జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Friday, December 24, 2010

రైతును విస్మరిస్తే.. మూడినట్టే * మూడేళ్లలోపే డిపాజిట్లు గల్లంతవుతాయి: జగన్

* ‘లక్ష్య దీక్ష’ ముగింపు సభలో సర్కారుకు హెచ్చరిక
* సర్కారు ప్యాకేజీ ప్రకటించక ముందు 42 మంది.. ప్రకటించాక 84 మంది రైతులు చనిపోయారు
* అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు రావడం లేదా?
* లక్షల మంది 48 గంటలపాటు దీక్ష చేస్తే స్పందించరా?
* 6 రోజులు దీక్ష చేసినా బాబుకు షుగర్, బీపీ తగ్గలేదంట... దీన్ని బట్టి చూస్తే.. ప్రతిపక్షం, ప్రభుత్వం కుమ్మక్కయ్యాయనిపిస్తోంది
* అన్నదాతలు, నేతన్నల తరఫున ఉద్యమాలు ముమ్మరం చేస్తాం..
.

లక్షల మంది రైతులు, నేతన్నలు తమను ఆదుకోవాలని వేడుకుంటూ 48 గంటలపాటు నిరాహార దీక్ష చేస్తే.. కనీసం స్పందించని రాష్ట్ర ప్రభుత్వంపై యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. వర్షాల దెబ్బకు పంట కోల్పోయి గత పదిహేను రోజుల్లో 126 మంది రైతులు ప్రాణాలు కోల్పోతే.. చీమకుట్టినట్లయినాలేని ఈ సర్కారును ఏమనాలని ప్రశ్నించారు. ‘ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని రైతుల సమస్యలపై ఉదాసీనంగా వ్యవహరిస్తే.. మూడేళ్లలోపే మీ డిపాజిట్లు గల్లంతవుతాయి’ అని హెచ్చరించారు.

అన్నదాతలు, నేతన్నల డిమాండ్లు నెరవేర్చడం కోసం వారిపక్షాన మరిన్ని ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. విజయవాడ కృష్ణాతీరంలో యువనేత చేపట్టిన 48 గంటల ‘లక్ష్య దీక్ష’ ముగింపు సందర్భంగా లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి గురువారం జగన్ ప్రసంగించారు. రైతన్నను ఆపద్బాంధవుడిలా ఆదుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తి ఏమైందంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మహానేత బతికున్నట్లయితే ఇలా రైతులు, నేతన్నలు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చేది కాదన్నారు. రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని, నాడు అన్నదాతల మరణాలను పరిహాసమాడి నేడు వారి కోసం దీక్ష చేస్తున్నానంటున్న చంద్రబాబును దునుమాడుతూ సాగిన యువనేత ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

కనిపించడం లేదా?: ‘చరణ్‌సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 23ను ‘రైతు దినం’గా కేంద్రం ప్రకటించిన ఈ రోజున లక్షల మంది రైతులు తమ న్యాయమైన కోర్కెల సాధనకు రోడ్లపైకి వచ్చి దీక్షలు చేయాల్సిరావడమే దురదృష్టం. వరుస తుపానులు, వర్షాలతో చేతికందిన పంట నీటిపాలై, నోటి దగ్గర ముద్ద నేలపాలై.. ఇలా లక్షల మంది 48గంటలపాటు అన్న పానీయాలు మానేసి, చలనక ఎండనకా చేస్తున్న దీక్ష కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనిపించడంలేదా? వినిపించడం లేదా? రైతుల ఆక్రందనపై ఏమాత్రమూ స్పందించకుండా బండరాయిలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.’

126 మంది రైతుల మృతి: ‘గడిచిన 15 రోజుల్లో 126 మంది రైతులు చనిపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. వీరిలో ఎక్కువ శాతం మంది కౌలు రైతులే. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కేవలం కంటితుడుపు చర్యే. ముఖ్యమంత్రి రైతులకు ప్యాకేజీ ప్రకటించక ముందు 42మంది చనిపోతే.. ప్యాకేజీ ప్రకటించాక 84 మంది ప్రాణాలు విడిచారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ రైతుల్లో ఏమాత్రమూ విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగించలేదన్న అంశం తేటతెల్లమవుతున్నా.. ఈ ప్రభుత్వానికి ఇంకా సిగ్గురావడం లేదా?’

బాబు, ప్రభుత్వం కుమ్మక్కు?: ‘రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు అలసత్వం వహిస్తే నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం ఈ వేళ రైతుల ఆందోళనకు మోకాలడ్డే కుయుక్తులకు పాల్పడుతోంది. లక్షల మంది రైతులు, నేతన్నలు 48 గంటలపాటు దీక్షకు ఉపక్రమిస్తే, దీక్ష మొదలయ్యేరోజు చంద్రబాబు బంద్ పిలుపు ఇచ్చారు. ముగింపురోజు రహదారుల దిగ్బంధం అని పిలుపు ఇచ్చారు. ఆరు రోజుల నిరాహార దీక్ష అనంతరం కూడా చంద్రబాబుకు బీపీ, షుగర్ లెవల్స్ ఏమాత్రం తగ్గలేదట. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం, చంద్రబాబు కుమ్మక్కయ్యారన్న అనుమానం కలుగుతోంది.’

ఆ అదృష్టం నాకు దక్కింది..
 ‘లక్ష్య దీక్ష’ పూర్తయిన సందర్భంగా యువనేత జగన్‌కు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేసే అవకాశం ఓ సాధారణ రైతుకు రావడంతో ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కృష్ణాజిల్లా మొవ్వ మండలం కాళ్లపాలెం గ్రామానికి చెందిన రైతు వీరనాగేశ్వరరావు యువనేతతోపాటే 48 గంటలపాటు అన్నపానీయాలు మాని దీక్ష చేశారు.జగన్‌కు ఆయన నిమ్మరసం తాగించిన అనంతరం ఆయనకు జగన్ స్వయంగా పళ్లరసం తాగించి దీక్ష విరమింపజేశారు.
అనంతరం నాగేశ్వరరావు మైకు పట్టుకుని ఉద్వేగభరితంగా మాట్లాడుతూ.. ‘జగన్‌తో దీక్ష విరమింపజేసే అదృష్టం నాకు దక్కడం ఆనందంగా ఉంది. ఆయనను కలిసి మా బాధలు చెప్పుకుంటే ఏదైనా సాయం అందుతుందని ఆశతో వచ్చాం. మేం జగన్‌కు మద్దతుగా ఉంటాం. రైతులందరూ జగన్ పక్షమే’ అని నినదించారు. తమ కోసం జగన్ నిరాహారదీక్ష చేస్తున్నారని తెలియడంతో మంగళవారం పొద్దున్నే తమ ఊరి నుంచి మొవ్వ చేరుకుని, అక్కడి నుంచి బస్సులో విజయవాడ వచ్చి దీక్షలో పాల్గొన్నానని ఆయన తెలిపారు.
సర్కారు, చంద్రబాబు దొందూ.. దొందే
‘తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బాబు ఇచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీ కేవలం రూ.600. వ్యవసాయమే దండగన్న పెద్ద మనిషి ఆయన. పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ.. రైతుల మరణాలను పరిహాసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఉచిత కరెంటు ఇస్తామని దివంగత నేత హామీ ఇస్తే.. ఇక ఆ తీగలు బట్టలు ఆరేసుకునేందుకు తప్ప ఎందుకూ పనికిరావని పరాచకాలాడిన పాలకుడు చంద్రబాబు. రైతుల సమస్యల పరిష్కారంలో ఆరోజు చంద్రబాబు.. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వమూ దొందూ..దొందే.’

ఈ డిమాండ్లేమీ గొంతెమ్మ కోర్కెలు కాదే..
‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏదోమేరకు ప్రభుత్వం చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని భావించే రైతుల తరఫున నేను కొన్ని నిర్దిష్టమైన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాను. ఆ డిమాండ్లేమీ గొంతెమ్మ కోర్కెలు కాదు.. అవి చాలా న్యాయమైనవి. హేతుబద్ధమైనవి. రైతు తిరిగి నిలదొక్కుకోవాలంటే ఆమాత్రమైనా సాయం అందించాలని దీక్షకు ముందు ప్రభుత్వాన్ని చేతులు జోడించి వేడుకున్నాను. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. రుణమాఫీ కింద రూ. 1,800 కోట్లు ఇచ్చేందుకు దివంగత వైఎస్ ఒక్క నిమిషంకూడా ఆలోచించలేదు. రైతులను ఆదుకోవడంలో ఆ మహానేత స్ఫూర్తి ఈ ప్రభుత్వానికి లేదా?’

ఇప్పటికైనా కళ్లు తెరవండి : ‘ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోతే రైతుల పక్షాన మరింత తీవ్రంగా ఉద్యమాలు చేస్తాం. మరింత ఒత్తిడి తెస్తాం. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉంది కదా అన్న ఉదాసీనతతో ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకపోతే.. మూడేళ్లలోపే ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయి.. డిపాజిట్లు గల్లంతవుతాయి.’

మరణించిన రైతులకు సంతాపం
పంట నష్టాన్ని తట్టుకోలేక ఇటీవల మరణించిన 126 మంది రైతుల ఆత్మ శాంతి కోసంజగన్ పిలుపు మేరకు ప్రాంగణంలోనివారందరూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోళ్లపాలెంకు చెందిన రైతు కొనకళ్ల వీరనాగేశ్వరరావు ఇచ్చిన నిమ్మరసం తాగి జగన్ దీక్ష విరమించారు. రెండు రోజులుగా తనతోపాటు దీక్ష చేస్తున్న నాగేశ్వరరావుకు కూడా పళ్లరసం ఇచ్చి యువనేత ఆయనతో దీక్ష విరమింపజేశారు.

రైతులను ఆదుకోవడమంటే ఇలాగా?
* వర్షాలతో నష్టపోయిన రైతును ఆదుకుంటామంటూ ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై జగన్ తన ప్రసంగంలో మండిపడ్డారు. ప్యాకేజీ ఎంత ఘోరంగా ఉందో వివరిస్తూ.. సర్కారును నిలదీశారు.
* ‘ఇన్‌పుట్ సబ్సిడీని రెట్టింపు చేసి *3600 చెల్లించాలని అడిగితే.. గతంలో ఇస్తున్న రూ. 800పైన కేవలం రూ.600మాత్రమే పెంచడం న్యాయమా? ప్రభుత్వం పెంచిన రూ. 600తో ఒక్క యూరియా బస్తా కూడా రాదే?
* వచ్చే రబీకి విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని కోరితే, ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని అడిగితే... గ్రేడ్లు, శాతాల లెక్కలు చెపుతున్న ప్రభుత్వాన్ని ఏమనాలి? 50 శాతంకన్నా ఎక్కువ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే.. ఆ రైతు బతుకు ఏం కావాలి? ప్రభుత్వం ఇలా వ్యాపారి పాత్ర పోషిస్తే ఈ కష్టకాలంలో రైతుల గతి ఏం కావాలి?
* అన్నింటికీ మించి కౌలురైతుల దయనీయ పరిస్థితిపై కనీస కనికరం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. పావలా వడ్డీ రుణాలతో పైసాపైసా పొదుపు చేసుకున్న సొమ్మును పెట్టుబడిగా పెట్టి కౌలుభూములు తీసుకుని వ్యవసాయం చేసేవారిలో ఎక్కువ మంది మహిళలున్నారు. వారందరూ ఈ రోజు పీకలలోతు అప్పుల్లో కూరుకుపోయారు. ఆ అక్కచెళ్లెలను ఆదుకోవాలన్న ఆలోచన చేయని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి?
* ధర్మవరంలో పదిరోజులుగా నేతన్నలు దీక్షలు చేస్తుంటే.. చీమకుట్టినట్టయినా లేని ఈ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించింది. మహానేత ఏర్పరచిన ఈ ప్రభుత్వం ఇంతగా రైతువ్యతిరేకిగా మారిపోయిందని చెప్పేందుకు సిగ్గుగా ఉంది.

వైఎస్ లేకపోవడమే పెద్ద విపత్తు!
  ప్రస్తుతం రాష్ట్ర రైతులకు వరదలకన్నా వైఎస్ లేకపోవడమే పెద్ద విపత్తుగా పరిణమించిందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడి ్డ అన్నారు. మహానేత వైఎస్ ఉన్నట్లయితే ఇలాంటి వరదలు ఎన్ని వచ్చినా రైతు గుండె చెదరకుండా.. ఆదుకునేవారని చెప్పారు. ‘లక్ష్య దీక్ష’ముగింపు సమావేశానికి హాజరైన మేకపాటి మాట్లాడుతూ.. ‘విపత్తులు సంభవించినప్పుడే ప్రజలకు బాసటగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై మరింత ఎక్కువగా ఉంది. దురదృష్టవశాత్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు’ అని పేర్కొన్నారు. రైతుల సమస్యలపై స్పందించడంలో జగన్ తండ్రికి మించిన తనయుడన్న విషయం ఈ దీక్ష ద్వారా రుజువైందన్నారు.

‘2004, 2009 ఎన్నికల్లో వైఎస్ సాధించిన విజయాల కారణంగానే.. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగిందని అందరూ అంటుంటారు. అయితే. అమెరికాతో అణు ఒప్పందం సందర్భంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు ప్రమాదపుటంచున పడిపోయిన కేంద్రాన్ని ఒడ్డుకు చేర్చడంలో వైఎస్ కృషిని మరచిపోరాదు’ అని అన్నారు. కాంగ్రెస్ నేతలు జగన్‌పై అవాకులు చవాకులు విసరడం మంచిది కాదన్నారు. ‘తొందరపడి ఎగతాళి చేయకండి. సవాళ్లు విసరకండి. భవిష్యత్‌లో జగన్ అవసరం ఢిల్లీకి వస్తుంది’ అని వారినుద్దేశించి ఆయన హెచ్చరిక చేశారు.


ప్రభం‘జనం’

‘లక్ష్య దీక్ష’కు ఆఖరి రోజూ పోటెత్తిన రైతన్నలు, ప్రజలు
 

వరుస వర్షాలతో అతలాకుతలమైన రాష్ట్ర రైతులకు బాసటగా యువనేత జగన్ తలపెట్టిన ‘లక్ష్య దీక్ష’ కార్యక్రమం అన్ని కోణాల్లోనూ సంపూర్ణంగా విజయవంతమైంది. వైఎస్ అకాల మరణం తర్వాత ఏర్పడ్డ ఖాళీని భర్తీచేయగలిగే శక్తి ఒక్క జగన్‌కే ఉందన్న నమ్మకం అటు ప్రజల్లోనూ ఇటు నాయకుల్లోనూ ఈ 48 గంటల దీక్ష కలుగజేసింది. ఆపద సమయంలో రైతుపట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ నేతలు కేవలం కంటితుడుపు చర్యలకే పరిమితమైతే...వారు మహానేత వైఎస్ రాజకీయ వారసులెలా అవుతారన్న సూటి ప్రశ్న ప్రజల మెదళ్లలో నాటుకుంది.

ఓదార్పు కోసం.. రాజీనామాదాకా..

దివంగత నేత మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర కాంగ్రెస్‌తో క్రమేపీ దూరాన్ని పెంచుతూ వచ్చింది. ఎలాగైనా జగన్‌ను బలహీనపరచాలన్న అధిష్టానం ప్రయత్నాలు చివరకు దివంగత నేత కుటుంబంలో చీలిక తెచ్చేవరకూ వెళ్లాయి. దీంతో పార్టీకీ, ఎంపీ పదవికి రాజీనామా చేసి జగన్ బయటకొచ్చారు. అయితే.. ఎంతటివారైనా పార్టీని వీడితే జీరోలే అవుతారని, జగన్‌కున్న సొంత బలం ఏంటో ఇప్పుడు తెలుస్తుందని.. ఎమ్మెల్యేల బలం లేకనే ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేయనని జగన్ అంటున్నారని.. ఇలా ఎన్నో వ్యాఖ్యానాలు, విశ్లేషణలు వెల్లువెత్తాయి. ఇవన్నీ ‘లక్ష్య దీక్ష’తో పటాపంచలైపోయాయి. జనంలో జగన్‌కున్న బలాన్ని, అన్నదాత మదిలో ఇప్పటికీ పదిలంగా ఉన్న మహానేత జ్ఞాపకాలను ఈ దీక్ష ఢంకా భజాయించి చెప్పిందని పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

జగన్‌పైనే ఆశలు: అకాల వర్షాల ధాటికి అతలాకుతలమైన జిల్లాల్లో పర్యటించిన జగన్‌కు కోటి ఆశలతో రైతన్నలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. మీ నాన్న బతికుంటే మాకు ఈ ఇబ్బందులు వచ్చేవికావు. నీవైనా మాకో దారి చూపమంటూ... ఆశగా రైతన్నలు చూసిన చూపులు జగన్‌కు దిశానిర్దేశం చేశాయనవచ్చు. ఆయన పర్యటన క్రమంలోనే ఎక్కడికక్కడ ప్రజలు, ద్వితీయశ్రేణి నాయకులు జగన్ బాట పట్టడంతో స్థానిక ఎమ్మెల్యేలకు తమ వైఖరి ఏంటో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పలు నియోజకవర్గాల్లో అప్పటికప్పుడు కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారి అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు కొందరు. ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన 48గంటల నిరాహార దీక్ష పిలుపునకు రాష్టవ్య్రాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది.


బాబు, సర్కారు.. కుమ్మక్కు కుట్ర..:
యువనేత దీక్ష ప్రకటన చేసిన వెంటనే.. క్రెడిట్ ఎక్కడ ఆయనకు పోతుందో అన్న ఆదుర్దాతో చంద్రబాబు హడావుడిగా నిరాహార దీక్షకు పిలుపు ఇచ్చారు. రైతులు వీటిని వేటినీ పట్టించుకోలేదు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో దీక్ష తొలిరోజు నలుమూలల నుంచీ దాదాపు రెండు లక్షలకుపైగా రైతులు విజయవాడ కృష్ణాతీరానికి తరలివచ్చారు. ఆ జన ప్రవాహానికి అడ్డుకట్టలు వేసేందుకు అటు ప్రభుత్వమూ, ఇటు చంద్రబాబు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కృష్ణా తీరానికి చేరుకున్న జనసమూహం ముందు నిల్చొని జగన్ చేసిన ప్రసంగం.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సింహనాదమే అయ్యింది. జగన్ దీక్ష ప్రాధాన్యతను తగ్గించే దిశగా ప్రతిపక్షనేతతో కుమ్మక్కయిన ప్రభుత్వ కుటిల యత్నాలు బట్టబయలయ్యాయి. జగన్ చేపట్టిన లక్ష్య దీక్ష ఏక కాలంలో అటు ప్రభుత్వ డొల్లతాన్ని, ఇటు ప్రతిపక్ష కుటిల నీతినీ ఎండగట్టడమే కాక, ఈ రాష్ట్రంలో రైతుల సమస్యలపై స్పందించే నేత జగన్ ఒక్కడే అన్న భరోసాను అన్నదాతకు ఇచ్చింది.

జగన్ వెంట జనం.. జనంతోనే నేతలు


దీక్ష రెండోరోజూ అదే జోరు కొనసాగింది. రెండోరోజు దీక్షలో జగన్ ప్రసంగాలజోలికి వెళ్లకుండా.. దీక్షకు వచ్చిన ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలుసుకునేందుకే కేటాయించారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఒక్కొక్కరినీ పలుకరిస్తూ ఉన్నారు. రాత్రి చలిని, పగలు ఎండను లెక్కచేయకుండా ఓపిగ్గా ఒక్కొక్కరిని పలుకరించే తీరు యువనేతను జనాలకు మరింత దగ్గర చేసింది. రెండోరోజు దీక్షకు మరో ప్రత్యేకత కూడా ఉంది. కనీవినీ ఎరుగని రీతిలో దీక్ష శిబిరం వద్ద మహిళలు బారులు తీరారు. ఆ జన ప్రభంజనం రాష్టవ్య్రాప్తంగా పలువురు ఎమ్మెల్యేలనూ దీక్షా శిబిరం వైపు నడిపించింది. పార్టీ క్రమశిక్షణలు, బుజ్జగింపులు ప్రజా ఆకాంక్షల ముందు వెలవెలబోయాయి. ఇద్దరు ఎంపీలు, 32మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, పలువురు జడ్పీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జగన్‌కు సంఘీభావంగా ‘లక్ష్యదీక్ష’ వేదిక నెక్కారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తనకు లేదని, పార్టీకి రాజీనామా చేసిన రోజు జగన్ ప్రకటించినప్పుడు... కూల్చే ఉద్దేశం లేక కాదు... బలం లేక జగన్ ఆమాట అంటున్నారు... అన్న వారి నోటికి తాళాలు పడ్డాయి.
జగన్ పార్టీ పెట్టక ముందే 32మంది ఎమ్మెల్యేల మద్దతుకు వేదిక అయ్యింది ‘లక్ష్య దీక్ష’.

పోటెత్తిన జనం:
లక్ష్య దీక్ష ముగింపు నేపథ్యంలో రహదారుల దిగ్బంధానికి తెలుగుదేశం పిలుపునిచ్చిన ప్పటికీ.. దీక్షా ప్రాంగణానికి జనం భారీఎత్తున తరలివచ్చారు. ఉదయం 8 గంటల నుంచే ప్రాంగణం వద్దకు వివిధ జిల్లాల నుంచి జనం చేరుకోవడం మొదలైంది. 12 గంటలకు సభ ముగిసే వరకూ వస్తూనే ఉన్నారు. దీంతో కృష్ణా తీరం కిక్కిరిసిపోయింది. ఎండ తీవ్రంగా ఉన్నా లెక్కచేయకుండా మూడు గంటలపాటు నిలబడి ఆసక్తిగా నేతల ప్రసంగాలు విన్నారు. మంద కృష్ణమాదిగ, జూపూడి ప్రభాకర్, కొండా సురేఖ మాట్లాడుతుండగా అరుపులు, ఈలలు, చప్పట్లతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. కొండా సురేఖ ఆటోగ్రాఫ్ కోసం జనం ఉత్సాహం చూపారు.

యువనేతను చూసివెళ్లిపోకుండా వేలాదిమంది ఆయనతో చేయి కలపాలని వేదిక ముందు ప్రాంతంలోకి దూసుకొచ్చారు. పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి వారిని ఆ ప్రాంతంలో కూర్చునేలా చేశారు. జగన్ 11.55 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించి 12.15 గంటలకు ముగించి, గత 15 రోజుల్లో మరణించిన 126 మంది రైతులకు సంతాపం తెలిపేందుకు రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరారు. అనంతరం సభ ముగిసినట్లు ప్రకటించగానే మహిళలు ఉవ్వెత్తున వేదికపైకి వెళ్లే మార్గంలోకి దూసుకొచ్చారు. రెండురోజులుగా దీక్షలో ఉండి అలసిపోయిన జగన్‌ను అనుయాయులు కిందకు తీసుకెళ్లిపోవడంతో మహిళలు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు నచ్చజెప్పి పరిస్థితిని వివరించడంతో వారు శాంతించారు.


ముగిసిన లక్ష్య దీక్ష..


మెతుకు ముట్టకుండా రైతుల కోసం చేసిన జగన్ దీక్షను గురువారం మరో రైతే వచ్చి విరమింపజేశారు. లక్షలాదిగా తరలివచ్చిన రైతన్నలు, చేనేత కార్మికులు, మహిళల జయజయధ్వానాల మధ్య జగన్ తన నిరాహార దీక్షను ముగించారు. దీక్ష మొత్తం మంగళవారం ఉదయం 11.00 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరిగింది. దీక్ష ముగింపు సందర్భంగా వైఎస్సార్ ప్రాంగణానికి నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సహా అనేకమంది నేతలు దీక్షా శిబిరానికి వచ్చి జగన్‌కు మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యేలు పేర్ని వెంకట్రామయ్య(నాని), జోగి రమేష్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆయనను పరామర్శించి ముగింపు సభలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment