జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Monday, July 12, 2010

నాన్న లేక ఒంటరినయ్యా! - 'తూర్పు'లో జగన్ సంయమన బాట

తొలి రోజు ఐదుగురికి ఓదార్పు
 "నాన్న దూరమయ్యాక ఒంటరినయ్యాను.. గుర్తొచ్చినపుడల్లా కన్నీరు పెట్టని రోజు లేదు. ఆనక కోట్లాది మంది ప్రజల ఆప్యాయత, నాపట్ల చూపుతున్న ప్రేమను చూసి నే ను ఒంటరిని కాదనిపించింది. రాష్ట్రమంతా నిండి ఉన్న తెలుగు ప్రజలతో ప్రేమానుబంధాలను కలిపి పెద్ద కుటుంబాన్నే నాన్న నాకు అప్పగించి వెళ్లారు'' అని కడప ఎంపీ జగన్ అన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. అంతకుముందు తెల్లవారుజామునే అన్నవరం చేరుకున్నారు. సత్యదేవుడిని దర్శించుకున్న తర్వాత 11గంటల ప్రాంతంలో తొండంగి మండలంలో యాత్ర మొదలైంది. కొత్తపల్లి, శృంగవృక్షం, తొండంగి, ఒంటిమామిడి జంక్షన్, కొత్తపాకల, పెరుమాళ్లుపురం, బుచ్చయ్యపేటల్లో పర్యటించారు.

పలుచోట్ల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి కొద్దిసేపు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వైఎస్ లాంటి గొప్ప నేతను కోల్పోయిన శోకంతో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారని, వారంతా తన కుటుంబ సభ్యులేనని తెలిపారు. అలాంటివారు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్నారని, అందరి కుటుంబాలను ఓదార్చాల్సి ఉంది కనుక ఎక్కువసేపు మాట్లాడలేనని తెలిపారు.

పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఆశీర్వదించాలని కోరారు. సోమవారం రాత్రి తుని రామా «థియేటర్ సెంటర్‌లో మాట్లాడుతూ.. నాన్న మరణవార్త విని తట్టుకోలేక గుండెలు పగిలి ఈ జిల్లాలో 74మంది చనిపోయారని, వారందరినీ కలిసి ఓదార్చాల్సిన గురుతర బాధ్యత తనపై ఉందన్నారు. మహానేత కుమారుడిగా బాధ్యతలు నెరవేర్చడంలో ముందుకెళ్లే శక్తి యుక్తులు తనకివ్వాలని అర్ధించారు.

ముగ్గురు ఎమ్మెల్యేల హాజరు
'తూర్పు' యాత్రలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న యాత్రకు తుని ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు హాజరయ్యారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా జగన్ వెంట ఓదార్పుయాత్రలో పాల్గొన్నారు.

మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్.శేషారెడ్డి (అనపర్తి), పొన్నాడ సతీశ్ కుమార్ (ముమ్మిడివరం), రౌతు సూర్యప్రకాశరావు (రాజమండ్రి సిటీ), ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు జగన్‌కు స్వాగతం పలికి, అనంతరం విశాఖ వెళ్లి విమానంలో హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు బుచ్చయ్యపేట వచ్చి జగన్‌యాత్రకు సంఘీభావం తెలిపారు.

సంక్షిప్త ప్రసంగాలు
జగన్ ప్రసంగాలన్నీ సంక్షిప్తంగానే సాగాయి. ఎటువంటి రాజకీయ ప్రసంగాలు, విసుర్లు లేకుండానే సాదాసీదాగా మాట్లాడి సెలవు తీసుకున్నారు. కోన గ్రామాల్లో సాధారణ స్థాయిలోనే జనం హాజరయ్యారు. తుని పట్టణంలో వర్షపు జల్లుల్లోనే యాత్ర కొనసాగింది.
తూర్పు గోదావరిజిల్లాలో తొలిరోజు రాత్రి 9 వరకు 5 కుటుంబాలను జగన్ ఓదార్చారు. బుచ్చయ్యపేట గ్రామంలో మడికి దారయ్య ఇంటికి జగన్ వెళ్లారు. ఆయన భార్య, కుటుంబసభ్యులను ఓదార్చారు. వారికి రూ. లక్ష చెక్కు ఉంచిన కవర్ అందజేశారు. అక్కడినుంచి టి.వెంకటాపురం వచ్చి.. కాతా వీర్రాజు భార్య అప్పలరాజు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. 
తుని చేరుకుని పల్లెల బాబూరావు, మార్నీడి వెంకన్నదొర, అనపర్తి శ్రీరాములు కుటుంబాలను పరామర్శించి సాయమందించారు. కోటనందూరు మండలానికి కూడా వెళ్తానని జగన్ పట్టుబడుతున్నా, భద్రతా కారణాల రీత్యా పోలీసులు వెనకాడుతున్నారు.

No comments:

Post a Comment