జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Sunday, July 25, 2010

చేతిలో చదరంగం - ఆచి తూచి అధిష్ఠానం పావులు, ఆర్థిక మూలాలే లక్ష్యాలు

మరో 'గాలి' కాకూడదనే?
బయ్యారంపై జగన్ శిబిరం మౌనం
నేతల నుంచి రోశయ్యకు మద్దతు
ఓబుళాపురం, బ్రహ్మాణి, భారతి సిమెంట్స్‌పైనా విచారణకు డిమాండ్
సయోధ్య కుదరాలంటే అద్భుతం జరగాల్సిందేనంటున్న నేతలు
కాంగ్రెస్‌లో రాజకీయ చదరంగం! ఓ వైపు అధిష్ఠానం.. మరోవైపు కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి శిబిరం. ప్రత్యక్షంగా, పరోక్షంగా సవాళ్లు.. ప్రతి సవాళ్లు! మొన్నటి దాకా తన మాటలు.. చేతలు, తన పత్రికలో ప్రభుత్వ వ్యతిరేక కథనాలతో జగన్ సవాళ్లు.

ఇప్పుడు అధిష్ఠానం వంతు! యువనేతకు అత్యంత విధేయుడు అంబటి రాంబాబుపై మొన్న వేటు! బయ్యారంలో అల్లుడి గనుల లీజు నిలిపివేస్తూ నిన్న ముఖ్యమంత్రి సంతకం పోటు! వీటన్నింటి నడుమ ఓదార్పు యాత్రను కొనసాగిస్తున్న కడప ఎంపీ!! ఏం జరుగుతోంది? అధిష్ఠానం ఏం చేయబోతోంది? మరో గాలి జనార్దనరెడ్డిలా జగన్ మారతారన్న ఆందోళన అధిష్ఠానంలో ఉందా?

ఆ పరిస్థితి రానీయకూడదనే అయన ఆర్థిక మూలాలపై దెబ్బ వేసి.. కాళ్లు చేతులు కట్టేయాలనుకుంటోందా? లేక ఒకదాని వెంట మరొక చర్య తీసుకుంటూ జగన్ రెచ్చిపోయేలా చేసి.. బయటికి పంపాలన్న వ్యూహమా? కొమ్ములు వంచి కాళ్లబేరానికి రప్పించాలన్న ఎత్తుగడా? తన తండ్రి వైఎస్ మరణానంతరం సీఎం సీటును వారసత్వ ఆస్తిగా భావించిన జగన్‌కు అధిష్ఠానం నుంచి తగులుతున్న షాకులపై కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున సాగుతున్న చర్చల సారాంశమిది!

తన ఆర్థిక మూలాలనే అధిష్ఠానం టార్గెట్ చేసిన తరుణంలో భవిష్యత్‌లో జగన్ వ్యూహమేంటి? ఇదే ఇప్పుడు ఆసక్తి కల్గిస్తున్న అంశం. రోజుల తరబడి సాగుతున్న ఓదార్పు యాత్ర.. 'ఎక్కడ' ముగుస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. బయ్యారం అంశంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం.. అధిష్ఠానానికి, జగన్‌కు మధ్య వైరం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు.

వైఎస్. అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్‌కు సంబంధం ఉందని వార్తలు వస్తున్న బయ్యారం గనుల లీజు వ్యవహారంలో తొలుత విచారణకు ప్రతిపాదించిన సీఎం.. మంత్రులు వద్దనడంతో ఆగినట్లు కనిపించారు. కానీ.. అకస్మాత్తుగా ఈ లీజు నిలిపివేతను కోరుతూ కేంద్రానికి లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. జగన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని, వైఎస్ మరణించి ఏడాది పూర్తయ్యే నాటికి తన రాజకీయ సత్తా నిరూపించుకునే దిశగా కదులుతున్నారని అభిజ్ఞ వర్గాల నుంచి సమాచారం అందడంతో అధిష్ఠానం అందుకు అనుగుణంగా పావులు కదుపుతోందని తెలుస్తోంది.

బయ్యారం గనుల గురించి ముఖ్యమంత్రి నుంచి పూర్తి సమాచారం అందిన తర్వాతనే అధిష్ఠానం.. ఈ మేరకు రోశయ్యకు తగిన సలహా ఇచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే.. తమ ఆర్థిక మూలాలపై పడిన దెబ్బతో జగన్ శిబిరం కలవరం చెందుతోంది. మున్ముందు ఇలాంటి నిర్ణయాలు మరిన్ని చూడాల్సి వస్తుందని.. ఇదంతా పొమ్మన లేక పొగ పెట్టడంలా ఉంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

బయ్యారం గనుల వ్యవహారంలో తమ ప్రమేయం లేదని యువనేత వర్గం ప్రకటించడంతో.. ఇప్పుడు రోశయ్య నిర్ణయాన్ని బహిరంగంగా తప్పుపట్టే అవకాశం వారికి లేకుండా పోయిందని పలువురు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దాదాపు ఎనిమిది మంది మంత్రులు బయ్యారంపై విచారణ వద్దన్నారని వార్తలు వచ్చాయి. కానీ.. ముఖ్యమంత్రితో సంతకం చేయించడం ద్వారా అధిష్ఠానం అంటే ఏమిటో తెలియజెప్పినట్లయిందని ఒక సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో.. అనుమతి ఇవ్వకపోయినా ఓదార్పు యాత్రను కొనసాగించడం ద్వారా భవిష్యత్తులో హైకమాండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనన్న సంకేతాలను జగన్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అంబటిపై వేటు, బయ్యారం గనులకు బ్రేకు ఇందులో భాగమేనని అన్నారు. మొత్తం మీద ప్రస్తుతం కడప ఎంపీ జగన్‌కు, అధిష్ఠానానికి మధ్య వ్యవహారం తెగేదాకా వెళ్లిందని, ఇరువైపులా.. పట్టు బిగించుకుని ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సమీప భవిష్యత్‌లో.. పార్టీలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయని ఆ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తాను ఇప్పటికీ ప్రయత్నిస్తున్నా.. ద్వారాలు మాత్రం క్రమంగా మూసుకుపోతున్నాయే తప్ప తెరుచుకునే అవకాశాలు కనుచూపు మేరలో కన్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ పార్టీలోని సీనియర్ మంత్రులను కలవరానికి గురి చేస్తున్నాయని ఆయన చెప్పారు.

జగన్‌ను ప్రేరేపించేలా అధిష్ఠానం నిర్ణయాలు ఉంటున్నాయని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. అధిష్ఠానాన్ని జగన్ ఏ మాత్రం విమర్శించకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నా, పార్టీ పెద్దలు మాత్రం తక్కువ అంచనా వేయడం లేదని ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. "జగన్ ఎప్పటికైనా పార్టీకి ప్రమాదకారే.. ఆయన మరో గాలి జనార్దన్ రెడ్డిలా రాష్ట్ర రాజకీయాలను శాసించగలరు.. అందుకే సాధ్యమైనంత త్వరలో ఆయనను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకే అధిష్ఠానం సిద్దమవుతున్నది'' అని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెప్పారు.

ఓ విధంగా చూస్తే రాష్ట్ర కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వచ్చిందనేది రాజకీయ విశ్లేషకుల మాట. అధిష్ఠానం నిర్ణయాలను కొందరు అభినందిస్తుంటే.. అవి ఎటుపోయి.. ఎటు వస్తాయోనని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. వరుస పరిణామాలపై కొందరు విస్మయం వెలిబుచ్చుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో జగన్.. మరో గాలి జనార్దనరెడ్డి కాకూడదన్న తలంపుతో అధిష్ఠానం ఉందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

జగన్‌కు అధికారం కట్టబెడితే వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన గాలి జనార్దనరెడ్డి, ఆయన సోదరులు కర్ణాటక రాజకీయాలను శాసిస్తున్నట్లు.. రాష్ట్ర రాజకీయాలను తన ఆర్థిక శక్తిని ఉపయోగించి.. గుప్పిట్లోకి తీసుకుంటారన్నదే అధిష్ఠానం ఆందోళనగా కనిపిస్తోందని ఓ సీనియర్ నేత చెప్పారు. ఇప్పటికే బయ్యారం నుంచి కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని తరలించి... ఉక్కు ఫ్యాక్టరీ పేరుతో సొమ్ము చేసుకోవడం, దాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం అధిష్ఠానం దృష్టికి వచ్చిందని అంటున్నారు.

ఇదే కాక జగన్‌కు ఏయే మార్గాల ద్వారా కోట్లాది రూపాయల నిధులు అందుతున్నాయన్న విషయంలో కూడా అధిష్ఠానం సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఈ మూలాలకు కత్తెరలు వేస్తేగానీ జగన్ దూకుడుకు కళ్లెం పడదని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. మైనింగ్, ఇతర మాఫియాలు రాజకీయాలను ప్రభావితం చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా చాలా కాలం నుంచి ఆందోళన చెందుతున్నారని, ఇటీవల కర్ణాటక గవర్నర్ భరద్వాజ కూడా హెచ్చరికలు చేయడంతో ఆమె ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని భావించారని తెలుస్తోంది.

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా ఈ విషయంలో కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం పంపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జగన్ ఎంత మౌనంగా ఉన్నప్పటికీ ఆయన ఆర్థిక మూలాలపై, ఇతర లావాదేవీలపై అధిష్ఠానం ప్రేరణతో చర్యలు ఉంటాయని, మరో వైపు ఆయనను రాజకీయంగా బలహీనం చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతాయని ఆ వర్గాలు అంటున్నాయి. అవునన్నా.. కాదన్నా ఓదార్పు యాత్రలో పాల్గొంటానని స్పష్టం చేసి, ఆచరిస్తున్న మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ వ్యవహార శైలి పట్ల అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్నట్టు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతానికి జగన్.. పార్లమెంట్ సమావేశాలకు హాజరై, అధిష్ఠానంతో రాజీమార్గానికి ప్రయత్నించడమే ఉత్తమమని, ప్రకాశం జిల్లా యాత్రలు కూడా రద్దు చేసుకోవడం మంచిదని ఆయన శ్రేయోభిలాషులు కొందరు భావిస్తున్నారు. అంతేకాక బయ్యారం గనుల లీజును జగన్ సన్నిహితులైన మంత్రులు ఎవరూ బహిరంగంగా విమర్శించకపోవడంతో ఆయన ఏం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా... ఏదైనా అద్భుతం జరిగితే తప్ప జగన్, అధిష్ఠానం మధ్య సయోధ్య నెలకొనే అవకాశాలు లేవని పార్టీ నేతలు అంటున్నారు.

రోశయ్యకు మద్దతు :ఇదిలా ఉండగా.. బయ్యారం గనుల విషయంలో ముఖ్యమంత్రికి మద్దతు పెరుగుతోంది. ఆయన నిర్ణయం సరైనదేనని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్యే శంకర్‌రావు అన్నారు. రాష్ట్ర మైనింగ్ అభివృద్ధి సంస్థ ఎమ్‌డీగా రాజగోపాల్ ఉన్న సమయంలో కేటాయించిన అన్ని మైనింగ్ లీజులపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వీహెచ్ కోరారు.

అక్రమ మైనింగ్ వల్లే గాలి సోదరుల వంటివారు వేల కోట్లు గడించి ప్రభుత్వాలను శాసించే స్థాయికి ఎదిగి పోయారని ఆయన ప్రస్తావించారు. ఓ అడుగు ముందుకేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్‌రావు... దివంగత వైఎస్‌పై విరుచుకుపడ్డారు. అత్త సొమ్ము అల్లుడు ధారబోసినట్లు .. రాష్ట్రాన్ని తమ బంధువులకు గంపగుత్తగా ఇచ్చేశారంటూ విమర్శించారు. బయ్యారం అంశంతో పాటు.. ఓబుళాపురం గనులు, బ్రహ్మణీ స్టీల్స్, భారతీ సిమెంట్స్‌పైనా ప్రభుత్వం విచారణకు ఆదేశించాలన్నారు.

అయితే.. ఈ పరిణామాలపై కర్ర విరక్కుండా.. పాము చావకుండా అన్న పద్ధతిలో మంత్రి బొత్స స్పందించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం ఏర్పడిందా అన్న ప్రశ్నకు "సంక్షోభం ఉందంటే ఉంది. లేదంటే లేదు. మనం చేసే ఆలోచనలు, ధోరణులను బట్టి ఉంటుంది'' అంటూ డొంక తిరుగుడు సమాధానం చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర తమ జిల్లాకు వస్తే.. అప్పుడు దాని గురించి మాట్లాడతానని విజయనగరం జిల్లాకు చెందిన ఈ మంత్రి అన్నారు.

No comments:

Post a Comment