జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Wednesday, December 22, 2010

అకుంఠిత దీక్ష * మెతుకు ముట్టకుండా.. మడమ తిప్పకుండా

* జగన్‌తోపాటే దీక్ష కొనసాగిస్తున్న రైతులు, నేతన్నలు, ప్రజాప్రతినిధులు
* కృష్ణాతీరాన గజగజలాడిస్తున్న చలినీ లెక్కచేయని జనం
* రెండోరోజు అన్నదాతల బాధలు వినడానికే ప్రాధాన్యమిచ్చిన జగన్
* బుధవారమూ జనప్రవాహం.. పోటెత్తిన మహిళలు
* దీక్షకు మద్దతుగా 29 మంది ఎమ్మెల్యేల హాజరు..
* తరలివచ్చిన ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు... రైతన్నలకు భరోసా
* ‘లక్ష్యదీక్ష’ ప్రారంభమై రెండురోజులైనా స్పందించని సర్కారు
* కాంగ్రెస్ నాయకులను బుజ్జగించే యత్నాలకే ప్రాధాన్యం!
* నేడు 9 గంటల నుంచి దీక్ష విరమణ కార్యక్రమం


‘జగనన్న దీక్షకు వస్తుంటే మా మంత్రిగారు వద్దని ఫోన్ చేశారు. సమస్యలన్నీ తీరుస్తానన్నా లెక్కచేయలేదు. దీక్షకాడికి వచ్చి నిన్నటి నుంచీ ఇక్కడే ఉన్నా’..
- రైతు నన్నపనేని ఉల్లయ్య, గుంటూరు జిల్లా చిడుముక్కల వాసి

‘ఆదివారం రాత్రే ఇక్కడికొచ్చాం. మా ఓళ్లంతా తలా కొంత వేసుకుని లారీ మాట్లాడుకున్నాం. అది పట్టకపోతే కొందరు రైలుకొచ్చారు. మా పంటలన్నీ పోయాయి. మా బాధలు వైఎస్ బిడ్డకు చెప్పుకుందామని వచ్చాం’..
-అరవరెడ్డి, ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొత్తూరు రైతు

‘పొలంలో పనులున్నాయ్.. కోతలు కోయాలి.. ఆ పని తర్వాతైనా చేసుకోవచ్చని మా కోసం కష్టపడుతున్న జగన్ కోసం వచ్చా’...
-మరో రైతు మోహన్‌రెడ్డి
..యువనేత వైఎస్ జగన్ ‘లక్ష్య దీక్ష’ చేస్తున్న వైఎస్‌ఆర్ ప్రాంగణంలో ఏ రైతును కదిలించినా ఇవే మాటలు.. ఇవే అనుభవాలు. నేతలు వద్దన్నా, తమకెన్నో పనులున్నా పక్కనపెట్టి.. తమ కోసం పోరాడుతున్న జగన్ కోసం తరలివచ్చిన అన్నదాతలు, చేనేత కార్మికులు యువనేతతోపాటే మొక్కవోని దీక్ష కొనసాగిస్తున్నారు. 48 గంటలు పూర్తయ్యేదాకా మెతుకు ముట్టబోమంటున్నారు. మంగళవారం నిరాహార దీక్ష మొదలు పెట్టిన జగన్‌తోపాటు రైతన్నలు, నేతన్నలు రాత్రంతా గజగజలాడించే చలిలోనే తమ దీక్షను కొనసాగించారు. అసలే చలికాలం.. దీనికితోడు కృష్ణాతీరం.. చల్లటి గాలులు.. అయినా వారు బెదరలేదు. రెండురోజుల నుంచి అక్కడే తిరుగుతూ, నేతల ప్రసంగాలు వింటూ ఎంతో ఓపిగ్గా టెంట్లలోనే గడుపుతున్నారు.

దీక్ష రెండో రోజు బుధవారం వివిధ జిల్లాల నుంచి వరుసగా వస్తున్న రైతులను వేదికపైకి పిలిచించి వారి కష్టాలను అడిగి తెలుసుకోవడానికే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. వారి బాధలు తెలుసుకుని.. వాటిని పరిష్కరించడమెలా అన్న అంశంపైనే దృష్టి కేంద్రీకరించారు. దీక్షకు మద్దతు పలికేందుకు, జగన్‌ను చూసేందుకు బుధవారం రాష్ట్రం నలుమూలల నుంచీ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు రైళ్లలో, బస్సుల్లో.. ఏ వాహనం అందుబాటులో ఉంటే అందులో విజయవాడకు తండోపతండాలుగా తరలివచ్చారు. వేదిక వద్దకెళ్లి జగన్‌తో చేయి కలిపారు. వీరిలో ఎక్కువ శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ తాకిడిని ఊహించలేక మంగళవారం చేతులెత్తేసిన పోలీసులు బుధవారం భద్రతను పెంచారు. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించి భారీ స్థాయిలో మోహరించారు. మంగళవారం విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లు, ఏఆర్ సిబ్బంది కలిపి 600 మందితో లక్ష్య దీక్షకు బందోబస్తు ఏర్పాటుచేశారు.

ప్రజాప్రతినిధుల సంఘీభావం: సామూహిక నిరాహార దీక్షకు బుధవారం కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి రైతులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరాగా, దీక్షకు బుధవారం 29 మంది ఎమ్మెల్యేలు సంఘీభావం ప్రకటించడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆందోళన చెందినట్లు, ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి ఎమ్మెల్యేల బుజ్జగింపు చర్యలకు పూనుకున్నట్లు సమాచారం. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. తొలిరోజు జగన్ దీక్షకు సంఘీభావం ప్రకటించిన చాలా మంది ఎమ్మెల్యేలు రెండోరోజుకూడా శిబిరం వద్దనే కనిపించారు. వీరు కాక రెండో రోజు అదనంగా మరో ఆరుగురు ఎమ్మెల్యేలు జగన్ దీక్షకు సంఘీభావం ప్రకటించడం గమనార్హం. పీసీసీ మాజీ కార్యదర్శి కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, కర్నూలు రైతు నాయకుడు పి.మురళీధర్‌రెడ్డి తదితర నాయకులు యువనేతతోపాటే దీక్ష కొనసాగిస్తున్నారు. కాగా వంగపండు ఉష తదితర కళాకారులు ఆలపించిన పాటలు సభికులను ఉత్తేజపరిచాయి.

చలి పులి: వేలాదిమంది రాత్రంతా యువనేతకు సంఘీభావంగా నిరాహారదీక్ష చేస్తూ అక్కడే నిద్రించారు. ఆరుబయలు, పైగా నదీతీరం కావడంతో చల్లగాలి విపరీతంగా ఉంది. రాత్రి అక్కడే పడుకున్నవారు రగ్గులను, కూర్చోవడానికి షామియానాలో వేసిన పట్టాలను కప్పుకున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచే అభిమానులు దీక్షా స్థలానికి తరలిరావడం ప్రారంభమైంది. మచిలీపట్నం నుంచి రెండువేల మంది ఆటోలు, బస్సులలో ప్రదర్శనగా విజయవాడకు వచ్చారు. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని రాకపోయినా ఆయనే దగ్గరుండి వీరిని పంపించారు.

ఆరుబయటే జగన్ దీక్ష: వేదికపై షామియానా వేయడానికి యువనేత జగన్ అంగీకరించకపోవడంతో ఆరుబయటే ఆయన దీక్ష సాగింది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడంతో రాత్రి వేళలో చలి ఎక్కువగా ఉంది. మంగళవారం రాత్రి 14 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినా జగన్ వేదికపైనే నిద్రించారు. కాగా గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ముగింపు సభకు వివిధ జిల్లాల నుంచి అభిమానులు పెద్దఎత్తున వస్తున్నట్లు నిర్వాహకులకు సమాచారం అందింది. వరుస వర్షాలతో పండిన పంటంతా నీటిపాలై నిస్సహాయులుగా మిగిలి పోయిన రైతు సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట డిమాండ్లతో యువనేత ‘లక్ష్యదీక్ష’ ప్రారంభిస్తే, వాటి పరిష్కారంపై ప్రభుత్వం ఇంతవరకూ పెదవి విప్పలేదు. దీంతో ప్రభుత్వ వైఖరిపై జగన్ తన దీక్ష ముగింపు ప్రసంగంలో ఎలా విరుచుకు పడతారో అన్న ఉత్కంఠ అటు అశేష రైతుల్లోనూ, ఇటు నేతల్లోనూ కనిపిస్తోంది.
వైఎస్ ఉన్నప్పుడే ధీమా..

రెండేళ్ల నుంచి సాగు చాలా కష్టంగా మారిందని, ఎంత చేసినా చివరికి మిగిలేది నష్టమేనని లక్ష్య దీక్షకొచ్చిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్నామని, లోన్లు కూడా సరిగా రావడంలేదని నూజివీడుకు చెందిన శ్రీనివాసరావు ‘న్యూస్‌లైన్’ వద్ద ఆవేదన వ్యక్తంచేశాడు. వైఎస్ ఉన్నప్పుడు ధీమాగా ఉండేవాళ్లమని, ఇప్పుడు అది లేదని వాపోయాడు. ఎంత నష్టమొచ్చినా, కష్టమొచ్చినా పట్టించుకునేవారు కనిపించడంలేదని కృష్ణా జిల్లా కంకిపాడుకుచెందిన వృద్ధ రైతు రావి గోపాలరావు చెప్పుకొచ్చారు. తమ కోసం జగన్ చేసిన డిమాండ్లు అమలుచేస్తే బయటపడతామని, లేకపోతే ఆకలి చావులే గతని రైతులు వాపోతున్నారు. లక్ష్య దీక్షకొచ్చిన వారిలో ఎక్కువ మంది ఇలాంటి రైతులే.


బస్తీమే సవాల్‌ !
Bastime 
వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జరుపుతున్న లక్ష్య దీక్షతో రైతుల విషయంలో సర్కార్‌ ధోరణి ఏమాత్రం మారకపోయినా, మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నది. తన తండ్రి రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఏ ప్రయత్నమూ చేయబోనని, మాట తప్పనని, మడమ తిప్పనని జగన్‌ చెబుతున్నప్పటికీ ఆయన వర్గం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. జగన్‌ వర్గంలో ప్రముఖులుగా పేరు పొందిన వారు కాంగ్రెస్‌ నాయకత్వానికి సవాళ్ళు విసరటం ప్రారంభమైంది. ఆ సవాళ్ళ తీవ్రత ఏ స్థాయికి చేరిందంటే దమ్ముంటే జగన్‌ దీక్షకు వచ్చి మద్దతు పలికిన వారిపై చర్య తీసుకుని చూడాలనే దాకా వెళ్ళింది. షోకాజులు పంపిస్తే పార్టీకి రాజీనామాలు చేస్తామనే స్థాయికి చేరుకుంది. ఇటు కాంగ్రెస్‌ నాయకత్వం దీనిపై స్పందించక పోయినా, ఒకరిద్దరు మంత్రులు జగన్‌ వర్గం కన్న ముందే సవాళ్ళు విసరటం ప్రారంభించారు. విశాఖలో మంత్రి శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ జగన్‌ దీక్షకు వెళ్ళిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలిచి గెలవాలని సవాల్‌ చేశారు. వారు అలా చేస్తే తానూ రాజీనామా చేసి ఎన్నికల్లో నిలుస్తానన్నారు. మరో మంత్రి డీఎల్‌ రవీంద్రరెడ్డి మరో మెట్టు ముందుకు పోయి జగన్‌ వర్గీయులు రాజీనామాలు చేసి ఎన్నికల్లో నిలిస్తే డిపాజిట్లు అయినా దక్కవన్నారు.

అనకాపల్లి ఎంపీ సబ్బం హరి సైతం గళం పెంచారు. జగన్‌ విశాఖలో జరిపే ఓదార్పు యాత్రకు తప్పనిసరిగా హాజరవుతానని ఇప్పటికే ప్రకటించిన ఆయన లక్ష్య దీక్షకూ వచ్చారు. అక్కడే మాట్లాడుతూ ఓదార్పు యాత్రకు కానీ, లక్ష్య దీక్షకు కానీ వెళ్ళవద్దని అధిష్ఠానం తనకు చెప్పలేదని, ఒకవేళ ఇదే తప్పని భావించి షోకాజ్‌ నోటీసు ఇస్తే పార్టీకీ, పదవికీ రాజీనామా చేసి జగన్‌తోనే ఉంటానని తేల్చి చెప్పారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎంపీలు ఎవరినీ కలవాలని పిలిపించలేదని, ఎంపీలే ఆమెను కోరి వెళ్ళారే తప్ప అటువైపు నుంచి ఎలాంటి ఆహ్వానమూ లేదని ఎద్దేవా చేసినట్టు మాట్లాడారు.

వరంగల్‌ జిల్లా పరకాల ఎమ్మెల్యే, కొండా సురేఖ గళం పెంచుతూ పోతున్నారు. మంత్రి శంకర్రావు సవాల్‌పై ఆమె స్పందించకపోయినా జగన్‌ బలం ఏమేర ఉందో చెప్పారు. లక్ష్య దీక్షకు అంతా రాకపోయినా జగన్‌కు 70 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, మరో 50 మంది సిద్ధంగా ఉన్నారని బాంబు పేల్చారు. అంటే శాసనసభలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఉన్న 155 మందిలో120 మంది తమ పక్షానే ఉన్నారని, అటువైపు ఉన్న వారు కేవలం మంత్రులు మాత్రమే అన్నట్టు మాట్లాడారు. అంటే జగన్‌ ఏ క్షణంలో సర్కార్‌ను కూల్చమని ఆదేశిస్తే తామంతా అందుకు సిద్ధంగా ఉన్నామన్న హెచ్చరికను సురేఖ పరోక్షంగా కాంగ్రెస్‌ నాయకత్వానికి చేశారు.

సవాల్‌కు సై...
శంకర్రావు విసిరిన సవాల్‌ను మాజీ మంత్రి, జగన్‌ వర్గంలో బలమైన నేత బాలినేని శ్రీనివాస రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి స్వీకరించారు. వారిద్దరూ మీడియాతో విడివిడిగా మాట్లాడుతూ మంత్రి సవాల్‌ను స్వీకరించటానికి తాము సిద్ధంగా ఉన్నామని, ముందు శంకర్రావు తన పదవికి రాజీనామా చేసి జనంలోకి వెళ్తే తాము అందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు.


దమ్ముంటే చర్య తీసుకోండి...గోనె
లక్ష్య దీక్షకు హాజరైన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని శంకర్రావు చేసిన డిమాండ్‌పై సీనియర్‌ నేత, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాశరావు తీవ్రంగా స్పందించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధినాయకత్వానికి ఏమాత్రం దమ్ము ఉన్నా ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని సవాల్‌ చేశారు. అదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయో కాలమే తేలుస్తుందన్నట్టుగా గోనె మాట్లాడారు.

హై కమాండ్‌పైనే గురి...
ఎంపీ పదవికి, పార్టీకీ జగన్‌ రాజీనామా చేసినా ఆయన వర్గం మాత్రం అధిష్ఠానాన్ని వదలిపెట్టటం లేదు. తమ లక్ష్య దీక్షకు భయపడినందుకే సోనియా గాంధీ రాష్ట్ర ఎంపీలను పిలిపించుకుని మంతనాలు జరిపారని, జగన్‌ దెబ్బ ఏమిటో ఇప్పటికే అధినాయకత్వానికి తెలిసిపోయినందుకే బెంబేలెత్తుతున్నారని ఎత్తిపొడుపు మాటలు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం ద్వారా జగన్‌ను ఢీకొనే సత్తా కాంగ్రెస్‌ హై కమాండ్‌కు కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకత్వానికి కానీ లేదన్న బహిరంగ సవాల్‌ను విసురుతున్నారు. జగన్‌ వర్గీయుల నుంచి ఇంత సూటిగా సవాళ్ళ అస్త్రాలు దూసుకు వస్తున్నా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మాత్రం మౌనమే మంచిదన్న సూత్రాన్ని పాటిస్తున్నది. బుధవారం మీడియాతో మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ జగన్‌ దీక్షకు వెళ్ళిన ఎమ్మెల్యేల విషయంలో ప్రతినిధులు ఎంత రెట్టించి ప్రశ్నలు వేసినా మౌనాన్నే పాటించారు.

ఈ పరిణామాలు ఎక్కడికో?...
ఉభయ వర్గాల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం, సవాళ్ళు ఏ స్థాయికి పోతాయన్నది ఇప్పుడే చెప్పలేకపోయినా, రాజకీయ పరిణామాల గతిలో మార్పులు తెచ్చే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయని తటస్థంగా ఉన్న సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. ఎవరు ఎలాంటి సవాళ్ళు విసురుకున్నా ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఢోకా లేకపోయినా తమ నుంచి ఎప్పటికైనా గండం తప్పదన్న సంకేతాలను జగన్‌ వర్గం ఇవ్వటం ప్రారంభమైనట్టేనని తేలిపోయిందని వారన్నారు.
ఇంతింతై...
జగన్‌కు 29 మంది ఎమ్మెల్యేల మద్దతు

లక్ష్య దీక్షకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. పిల్ల కాలువలా ప్రారంభమైన జన ప్రవాహం.. కృష్ణమ్మలా హోరెత్తుతోంది. యువనేత జగన్ వెంటే మేమున్నామంటూ.. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో తమ అభిమాన నేతకు మద్దతు పలుకుతున్నారు. ఒత్తిడులు, ప్రలోభాలను లెక్కచేయకుండా లక్ష్య దీక్ష శిబిరాన్ని సందర్శించి బహిరంగంగా జగన్‌కు అండగా నిలబడుతున్నారు. పార్టీలకతీతంగా ఒక్కటై ముందుకు సాగుతున్నారు. లక్ష్య దీక్ష శిబిరాన్ని రెండవరోజైన బుధవారం పలు పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించి జగన్‌కు సంఘీభావం తెలిపారు.తో రెండురోజులుగా జగన్ దీక్షకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. వీరిలో పీఆర్పీకి చెందిన శోభా నాగిరెడ్డి(ఆళ్లగడ్డ), కాటసాని రామిరెడ్డి(బనగానపల్లె), కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాసులు (రైల్వే కోడూరు), కమలమ్మ(బద్వేలు), అమరనాథ్‌రెడ్డి (రాజంపేట), షాజహాన్ (మదనపల్లి) ఉన్నారు. మంగళవారమే మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల్లో... జి.ఆదినారాయణరెడ్డి(జమ్మలమడుగు), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ), జి. శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), వి. గురనాథరెడ్డి(అనంతపురం), కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (ధర్మవరం), బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), పిల్లి సుభాస్‌చంద్రబోస్ (రామచంద్రపురం), కొండా సురే ఖ (పరకాల), జయసుధ (సికింద్రాబాద్), ఆళ్ల నాని (ఏలూరు), డి.బాబూరావు (పాయకరావుపేట), కె.రామచంద్రారెడ్డి (రాయదుర్గం).

మద్దాల రాజేష్ (చింతలపూడి), పి.అంజిబాబు (భీమవరం), పి.బాలరాజు (పోలవరం), రేగ కాంతారావు(పినపాక), ఎం.ప్రసాదరాజు (నరసాపురం), లబ్బి వెంకటస్వామి (నందికొట్కూరు), బాలనాగిరెడ్డి (మంత్రాలయం), మహేశ్వరరెడ్డి (నిర్మల్, పీఆర్పీ), ఎన్. శేషారెడ్డి (అనపర్తి), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఉదయగిరి), టీడీపీకి చెందిన ఎన్. ప్రసన్నకుమార్‌రెడ్డి (కోవూరు) ఉన్నారు. వీరు కాక ఎమ్మెల్సీలు కొండా మురళి, పుల్లా పద్మావతి, టీజీవీ కృష్ణారెడ్డి, జూపూడి ప్రభాకరరావు కూడా ఉన్నారు.


శిబిరంలోనే సబ్బం..: అనకాపల్లి ఎంపీ సబ్బం హరి మంగళవారం సాయంత్రం నుంచి నిరాహార దీక్షా శిబిరంలోనే ఉన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ర్ట ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, తాను ఎప్పటికీ జగన్ పక్షమేనని స్పష్టం చేశారు.

రెండవ రోజు శిబిరంలో ప్రముఖులు..: సినీ నటులు రోజా, రాజశేఖర్ దంపతులు రెండవ రోజు కూడా దీక్షా శిబిరాన్ని సందర్శించి జగన్‌కు మద్దతు పలికారు. నంద్యాల మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి తన భార్య శోభతో కలిసి శిబిరాన్ని సందర్శించారు. అమలాపురం మాజీ ఎంపీ ఏజేవీ బుచ్చి మహేశ్వరరావు దీక్షా శిబిరానికి వచ్చి యువనేతకు మద్దతు తెలిపారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు, ఆయన భార్య విజయలక్ష్మి కూడా జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.


మద్దతు పలికిన మాజీలు..: మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం, ముక్కు కాశిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, బాజిరెడ్డి గోవర్ధన్, రామకృష్ణారెడ్డి, నెలవల సుబ్రమణ్యం, కుర్రి పున్నారెడ్డి, చల్లా వెంకటకృష్ణారెడ్డి, జంగా కృష్ణమూర్తి, మేకా ప్రతాప్ అప్పారావు, జంకే వెంకటరెడ్డి, జలీల్‌ఖాన్, మర్రెడ్డి రామకృష్ణారెడ్డి, జేష్ఠ రమేష్‌బాబు, చిర్ల జగ్గిరెడ్డి శిబిరాన్ని సందర్శించి జగన్‌కు మద్దతు పలికారు. ఉరవకొండ ఇన్‌చార్జి విశేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ కూడా జగన్‌కు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చిట్టా విజయభాస్కర్ రెడ్డి, నాగార్జునసాగర్ కుడి కాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గడిపూడి నరసింహారావు, ఎస్సీ-ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జున, సినీ నటుడు విజయచందర్, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, గట్టు రామచంద్రరావు, పీఎన్‌వీ ప్రసాద్, గోనె ప్రకాశ్‌రావు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తాడి శకుంతల, బత్తుల బ్రహ్మానందరెడ్డి, వై. భద్రారెడ్డి, చింతకుంట రంగారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఏపీ స్టేట్ వైఎస్సార్ సాధన సమితి అధ్యక్షుడు చేవూరి శ్రీధర్‌రెడ్డి, తెలంగాణ వైఎస్సార్ అభిమాన సంఘం నాయకుడు డాక్టర్ ప్రకాష్ వంజరి, పశ్చిమ గోదావరి డీసీసీ మాజీ అధ్యక్షుడు మోషేన్ రాజు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుడు మేకా రామకృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ మోహన్‌కుమార్, రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ చోడిశెట్టి రాఘవబాబు, ఐడీసీఎస్‌ఆర్ అధ్యక్షుడు పెరికే వరప్రసాద్‌రావు, శిల్పా చక్రపాణి రెడ్డి, కృష్ణాజిల్లా కృత్తివెన్ను ఎంపీపీ మైలా రత్నకుమారి రెండోరోజు దీక్షా శిబిరంలో పాల్గొన్నారు.

సంఘీభావం తెలిపిన ప్రముఖులు ..: నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి తనయుడు మేకపాటి గౌతంరెడ్డి తన బంధువులు, మిత్రులతో దీక్షా శిబిరాన్ని సందర్శించి జగన్‌కు సంఘీభావం తెలిపారు. సహకార మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మేనల్లుడు కె. వినయ్‌రెడ్డి శిబిరం ప్రారంభం నుంచి జగన్ వెన్నంటే ఉన్నారు.

జగన్‌ను ఆశీర్వదించిన నేదురుమల్లి పద్మనాభరెడ్డి..: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సోదరుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి లక్ష్యదీక్ష శిబిరాన్ని సందర్శించి జగన్‌కు మద్దతు పలికారు. జగన్ భవిష్యత్తు బావుండాలనే ఆకాంక్షను వ్యక్తంచేశారు. రాంకీ గ్రూపు డెరైక్టర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండవ రోజు దీక్షా శిబిరాన్ని సందర్శించి జగన్‌ను కలిసి కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం సోదరుడు కాకుమాను జెడ్పీటీసీ జేడీ రవి లక్ష్య దీక్ష శిబిరానికి వచ్చి యువనేతకు మద్దతు తెలిపారు.

ఫోన్‌లో ప్రముఖుల మద్దతు..: దీక్ష చేస్తున్న జగన్‌ను కలిసి పలువురు ప్రత్యక్షంగా సంఘీభావం తెలుపుతుంటే, ఇక్కడికి రాలేనివారు ఫోన్లలో మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రముఖ సినీనటి, రాంపూర్ (ఉత్తరప్రదేశ్) ఎంపీ జయప్రద, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఫోన్‌చేసి జగన్‌కు సంఘీభావం ప్రకటించారు. 

 దిక్కుతోచడం లేదన్నా..!
* బాధల్ని పంచుకున్న రైతాంగం
* ఓదార్చిన జగన్.. అన్నదాతలకు భరోసా


పంట మొత్తం నీటి పాలైందన్నా.. అప్పుల పాలైపోయాం.. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.. మీకాడ మా బాధలు చెప్పుకు పోదామని వచ్చినాం.. అంటూ అన్నదాతలు గోడు వెళ్లబోసుకున్నారు. యువనేత జగన్ చేపట్టిన లక్ష్య దీక్షకు మద్దతు పలకడానికి వివిధ జిల్లాల నుంచి వేలాది మంది రైతులు విజయవాడ ‘వైఎస్సార్ దీక్షా ప్రాంగణా’నికి తరలివస్తున్నారు. జగన్‌ను కలసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. అధైర్యపడొద్దని యువనేత ఇచ్చే ఓదార్పు రైతుల్లో కొత్త ఆశలు నింపుతోంది. వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు వ్యవ‘సాయం’ ఎంతో బాగుండేదని రైతులు చెబుతున్నారు. నువ్వు సీఎం అయితేనే మా బాధలు తీరతాయన్నా అని తమ మనసులోని ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు. జగన్‌ను కలిసి స్వయంగా తమ బాధలు చెప్పుకొనే అవకాశం దక్కడంతో రైతాం గం ఉబ్బితబ్బిబ్బయింది. తాము ఎలా నష్టపోయామో రైతులు వేది కపై నుంచి మైక్‌లో వివరించారు. బుధవారం పలువురు రైతులతో జగన్ సంభాషణ సాగిందిలా..

ప్రకాశం జిల్లా త్రిపురాంతపూర్ మండలం వెల్లంపల్లికి చెందిన కందుల చిన్నపరెడ్డితో..
ఎన్ని ఎకరాలు సాగుచేశావన్నా?
ఎనిమిది ఎకరాల్లో వరి, మినుము సాగుచేశా..
ఎంత నష్టం జరిగింది?
మూడొంతులు పంట పోయింది..
నష్టపరిహారం వచ్చిందా?
లేదన్నా, రెండేళ్లుగా అధికారులు పంటల నష్టాన్ని నమోదు చేయడంలేదు. జేసీ, వ్యవసాయశాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. తప్పుడు లెక్కలు రాస్తున్నారు.
మీది ఏ నియోజకవర్గం?
ఎరగ్రొండపాలెం
ఆందోళనచెందకన్నా..
మాట్లాడదాం...
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పచ్చాల వెంకటాపురానికి చెందిన ఇండేల నాగిరెడ్డితో..
ఎంత భూమి ఉందన్నా?
నాకేంలేదన్నా.. ఏడు ఎకరాలు కౌలుకు తీసుకున్నా.. ఐదెకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో వరి సాగుచేసినా..
కౌలు ఎంత కట్టాలి? పెట్టుబడి ఎంత ?
ఎకరాకు పది బస్తాల ధాన్యం ఇవ్వాలి. పత్తికి రూ.4 వేలు చెల్లించాలి.. లక్షకు పైనే ఖర్చులయ్యాయి..
ధర ఎలా ఉంది?
పత్తి క్వింటా రూ.1,500 ఇస్తామంటున్నారు. 30 శాతం ధాన్యం తడిసింది. కొనుగోలుకు వ్యాపారులు మందుకురావడం లేదన్నా.
మరి ఇప్పుడు ఏమిటి పరిస్థితి?
కౌలు కట్టే పరిస్థితి కూడా లేదన్నా. ఏం చేయాలో తెలియడం లేదు.
నాఫోన్ నంబర్ తీసుకో.. హైదరాబాద్‌రా మాట్లాడదాం..

గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలేనికి చెందిన భవనం శ్రీనివాస్‌తో..
ఎలా ఉన్నావన్నా? ఏం పంట సాగు చేశావు?
పంటలు మొత్తం నేల పాలయ్యాయన్నా. 9 ఎకరాలు కౌలు తీసుకొని పత్తి సాగుచేసినా అన్నా.
పరిస్థితి ఏమిటి? క్వింటాకు ఎంత ఇస్తున్నారు?
15 క్వింటాళ్లు రావాల్సి ఉండగా 4 క్వింటాళ్లే వచ్చిందన్నా. రంగుమారడంతో ధర పలకడం లేదు. క్వింటాల్‌కు రూ.1,200 నుంచి రూ.1,500 ఇస్తామంటుండ్రన్నా.
మద్దతు ధర ఎంత రావాలి?
రూ.3,500 నుంచి రూ.4 వేలు రావాలి.
ఎంత నష్టం వచ్చింది?
రూ.20 వేలు కౌలు కట్టాలి. రూ.40 వేల వరకూ పెట్టుబడులయ్యాయి. మొత్తం మీద రూ. 2 లక్షల వరకూ నష్టం వచ్చిందన్నా.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన కర్రి వెంకటరెడ్డితో..
ఎన్ని ఎకరాల్లో పంట సాగుచేశావన్నా?
నాలుగు ఎకరాల్లో వరి పైరు సాగు చేశా..
దిగుబడి ఎంత వచ్చింది?
అన్నీ బాగుంటే ఎకరాకు 30 బస్తాలు పండాలి. పది బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నా..
ఎకరానికి ఎంత ఖర్చు చేశావన్నా?
రూ.15 వేలు పైనే ఖర్చులయ్యాయన్నా. అప్పుల పాలైపోయాం. ఇదిగో చూడన్నా అంటూ తడిసి రంగుమారిన వరికంకుల్ని చూపాడు.
అయ్యో..

వరంగల్ జిల్లా మనుగొండకు చెందిన మర్రి కుమరయ్యతో..
ఏం పంట వేశావన్నా?
ఆరు ఎకరాల్లో పత్తి సాగుచేశా.
ధర ఎలా ఉంది?
రేటు రావడం లేదయ్యా. క్వింటా రూ.4 వేలు పలకాల్సిన పత్తికి రూ.1,200 నుంచి రూ.1,500 ఇస్తున్నారు.
నీ పరిస్థితి ఏమిటి?
కిస్తీలు (అప్పు) కట్టలేకపోతున్నా. నాన్నగారి(వైఎస్‌ఆర్) దయవల్ల రాజీవ్ ఆరోగ్యశ్రీలో గుండె ఆపరేషన్ చేయించుకున్నా.
మాట్లాడదాం.. బాధపడకు..

దీక్షకు పోటెత్తిన మహిళలు
యువనేత జగన్ లక్ష్య దీక్ష శిబిరానికి రెండోరోజైన బుధవారం మహిళలు పోటెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జగన్ దీక్ష విజయవంతం కావాలంటూ వారంతా ఆశీర్వదించారు. మొదటి రోజు రెండు లక్షల మందికి పైగా ప్రజలు శిబిరానికి తరలిరావడంతో వారిని నియంత్రించడం పోలీసులకు సాధ్యం కాలేదు. అనేకసార్లు శిబిరం వద్ద లాఠీలతో అభిమానులను అదుపు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను గమనించిన మహిళలు, ఉద్యోగులు మొదటి రోజున శిబిరం వద్దకు రావడానికి ధైర్యం చేయలేకపోయారు. ముఖ్యంగా మహిళలు ఇళ్లకే పరిమితమై టీవీల్లోనే యువనేత కార్యక్రమాన్ని చూశారు. అయితే, మొదటి రోజు అనుభవంతో పోలీసు ఉన్నతాధికారులు పొరుగు జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించి తోపులాటలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టారు. వైఎస్సార్ ప్రాంగణంలో మెరుగుపడిన పరిస్థితిని టీవీల్లో చూసిన మహిళలు రెండోరోజు లక్ష్య దీక్ష కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చారు.

మీడియా సెంటర్ సమీపంలో ఒక బ్లాక్‌ను ప్రత్యేకంగా మహిళలకు కేటాయించారు. ఈ బ్లాక్‌లోని మహిళలు విడతలవారీగా జగన్‌ను కలిసే అవకాశం కల్పించారు. నిత్యావసర వస్తువుల ధరలు, వంట గ్యాస్, కిరోసిన్ ధరలు ఆకాశాన్ని తాకాయని, చాలీచాలని ఆదాయంతో జీవనం సాగించడం కష్టంగా ఉంటోందని డ్వాక్రా గ్రూపు మహిళలు జగన్ వద్ద వాపోయారు. అనేక మంది యువతులు జగన్ ఆటోగ్రాఫ్ కోసం పోటీపడ్డారు. ‘అన్నా, నీ ఆటోగ్రాఫ్ ఇవ్వన్నా, నేను బతికున్నంత కాలం జాగ్రత్తగా దాచుకుంటా’నని అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి వచ్చిన రాధిక అనే యువతి కోరింది. కొందరు మహిళలు తమ ఇంట్లో పూజ చేసిన అక్షింతలను ఆయన శిరస్సుపై వేసి ఆశీర్వదించారు. వేదిక వద్దకు చేరుకుంటున్న తల్లులు తమ పిల్లలకు ‘అడిగో జగనన్న’ అంటూ చూపించడం కనిపించింది. చిన్నారులను జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ, ముద్దాడడంతో తల్లుల ఆనందం అవధులు దాటింది. మరోవైపు వైఎస్సార్ పాలనలో పరిష్కారమైన అనేక సమస్యలను ప్రభుత్వ ఉద్యోగులు ఈ సందర్భంగా జగన్ వద్ద ప్రస్తావించారు. ‘మీ తండ్రి ఉద్యోగులను కన్నబిడ్డల వలే చూసుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మేము మా సొంత బిడ్డ వలే చూసుకుంటా’మని చెప్పారు. గతంలో తామంతా వేతనాలపై 15 శాతం అదనంగా ఆశిస్తే, వైఎస్సార్ 23 శాతం వరకు పెంచి తమ అభిమానాన్ని పొందారని పేర్కొన్నారు.


పలుచోట్ల సంఘీభావ దీక్షలు: యువనేత చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాలలోని తెలుగువారు సంఘీభావదీక్షలు చేస్తున్నారు. అబుదాబీ, సౌదీ అరేబియా, అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి.

No comments:

Post a Comment