జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Saturday, July 10, 2010

నాతో తిరగొద్దంటారా? ఓదార్పులో జగన్ ఆగ్రహం - మాటలు పేల్చిన జగన్: తిప్పి కొట్టిన లీడర్స్ - సీమ ఎమ్మెల్యేలతో మంతనాలు

కట్టడి చేయడం న్యాయమా?
వైఎస్‌ను అభిమానించడం నేరమా?
ఓదార్పులో పాల్గొనలేక నరకయాతన
భార్య, తమ్ముళ్లను పంపుతున్న ఎమ్మెల్యేలు
నా మాట కూడా మూగబోయింది
(శ్రీకాకుళం) కడప ఎంపీ జగన్ తన స్వరం మరింత పెంచా రు. రాష్ట్ర నాయకత్వంతోపాటు, అధిష్ఠానంపైనా సూటిగా బాణాలను సంధించారు. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఓదార్పు యాత్ర మూడో రోజున జగన్ మాటల్లో ఆక్రోశం, ఆగ్రహంతోపాటు ఒకింత ఆవేదన స్పష్టంగా కనిపించింది. వైఎస్ మృతిపై తనకు ఇప్పటికీ సందేహాలున్నాయనే సంకేతాలు పంపారు.

ఆయన దుర్మరణంపై సమగ్ర విచారణ ఎందుకు జరిపించలేకపోయారని జగన్ నిలదీశారు. శనివారం ఆయన వీరఘట్టంలో వీరావేశంతో ప్రసంగించారు. తన యాత్రలో పాల్గొనాలని ఉన్నా... పాల్గొనలేక ఎమ్మెల్యేలు నరక యాతన అనుభవిస్తున్నారని అన్నారు.

"వారి మనసంతా వైఎస్‌తోనే ఉంది. కానీ... యాత్రలో పాల్గొనలేక నరకయాతన అనుభవిస్తున్నారు. వాళ్లు రాలేక... భార్యలను, తమ్ముళ్లను నాతో పంపుతున్నారు. వైఎస్‌ను ప్రేమించడం అంత అన్యాయమైన పనా? ఎందుకు? ఆ ఎమ్మెల్యేలను అంత నరకం అనుభవించే పరిస్థితిని ఎందుకు తీసుకొస్తున్నారు?

తూర్పు గోదావరి జిల్లా గురించి ఈ రోజే నాకు తెలిసింది. అక్కడ కూడా అంటున్నారట! ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ నాతో తిరగొద్దని అంటున్నారట! వారిని కూడా కట్టడి చేసే కార్యక్రమం జరుగుతోందట. ఇది న్యాయమేనా?'' అని ప్రశ్నించారు.

వైఎస్ అనుక్షణం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసి అమరులయ్యారని... అలాంటి నేత జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యేలను నియోజకవర్గాలకు పంపించకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. "శ్రీకాకుళం జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులకు ఓదార్పు యాత్రకు వెళ్లొద్దని చెప్పినప్పటికీ వారి కుటుంబ సభ్యులు వైఎస్‌పై అభిమానంతో వస్తున్నారు.

కొందరు వారికి కూడా హెచ్చరికలు పంపే పనిలో ఉన్నారు'' అని జగన్ ఆరోపించారు. శనివారం జగన్ హిర మండలం, మదనాపురం, గొయిది, సీతంపేట, ఎం.సింగుపురం, నవగాం, వీరఘట్టం, కంబర తదితర ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి ప్రసంగించారు.

అంతకుముందు ఆముదాలవలసలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి పదవికి సంబంధించి తన ఆకాంక్షను స్వల్పంగా బయటపెట్టారు. 'జగన్ ముఖ్యమంత్రి కావాలి' అని అభిమానులు నినదించగా... 'ప్రతి గుండె చప్పుడు ఆ భగవంతుడికి వినిపిస్తుంది' అంటూ జగన్ చిరునవ్వులు చిందించారు. పాలకొండ నుంచి ప్రారంభమెన మూడోరోజు ఓదార్పు యాత్రలో వైఎస్ విగ్రహాల ఆవిష్కరణకు ప్రాధాన్యం ఇచ్చారు.

పాలకొండలో జడ్పీ అ«ధ్యక్షుడు పాలవలస రాజశేఖరం ఇంట్లో రెండు గంటలపాటు గడిపారు. యాత్రలో శ్రీకాకుళం జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రాధాన్యం కూడా తగ్గింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతల హవా బాగా కనిపించింది.

రేపటి నుంచి 'తూర్పు'లో ఓదార్పు
జగన్ ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లాకు చేరుకోనున్నారు. శ్రీకాకుళం నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో తుని చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా అన్నవరం వెళ్లి బస చేస్తారు. సోమవారం తొండంగి మండలం నుంచి ఓదార్పు యాత్రను జగన్ చేపట్టనున్నారు. 

మాటలు పేల్చిన జగన్: తిప్పి కొట్టిన లీడర్స్

* ఓదార్పు యాత్రలో పాల్గొనాలని ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలకు గాఢంగా ఉంది. వారి మనసంతా వైఎస్‌తోనే ఉంది. కానీ... యాత్రలో పాల్గొనలేక నరకయాతన అనుభవిస్తున్నారు. వాళ్లు రాలేక... భార్యలను, తమ్ముళ్లను నాతో పంపుతున్నారు.

* తూర్పు గోదావరి జిల్లా గురించి ఈ రోజే నాకు తెలిసింది. అక్కడ కూడా అంటున్నారట! ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ నాతో తిరగొద్దని అంటున్నారట! వారిని కూడా కట్టడి చేసే కార్యక్రమం జరుగుతోందట. ఇది న్యాయమేనా? ఈ విషయం తెలుసుకున్నాక నా మాట మూగబోయింది.

* వైఎస్‌ను ప్రేమించడం అంత అన్యాయమైన పనా? వైఎస్‌పై అభిమానం పెంచుకున్న వాళ్లంతా నేరస్థులా? ఆ ఎమ్మెల్యేలకు అంత నరకం అనుభవించే పరిస్థితిని ఎందుకు తీసుకొస్తున్నారు?

* వైఎస్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసి అమరులయ్యారు. అలాం టి నేత జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యేలను నియోజకవర్గాలకు పంపించకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం?

* వైఎస్ మరిలేరన్న చేదు నిజం విని గుండె ఆగి చనిపోయిన వారు కాంగ్రెస్ కార్యకర్తలు కారా? వారి కుటుంబాల గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఓదార్పు అందరి బాధ్యత కాదా?

* రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూసి గుండె బరువెక్కుతోంది!

* యాత్రకు వెళ్ళొద్దని అధిష్ఠానం సూచన చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిత్రులంతా దీనిని పాటిస్తారని అనుకుంటున్నా. యాత్రకు సంబంధించి హైదరాబాద్, ఢిల్లీల్లో నేను ఒకే వివరణ ఇచ్చినా మాట మార్చినట్లుగా కొన్ని ప్రసార సాధనాల్లో రావడం ఆశ్చర్యకరం.

* జగన్ యువకుడు, మంచి భవిష్యత్తు ఉంది. ఆయనను కొడుకుతో సమానంగా భావిస్తున్నా నే తప్ప ఎలాంటి శత్రుత్వం లేదు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికి ఒక సంప్రదాయం ఉందన్న విషయాన్ని గ్రహించాలి. - ముఖ్యమంత్రి రోశయ్య

* ఓదార్పు అంటే రాహుల్ చేసినట్లు నిరాడంబరంగా ఉండాలి. కానీ జగన్ వెళుతున్నట్టుగా పెళ్లి ఊరేగింపులా డప్పులు, డ్యాన్సులు, జిం దాబాద్‌లతో కాదు. ఎమ్మెల్యేలు చక్కగా అసెంబ్లీకి వస్తే, నరక యాతన అనుభవిస్తున్నారన డం సమంజసం కాదు. ప్రచారం, రవాణా సౌకర్యాలు కల్పిస్తే ఎవరి సభకైనా జనాలు వస్తారు. రాజకీయాలు ఈ 9 నెలల్లోనే అత్యున్నత స్థాయికి ఎదిగాయి. రాజకీయాలు భ్రష్టు పట్టినట్లు ఆయనకొక్కరికే కనిపిస్తోంది. జగన్‌కు మీడియా ఇస్తున్న కవరేజి చూస్తే ఇదేదో ప్యాకేజీలా ఉంది. - వీహెచ్

* ఓదార్పు యాత్రకు వెళ్లొద్దని మంత్రులు, ఎమ్మెల్యేలను ఎవరూ అడ్డుకోలేదు. యాత్రలో పాల్గొనే విషయంలో ప్రభుత్వ, పార్టీ పరంగా ప్రజాప్రతినిధులపై ఎలాంటి ఆంక్షలు లేవు. పాల్గొనకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదు. - మంత్రి శ్రీధర్ బాబు

సీమ ఎమ్మెల్యేలతో మంతనాలు
జగన్‌తో 11 మంది ఎమ్మెల్యేల భేటీ

( శ్రీకాకుళం) రాయల సీమ ప్రాంతానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు శనివారం జగన్‌తో భేటీ అయ్యారు. ఓదార్పు యాత్రలో పాల్గొనేందుకు వీరు శనివారం జిల్లాకు వచ్చారు. పాలకొండలో జెడ్పీ చైర్మన్ పాలవలస రాజశేఖరం ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న జగన్‌ను కలిసి, మంతనాలు జరిపారు.

వీరిలో జి.శ్రీకాంత్‌రెడ్డి, ఆళ్ల నాని, గురునాధరెడ్డి, బి.శివప్రసాదరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, రుషి, ముత్యంరెడ్డి, ఆదినారాయణ, వెంకటస్వామి, అమరనాధ్‌రెడ్డి, నర్సిరెడ్డి, గుంటూరు, పాలకొల్లు ఎఎంసీల చైర్మన్‌లు నర్సిరెడ్డి, దత్తాత్రేయ వర్మ తదితరులు ఉన్నారు. శుక్రవారం నాటి ఓదార్పు యాత్రలో జగన్ చేసిన వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన కథనాలు, పార్టీ నేతల అభ్యంతరాలు తదితర అంశాలపై వారు చర్చించినట్టు తెలిసింది.

ఈ పరిస్థితిలో మరింత ముందుకు వెళ్లాలంటే చెప్పాలనుకున్నది సూటిగా వ్యక్తీకరించాల్సిందేనని వారు సూచించారు. వీరఘట్టంలో చేసిన వ్యాఖ్యల వెనుక ఈ ప్రభావం కూడా ఉందని తెలుస్తోంది. ఈ నేతలతో భేటీ జరిగిన తర్వాతే జగన్ ప్రసంగంలో మార్పు రావడం విశేషం.

సీఎం కావాలని నినాదాలు
ఓదార్పు యాత్ర ప్రారంభం నుంచి ఆలస్యంగా జరుగుతుండడంతో జగన్ రాత్రి వేళ కూడా కంటి మీద కునుకు లేకుండా పర్యటిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 3గంటలకు ఆమదాలవలస చేరుకొన్న జగన్‌కు మున్సిపల్ చైర్మన్ బొడ్డేపల్లి రమేష్, ఎంపీపీ బి.గోవిందగోపాల్, జడ్‌పీటీసీ సభ్యురాలు బి.మాధురి స్వాగతం పలికారు. జగన్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన సీఎం కావాలంటూ కొంతమంది నినాదాలు చేశారు. అది విని మీ గుండె చప్పుడు ఆ దైవం వింటారంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.

జగన్ వెంటే మేమూ
రాజాం/రాజాం రూరల్: జగన్ వెంటే తాముంటామని కడప, అనంతపురం, ఖమ్మం, వరంగల్ జల్లాల ఎమ్మెల్యేలు ఆదినారాయణ, గురునాధరెడ్డి, ముత్యంరెడ్డి, శ్రీనివాసులరెడ్డి తదితరులు అన్నారు.

శనివారం జగన్మోహన్‌రెడ్డి ఓదార్పులో పాల్గొనేందుకు వారు శ్రీకాకుళం జిల్లా రాజాం వచ్చారు. ఈ సందర్భంగా 'ఆన్‌లైన్'తో మాట్లాడుతూ... జగన్‌కు వస్తున్న ఆదరణ చూస్తే.. రాష్ట్ర కాంగ్రెస్‌లో మంచి నాయకుడు అవుతాడనే నమ్మకం కలుగుతున్నదన్నారు. బయటకు వెళ్లి, వేరే పార్టీ పెట్టే ఆలోచన జగన్‌కు ఏమాత్రం లేదన్నారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రోశయ్య జగన్ యాత్రపై నిమిషానికి ఓ మాట మార్చడం ఎంతమాత్రం తగదని ఎమ్మెల్యేల బృందం పేర్కొన్నది. కొడుకుగా అభిమానించి ఆశీర్వదించాలే తప్ప ఈ విషయాన్ని రాజకీయం చేయకూడదని, అధిష్ఠానానికి యాత్రపై సరైన సూచన ఇవ్వాలని వారు అభిప్రాయపడ్డారు.

మూడో రోజూ కనిపించని స్థానిక ఎమ్మెల్యేలు
శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ మూడో రోజు కూడా పాల్గొన లేదు. ప్రభుత్వ విప్ కొండ్రు మురళీ మోహన్ వస్తారనుకున్నా.. ఆయన కూడా రాలేదు. స్థానిక ఎమ్మెల్యేలు ఎవరూ లేకుండా వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం జగన్‌కు ఆగ్రహం తెప్పించింది.

జగన్‌ వెంటే మేము
askingవైఎస్‌ జగన్‌ నిర్వహిస్తున్న ఓదార్పు యాత్రకు తమ పూర్తి మద్దతు ఉం దని కడప, అనంతపురం ,దర్శి తదితర ప్రాంతాల ఎంఎల్‌ఏలు తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా, రాజాంలో నిర్వహించిన జగన్‌ ఓదార్పు యాత్రలో వారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మేజర్‌న్యూస్‌తో మాట్లాడారు.అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా జగన్‌కు బాసటగా నిలుస్తామని పేర్కొన్నారు. అయితే అధిష్ఠానం జగన్‌ యాత్రపై సానుకూలంగా సూచనలిచ్చిందే తప్ప వ్యతి రేకించలేదన్నారు. జగన్‌ యాత్రకు ప్రజా స్పందన ఎలా ఉందనేది స్వయంగా పరిశీలించేందుకే తాము వచ్చామని, ప్రజలనుంచి అనూహ్య స్పందన రావడం హర్షదాయకమన్నారు.

వైఎస్‌ మృతి చెందిన సమయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సోనియా గాంధీ, రాహుల్‌గాంధీలు తరలివచ్చి వైఎస్‌ కుటుంబాన్ని ఓదార్చి తామున్నామంటూ భరోసా ఇచ్చారని, అదే స్పూర్తితో జగన్‌ తన తండ్రి మరణ వార్తవిని ప్రాణాలు విడిచిన కుటుంబాలను ఓదార్చి తానున్నానంటూ భరోసా ఇస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ యాత్ర కొనసాగిస్తున్నారే తప్ప ఇందులో ఆక్షేపించాల్సింది ఏముందని వా రు ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వైఎస్‌ జగన్‌కు దిశదశ నిర్దేశించాలే తప్ప రోజుకో మాటమార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొడుకుగా భావించి ఆశీస్సులు అందజేసి జగన్‌ యాత్రపై అధిష్ఠానానికి సానుకూల సంకేతాలు ఇవ్వాలన్నారు. మేజర్‌న్యూస్‌తో మాట్లాడిన వారిలో కడప, జమ్మలమడుగు, అనంతపూర్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన ఆదినారాయణరెడ్డి, గురునాధరెడ్డి, ముత్యంరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment