జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Wednesday, July 14, 2010

జగన్‌ ఆర్థికమూలాలపై ఉక్కుపాదం ?


తనను లెక్కచేయకుండా, సొంత ఇమేజ్‌ పెంచుకుని, పార్టీని చీల్చే దిశగా అడుగులు వేస్తున్న కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ వ్యవ హారంలో కీలెరిగి వాతపెట్టాలన్న నిర్ణయానికి అధిష్ఠానం వచ్చి నట్లు తెలిసింది. అందులో భాగంగా.. సహజంగా రాయల సీమ ఫ్యాక్షన్‌ నేతల వ్యూహాన్నే కాంగ్రెస్‌ అధిష్ఠానం కూడా అనుసరిస్తోంది. అంటే.. జగన్‌, ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారుల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు తన వద్ద ఉన్న మార్గాలను అన్వేషించడం ప్రారంభించినట్లు సమా చారం. గత రెండు రోజుల నుంచి ఢిల్లీ పార్టీ వర్గాల్లో ఇదే అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితి సృష్టించడానికి సిద్ధ మయిన జగన్‌ వ్యవహారాన్ని సీరియస్‌గానే తీసుకోవాలని నాయకత్వం నిర్ణయించినట్లు కనిపిస్తోంది.

తొలుత ఆయన వ్యవహారంపై వేచిచూసే ధోరణి అవలంబించాలని భావించి నప్పటికీ, జగన్‌ ఓదార్పు యాత్ర నుంచి వస్తున్న నివేదికలు పరిశీలించి తర్వాత జగన్‌కు ఎంత త్వరగా చెక్‌ పెడితే పార్టీ పరిస్థితి అంత త్వరగా చక్కబడుతున్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సొంత పార్టీకి చెందిన దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు2 ఎంపీలు జగన్‌ను అనుసరించాలన్న ప్రాథమిక సమాచారం తెలుసుకున్న నాయకత్వం.. ఆ మేరకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని, నష్ట నివారణ చర్యలు ప్రారంభించాలని నిర్ణయించింది.
అందులో భాగంగా.. జగన్‌, ఆయన కుటుంబభ్యులు, ఆయనకు దన్నుగా నిలస్తున్న ప్రముఖుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా దానినో హెచ్చరిక సంకేతంలా పంపించాలని భావిస్తున్నట్లు సమాచారం. వైఎస్‌ అల్లుడు బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ప్రధాన భాగస్వామిగా ఉన్నారని భావిస్తోన్న బయ్యారం గనులపై దృష్టి సారించడం అందులో భాగమేనంటున్నారు. ఈ వ్యవహారంపై సభాసంఘం వేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. దాని ద్వారా.. ‘జగన్‌ కుటుంబ సభ్యులపైనే దాడులు జరుగుతుంటే ఇక తమకు ఎవరు అండగా ఉంటారన్న’ భయాన్ని ఆయన మద్దతుదారుల్లో కలిగించడమే అధిష్ఠానం వ్యూహంగా కనిపిస్తోంది.

కాగా, ముఖ్యమంత్రుల సమావేశానికి మంగళవారం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రోశయ్యకు అధిష్ఠానం ఆ మేరకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. జగన్‌, ఆయన కుటుంబసభ్యులు, మద్దతుదారుల విషయంలో అనుసరించవలసిన వ్యూహాన్ని రోశయ్యకు వివరించేందుకు నాయకత్వం సిద్ధంగా ఉంది. రోశయ్య ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత సభా సంఘాన్ని ఏర్పాటుచేసేందుకు అంగీకరించవచ్చంటున్నారు. ఆ తర్వాత విజిలెన్స్‌ విభాగాన్ని జగన్‌ కంపెనీలు, ఆయన మద్దతుదారుల ఆర్థిక వ్యవహారాలపై దృష్టి సారించేలా చర్యలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఢిల్లీ పార్టీ వర్గాల సమాచారం. వైఎస్‌ అల్లుడు అనిల్‌కుమార్‌ బయ్యారం గనులపై విచారణ సమయంలోనే.. జగన్‌కు చెందిన పరిశ్రమలపైనా దృష్టి సారించేందుకు నాయకత్వం ప్రణాళిక రూపొందించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఆయనకు దన్నుగా నిలుస్తున్న కర్నాటక బిజెపి మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలపైనా కన్నేయనున్నట్లు చెబుతున్నారు. తొలిదశగా భాగంగా.. మైనింగ్‌ వాహనాల వల్ల దెబ్బతింటోన్న రోడ్ల నష్టానికి సంబంధించి, కర్నాటక రాష్ట్రం కంటే రెట్టింపు రోడ్‌ టాక్స్‌ విధించాలని నిర్ణయం తీసుకోనుంది. గాలి నైతిక మద్దతు, నిధులతోనే జగన్‌ సొంతపార్టీ పెట్టి కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే నాయకత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఇదిలాఉండగా.. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లినా నాయకత్వం దానికి పెద్దగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు లేదని, పార్టీ నాయకత్వం దృష్టంతా ఎంపీలు వెళ్లకుండా నిరోధించడంపైనే ఉంద ని గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్‌ ఎంపీ వెల్లడించారు. తమ నాయకత్వానికి రాష్ట్రాలు, ఎమ్మెల్యేల కన్నా ఎంపీలే ముఖ్యమని చెప్పారు. జగన్‌ ఓదార్పు యాత్రకు సంబంధించి రాష్ట్ర మీడియాలో వస్తున్న ప్రచారం అంతా ఏకపక్షంగా ఉందని , క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని ఆ ఎంపీ నాయకత్వానికి తాజాగా నివేదిక కూడా ఇచ్చినట్లు తెలిసింది.

No comments:

Post a Comment