జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Friday, July 9, 2010

నాతో రండి ఏ మలుపు తీసుకున్న నా వెంట నిలవండి - వైఎస్ మరణాంతరం రాజకీయం దిగజారింది 'ఓదార్పు'లో జగన్ కొత్త మాట రెండో రోజే మారిన స్వరం

శ్రీకాకుళం: వ్యక్తిగత 'ఓదార్పు'లో రాజకీయం తొంగి చూసింది. యాత్ర రెండో రోజునే కడప ఎంపీ వైఎస్ జగన్ 'మనసులో మాట' కొంచెం కొంచెంగా బయటపడింది. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న జగన్ శుక్రవారం పలుచోట్ల అభిమాన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తన తండ్రి వైఎస్ మరణించిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో రాజకీయాలు అట్టడుగుకు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నరసన్నపేటలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఈ వ్యాఖ్య చేశారు. అంతటితో ఆగలేదు! "నేను రాజకీయాల్లో ఒంటరిని కాను. ఇంతమంది నా వెనుక ఉండగా... నేను ఒంటరినెలా అవుతాను! రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తీసుకున్నా, మీరంతా నావెంటే ఉంటారని ఆశిస్తున్నాను'' అంటూ అభిమానులకు కొత్త పిలుపు ఇచ్చారు. సరికొత్త సంకేతాలు పంపారు.

శ్రీకాకుళం జిల్లా ఓదార్పులో రెండో రోజుకే జగన్ ప్రసంగంలో తేడా రావడం గమనార్హం. మొదటి రోజు ఆయన ప్రసంగం ప్రజలు తన మీద కురిపిస్తున్న ప్రేమ, తన తండ్రిపై ఉన్న అభిమానానికే పరిమితమైంది. రెండో రోజు ప్రసంగంలో రాజకీయ కోణం తొంగి చూసింది. నరసన్నపేట తర్వాత భైరి జంక్షన్, గార మండలం హుకుంపేట, గార తదితర ప్రాంతాల్లో జగన్ ప్రసంగించారు.

"రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన వైఎస్ చనిపోలేదు. మీ అందరి గుండెల్లో ఇంకా చిరంజీవిగా ఉన్నారు. అందువల్లే నేను ఏ జిల్లాకు వెళ్లినా ఒక కొడుకులా ప్రేమ పంచుతున్నారు. సోదరునిలా ఆత్మీయతను అందిస్తున్నారు. నాతో ఎవరున్నా, లేకపోయినా మీరున్నారు. ఈ అభిమానాన్ని మరిచిపోలేను'' అని తెలిపారు. జగన్ ఓదార్పు యాత్రకు రెండో రోజు కూడా విశేష ఆదరణ లభించింది.

జగన్ కంటి మీద కునుకు లేకుండా యాత్రను కొనసాగించారు. ద్వితీయ శ్రేణి నాయకులు, వారి వెనుక ఉన్న ముఖ్య నేతల ప్రోత్సాహంతోనే యాత్ర విజయవంతమవుతోందన్న విషయాన్ని జగన్ కూడా గుర్తించారు. అందువల్లే ఈ జిల్లాలో లేకపోయినప్పటికీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు తనకు దూరం కాదనేలా వారి ఇళ్లకు వెళ్లడానికి ప్రాధాన్యం ఇచ్చారు.

No comments:

Post a Comment