జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, July 8, 2010

శ్రీకాకుళం జిల్లా ఓదార్పు యాత్రలో కడప ఎంపీ జగన్

జగమంత కుటుంబం నాది
నాన్న నాకు అప్పగించి వెళ్లారు

ఆయన కలలను సాకారం చేయడానికే వచ్చా
ఓదార్పు యాత్రలో కడప ఎంపీ జగన్
  "మా నాన్న గారు వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోతూ నన్ను ఒంటరిని చేసి పోలేదు. ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఆత్మబంధువులుగా ఆయన నాకు అప్పగించారు'' అని కడప ఎంపీ వైఎస్ జగన్ మోహనరెడ్డి అన్నారు. ఆయన గురువారం ఉదయం 11.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఓదార్పు యాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రజాప్రస్థానం విజయవాటిక వద్ద హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నా చెల్లెమ్మలకు, అక్కయ్యలకు, వృద్ధులకు, నా సోదరులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ వైఎస్ తరహాలో ప్రసంగం సాగించారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ చిత్ర పటానికి పూల మాల వేసి.. నివాళులర్పించారు. ఇచ్ఛాపురంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

గత రెండు మూడు నెలలుగా తాను రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పర్యటించానని, ప్రతి చోటా ప్రజల హృదయం వైఎస్ అన్న పేరునే ప్రతిధ్వనిస్తోందని అన్నారు. "మీరు అందరూ నా కుటుంబ సభ్యులే. అతి పెద్ద కుటుంబాన్ని నాకు వైఎస్ అనుగ్రహించి వెళ్లిపోయారు. ఆయన కలలను సాకారం చేయడానికే మీ మధ్యకు వచ్చాను'' అని జగన్ చెప్పారు. తనను కొడుకులా, సోదరునిలా, ఆత్మీయునిగా ఆదరిస్తున్నారంటూ "మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుడినై ఉంటాను'' అని చెప్పారు.

ఆ తర్వాత కవిటి, జగతి, కంచిలి, సోంపేట తదితర ప్రాంతాల్లో ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఇదే విషయాలను తన ప్రసంగంలో పదేపదే ప్రస్తావించారు. జగన్ తన మాటల్లో ముఖ్య కాంగ్రెస్ నాయకుల పేర్లుగానీ, స్థానిక నాయకుల పేర్లు గానీ ప్రస్తావించలేదు. "నాన్న చనిపోయి పది నెలలైంది. నేను ఒంటరిగా ఉన్నాననుకొనేవాడిని. కానీ ఇప్పుడు తెలిసింది నాన్న చనిపోలేదని, మీ అందరి గుండెల్లోనే ఉన్నారని'' అంటూ జగన్ తన ప్రసంగాల్లో చెప్పారు. చిరునవ్వుతో సాగనంపండంటూ ప్రసంగాన్ని వడివడిగా ముగించారు.

నేతల ప్రస్తావనలేదు
ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనే 8 చోట్ల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించిన జగన్... ఎక్కడా మూడు నాలుగు నిమిషాలకు మించి మాట్లాడలేదు. దాదాపు ప్రతి చోటా ఒకే తరహాలో మాట్లాడిన జగన్... తన ప్రసంగాల్లో ఎక్కడా అధిష్ఠానంపైగానీ, ముఖ్యమంత్రి రోశయ్యపైగాని విమర్శలు చేయలేదు. కేవలం ఓదార్పు యాత్రకు వచ్చానంటూ క్లుప్తంగా ముగించేశారు.

మూడు గంటలు ఆలస్యంగా
ఓదార్పు యాత్ర తొలిరోజు నిర్ణీత సమయం కన్నా 3గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు ఉదయం 8 గంటలకు జగన్ చేరుకున్నారు. ఆర్అండ్‌బీ అతిథి గృహానికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకున్నారు. 9 గంటలకు ప్రజాప్రస్థానం విజయవాటిక వద్దకు చేరుకున్నారు. తన తండ్రి వైఎస్ చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సివుంది.

ప్రజాప్రస్థానం విజయవాటిక వద్ద తగినంత జనం లేకపోవడంతో జగన్‌ను అతిథి గృహంలోనే మూడు గంటలపాటు ఉండిపోయారు. ఆ తర్వాత క్రమేపీ జనం పెరగడంతో 11.30 గంటల సమయంలో జగన్ ప్రజాప్రస్థాన విజయవాటిక వద్దకు చేరుకున్నారు. తన తండ్రికి నివాళులర్పించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఆలస్యం అలా కొనసాగి మధ్యాహ్నం ఒంటి గంటకు సోంపేటలోని గాంధీ మండపం వద్ద జరగాల్సిన జగన్ ప్రసంగ కార్యక్రమం రాత్రి 9 గంటలకు మారింది.

అపశ్రుతులు
యాత్ర ప్రారంభంలోనే పలు అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద రైలు నుంచి దిగే జగన్‌ను చూడాలని ఆసక్తితో జనం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వారిలో కొంతమంది అక్కడున్న ఒక చెట్టును ఎక్కారు. జనభారాన్ని తట్టుకోలేక ఆ చెట్టు కూలిపోవడంతో పది మందికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. ఈలోగా జగన్ రైల్వే స్టేషన్‌లో దిగబోతుండగా తొక్కిసలాట జరిగింది, అందులో ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ లాభాల స్వర్ణమణిని నెట్టుకుంటూ జనం ముందుకు వచ్చారు. దాంతో ఆమె కిందపడిపోయారు.

వెనుక వస్తున్న జనం ఆమెను తొక్కుకుంటూ పరుగులు తీశారు. దీంతో ఆమె తీవ్రగాయాలపాలయ్యారు. ఓదార్పు యాత్రకు స్ధానికుల కన్నా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే అధికంగా వుండడంతో జనం కన్నా వాహనాల రద్దీ ఎక్కువైంది. దీనివల్ల ట్రాఫిక్ నియంత్రణ అస్తవ్యస్తమై జాతీయ రహదారి పొడవునా చాలా సమయం ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనిని సరిదిద్దడానికి పోలీసులు తంటాలు పడ్డారు.

ఇదీ ఓదార్పు!
జగన్ తన ఓదార్పు యాత్ర తొలి రోజున రాత్రి 12 గంటల సమయం వరకూ నాలుగు కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో ఇంట్లో సుమారు ఐదు నిమిషాల పాటు గడిపారు. రాత్రి 1గంట దాటే వరకూ జగన్ పరామర్శల షెడ్యూలు ఉంది. తొలుత ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టిలో పైల చంద్రమ్మ కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. అనంతరం కవిటి మండలం జగతి గ్రామంలో రెడ్డి అప్పన్న కుటుంబసభ్యులను పరామర్శించారు.

అక్కడి నుంచి కంచిలి మండలం కేశరపడ చేరుకొని పిలక గణపతి కుటుంబాన్ని ఓదార్చారు. ఆయా కుటుంబాల పెద్దలకు ఒక కవర్ అందజేశారు. అందులో ఎంత నగదు ఉన్నదనేది ఎవరికీ తెలియదు. దారి పొడవునా అభిమానులు ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను కూడా జగన్ ఆవిష్కరించారు. నత్తు రామారావు అనే కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో కాసేపు సేదతీరి.. మధ్యాహ్న భోజనం చేశారు. మాజీ ఎమ్మెల్యే లల్లూ అగర్వాల్ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారు.

No comments:

Post a Comment