జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Friday, July 9, 2010

ఓదార్పు... ఓనర్ షిప్, జగన్‌కు ఎందరి మద్దతు? ఎమ్మెల్యేల యాత్ర ఓదార్పునకు క్యూ - జాబితాలో 24 మంది: వారిలో నలుగురు మంత్రులు

ఓదార్పు... ఓనర్ షిప్

... వై.ఎస్. వారసుడిగా, తండ్రి ఆస్తిపాస్తులు వచ్చినట్టే, ముఖ్యమంత్రి పదవి కూడా తనకే రావాలన్నది జగన్ పట్టుదల. కాంగ్రెస్ కనుక అలా సీఎం సీటును స్వచ్ఛందంగా అప్పగించడానికి సిద్ధపడకపోతే, వైఎస్ పేరు, 'సానుభూతి' మంత్రంతో, ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్‌నే హైజాక్ చేయాలన్నది ఆయన ఎత్తుగడ!...


ఆంధ్రప్రదేశ్‌లో కొన్నేళ్లుగా పట్టు 'చే'జారిన 'తన కాంగ్రెస్' పార్టీని, ఇకనైనా ఎలాగోలా మళ్లీ 'హస్త'గతం చేసుకోవాలన్నది సోనియాగాంధీ పట్టుదల. అందుకోసం ఎంతకైనా సిద్ధపడాలి, ఎవరినైనా వదులుకోవాలన్నది ఆమె ఆలోచన! ఇప్పుడు తలెత్తింది 'ఓదార్పు- అనుమతి' సమస్య కాదు! రాష్ట్ర కాంగ్రెస్‌పై 'ఓనర్‌షిప్ ఎవరిది' అన్న ప్రశ్న!.... 'ఆదిత్య' రాసిన 'సానుభూతి వ్యూహం' 

ఎమ్మెల్యేల యాత్ర ఓదార్పునకు క్యూ
జాబితాలో 24 మంది: వారిలో నలుగురు మంత్రులు

పిల్లి, పినిపె, బాలినేని, అహ్మదుల్లా
కొండ్రుతో కేవీపీ మంతనాలు
తూర్పుగోదావరి ఎమ్మెల్యేల భేటీ
యాత్రలో పాల్గొనాలని నిర్ణయం
వెళ్లకపోతే స్థానికంగా దెబ్బతింటామని భయం
అధిష్ఠానం వైఖరిపై నేతల్లో అయోమయం

కడప ఎంపీ జగన్ మలి విడత ఓదార్పు యాత్ర కాంగ్రెస్ శాసనసభ్యుల్లో కలకలం సృష్టిస్తోంది. యాత్రలో తాము పాల్గొనకపోయినా, ప్రజా స్పందన బాగుండడం, నియోజక వర్గాల్లోని ద్వితీయ శ్రేణి క్యాడర్ క్రియాశీల పాత్రను పోషించడం వారిని కలవర పెడుతున్నాయి. దీంతో అసెంబ్లీ సమావేశాల కారణంగా హైదరాబాద్‌లోనే ఉండిపోవాల్సి వచ్చిన శాసనసభ్యుల పరిస్థితి, మనసొక చోట, తనువొక చోట అన్నట్లుగా మారింది.

తమ నియోజకవర్గాల్లో, జగన్‌తో మమేకమై తిరుగుతున్న యువ నేతల వల్ల, భవిష్యత్తులో తమ రాజకీయ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. జగన్‌తోపాటు ఓదార్పు యాత్రలో పాల్గొనకుంటే... రాజకీయంగా తాము వెనకబడి పోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. కీలకమైన సమయంలో జగన్ వెంట తాము లేకుంటే బాగుండదని యువ ఎమ్మెల్యేలు కొందరు పేర్కొంటున్నారు.

అందుకే ముఖ్యమంత్రి, అధిష్ఠానం మనోగతం ఏమైనప్పటికీ, యాత్రలో పాల్గొనడానికే కొందరు సిద్ధపడుతున్నారు. దీంతో జగన్ యాత్రలో పాల్గొంటామని ప్రకటించే శాసన సభ్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు శుక్రవారంనాడు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో, జగ్గంపేట ఎమ్మెల్యే తోట వెంకట నరసింహులు నివాసంలో సమావేశమయ్యారు.

జగన్ యాత్రలో పాల్గొనే విషయంలో అందరిదీ ఒకే బాటగా ఉండాలని ఇందులో తీర్మానించారు. మెజారిటీ శాసనసభ్యుల అభిప్రాయం మేరకు, జిల్లాలోని ఎమ్మెల్యేలంతా యాత్రలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రాజా అశోక్‌బాబు (తుని), పి.సతీష్‌కుమార్ (ముమ్మడివరం), రేపాక వరప్రసాద్ (రాజోలు), పి.రాజేశ్వరి దేవి (గన్నవరం), ఎన్.శేషారెడ్డి (అనపర్తి), రౌతు సూర్యప్రకాశ్‌రావు (రాజమండ్రి) ఈ భేటీకి హాజరయ్యారు. ఎమ్మెల్యేలందరం ఒకే మాటపై ఉండాలని తీర్మానించినట్టు తోట నరసింహులు 'ఆన్‌లైన్'కు చెప్పారు.

యాత్రలో ఒకరు పాల్గొని, మరొకరు పాల్గొనకపోవడం సరికాదని నిర్ణయించామన్నారు. రాజమండ్రిలో జగన్‌కు స్వాగతం పలుకుతానని రౌతు సూర్యప్రకాశరావు చెప్పగా, వైఎస్ వల్లే తాను రాజకీయంగా ఎదిగానని, అందువల్ల యాత్రకు వెళతానని రేపాక వరప్రసాద్ అన్నారు. అందరిదీ ఒకే మాటగా ఉంటే, అధిష్ఠానం కూడా చర్య తీసుకునేందుకు వెనుకా ముందూ ఆలోచిస్తుందని ఎమ్మెల్యేలు భావించినట్టు తెలిసింది.

కాగా సొంత నియోజకవర్గంలో ఉన్న జగన్ సన్నిహిత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (కాకినాడ సిటీ) ఈ భేటీకి హాజరు కాలేదు. అయితే అక్కణ్నుంచే ఆయన 'ఆన్‌లైన్'తో మాట్లాడుతూ, యాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారు.


"శ్రీకాకుళం జిల్లాలో శాసనసభ్యులు ఓదార్పు యాత్రలో పాల్గొనకపోయినా నడుస్తుంది. కానీ తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం సాధ్యంకాదు. యాత్రలో పాల్గొనకుంటే ప్రజలు నిలదీస్తారు. మేం పాల్గొనకపోయినా, జిల్లా అంతా, అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ అభిమానులు ఏకమవుతారు. చివరికి మమ్మల్ని (ఎమ్మెల్యేలను) కూడా పట్టించుకోరు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపె విశ్వరూప్ జగన్ యాత్రలో పాల్గొనాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఓదార్పులో పాల్గొంటానని సుభాష్ చంద్రబోస్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం రోశయ్య స్పందన తర్వాత కూడా, తన వైఖరిలో మార్పేమీ లేదని బోస్ సన్నిహితుల వద్ద స్పష్టం చేశారు.

పాల్గొన వద్దని అధిష్ఠానం హుకుం జారీ చేస్తే, మంత్రి పదవి విడిచి పెట్టేందుకైనా సిద్ధమేనని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. జిల్లాలో జగన్ యాత్ర చేపట్టేందుకు ఇంకా సమయం ఉందని, తానేం చేయబోతున్నదీ అప్పుడే స్పష్టమవుతుందనీ పినిపె 'ఆన్‌లైన్'తో అన్నారు.

ఇతర ప్రాంతాల్లో...:
ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితిని పరిశీలిస్తే... ప్రస్తుతం యాత్ర జరుగుతున్న శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మార్గదర్శనం కోసం వారు మంత్రి ధర్మాన ప్రసాదరావు వైపు చూస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి యువ ఎమ్మెల్యేలు జోగి రమేశ్, ఉగ్ర నరసింహారెడ్డి, గుర్నాథరెడ్డి, అమర్నాథరెడ్డి, లబ్బి వెంకట స్వామి, సాయిప్రసాద్‌రెడ్డి తదితరులు తాము ఓదార్పు యాత్రలో పాల్గొంటామని స్పష్టం చేస్తున్నారు.

తనకు రెండు రోజుల పాటు సొంత పనులు ఉన్నాయని, అవి చక్కదిద్దుకొని, యాత్రలో పాల్గొంటానని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రాజేశ్ వివరించారు. శని, ఆదివారాల్లో అసెంబ్లీ సమావేశాలు లేనందున, ప్రభుత్వ విప్ కోండ్రు మురళి, జగన్ యాత్రలో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లాకు పయనమయ్యారు.

అంతకుముందు ఆయన అసెంబ్లీ ప్రాంగణంలోనే మరోవైపు వైఎస్ కుటుంబ సన్నిహితుడు, ఎంపీ కేవీపీ రామచంద్రరావుతో మాటామంతీ జరిపారు. వైఎస్ కుటుంబ బంధువు, ఒంగోలు జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే జగన్ వెంట నిలిచారు.

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పరిస్థితులకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో స్థితిగతులకు చాలా వైవిధ్యం ఉంటుందని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు చెబుతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ముఠా రాజకీయాలు ఎక్కువగా ఉన్నందున, ఏ గ్రూపునకు ఆ గ్రూపు, రాజకీయంగా బలోపేతం అయ్యేందుకు నిత్యం ప్రయత్నాలు నెరపుతుంటాయి.

ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేసే ఈ జిల్లాల కాంగ్రెస్ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి కాంగ్రెస్‌లో కన్పిస్తోంది. మిగతా ప్రాంతాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా యాత్రలో పాల్గొనాలా వద్దా అనే విషయంలో ఊగిసలాడుతున్నారు.

అధిష్ఠానం వైఖరిపై అయోమయం: జగన్ యాత్ర విషయంలో అధిష్ఠానం వైఖరి అర్థం కాక పార్టీ నేతలు అయోమయంలో పడుతున్నారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు, బుధవారం ఉదయం, ముఖ్యమంత్రి రోశయ్య విలేఖరులతో చెప్పిన మాటలకు, అదే రోజు సాయంత్రం ఢిల్లీలో విడుదల చేసిన లేఖకూ సారాంశంలో తేడా ఉందన్న అభిప్రాయం శాసనసభ్యుల్లో వ్యక్తమవుతోంది.

జగన్ యాత్ర మొదలై రెండు రోజులైనా అధిష్ఠానం నుంచి స్పష్టత రాలేదని, దీంతో ఓదార్పు పట్ల అధిష్ఠానం సుముఖతతో ఉందో, విముఖతతో ఉందో తెలియడం లేదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాలకు అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం కారణమని తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి ఒకరు అభిప్రాయపడ్డారు.

"జగన్ యాత్రపై అధిష్ఠానం ఇప్పటివరకూ స్పష్టమైన వైఖరిని వెల్లడించక పోవడం ఒక కారణమైతే, కీలకమైన ఇలాంటి సమయంలో రాష్ట్ర నాయకత్వం చురుకుగా స్పందించక పోవడం మరో కారణం. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ప్రజా ప్రతినిధుల్లో చిన్నపాటి సందేహం ఉన్నా, నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకత్వానిదే.

సీఎల్పీని పిలిచి, అందులో ఓదార్పు యాత్రపై అధిష్ఠానం వైఖరి ఏమిటో, రాష్ట్ర నాయకత్వం ఏమనుకుంటుందో స్పష్టం చేసి ఉంటే .. ఈ రోజు శాసనసభ్యుల్లో ధర్మ సందేహాలు వచ్చి ఉండేవి కావు. సీఎల్పీ సమావేశం కాకున్నా, కనీసం మంత్రివర్గాన్నైనా సమావేశపరిచి, వైఖరిని చెబితే బాగుండేది'' అని ఆ మంత్రి పేర్కొన్నారు.

మరికొందరు మంత్రులు కూడా ఇదేరకంగా అభిప్రాయపడడం విశేషం. మొత్తమ్మీద జగన్ యాత్ర- పరిణామాలు మున్ముందు కాంగ్రెస్‌లో కల్లోలానికి దారితీస్తాయేమోనన్న ఆందోళన శాసనసభ్యుల్లో కన్పిస్తోంది!

జగన్‌కు ఎందరి మద్దతు?

ఓదార్పు యాత్ర చేస్తున్న జగన్‌కు మద్దతు తెలుపుతూ, యాత్రలో పాల్గొంటామని చెబుతున్న మంత్రులు, శాసనభ్యుల పేర్లు ఇవీ...

1. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి,
2. మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్,
3. మంత్రి పినిపె విశ్వరూప్,
4. మంత్రి అహ్మదుల్లా,
5. పి. సతీష్‌కుమార్,
6. రేపాక వర ప్రసాద్,
7. పి. రాజేశ్వరీ దేవి,
8. ఎన్.శేషారెడ్డి,
9. రౌతు సూర్యప్రకాశరావు,
10. తోట నరసింహులు,
11. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి,
12. జోగి రమేష్,
13. ఉగ్ర నరసింహారెడ్డి,
14. గుర్నాథరెడ్డి,
15. అమర్‌నాథరెడ్డి,
16. లబ్బి వెంకటస్వామి,
17. సాయి ప్రసాద్‌రెడ్డి,
18. కోండ్రు మురళి,
19. రాజేశ్,
20. గురుమూర్తిరెడ్డి,
21. శివప్రసాదరెడ్డి,
22. శ్రీకాంతరెడ్డి,
23. దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి,
24. రాజా అశోక్‌బాబు

No comments:

Post a Comment