జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Monday, July 12, 2010

ఆత్మరక్షణలో...! రోశయ్య ఆయుధాలు రెండు


ఓదార్పు యాత్ర ముందుకు సాగుతున్న కొద్దీ వైఎస్‌ జగన్మో హన్‌రెడ్డి మాటల దూకుడును కలసి కట్టుగా అడ్డుకునేందుకు మంత్రులు, సీనియర్‌ నేతలు సిద్ధమవుతున్నారు. ఇక ముందు జగన్‌ చేసే ప్రతి వ్యాఖ్యపైనా తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేసేం దుకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఇప్పటిదాకా జగన్‌ నోటి వెంట తన పేరు ప్రస్తావనకు రాకపోవటంతో లౌక్యంగా సర్దుకుపోతూనే చుర కలు వేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి రోశయ్య ఇక ఇప్పుడు అలా ఉంటే లాభం లేదని భావిస్తున్నట్టు తెలిసింది.

laughసర్కార్‌ మనుగడపై జగన్‌ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఎలాగైనా తన ముఖ్యమంత్రి పదవిని, సర్కార్‌ను నిలబెట్టు కోవాలని ఆయన కృత నిశ్చయంతో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే తన పెద్దరికం నిలబెట్టుకుంటూ కాగల కార్యభారాన్ని మొత్తం మంత్రులు, సీనియర్‌ నేతలు, అధిష్ఠానం పెద్దలపైనే మోపాలని రోశయ్య భావిస్తున్నట్టు సమాచారం. అందుకు సూచనగానే సోమవారం నుంచి నిన్న మొన్నటిదాకా జగన్‌ను నూటికి నూటొక్కసార్లు వెనకేసుకు వచ్చిన మంత్రులు, పలువురు సీనియర్‌ నేతలు ఒక్కసారిగా జగన్‌పై విరుచుకుపడటం ప్రారంభించారు. ఇంతకాలం పాటు జగన్‌కు వెన్నుదన్నుగా ఉన్న సీనియర్‌ మంత్రులు బొత్స సత్యనారాయణ లాంటి వారే ఇప్పుడు ఎదురుదాడికి నాయకత్వం వహించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆగ్రహించిన రోశయ్య?...
రోజులు గడిచే కొద్దీ జగన్‌ వ్యాఖ్యలు పదునెక్కు తుండటం, ఇప్పటిదాకా తనపై పరోక్షంగా దాడి చేసిన ఆయన, రణస్థలం వద్ద ఏకంగా తనపైనే బాణాలు ఎక్కుపెట్టటం రోశయ్యను తీవ్ర ఆగ్ర హానికి గురి చేసినట్టు విశ్వసనీయ సమాచారం. జగన్‌ వ్యాఖ్యలు వినటంతోనే ఆయన సీనియర్‌ మంత్రులతో సీరియస్‌గా మంతనాలు జరిపి, ఎదురుదాడికి అవసరమైన సలహాలను అడిగి తెలుసుకున్నారు. జగన్‌ తనకుమారుడి లాంటి వాడని ఎన్ని పర్యాయాలు చెప్పినా, ఓదార్పు యాత్రకు అధిష్ఠానం ఆమోదం లేదని మాత్రమే చెప్పి, మిగిలిన విషయాలు మాట్లాడకపోయినా తననే లక్ష్యంగా చేసుకుని జగన్‌ నేరుగా వ్యాఖ్యానించి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయటం రోశయ్యను కంగు తినిపించింది. ఆయన ఇలా తనపైనే సూటిగా వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేకపోయారు. ఇంతదాకా వచ్చిన తర్వాత ఇక ఊరుకుంటే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చి తాను వెనుక ఉంటూ ఒకరిద్దరు తప్ప మంత్రులందరినీ ముందుకు తోసి ఎదురుదాడికి పురి కొల్పాలని నిర్ణయించుకున్నారు.

నష్టం నివారణ కోసమే...
జగన్‌ వ్యాఖ్యలు మరింత పదునెక్కితే వాటి ప్రభావం సర్కార్‌ మనుగడపై సైతం పడక తప్పదని రోశయ్య విశ్వసిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు మౌనంగా ఉంటే ఓదార్పు యాత్ర ముగించిన తర్వాత జగన్‌ ఇక మరింతగా ఎదురుదాడికి దిగుతారని, దాన్ని మొగ్గలోనే తుంచేసి, ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేకుండా చూసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు ఆ వర్గాలు వివరించాయి. ఈ వ్యూహంలో భాగంగానే ఆయన కొందరు మంత్రులతో మాట్లాడుతూ ‘సర్కార్‌ను ఉంచుకున్నా ... ముంచుకున్నా భారం మీదే...ఆ అబ్బాయి అలా మాట్లాడుతుంటే మీరు ఆకుకు అందని, పోకకు పొందని మాటలు మాట్లాడుతూ పబ్బం గడిపితే లాభం లేదు...మాటకు మాట...వ్యాఖ్యకు వ్యాఖ్య పద్ధతిలో ఎదురుదాడికి సమాయత్తం కావాలి...అటు వైపు నుంచి తీవ్రతను బట్టి దానికి దీటైన రీతిలో జవాబివ్వాలి...ఆలస్యం చేస్తే అసలుకే మోసం వచ్చేట్టుంది...’ అని చెప్పినట్టు సీనియర్‌ మంత్రులు కొందరు చెబుతున్నారు.

రాజీ యత్నాలకు రాం...రాం...?
రోశయ్య ఈ మాట చెప్పటంతో సీనియర్‌ మంత్రులు ఒక్కసారిగా మేలుకున్నారు. మరోవైపు ఈ పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా రాజీ యత్నాల కోసం జగన్‌కు సన్నిహితుడైన వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డి నివాసంలో ఆదివారం సమావేశమైన కొందరు మంత్రులు జగన్‌ వ్యాఖ్యలు విన్న తర్వాత ఇక వారిద్దరి మధ్య రాజీ యత్నాలు చేసినా ఫలితం ఉండబోదని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఎదురుదాడికి సిద్ధం కావాలని రోశయ్య ఇచ్చిన సంకేతాన్ని అందుకున్నదే తడవుగా జగన్‌కు సన్నిహితుడుగా పేరున్న మంత్రి వట్టి వసంతకుమార్‌ తన చాంబర్‌లో ఆరుగురు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ప్రసాదరాజు, జోగి రమేశ్‌, శ్రీకాంత్‌రెడ్డి, రాజేశ్‌, గురునాథ రెడ్డి, బాలరాజుతో జరిపిన మంతనాల్లో జగన్‌ వ్యాఖ్యలపై ఏమీ మాట్లాడలేని స్థితి నెలకొన్నదని, ఓదార్పు యాత్రలో రాజకీయాలు మాట్లాడబోనని ముందు చెప్పిన జగన్‌, అలా మాట్లాడటం తప్పేనని నిర్ణయించినట్టు సమాచారం. ఈ వ్యాఖ్యలను ఎదుర్కోకపోతే అనేక పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉందని భేటీలో నిర్ణయించారు.

బొత్సతో మొదలు...
తన ముఖ్యమంత్రి పదవి పోతుందనే రోశయ్య కుట్ర చేస్తున్నారనే అర్థం వచ్చే రీతిలో జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ముందుగా నిరసన తెలిపే బాధ్యతను సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ తీసుకున్నారు. సోమవారం ఆయన పత్రికల వారితో శాసనసభ ఆవరణలో మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి జగన్‌ కుమారుడు మాత్రమే అని, ఆయనకు కుటుంబ వారసత్వం మాత్రమే ఉందన్నారు. తామంతా రాజకీయ వారసులం అని చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కావాలని రోశయ్య పైరవీ చేసుకోలేదని, ఆయన పేరు ప్రతిపాదించింది జగన్‌ కాదా అని ప్రశ్నించారు. ఒక సీనియర్‌ మంత్రి నోటి వెంట జగన్‌ను ఉద్దేశించి వచ్చిన వ్యాఖ్యలు, ఆయనను వైఎస్‌ కుటుంబానికి మాత్రమే పరిమితం చేయాలనుకోవటం మామూలు పరిణామం కాదు.

అదే బాటలో మరి కొందరు...
బౌత్స సత్యనారాయణ బహిరంగంగా ఇలా మాట్లాడారో లేదో సిద్దిపేట లోక్‌సభ సభ్యుడు సర్వే సత్యనారాయణ ఢిల్లీలో మాట్లాడుతూ జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్రంలాంటి పార్టీలో జగన్‌ ఒక నీటి చుక్కగా అభివర్ణించారు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చి గంతులేస్తే ఎలా? అని గద్దించారు. ఇటు నిజామాబాద్‌ ఎంపీ మధు యాష్కీ అయితే జగన్‌ యాత్ర బోగస్‌ అని కొట్టి పారేశారు. అధికార దాహంతోనే ఈ యాత్ర సాగుతున్నదని విరుచుకు పడ్డారు. వీరికన్న ముందే పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, శంకర్రావు లాంటి వారు నిప్పులు కురిపించారు.

ఎమ్మెల్యేల కింకర్తవ్యం?...
ఒకవైపు జగన్‌ దూకుడు, మరోవైపు మంత్రులు, సీనియర్ల ఎదురుదాడి నేపథ్యంలో జగన్‌ వర్గానికి చెందిన పలువురు ఎమ్మె ల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎటువైపు మొగ్గితే ఏమవుతుం దో అనే ఆందోళన వారిలో కనిపిస్తున్నది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పటినుంచి ఆయనతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు తాడో పేడో తేల్చుకుందామన్న ఆలోచనతో ఉంటే, మరి కొందరు అధిష్ఠానం మాటను ధిక్కరిస్తే ఎలా అనే మీమాంసలో పడిపోయారు. తమంతట తాము ఎలాంటి ప్రకటన లు, వ్యాఖ్యానాలు చేయకుండా జిల్లాకు చెందిన సీనియర్‌ నేతలు, మంత్రుల సూచనల మేరకు నడుచుకోవాలనుకుంటున్నట్టు చెబుతున్నారు.

కేవీపీ
Rosaiah,-KVP
కాంగ్రెస్‌ అంతర్గత కలహాలు, జగన్‌ తిరుగు బాటుకు సంబంధించి అడిగే ప్రతి ప్రశ్నకూ తనకెలాంటి సంబంధం లేదని, ‘అంతా అధిష్ఠానమే చూచుకుంటుంద’నే ముఖ్యమంత్రి రోశయ్య తాజాగా తెలివైన కొత్త వ్యూహానికి తెర లేపారు. ఇంతవరకూ తనను ఇబ్బంది పెడు తున్న జగన్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్య వ్యాఖ్యలు, వెటకారమైన మాటలు మాట్లాడు తోన్న రోశయ్య ఇక వైఎస్‌ ఆత్మబంధువు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కేవీపీ రామచంద్ర రావును లక్ష్యంగా పెట్టుకుని పావులు కదుపు తుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశ మయింది. తనకు ఇబ్బందులు సృష్టిస్తోన్న జగన్‌ను కేవీపీ ‘అధిష్ఠానం దారిలో తెచ్చేందుకు’ ప్రయత్నిస్తున్నారని తాను నమ్ముతున్నట్లు, అధిష్ఠానం ఆలోచనలకు భిన్నంగా కేవీపీ వ్యవహరించబోరని విశ్వసిస్తున్నట్లు రోశయ్య చేసిన నర్మగర్భమైన వ్యాఖ్యలు పరిశీలిస్తే.. ఈ వ్యవహారంలో ఆయన నెమ్మదిగా కేవీపీనీ వ్యూహాత్మకంగా ఇరికించేప్రయత్నాలు చేస్తు న్నట్లు స్పష్టమవుతోంది.

ఒక విధంగా జగన్‌ను కేవీపీ నియంత్రించి తీరాలన్న ఆదేశం, బలవం తపు బాధ్యత రోశయ్య మాటల్లోధ్వనిస్తోంది. ముఖ్యమంత్రి పక్కన చేరిన ఒక ప్రముఖుడే జగన్‌కు దన్నుగా నిలుస్తున్నారంటూ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఇటీవల ఆరోపణలు చేసిన నేపథ్యంలో, రోశయ్య చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంటే.. కేవీపీ జగన్‌ను తెరచాటు మద్దతునిస్తున్నారని రోశయ్య చెప్పకనే చెప్పినట్టయింది. కేవీపీ జగన్‌ను నియంత్రించడం లేదని, ఆయన ఒకవైపు రోశయ్యకు సన్నిహితంగానే వ్యవహరిస్తు న్నారన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో రోశయ్య ప్రకటన కూడా అదే సంకేతాలను బలపరుస్తోందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

జగన్‌ను నియంత్రించే అవకాశం ఒక్క కేవీపీకే ఉందని, ఆయన ఎవరి మాటా వినరని కూడా రోశయ్య అధిష్ఠానానికీ సంకేతాలిచ్చారు. దీనిద్వారా.. జగన్‌ను నియంత్రించే బాధ్యతను తెలివిగా కేవీపీపైకి నెట్టి, ఆ బాధ్యతలో ఒకవేళ ఆయన విఫలమయితే అందుకు కేవీపీనే బాధ్యుడిని చేసే వ్యూహంతోనే రోశయ్య కొత్త ఎత్తులు మొదలుపెట్టినట్లు స్పష్టమవుతోంది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంకా కేవీపీ కనుసన్నులలోనే నడుస్తున్నారని పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రోశయ్య వ్యాఖ్యలు కూడా దానినే బలపరుస్తున్నాయి. మొత్తానికి కేవీపీ భుజంపై నుంచి తుపాకీ గురిపెట్టి జగన్‌ను పేల్చాలన్నది రోశయ్య వ్యూహంగా కనిపిస్తోంది.

ఓదార్పు యాత్రలో కేవీపీ మేనల్లుడు
తూర్పుగోదా వరిలో ప్రవేశించిన జగన్‌ ఓదా ర్పుయాత్ర లో రాష్ట్ర రక్షణ, భద్రతా వ్యవహరాల కమిటీ ఛైర్మన్‌, రాజ్యసభ సభ్యుడు కేవీపీ మేనల్లుడు అశోక్‌ ఉండటం అందరినీ ఆకర్షించింది. సోమవారం నాటి ఓదార్పు యాత్రను విజ యవంతం చేయడానికి అశోక్‌ ఆదివారం నుంచే ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం నుంచి జగన్‌ను వెన్నంటే ఉన్నారు.

No comments:

Post a Comment