జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Wednesday, December 1, 2010

జగన్‌ పార్టీ రె‘ఢీ’ * రెండేళ్లలో పవర్, ఇదీ టార్గెట్ * అధికారమే లక్ష్యంగా నిర్మాణం

రెండేళ్లలో పవర్, ఇదీ మన టార్గెట్: అనుచరులతో జగన్ వ్యాఖ్యలు
అతి త్వరలో పార్టీ పెడదాం.. అధికారమే లక్ష్యంగా నిర్మాణం
బెజవాడలో తొలి సభ
స్ధానిక ఎన్నికల్లో సత్తా చూపుదాం
సర్కారు కూల్చివేతపై ఓపిక పట్టండి
బాబాయ్‌తో విభేదాలు నిజమే
రెండోరోజు ఇడుపులపాయలో తగ్గిన జనం
ముగ్గురు ఎమ్మెల్యేలే హాజరు

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా.. కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహనరెడ్డి కదులుతున్నారా? మరో రెండేళ్లలో సీఎం గద్దెనెక్కాలని అడుగులేస్తున్నారా? తన పార్టీని గ్రామస్థాయి నుంచి నిర్మించి.. కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని భావిస్తున్నారా?.. ఇడుపులపాయలో జగన్.. బుధవారం తన అనుచరులతో చెప్పిన విషయాలు ఇందుకు అవుననే సమాధానమిస్తున్నాయి. రెండేళ్లలో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా.. అతి త్వరలో కొత్త పార్టీని నెలకొల్పబోతున్నట్లు తన అనుచరులకు కడప ఎంపీ వెల్లడించడమే ఇందుకు నిదర్శనం.

కొత్త పార్టీ క్షేత్రస్థాయిలో నిర్మాణం జరిగిన తరువాత.. ప్రభుత్వంపై పోరాడదామని కూడా అనుయాయులతో జగన్ అన్నారు. కొత్త పార్టీ తరఫున.. స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి.. అధికార పార్టీకి తమ సత్తా చూపిద్దామని కూడా ఆయన చెప్పినట్లు తెలిసింది. రాష్ట్ర మంత్రివర్గంలో తన అనుచరులకు మొండిచేయి ఎదురైన నేపథ్యంలో.. కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహనరెడ్డి తన మంత్రాంగాన్ని ముమ్మరం చేశారు. రెండు రోజులుగా ఇడుపులపాయలో మకాం వేసిన జగన్.. బుధవారం తన అనుచరులతో వివిధ దఫాలుగా భేటీ అయ్యారు. కడప, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన తన అనుచరులకు తన భావి ప్రణాళికను వివరించారు. వారి అభిప్రాయాలు సేకరించారు.

కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి కూడా జగన్‌తో ఉన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కాంగ్రెస్ అధిష్ఠానం తనను ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలే చేస్తోందని, ఈ నేపథ్యంలో జిల్లాలో.. అదీ కడప పార్లమెంట్ పరిధిలోనే ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడమే ఇందుకు తార్కాణమని అనుచరులతో వైఎస్ తనయుడు అన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు అనంతరం విజయవాడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తన అనుయాయులకు ఆయన చెప్పినట్లు సమాచారం. అనంతరం.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేపట్టి.. పార్టీని బలోపేతం చేస్తానని అనుచరులకు చెప్పారు. అయితే.. వైఎస్ ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత ప్రభుత్వం పని చేయడం లేదని, ప్రభుత్వాన్ని కూల్చాలంటూ జగన్‌ను ఆయన అనుయాయులు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.

ప్రభుత్వాన్ని కూల్చాలని అప్పుడే జగన్ శక్తి ఏంటో తెలుస్తుందని వారన్నారు. ఇందుకు ప్రతిస్పందనగా వైఎస్ తనయుడు.. "ఇందుకు కొంత కాలం ఓపిక పట్టాలి. ఆ సంగతి నాకు వదిలేయండి! మన బలం స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిద్దాం! పార్టీ గుర్తుతోనే పోటీ చేస్తాం! ఎలాంటి పరిస్థితి వచ్చినా.. మనం గట్టిగా ఉండాలి'' అని తమకు సూచించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. రోజుల వ్యవధిలోనే తన నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందని, ఆ పార్టీ పటిష్టతకు అందరూ కృషి చేయాలని జగన్ కోరినట్లు సమాచారం. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలాన్ని చూపిద్దామని కార్యకర్తలకు ఆయన చెప్పారు. అలాగే కమలాపురం నియోజకవర్గానికి చెందిన నేతలతో భేటీ అయినప్పుడు కూడా.. వారికీ ఇదే విషయాన్ని జగన్ చెప్పినట్లు తెలిసింది.

తన తండ్రి రాజకీయ ఎదుగుదలకు ఎలా కృషి చేశారో తాను ఏర్పాటు చేయబోయే పార్టీ బలోపేతానికి కూడా గ్రామ స్థాయి నుంచే అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. మరో వైపు.. మాజీమంత్రి పిల్లి సుభాశ్ చంద్రబోస్.. గురువారం హైదరాబాద్‌లో జగన్ నివాసంలో పార్టీ రూపకల్పనపై చర్చిస్తామని చెప్పడం కూడా.. జగన్ కొత్త పార్టీ పెడతారన్న వాదనకు బలం చేకూరుస్తోంది.

రెండోరోజు ముగ్గురే ఎమ్మెల్యేలు.. తగ్గిన జనం

కాగా.. జగన్ వద్దకు వస్తున్న వారి సంఖ్య బుధవారానికి పలుచబడింది. తొలి రోజు జనంతో ఇడుపులపాయ కిక్కిరిసిపోగా రెండో రోజు జనం తాకిడి తగ్గింది. బుధవారం వైఎస్ తనయుడిని కలిసిన వారిలో.. అనంతపురం ఎమ్మెల్యే రఘునాథ్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి మాత్రమే ఉన్నారు. సినీ నటి రోజా సోదరుడు, తుడా మాజీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి కూడా జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. రెండు రోజుల పాటు ఇడుపులపాయలో బస చేసిన జగన్ బుధవారం రాత్రి కడపలో తన బంధువైన మల్లికార్జునరెడ్డి గృహ ప్రవేశానికి హాజరయ్యారు. అనంతరం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు పయనమయ్యారు. 
జగన్‌ పార్టీ రె‘ఢీ’
Jagun1యువనేత జగన్‌ కొత్త పార్టీ ప్రకటన కోసం ఎదురుచూసిన అనుచర వర్గానికి ఆయన నోటి వెంట తీపి కబురే వెలువడింది. కొత్త పార్టీ పెడతారా లేక సరైన సమయం కోసం ఎదురుచూస్తారా అని ఆలోచిస్తున్న ప్రజలకు ఆయన నిర్ణయం సంతోషాన్ని కలిగించనుంది. పార్టీ పెట్టే అంశంపై ముహూర్తం తేదీని వెలువరించకపోయినా త్వరలోనే కొత్త పార్టీని స్థాపించనున్నట్లు, పార్టీ ప్రకటన అనంతరం విజయవాడలో భారీ బహిరంగసభను తలపెట్టనున్నట్లు జగన్‌ తన అంతరంగీకులతో చెప్పడంతో ఆయన వర్గీయుల్లో ఆనందం వెల్లువిరిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఇడుపులపాయలో జిల్లాలోని పలు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో జగన్‌ సమావేశం నిర్వహించారు.

వివరాలు గోప్యమే అయినా, వచ్చిన నాయకులకు కార్యకర్తలకు పార్టీ పెట్టడం ఖాయమని, తొందర అవసరం లేదని, ప్రస్తుతం మన ముందు ఉన్న బాధ్యత గ్రామస్థాయి నుంచి బలం పొందాలని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ శాయశక్తులా ప్రయత్నాలు చేయాలని సూచించినట్లు సమాచారం. నాన్న సంక్షేమ పథకాలు ప్రజల్లో ఉన్నాయి కనుక వారిని పూర్తిగా మనవైపు తిప్పుకొనేందుకు గ్రామస్థాయిలో కేడర్‌ను బలోపేతం చేయాలని సూచించినట్లు తెలిసింది. కొత్త పార్టీ ప్రకటన అందరూ ఊహించిందే అయినా ఎప్పుడుపెడతారన్నదే రాష్టవ్య్రాప్తంగా చర్చనీ యాంశంగా ఉంది. అయితే జగన్‌ బహిరంగసభ ఏర్పాటు విషయాన్ని కూ డా ప్రస్తావించడంతో ముహూర్తం త్వర లోనే ఉందని అర్థమైంది. ఇడుపుల పాయలో జగన్‌ను పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే కలవడం జరిగింది.

గురువారం హైదరాబాద్‌లో మరోసారి అనుచరులతో సమావేశం కావా లని నిర్ణయించడంతో అక్కడికి వచ్చే ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను బట్టి జగన్‌ సంఖ్య తేలనుంది. ఏదీ ఏమైనా జగన్‌ రాజీనామా అనంతరం రాష్ట్రంలో పలు ఆసక్తికర అంశాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వాయిదా పడుతూ వచ్చిన మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తి కావ డంతో జగన్‌ ఇక తన పూర్తి విశ్వరూ పాన్ని ప్రదర్శించేందుకోసం సన్నద్ధమౌ తారని తెలుస్తోంది. 150మందిపైగా ఎమ్మెల్యే ల్లో ప్రస్తుతం మంత్రివర్గంలో బెర్తు దొరికింది 39మందికే కనుక మిగిలిన వారిలో అసంతృప్తులను దరికి చేర్చుకొ నేందుకు ప్రణాళికలు కూడా రూపొందించే అవకాశముంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం ఇప్పటికే ఒకరిద్దరు అధిష్టానంపై గళం విప్పడం కూడా జరిగింది. దీన్ని బట్టి చూస్తే జగన్‌ ప్రణాళికబద్దంగా తన చెంతనున్న సంఖ్యకు రెట్టింపు సంఖ్యను జతచేసుకొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.


కుటుంబాన్ని చీల్చడానికి సోనియా కుట్ర
హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: తన చిన్నాన్న వివేకానందరెడ్డి అంటే తనకు ఎప్పటికీ గౌరవ భావమేనని, ఆయనను తన కుటుంబ సభ్యునిగానే భావిస్తానని కడప లోక్‌సభ మాజీ సభ్యుడు వైఎస్‌ జగన్మోహన రెడ్డి స్పష్టం చేశారు. సోనియాగాంధీ తన కుటుంబాన్ని చీల్చే కుట్రలో భాగంగా..తన చిన్నాన్నను ఉపయోగించుకోవడం బాధ కలిగించిన మాట వాస్తవమేనని చెప్పారు.

అయితే తమ ఇద్దరి మధ్య వాగ్వాదం, గొడవ జరిగినట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు తనను విస్మయానికి గురి చేశాయని అన్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగకపోయినా, ఊహించి అన్యాయమైన అభూత కల్పనలను రాశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

మంగళవారం ఉదయం ఇడుపుల పాయలో, సాయంత్రం పులివెందులలో తమ కుటుంబ సభ్యుల సమక్షంలో ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని, ఏకాభిప్రాయం కుదరని మాట వాస్తవమేనని అన్నారు. గొడవ జరిగిందని కొన్ని పత్రికలు రాయడం బాధాకరమని చెప్పారు.

No comments:

Post a Comment