జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Saturday, July 10, 2010

ఓదార్పు యాత్రపై అధిష్ఠానం మౌనం

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాన్ని పెడచెవిన బెట్టి దివంగత నేత వైఎస్‌ తనయుడు, కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించిన 'ఓదార్పు యాత్ర'కు పెద్దగా ప్రాధాన్యతనివ్వరాదనే అధిష్టానం ఇప్పటికీ భావిస్తోంది.
వైఎస్‌ పుట్టినరోజునాడు గురువారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమైన జగన్‌ యాత్ర విజయవంతంగా రెండవరోజుకు చేరుకొన్నప్పటికీ దీనిపై స్పందించేందుకు అధిష్ఠానం ప్రతినిధులు ముందుకు రావడం లేదు.
పెద్దసంఖ్యలో ప్రజల భావోద్వేగాలతో ముడివడిన ఈ యాత్ర గురించి ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయకుండా వేచిచూడాలనే వైఖరినే ఎఐసిసి అధికార ప్రతినిధులు కూడా అవలంబిస్తున్నారు. జగన్‌ ఓదార్పు యాత్ర గురించి తనకేమీ తెలియదని, ఒక కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యుడు సాగిస్తున్న ఈ యాత్రపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడైన కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని మాత్రమే అడగాలని శుక్రవారంనాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికాగోష్ఠిలో మాట్లాడిన ఎఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్‌ షకీల్‌ అహ్మద్‌ విలేఖరుల ప్రశ్నలను తప్పించుకొనే ప్రయత్నం చేశారు. జగన్‌ కొత్త పార్టీ పెడుతున్నారనే వార్తలపై మీ అభిప్రాయమేమిటన్న విలేఖరుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చేందుకు నిరాకరించారు. పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి నాయకత్వంపై దండయాత్ర మాదిరిగా ఆయన సాగిస్తున్న వోదార్పు యాత్ర రెండవ రోజుకు చేరినా స్పందించరా అన్న ప్రశ్నలకు 'యాత్ర గురించి నాకెలాంటి సమాచారం లేదు, యాత్రకు అధిష్ఠానం అనుమతి ఉన్నదా లేదా కూడా నాకు తెలియదు, యాత్ర సందర్భంగా ఆయన పార్టీపై ధ్వజమెత్తినట్లు కూడా ఎలాంటి సమాచారం లేదు' అన్న మాటలే ఆయన నుండి సమాధానంగా లభించాయి.
అయితే, అంతకుముందు కేరళలో వామపక్ష కూటమితో చేతులు కలపాలన్న యుపిఎ భాగస్వామ్యపక్షంఎన్‌సిపిలో చోటుచేసుకొంటున్న పరిణామాల గురించి, బీహర్‌ పరిణామాల గురించి వివరించిన ఆయనపై విలేఖరులు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌లో చోటుచేసుకొంటున్న పరిణామాలపై ఎందుకు వ్యాఖ్యానించరంటూ విరుచుకుపడినా ఆయన మౌనం వీడలేదు. కాకపోతే, ఒక దశలో ఓదార్పు యాత్రను పార్టీ జాగ్రత్తగా గమనిస్తోందని, ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ తిరిగి వచ్చాక సమర్పించే నివేదిక ఆధారంగానే అధిష్ఠానం ఏ నిర్ణయమైనా తీసుకొంటుందని మాత్రం వివరించారు.
  • మొయిలీ నివేదికపైనే ఏ నిర్ణయమైనా : షకీల్‌ అహ్మద్‌ ప్రకటన
కాంగ్రెస్‌లో ఒక వ్యక్తికి సంబంధించిన అంశంపై పెద్దగా ఆందోళన అనవసరమని, కాలక్రమేణా అన్ని సమస్యలు పరిష్కారమౌతాయన్న ధీమాను మరో సీనియర్‌ ఎఐసిసి నాయకుడు వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment