జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Monday, July 12, 2010

కొంత గడువు తర్వాత షోకాజ్ తప్పదు మరిన్ని తప్పులు చేయనిద్దాం.. అధిష్ఠానం ఆలోచన

రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఆందోళన

ఏపక్షాన నిలవాలనే అయోమయం
అసెంబ్లీలో బృందాలుగా చర్చలు
నష్ట నివారణపై ముఖ్యమంత్రి దృష్టి
ఎమ్మెల్యేలతో భేటీకి ప్రాధాన్యం
అంతరం తగ్గించుకునే ప్రయత్నం
కడప ఎంపీ వైఎస్ జగన్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం ఇంకొంచెం సమయం ఇవ్వాలని భావిస్తోంది. చేసిన 'తప్పులు' దిద్దుకునేందుకు కాదు! ఇంకొన్ని తప్పులు చేసేటందుకు! అధిష్ఠానం పెద్దల అభిప్రాయం ప్రకారం... జగన్ తాను కూర్చున్న కొమ్మ ను తానే నరుక్కుంటున్నారు. ఓదార్పు యాత్రలో చేస్తున్న వ్యాఖ్యలు అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించిన విషయం సుస్పష్టం.

దీనిపై సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేయనున్నట్లు మీడియాలో హడావుడి జరిగింది. అయితే... జగన్ చేత మరిన్ని తప్పులు చేయించి ఆ తర్వాత చర్య తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. జగన్ కార్యకలాపాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా సోమవారం లండన్ నుంచి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీని అధిష్ఠానం కోరినట్లు తెలిసింది.

జగన్ మాట్లాడిన ప్రతి మాటను రికార్డు చేయాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. తూర్పు గోదావరిలో ఓదార్పుయాత్ర పూర్తయ్యే నాటికి పరిస్థితిపై ఒక అంచనా ఏర్పడుతుందని, అప్పటికి జగన్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.

"ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వక తప్పదు. కానీ, మరికొంత కాలం వేచి చూడాలని భావిస్తున్నాం. ఓదార్పు యాత్రను వ్యక్తిగతంగా భావించినా, జగన్ చేసే వ్యాఖ్యలను మాత్రం సీరియస్‌గా తీసుకోక తప్పదు. ఆయన తప్పులు చేసేందుకు అన్ని అవకాశాలు ఇచ్చి చూస్తాం'' అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. జగన్ ఎత్తులకు అధిష్ఠానం పైఎత్తులు వేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

జగన్‌తో ఉన్నవారంతా నిజానికి ఆయన మనుషులు కారన్నది వీరి అభిప్రాయం. "జగన్‌పై అధిష్ఠానం చర్య తీసుకుంటుందని తెలిస్తే... ఆయనను వదిలేసే వారే ఎక్కువ. ఒకవేళ జగన్ పార్టీని చీల్చినా దాని వల్ల ఫలితం ఉండదు. మధ్యంతర ఎన్నికలు రావడ మో, ప్రతిపక్షాలకు అధికారం అప్పజెప్పడమో జరుగుతుందని వారికి తెలుసు'' అని హెచ్చరిస్తున్నారు.

జగన్ ఆర్థిక మూలాలపై ఇప్పటికే అధిష్ఠానం నివేదిక సేకరించిందని... ఆయన అనుయాయుల రాజకీయ, ఆర్థిక నేపథ్య సమాచారం కూడా అందిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. "ప్రస్తుతానికి అధిష్ఠానం పరిస్థితిని గమనిస్తూనే సమాచార సేకరణ చేస్తోంది. సరైన సమయంలో మూడో కన్ను తెరుస్తుంది'' అని చెబుతున్నారు.

ఎప్పుడేం జరుగుతోందో...
'మరో నాలుగేళ్లు దర్జాగా అధికారాన్ని అనుభవించవచ్చు' అనే ధీమా రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కనిపించడంలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనే వ్యక్తమవుతోంది. మధ్యంతర ఎన్నికలు వస్తాయనే దిగులు కనిపిస్తోంది. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వీరప్ప మొయిలీ పరిస్థితిని చక్కదిద్దుతారేమోననే ఆశ వారిలో మిణుకు మిణుకుమంటోంది.

శాసనసభా ప్రాంగణంలో సోమవారం ఏ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసినా దీనిపైనే చర్చించుకోవడం కనిపించింది. "జగన్ వేరు కుంపటి పెడితే ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? లేక... వైఎస్‌పై ప్రేమతో జగన్‌తో నడవాలా?'' అనే సందిగ్ధత నెలకొంది. సోమవారం మంత్రి వట్టి వసంతకుమార్ చాంబర్‌లో శాసనసభ్యులు జోగి రమేశ్, శ్రీకాంత్‌రెడ్డి, గురునాథ రెడ్డి, ప్రసాద్‌రాజు తదితరులు భేటీ అయ్యారు.

ముఖ్యమంత్రి రోశయ్యకు, జగన్‌కు మధ్య దూరం పెరిగిందని.. అది తగ్గేందుకు మార్గాలను అన్వేషించాల్సి ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా... చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ కోండ్రు మురళీమోహన్, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, సుధాకర్, షాజహాన్ తదితరులు వేరుగా భేటీ అయ్యారు. వారు కూడా తాజా పరిణామాలపై చర్చించుకున్నారు.

ఎమ్మెల్యేలతో రోశయ్య సయోధ్య
పార్టీలో నష్ట నివారణ దిశగా ముఖ్యమంత్రి రోశయ్య దృష్టి సారించారు. పార్టీకీ, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకూ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకూ పలువురు ఎమ్మెల్యేలలో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు ఉపక్రమించారు.

అధిష్ఠానం నిర్ణయం మేరకు శాసనసభ్యులతో తరచూ సమావేశాలు నిర్వహించాలని.. వైఎస్ తరహాలోనే శాసనసభలో విధిగా ఒక ప్రత్యేక సమయంలో ఎమ్మెల్యేలను కలవాలని రోశయ్య నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

నియోజకవర్గ సమస్యలపై తక్షణ చర్యలకు ఆదేశాలు ఇస్తూ... ఇతరత్రా చర్యలు తీసుకోవడంవల్ల ఎమ్మెల్యేలతో సయోధ్య పెరిగే అవకాశాలున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందులో భాగంగా రోశయ్య సోమవారం పలువురు ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమయ్యారు.

ఇదే సమయంలో శాసనసభలో కీలక పాత్రను పోషించే ఒక ముఖ్యనేత కూడా జగన్ సన్నిహిత ఎమ్మెల్యేలైన ఆనం వివేకానందరెడ్డి, శ్రీనివాసులు, గురునాథరెడ్డి, షాజహాన్‌తో పాటు.. టీజీ వెంకటేశ్, వీర శివారెడ్డి, మంత్రులు ధర్మాన, బాలినేని, ఏరాసు ప్రతాపరెడ్డిలతో సమావేశమయ్యారు. శాసనసభ్యులకూ, ప్రభుత్వానికి మధ్య సమన్వయం పెంచే కీలక బాధ్యతను జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించాలని నిర్ణయించారు.

ఇది రాజకీయం కాదా?
రాజకీయం లేదంటూనే ముఖ్యమంత్రిని జగన్ విమర్శించడమేమిటని మాజీ మంత్రి ఆర్.దామోదర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంపై విమర్శలు గుప్పించడం రాజకీయం కాదా అని ప్రశ్నించారు. ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించలేదన్నారు.

No comments:

Post a Comment