జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Wednesday, July 28, 2010

కాకినాడలో తెగదెంపుల సంగ్రామమా? జ'గన్' పేలేనా? అటు విప్... ఇటు నిప్పు నేడు 'బల ప్రదర్శన'

తూర్పుగోదావరిలో ఓదార్పు ముగింపు
సభకు రావాలంటూ ఎమ్మెల్యేలకు పిలుపు
35 మంది శాసనసభ్యులు వస్తారని అంచనా
మరింత బయటపడ్డ వర్గ విభేదాలు
తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం
 
అధిష్ఠానంతో ఇక అతకనంత దూరం
బెడిసి కొట్టిన సయోధ్య యత్నాలు
సోనియా మాట ఎత్తేందుకు యువనేత ససేమిరా
తదుపరి ఓదార్పు ప్రకాశం జిల్లాలో!

కాంగ్రెస్‌లో 'కదన స్వరాలు' పురి విప్పుతున్నాయి. వర్గాల మధ్య విభజన రేఖలు మరింత స్పష్టంగా బయటపడుతున్నాయి. బుధవారం రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. 'కాంగ్రెస్‌కు జగన్ తప్ప మరో దిక్కులేదు' అని జగన్ వర్గీయులు పేర్కొనగా... 'మరేం ఫర్వాలేదు! ఆయన పార్టీని వదిలి వెళ్లిపోవచ్చు' అనేలా ప్రత్యర్థులు ఒకింత దీటుగానే బదులిచ్చారు.

సస్పెన్షన్ వేటు పడిన అంబటి రాంబాబు మరోమారు గళమెత్తగా... నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మొట్టమొదటిసారి బహిరంగంగా జగన్‌కు జై కొట్టారు. వీరిద్దరి వ్యాఖ్యలపై ఎంపీలు సర్వే సత్యనారాయణ, వి.హనుమంతరావు, ఎమ్మెల్యే శంకర్‌రావు మండిపడ్డారు. మొత్తానికి... వారూ వీరూ కలిసి కథను మరింత త్వరగా 'క్లైమాక్స్' చేర్చే సంకేతాలు పంపుతున్నారు.

జగన్ వ్యవహారాన్ని దగ్గరుండి పరిశీలించాలని అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే వచ్చేనెల 6న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. అలాగే.. 4వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలోనూ జగన్‌కు సంబంధించిన చర్చ జరిగే అవకాశముంది.

ఇన్ని పరిణామాల మధ్య... తూర్పు గోదావరి జిల్లాలో షెడ్యూలుకు అతీతంగా సాగిన జగన్ ఓదార్పు యాత్ర ముగింపు సభ గురువారం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు వివిధ జిల్లాల ఎమ్మెల్యేలు, నేతలు కాకినాడకు చేరుకున్నారు. సభను జగన్ వర్గీయులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీనిని 'బహిరంగ బల ప్రదర్శన'కు వేదికగా మారుస్తున్నారు. సభలో పాల్గొనాల్సిందిగా నేతలకు సమాచారం పంపారు.

తన వర్గీయుడైన అంబటి రాంబాబుపై సస్పెన్షన్ వేటు వేసినా తమాయించుకున్న జగన్... గురువారం నాటి సభలో అధిష్ఠానంపైనా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపైన మాటల తూటాలు పేల్చే అవకాశముందని ఆయన వర్గీయులే అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్ర ముగింపు సందర్భంగా రణస్థలంలో ముఖ్యమంత్రి రోశయ్యను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలాన్ని రేపాయి.

ఇప్పుడు కూడా తన యాత్రలో పాల్గొనకుండా ఎమ్మెల్యేలను రోశయ్య అడ్డుకుంటున్నారని జగన్ భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర నాయకత్వంతో పాటు, అధిష్ఠానంపైనా నిప్పులు చెరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే... అధిష్ఠానానికి తమ బలం చూపడమే లక్ష్యమని, జగన్ రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు ఏవీ చేయబోరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గురువారం జగన్ అలాంటి వ్యాఖ్యలు చేసినా, చేయకపోయినా... ఆయనకూ, అధిష్ఠానానికీ మధ్య పరిస్థితి ఇప్పటికే 'ఉప్పూ, నిప్పు'లా మారింది.

విపక్షాల వాయిదా తీర్మానం నేపథ్యంలో బుధవారం పార్టీ ఎంపీలంతా లోక్‌సభకు హాజరు కావాలని కాంగ్రెస్ విప్ జారీ చేసింది. పార్లమెంటు సమావేశాల గురించి పట్టించుకోని జగన్... విప్‌ను కూడా పక్కకు పడేశారు. ఓదార్పు యాత్రలోనే ఉన్నారు. గురువారం బహిరంగ సభలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. వీటన్నింటి నేపథ్యంలో కడప ఎంపీకి, కాంగ్రెస్ అధిష్ఠానానికీ మధ్య అగాథం పూడ్చలేనంతగా పెరుగుతోంది.

జగన్ కాంగ్రెస్‌లోనే ఉండాలని భావిస్తున్న ఆయన వర్గీయులకు ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. 'రాజీకి మార్గాలు మూసుకుపోయి కనిపిస్తున్నాయి. ఇలాంటి ధిక్కారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సహించే ప్రసక్తి ఉండదేమో!' అని జగన్ శ్రేయోభిలాషుల్లో ఒకరైన ఎంపీ సబ్బం హరి సైతం అభిప్రాయపడటం గమనార్హం. అధిష్ఠానం మాట ఎలా ఉన్నా... సయోధ్యకు యువనేతే ససేమిరా అంటున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పేరెత్తడానికే ఆయన ఇష్టపడటంలేదని తెలుస్తోంది. తాము అధిష్ఠానం మాటను ధిక్కరించలేమని, ఇదే సమయంలో జగన్‌ను వదులుకునేందుకు కూడా సిద్ధంగాలేమని ఆయన వర్గీయుల్లోనే కొందరు అంటున్నారు. వీరు సయోధ్య యత్నాలకు శ్రీకారం చుట్టారు. కొందరు నేతలు ఇటీవల వైఎస్ బంధువు వైవీ సుబ్బారెడ్డిని కలివారు.

జగన్‌కు, అధిష్ఠానానికి మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకు చొరవ చూపాలని సూచించారు. వారి సూచనలతో వైవీ సుబ్బారెడ్డి కూడా ఏకీభవించారు. అయితే... 'నేను జగన్‌కు ఎలాంటి సలహాలూ ఇవ్వను. మీలో ఎవరో ఒకరు ఆయనను కలసి చెప్పాలనుకున్నది చెప్పండి' అని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు తూర్పు గోదావరి జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్‌తో సమావేశమయ్యారు. అధిష్ఠానంతో వైరం పెంచుకుంటూ పోవడంకంటే.. సయోధ్యతో ముందుకు సాగడమే మంచిదని తెలిపారు. ఓదార్పు యాత్రలో సోనియాను ప్రశంసిస్తూ ప్రసంగించాలని సూచించారు. దీనికి జగన్ ససేమిరా అన్నారు.
'నా ఓదార్పు యాత్రకు సోనియా అనుమతి ఇవ్వలేదు. ఇది జగమంతటికీ తెలుసు. ఓదార్చేందుకు వస్తానని పావురాలగుట్ట సభలోనే ప్రకటించాను. ఆ మాటను నిలబెట్టుకుంటున్నాను. నాన్న రక్తం నాలో ప్రవహిస్తోంది. బాధిత కుటుంబాలను ఓదార్చాల్సిన బాధ్యత నాపై ఉంది.

ఇదే విషయాన్ని అధిష్ఠానానికి వివరించాను. యాత్ర పట్ల సోనియా సుముఖతను వ్యక్తం చేయలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ యాత్రలో సోనియాను ప్రశంసించాలని నాతో ఎలా చెబుతారు? ఇది సాధ్యం కాదు. ఆ ఆస్కారమే లేదు'' అని జగన్ తేల్చి చెప్పినట్లు తెలిసింది.

బుధవారం ఎంపీలు సబ్బం హరి, అనంత వెంకట్రామిరెడ్డి, కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ ఢిల్లీలో భేటీ అయ్యారు. జగన్ విషయంపై చర్చించారు. వీరు జగన్‌కు, అధిష్ఠానానికీ మధ్య తెగతెంపులు కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిసింది. ఎంపీలు కిళ్లి కృపారాణి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా జగన్ పార్టీలో లేకపోతే పార్టీకే నష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సభలో బల ప్రదర్శన...
తూర్పు గోదావరి జిల్లాలో షెడ్యూలుకు అతీతంగా సాగిన 'ఓదార్పు' యాత్ర గురువారం బహిరంగ సభ రూపంలో ముగియనుంది. ఈ సభకు జగన్ అనుచరగణం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఈ సభ వేదికపై జగన్ తన మనసులోని మాటను వెల్లడించాలని నిర్ణయించారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

సభకు సరిగ్గా ఒక్కరోజు ముందు... అంబటి రాంబాబు, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇవి వారి వ్యక్తిగత వ్యాఖ్యలుగా భావించలేమని.. జగన్ మనసులోని మాటలుగానే పరిగణించాల్సి వస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

ఇప్పటిదాకా ఏదైనా జిల్లాలో ఓదార్పు యాత్ర ముగింపు సమయంలో జగన్ తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించి, అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడమే జరిగింది. తొలిసారిగా కాకినాడలో బహిరంగ సభకు వేదికను సిద్ధం చేయడం చర్చనీయాంశమైంది. ఈ సభకు సాధ్యమైనంత మంది ఎక్కువ ఎంపీలను రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుచర గణంతో సహా తరలి రావాలంటూ నేతలకు పిలుపులు వెళ్లాయి.

ఇప్పటికే జగన్ వర్గీయులుగా పేరొందిన ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), శ్రీనివాసులు (రైల్వే కోడూరు), అమర్‌నాథ్‌రెడ్డి (రాజంపేట), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), రామచంద్రారెడ్డి (రాయదుర్గం), శివప్రసాదరెడ్డి (దర్శి), పి. రామకృష్ణారెడ్డి (మాచర్ల) కాకినాడలో బస చేశారు. బుధవారం వీరంతా జగన్‌ను కలిశారు.

మాజీ మంత్రి కొండా సురేఖ దంపతులు కూడా కాకినాడ చేరుకున్నారు. ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి దంపతులు, ఆళ్లనాని, జోగి రమేశ్ తదితరులు కూడా సభకు వచ్చే వీలుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక.. తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తోపాటు ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు జగన్ యాత్రలో భాగస్వాములయ్యారు. వీరంతా గురువారం నాటి సభలో పాల్గొనే అవకాశముంది. ఏ విధంగా చూసినా 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఈ సభలో పాల్పంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

జగన్ వర్గీయులు మాత్రం 35 మంది ఎమ్మెల్యేలు రావడం ఖాయమని చెబుతున్నారు. తదుపరి 'ఓదార్పు' ప్రకాశం జిల్లాలో ఉంటుందని జగన్ ఈ సభలోనే ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు తెలిపారు. త్వరలో తెలంగాణలోనూ జగన్ యాత్ర నిర్వహిస్తారని గట్టు రామచంద్రరావు కాకినాడలో తెలిపారు. జగన్ గురువారం రాత్రి రైలులో హైదరాబాద్‌కు బయలుదేరతారు.

No comments:

Post a Comment