రెల పాలెంలో, అనంతరం తట్టబందలో దివంగత నేత విగ్రహాలను యువనేత ఆవిష్కరించారు. అక్కడి నుంచి రెండు గంటలకు గుడ్డిప చేరుకుని విగ్ర హం ఆవిష్కరించి ప్రసంగించారు.

ప్రతి వీధీ.. జనగోదారి


తరువాత గొంప గ్రామంలో విగ్రహం ఆవిష్కరించి వస్తుండగా.. పిల్లవాని పాలెం గ్రామస్తులు మెయిన్‌రోడ్డుపై అడ్డంగా బైఠాయించి తమ గ్రామానికి రావాలని పట్టుబట్టారు. దీంతో షెడ్యూలులో లేకపోయినా ఆ గ్రామానికి వెళ్లి వచ్చారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు రావికమతం చేరుకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది మండల కేంద్రమే అయినా పట్టణాన్ని తలపించింది. ఇక్కడి కూడలి, వీధుల్లో జనం పోటెత్తారు. భారీగా వచ్చిన జనాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ ‘ఇంతపెద్ద కుటుంబాన్ని నాన్న నాకు ఇచ్చారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను..’ అని చెబుతూ సెలవు తీసుకున్నారు. రావికమతం నుంచి కొత్తకోట వరకు దారులన్నీ జనంతో పోటెత్తాయి. మేడివాడలో కార్యక్రమం లేనప్పటికీ జనం పట్టుబట్టడంతో ఆగాల్సివచ్చింది. ఆర్జాపురంలో ఇదే పునరావృతమైంది. వీటివల్ల యాత్రలో ఆలస్యం చోటుచేసుకుంది.

ఇక దొండపూడిలో రెండు విగ్రహాలు ఏర్పాటుచేయడమే కాకుండా పల్లె అంతా ఏకమై జగన్‌కు స్వాగతం పలికింది. అయితే ప్రసంగించే సమయంలో విద్యుత్తు అంతరాయం చోటుచేసుకోవడంతో జగన్ మాట్లాడలేకపోయారు. అక్కడి నుంచి 6.30కు కొత్తకోట చేరుకున్నారు. ఇక్కడ ఎం.నారాయణమూర్తి కుటుంబాన్ని ఓదార్చారు. ఇదే గ్రామంలో మూడు వైఎస్ విగ్రహాలను ఏర్పాటుచేయడం జగన్‌ను ఉద్వేగానికి లోనుచేసింది. మూడు మూడు విగ్రహాలు ఏర్పాటుచేసి వైఎస్ మా గుండెల్లోనే ఉన్నారంటూ మీరు చూపిస్తున్న ఆప్యాయతకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేనని అన్నారు.
ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు..

రాత్రి ఏడున్నరకు కొత్తకోటలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఇక్కడికి భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ‘రెండోసారి ప్రభుత్వాన్ని తెచ్చిన వైఎస్ వంద రోజుల్లోనే చనిపోయారు. తర్వాత ఏంజరిగిందో ఒక్కసారి ఆలోచించండి.. రెండోసారి అధికారంలోకి రావడానికి ముందు రెండే రెండు వాగ్దానాలు చేశారు వైఎస్. ఇరవై కిలోల బియ్యాన్ని ముప్పై కిలోలకు పెంచడం.. ఏడు గంటల కరెంటును తొమ్మిది గంటలకు పెంచడం. మాట ఇస్తే కట్టుబడి ఉండాలని వైఎస్ చెబితే.. మరి ఈ పాలకులు ఏం చేస్తున్నారో చూడండి. ప్రభుత్వం ఏర్పాటై దగ్గర దగ్గర రెండేళ్లవుతోంది.


ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా.. వైఎస్ చెప్పినట్టు బియ్యం ముప్పై కిలోలకు ఎందుకు పెంచడం లేదూ
అని అడుగుతున్నా.. ఏడు గంటల కరెంటు తొమ్మిది గంటలకు ఎందుకు పెంచడం లేదూ అని అడుగుతున్నా.. మాట ఇచ్చేది ఎన్నికల కోసమేనా? అంటే ఎన్నికల తరువాత మాటనూ, ప్రజలనూ గాలికొదిలేయవచ్చన్న భావనలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు..’ అని జగన్ ధ్వజమెత్తారు. ‘ఐదేళ్లు సువర్ణ యుగం తెచ్చిన వ్యక్తి వైఎస్ అయితే ఇవాళ పాలకులు ఎలా ఉన్నారో చూడండి. ప్రజలు ఆకాశం వైపు చూస్తున్నారు. దేవుడా.. వైఎస్‌ను మళ్లీ పంపండి అని అడుగుతున్నారు.. అంత అధ్వానంగా సాగుతోంది ప్రస్తుత పాలన’ అని జగన్ పేర్కొన్నారు.

కొత్తకోట అనంతరం భోగాపురం, రోలుగుంట, కొమరవోలు, నిండుగొండ, చెట్టుపల్లిలలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించిన యువనేత రాత్రి 11.15 గంటలకు పెద్దబొడ్డేపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్కడితో గురువారం యాత్ర పూర్తయింది. అనంతరం జగన్ 11:30కు నర్సీపట్నంలో బసచేశారు.


నారాయణమూర్తి కుటుంబానికి ఓదార్పు


వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కొత్తకోట గ్రామానికి చెందిన ముప్పిన నారాయణమూర్తి కుటుంబాన్ని యువనేత జగన్ గురువారం సాయంత్రం ఓదార్చారు. నారాయణమూర్తి భార్య కన్నమ్మ, కుమారుడు రామన్నదొర, కోడలు నాగమణి, కుమార్తె పార్వతిలను ఆయన పేరుపేరునా పలకరించారు. అమ్మను బాగా చూసుకోమని రామన్నదొరకు సూచించారు. తన కొడుక్కి ఏదైనా పని చూపించమని కోరిన కన్నమ్మకు తాను ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని కుమారుడు రామన్నదొరకు సూచించారు. ఇంతటి గొప్ప వ్యక్తి తన ఇంటికి వచ్చి తమను ఓదార్చి కొండంత ధైర్యాన్నివ్వడం ఆనందంగా ఉందని నారాయణమూర్తి కుటుంబసభ్యులు ఆనందబాష్పాలతో తెలిపారు.

No comments:

Post a Comment