జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Saturday, September 4, 2010

పదవిస్తారా పంపిస్తారా!: కడప ఎంపీ వైఎస్ జగన్ కు షోకాజ్‌ ?

ముఖ్యమంత్రిని చేయడమో, బయటకు పంపడమో!
అదిష్ఠానం ముందు రెండే దారులు...
దేనికైనా సిద్ధం
ఓదార్పపై మరో మాట లేదు..
సన్నిహితులకు జగన్ స్పష్టీకరణ
ఆర్భాటంగా 'ప్రకాశం ఓదార్పు'.. 250 వాహనాలతో కదిలిన కడప ఎంపీ
'కాబోయే సీఎం' నినాదాల జోరు...
8 మంది ఎమ్మెల్యేలు యాత్రకు దూరం
పీసీసీ నివేదిక కోరిన అదిష్ఠానం?.. దాని ద్వారానే చర్య
'ఒకటి నన్ను సీఎంను చేయడం! రెండు... పార్టీ నుంచి బయటకు పంపడం!'
కాంగ్రెస్ అధిష్ఠానానికి కడప ఎంపీ వైఎస్ జగన్ ఇచ్చిన ఆప్షన్లు ఇవి! అంతేకాదు... తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని కూడా జగన్ మోహన్ రెడ్డి తన సన్నిహితులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం...

శుక్రవారం ఇడుపులపాయ నుంచి ప్రకాశం జిల్లాకు బయలు దేరే ముందు జగన్ కొందరు సన్నిహితులతో మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణపై తన మనసులో మాట బయటపెట్టారు. ఓదార్పుపై మరో మాటకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తనకు సంబంధించి అధిష్ఠానం ముందు రెండే రెండు మార్గాలున్నాయని తెలిపారు. ఒకటి సీఎం పదవి అప్పగించడమైతే... రెండో మార్గం పార్టీ నుంచి పంపించడమని వివరించారు. పార్టీ నేతలంతా తన వెంట నడిస్తేనే మంచిదని జగన్ పేర్కొన్నట్లు తెలిసింది.

పీసీసీ ద్వారా చర్యకు శ్రీకారం?
పార్టీని ధిక్కరిస్తున్న వైఎస్ జగన్‌తోపాటు మరికొందరు పార్టీ నేతలపై పీసీసీ నుంచి నివేదిక తెప్పించుకున్న తర్వాత చర్య తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. జగన్ వైఖరితోపాటు ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న నేతల గురించి నివేదిక ఇవ్వాల్సిందిగా అధిష్ఠానం పీసీసీని కోరినట్లు సమాచారం. ఢిల్లీలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో జగన్ విషయమై పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అధిష్ఠానం కూడా ఒక పథకం ప్రకారం జగన్‌పై చర్యకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్ర పూర్తయిన తర్వాతే ఇతర ప్రాంతాల్లో పర్యటించే విషయం పరిశీలిస్తానని జగన్ వీరప్ప మొయిలీకి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం చర్య తీసుకోకుండా కొద్ది కాలం ఆగితే... బలం పుంజుకోవచ్చని జగన్ ఈ ఎత్తుగడ వేశారని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ అధిష్ఠానం ప్రదర్శించిన మౌనం వల్ల ఏదైనా కీడు జరిగిందో లేదో తెలియదని, ఇక ముందు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే మాత్రం పార్టీకి ప్రమాదమని రాష్ట్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.

అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటున్న ప్రజా ప్రతినిధులపై జగన్ వర్గం నుంచి ఒత్తిడి పెరుగుతోందని.. ఈ సమయంలో అధిష్ఠానం ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించకపోతే.. తమకు రాజకీయంగా నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే... అధిష్ఠానం ఇప్పటికే దీనిపై వ్యూహ రచన చేస్తోందని.. తన వైఖరిని వెల్లడిస్తుందని మరికొందరు నేతలు అంటున్నారు.

250 వాహనాలతో ఓదార్పు 'యాత్ర'
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ హితోక్తులు జగన్‌ను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయని స్పష్టమైపోయింది. ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రను జగన్ గతంలోకంటే అట్టహాసంగా ప్రారంభించారు. జగన్‌తోపాటు ఇడుపులపాయ నుంచి 250కి పైగా వాహనాలు కదిలాయి. ముందుకు కదిలేకొద్దీ వాహనాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో.. వీటి సంఖ్య 750 వరకూ చేరిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ వాహనాల్లోని వారి సంఖ్యే 3750 మంది వరకూ ఉంటుందని చెబుతున్నారు. స్థానికంగానూ భారీగానే జన సమీకరణ జరిగినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలు దూరం
అధిష్ఠానం ఆదేశాలు కచ్చితంగా తెలిసిన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన వైఖరిని బయటపెట్టారు. తొలి రోజు యాత్రలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, దర్శి ఎమ్మెల్యే శివప్రసాద రెడ్డి మాత్రమే యాత్రలో పాల్గొన్నారు. మిగిలిన 8 మంది... దగ్గుబాటి వెంకటేశ్వర రావు (పర్చూరు), ఎ.సురేశ్ (ఎర్రగొండపాలెం), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), ఆమంచి కృష్ణ మోహన్ (చీరాల), బీఎన్ విజయకుమార్ (సంతనూతలపాడు), మహీధర్ రెడ్డి (కందుకూరు), జీవీ శేషు (కొండెపి), ఉగ్ర నరసింహారెడ్డి (కనిగిరి) ఓదార్పు యాత్రకు దూరంగా ఉన్నారు. అధిష్ఠానంతో నేరుగా భేటీ అయినందున ప్రకాశం జిల్లాలో మెజారిటీ ప్రజా ప్రతినిధులు ఓదార్పు యాత్రకు దూరంగా ఉంటారని జగన్ వర్గం ముందే ఓ అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ ఏ జిల్లాలోనూ జరగనంత జన సమీకరణ ఈ జిల్లాలో జరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు.

సొంత బాటే..
జగన్ తన ప్రసంగంలో ఎప్పట్లాగానే అధిష్ఠానం ప్రస్తావన తీసుకురాలేదు. అధిష్ఠానం స్వయంగా ప్రకటించిన 'ఓదార్పు' గురించి కూడా మాట్లాడలేదు. ఫ్లెక్సీలలో సోనియా ఫొటోలు కనిపించలేదు. జగన్ కూడా తన ప్రసంగాల్లో సోనియా మాటెత్తలేదు. 'కాబోయే సీఎం జగన్' అనే నినాదాలు గతంలోకంటే ఎక్కువగా మిన్నంటాయి. జగన్ ఈ నినాదాలను ఆపే ప్రయత్నం చేయలేదు. 
జగన్‌కు షోకాజ్‌ ?
jagan--odaru
కడప ఎంపీ వైఎస్‌ జగ న్మోహన్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు జారీ చేసేందుకు ఏఐసీసీ లో రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో అతనికి నోటీసు ఇచ్చే అవకాశాలున్నట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం. అధిష్ఠానం ఆదేశాలను సైతం ధిక్క రిస్తూ జగన్‌ ఓదార్పు యాత్రకు బయలు దేరడంపై ఢిల్లీలో పార్టీ పెద్దలు, ప్రధానంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహా రాల ఇన్‌చార్జీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ఓదార్పుకు వెళ్ళొద్దని స్వయంగా నచ్చజెప్పినా వినకుండా జగన్‌ యాత్రకు బయలు దేరాడు. దీంతో హైకమాండ్‌ ఇక అతని విషయంలో ఏ మాత్రం ఉపేక్షించడం మంచిది కాద నే నిర్ణయానికి వచ్చినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.

రెండు, మూడు రోజుల్లో జగన్‌పై వేటు వేయడం ఖాయ మని హస్తిన వాతావరణం ద్వారా స్పష్టమవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ ఎ.ె .ఆంటోని, సభ్యులు మోతీలాల్‌వోరా తదితరులు రెండు రోజుల్లో సమావేశమై జగన్‌ పై వేటు వేసే విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దాని కంటే ముందు పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌, రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్‌ నేతల అభిప్రాయాన్ని కూడా పార్టీ తెలుసుకుంటుందని వినిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, శాసన సభలో పార్టీ నేత, మంత్రి జె.గీతారెడ్డి 24 గంటలు గడవక ముందే శుక్రవారం మరో సారి ఢిల్లీ బయలు దేరి వెళ్ళారు. నాలుగవ సారి పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఎన్నికైనందుకు ఆమెకు అభినందనలు తెలియ జేసేందుకు వీరు ఢిల్లీ వెళ్ళినట్లు బయటికి చెబుతున్నప్పటికీ, అసలు జగన్‌పై చర్యలు తీసుకునే విషయంలో చర్చించేందుకే వారిని పార్టీ హైకమాండ్‌ హుటా హుటిన పిలిపించినట్లు ఎఐసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఓదార్పు యాత్ర పట్ల అధినేత్రి అగ్రహంతో ఉన్నారని, వైఎస్‌ బాధితులను పార్టీ పరంగా ఓదార్చి ఆర్ధిక సహాయం అందజేస్తామని ప్రకటించినందున ఇక ఓదార్పు యాత్ర మానుకోవాలని గురువారం ఇడుపుల పాయలో వైఎస్‌ వర్ధంతిలో పాల్గొనేందుకు ఎఐసీసీ దూతగా వచ్చిన మొయిలీ జగన్‌కు నచ్చజెప్పారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్లు సైతం అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జగన్‌కు హితవు పలికారు. పార్టీ అధినేత్రి సోనియా వ్యతి రేకంగా ఉన్నా, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీ మొయిలీ వద్దని వారించినా వినిపించుకో కుండా జగన్‌ శుక్రవారం ఉదయం నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర కు బయలు దేరారు. ఎఐసీసీ నేతలు జగన్‌ వద్దకు మొయిలీ రూపంలో రాయ బారం పంపించినా ఫలితం లేక పోవడంతో ఇక అతనిపై చర్యలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర ద్వారా బలప్రదర్శనకు జగన్‌ సిద్ధం కావడంతో హైకమాండ్‌ అతనిపై సీరియస్‌గా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

నేడు డిఎస్‌, గీతాతో భేటి కానున్న సోనియా

పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నిక కావడంతో అభినందనలు తెలియజేయడానికి వచ్చే పార్టీ నేతలతో శుక్రవారం బిజీ బిజీగా ఉన్న సోనియా శనివారం నుంచి రాష్ట్రాల వారిగా పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు ఎఐసీసీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షురాలిగా గెలిచిన తరువాత ఆయా రాష్ట్రాల పీసీసీ అధ్య క్షులు, ముఖ్యమంత్రులు, సిఎల్పీ నేతలతో సోనియా సమావేశం కావడం సంప్రదాయంగా వస్తుంది. అందులో భాగంగానే శనివారం పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, గీతారెడ్డిలతో సోనియా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జగన్‌ వ్యవహారం, రోశయ్య ఆరోగ్య పరిస్థితులు వంటి ఆంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జగన్‌పై చర్యలు తీసు కుంటే రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు ఎలా ఉంటాయి? తదితర విషయాలను చర్చించే అవకాశం ఉన్నట్లు ఎఐసీసీవర్గాల ద్వారా తెలు స్తోంది. రాష్ట్ర నేతలు సోనియాకు సమర్పించే నివేదిక ద్వారా ఎఐసీసీ క్రమశిక్షణ సంఘం జగన్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేసే అవకాశాలుంటాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

No comments:

Post a Comment