జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Sunday, December 26, 2010

సర్కారు ఉందా ? ...... నేతన్నలు, రైతన్నల ఆత్మహత్యలపై చలించరేం ? ......


చేనేత రుణాలను వైఎస్ మాఫీ చేస్తే అమలేదని ప్రశ్న.. ధర్మవరంలో నేత కార్మికుల దీక్షకు సంఘీభావం
ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్
ప్రభుత్వంపై వైఎస్ జగన్ నిప్పులు

పనుల్లేక రాష్ట్రంలో 26 మంది నేతన్నలు మరణించారు
వారి ఆక్రందనలు, ఆకలి కేకలు సర్కారుకు వినపడవా?
రూ.312 కోట్ల నేత రుణాలను వైఎస్ మాఫీ చేస్తే.. ఏదీ అమలు?
చేనేత రంగానికి తక్షణమే రూ.600 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారమివ్వాలి
50 శాతం రాయితీపై ముడిసరుకులివ్వాలి.. ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలి

‘రాష్ట్రంలో నేతన్నలు, రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్ర ప్రభుత్వంగానీ రాష్ట్ర ప్రభుత్వంగానీ చలించడం లేదు. అసలు ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా?’ అని యువనేత వైఎస్ జగన్ ఘాటుగా ప్రశ్నించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో 12 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న చేనేత కార్మికులను శనివారం కలుసుకున్న ఆయన వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. అనంతరం అక్కడవేలాదిగా గుమికూడిన ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..  
ప్రభుత్వం మొద్దునిద్రపోతోంది

‘రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధిక శాతం మంది ఆధారపడిన రంగం చేనేతే. ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. కానీ.. నేతన్నలు తయారు చేసిన ఉత్పత్తులకు మాత్రం మార్కెట్లో సరైన ధరలు లభించడం లేదు. దీని వల్ల నేతన్నలకు నష్టాలే మిగులుతున్నాయి. చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడం వల్ల విధిలేని పరిస్థితుల్లో మగ్గాలను చుట్టేశారు. చేయడానికి పనుల్లేక.. పూటగడవని దుస్థితిలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే వారం రోజుల్లో ముగ్గురు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో 26 మంది అసువులు బాశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదు. మొద్దునిద్ర పోతోంది.’
రేషం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి..
‘ఒక్క అనంతపురం జిల్లాలో ఉన్న నేత కార్మికులకే ఏడాదికి 12 లక్షల కేజీల పట్టుదారం(రేషం) అవసరమైతే.. జిల్లాలో కేవలం 2.30 లక్షల కేజీల పట్టుదారం మాత్రమే ఉత్పత్తి అవుతుంది. కర్ణాటక నుంచి 4.50 లక్షల కేజీలు దిగుమతి చేసుకుంటుంటే.. తక్కిన 5.20 లక్షల కేజీల కోసం చైనా వైపు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం మల్బరీ సాగును ప్రోత్సహించి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేకాదు. రేషం కోసం చైనా వైపు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడటం వల్లే ముడిసరుకుల ధరలు పెరిగిపోయాయి. రేషం ధరలు ఏడాది క్రితం రూ.1,600 ఉంటే.. ఇప్పుడు రూ.3,400కు పెరిగింది. దాంతో ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. చీరలను మాత్రం ఆ ధరలకు కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. చేనేత పరిశ్రమ సంక్షోభంలో పడటం వల్ల ధర్మవరంలోనే 60 వేలకుపైగా మగ్గాలు మూతపడ్డాయి. కార్మికులందరూ వీధిన పడ్డారు. తినడానికి అన్నం కూడా లేక నేతన్నలు ఆకలికేకలు, ఆర్తనాదాలు చేస్తోంటే.. అవి ప్రభుత్వానికి విన్పించడం లేదా?’
నాడు ఎన్‌టీఆర్.. ఆ తర్వాత వైఎస్..
‘చేనేత పరిశ్రమను ఒకప్పుడు దివంగత నేత ఎన్.టి.రామారావు ఆదుకుంటే.. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేయూతనిచ్చారు. ఎన్‌టీఆర్, వైఎస్సార్ మినహా ఏ ఒక్కరూ నేతన్నలను ఆదుకోలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీఎంగా పనిచేసిన కాలంలో రాయితీలన్నీ ఎత్తివేసి నేతన్నల నడ్డివిరిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నేతన్నలకు ఎన్నో రాయితీలు కల్పించి.. ఉత్పత్తి చేసిన వస్తువులను ఆప్కో ద్వారా కొనుగోలు చేయించి, ఆదుకున్నారు. అందువల్లే వైఎస్ పాలనలో చేనేత రంగం మెరుగ్గా ఉండేది. నేతన్నలను ఆదుకోవాలనే లక్ష్యంతో రూ.312 కోట్ల రుణాలను వైఎస్ మాఫీ చేశారు. కానీ.. వైఎస్ నిర్ణయాన్ని ప్రభుత్వం ఇప్పటివరకూ అమలు చేయకపోవడంలో ఆంతర్యమేమిటి? అసలు నేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తారో లేదో ఈ ప్రభుత్వం చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దునిద్రపోతుండటం వల్లే చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది.’
ప్రభుత్వమా.. ప్రతిష్టకు పోవద్దు
‘వైఎస్ జగన్ ధర్మవరానికి వచ్చారని.. నేత కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారని.. ఇప్పుడు స్పందిస్తే ఆ క్రెడిట్ జగన్‌కే దక్కుతుందని ప్రభుత్వం ప్రతిష్టకు పోవద్దు. విధిలేని పరిస్థితుల్లో ఆకాశం వైపు చూస్తూ దేవుడా నువ్వే మాకు దిక్కు అని నేతన్నలు కన్నీరు కారుస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా నేత కార్మికుల కన్నీళ్లు తక్షణమే తుడవాలి.’
ఈ డిమాండ్లు తీర్చండి
దీక్ష చేస్తున్న నేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న జగన్.. వారి తరఫున ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లివీ..
చేనేత రంగానికి తక్షణమే రూ.600 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి.
ప్రతి చేనేత కార్మికుడికీ రూ.లక్ష చొప్పున పావలా వడ్డీకే రుణం ఇప్పించాలి.
ఆత్మహత్యలు చేసుకున్న రైతు, నేతన్నల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలి.
50 శాతం రాయితీపై ముడిసరుకులను నేతన్నలకు సరఫరా చేయాలి.
నేతన్నలు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలి.
పవర్‌లూమ్స్ నియంత్రించడానికి జిల్లాకు ఒక ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటుచేయాలి.
అనారోగ్యం కారణంగానే ఎమ్మెల్యే రాలేదు
‘అనారోగ్యంతో ఉన్నానని, కార్యక్రమానికి రాలేనని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నాకు ఫోన్ చేసి చెప్పారు. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి రాలేదు’ అని యువనేత జగన్ చెప్పారు. దీక్షకు సంఘీభావం తెలిపే కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హాజరు కాలేదు. దీంతో ఈ కార్యక్రమాన్ని ధర్మవరం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇదే సందర్భంలో పలువురు పట్టణ వాసులు ఎమ్మెల్యే గైర్హాజరుపై పలు రకాలుగా చర్చించుకున్నారు. అయితే ఈ విషయంపై జగన్ తన ప్రసంగం పూర్తయ్యాక ప్రత్యేకించి చెప్పడంతో చర్చకు తెరపడింది.
 ప్రతి దారీ.. జనహోరే
పులివెందుల నుంచి ధర్మవరం దాకా జగన్ కోసం బారులు తీరిన జనం..
దీక్షా శిబిరానికి అతికష్టంపై చేరిన యువనేత
నేత కార్మికుల కోసం పోరాడతానని భరోసా
కిక్కిరిసిన ధర్మవరం సెంటర్‌లో ఉద్వేగభరిత ప్రసంగం
 అనంతపురం జిల్లా ధర్మవరంలో 12 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న చేనేత కార్మికులను పరామర్శించడానికి వెళ్లిన యువనేత జగన్‌కు దారిపొడవునా ప్రజలు నీరాజనం పలికారు. శనివారం మధ్యాహ్నం పులివెందుల నుంచి బయల్దేరిన ఆయన ముదిగుబ్బ, బత్తలపల్లి మీదుగా ధర్మవరం చేరుకున్నారు. ఆయన్ను చూడ్డానికి, చేయి కలపడానికి తరలివచ్చినవారితో ధర్మవరం పట్టణ వీధులన్నీ ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. కళాజ్యోతి సర్కిల్ నుంచిగాంధీ నగర్ వరకు, ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ సర్కిల్ నుంచితేరు బజారు వరకు జనమే జనం. రోడ్డుకిరువైపులా ఉన్న మిద్దెలపై కూడా అభిమానులు నిండిపోయారు. వైఎస్‌ఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన దీక్షల శిబిరం వద్దకు వెళ్లి చేనేత కార్మికులకు జగన్ సంఘీభావం తెలిపారు. వారి సమస్యలు, డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు. తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. నేతన్నల తరఫున మడమ తిప్పకుండా పోరాడతానని హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి చేనేత సమస్యలపై మాట్లాడారు.

యువనేత వైఎస్ జగన్ శనివారం ఉదయం పులివెందుల నుంచి బయల్దేరి ఉదయం 11.20కు అనంతపురంజిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లుకు చేరుకున్నారు. దొరిగల్లు రోడ్డులో మహిళలు అధిక సంఖ్యలో చేరి.. బాణసంచా కాలుస్తూ వేచిచూశారు. జగ న్ కాన్వాయ్‌ను చూడగానే వారు సైతం ఈలలు, కేకలు వేశారు. కాన్వాయ్ ఆపాల్సిందేనంటూ నినాదాలు చేశారు. వీరి కోరిక మేరకు జగన్ వాహనం నుంచి కిందకు దిగి ‘బాగున్నారా’ అంటూ ఆప్యాయంగా పలుక రించి ముందుకు కదిలారు. ఈ సందర్భంగా ఓ మహిళ యువనేతకు అరటిపండు తినిపించి రాఖీ కట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు ముదిగుబ్బకు చేరుకున్నారు. అక్కడ వేలాది జనం జననేతకు ఘనస్వాగతం పలికారు. ముదిగుబ్బ నుంచి బత్తలపల్లి రహదారికి ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు రోడ్డుపైకి వచ్చి.. యువనేతను చూడటానికి ఎగబడ్డారు. దాంతో.. బత్తలపల్లికి చేరుకోవడానికి గంట సమయం పట్టింది. మధ్యాహ్నం 1.30కు ధర్మవరం శివారు ప్రాంతాలకు చేరుకున్నారు. అక్కడి నుంచి చేనేత కార్మికుల రిలే నిరాహారదీక్షలు చేస్తున్న ప్రాంతానికి చేరుకునే సరికి 45 నిమిషాలు పట్టింది. రోడ్లన్నీ జనసంద్రాలవడంతో దీక్షల శిబిరం వద్దకు అతికష్టంమీద ఆయన చేరుకున్నారు. ఇక్కడ రికార్డు స్థాయిలో ప్రజలు పోటెత్తడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. నేతన్నలను కలిసిన అనంతరంజగన్ బెంగళూరు వెళ్లారు. మార్గమధ్యంలో అభిమానుల కోరిక మేరకు పెనుకొండ, బెహలూల్‌షా దర్గా, సోమందపల్లెలో సైతం వాహనం నుంచి బయటకు వచ్చి అభివాదం చేశారు. బెంగళూరు నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు.
లక్ష్య దీక్షలో ప్రముఖంగా ప్రస్తావించిన యువనేత
చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడంతో మగ్గాలు చుట్టేసిన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్మవరంలోని వైఎస్‌ఆర్ సర్కిల్‌లో రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. ఈ విషయాన్ని రైతులు, నేతన్నలకోసం విజయవాడలో నిర్వహించిన లక్ష్య దీక్ష ప్రారంభ, ముగింపు సభల్లో జగన్ ప్రముఖంగా ప్రస్తావించారు. లక్ష్య దీక్ష పూర్తయిన తర్వాత.. నేతన్నల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు శనివారం ధర్మవరంలో పర్యటించాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి శుక్రవారం తెల్లవారుజామునే రిలే నిరాహారదీక్షల శిబిరాన్ని ఎత్తివేయించింది. శుక్రవారం నుంచి నేత కార్మికులు మండుటెండలోనే రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు.
 

No comments:

Post a Comment