మొయిలీ రామాయణంలో విలన్‌లెవరూ లేరు. అహల్య ఇష్టపడి ఇంద్రుడితో సుఖించిందే తప్ప తప్పు చేయలేదు. శూర్పణఖ అమాయకురాలు. నిరీక్షణ భరించలేక సీత అగ్నిప్రవేశం చేసిందే తప్ప రాముడు అటువంటి పరీక్ష ఏదీ పెట్టలేదు. ఆ మాటకొస్తే రావణుడూ దుర్మార్గుడు కాదు. సీతను అప్పగిద్దామనుకుంటుండగా రాముడు ఆయన్ని తొందరపడి చంపేస్తాడు. ఇక రామరాజ్యమైతే పూర్తిగా నేటి ఆధునిక ప్రజాస్వామ్యమే. కన్నడం నుంచి ఇంగ్లీషులోకి అనువాదమైన ఈ ఐదు సంపుటాల పద్యరచనలో ఇలాంటి విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ రచించిన రామాయణ మహాన్వేషణం నిజంగా మహాన్వేషణమే. శ్రీరాముడి కథను ఆయన లౌకిక వాద, ఆధునిక దృక్పథంతో రచించారు. అనేక కొత్త పాత్రలను, సంఘటనలను చేర్చడమే కాక మనకు పరిచయమైన అనేక ఘట్టాలను ఎంతో భిన్నంగా విశ్లేషించారు. జైనుల నుంచి జానపదులవరకు అనేక మంది రచించిన, పాడిన రామాయణాలను స్వేచ్చగా ఉపయోగించుకున్నారు. లక్ష్మణుడి పాత్రకు ఏ రామాయణంలో లేని ప్రాధాన్యం ఇచ్చారు. లక్ష్మణుడే తన రామాయణంలో నిజమైన కథానాయకుడని, ఆయన లేకపోతే రాముడే లేడని అంటారు మొయిలీ.
నా ఎదలో సంగీతం ఉబికి వచ్చినవేళ
కేతకీ పూల పరాగాలతో గాలి సవ్వడి చేసిన వేళ
మండేకరవాలంలా నీలి వసంతాకాశం మెరిసిన వేళ
ఊహల మెరుపు రేఖలు తామే ప్రకాశించిన వేళ
మేధావేశం, భావోద్వేగం కలిసిన నిర్ణిద్రానుభవంలో
సౌమిత్రికి నా వందనం... పాదాభినందనం.. అని రాశారు.
అహల్య చేసిన తప్పేమిటి?
ఇంద్రుడు అహల్యతో సుఖిస్తుండగా చూసి ఆమెను రాయి కమ్మని ఆమె భర్త గౌతముడు శపించినట్లు మనకు దాదాపు అన్ని రామాయణాల్లో కనిపిస్తుంది. కాని అహల్యకు అంత కఠినమైన శిక్ష విధించడాన్ని సహించలేకపోయారు మొయిలీ. రామాయణ మహాన్వేషణంలో అహల్య తన బాల్యం నుంచి ఇంద్రుడిపై అభిమానం పెంచుకున్నట్లు ఆయన చిత్రించారు.
ఇంద్రుడు గౌతముడి వేషంలో కనపడ్డప్పుడు ఆమె అతడిని వెంటనే గుర్తించినా, అతడి పట్ల తన మోహాన్ని అణచుకోక ఉద్దేశపూర్వకంగానే అతడితో సుఖిస్తుంది. ఆ తర్వాత పశ్చాత్తాపంతో తన ఇంటిని, భర్తను వదిలిపెట్టి ఏకాంత స్థలంలో ధ్యానంలో మునిగిపోతుంది. రాముడు ఆమెను కలిసినప్పుడు ఆమె అన్ని బలహీనతలను త్యజించిన తపస్వినిలా కనపడుతుంది. అప్పుడు అహల్యను, గౌతముడిని ఏకం చేస్తాడు రాముడు.
శూర్పణఖ పట్ల అంత దారుణమా?
రామలక్ష్మణులను వలచి వచ్చిన శూర్పణఖను ముక్కు, చెవులు కోసి దారుణంగా శిక్షించడం మొయిలీకి నచ్చలేదు. ఇష్టం లేకపోతే వద్దనాలి కాని, అంత క్రూరంగా శిక్షించడం దేనికి? అని భావించారు ఆయన. ఆమెను పాపం, పుణ్యం, నీతి, నియమాలు ఎరుగని వనితగా, అప్పటికి మనసుకు ఏది నచ్చితే దాన్ని ఆశించే అమాయక వనితగా చిత్రించారు. శూర్పణఖ సీతను వేధిస్తే లక్ష్మణుడు కత్తి తీశాడని, ఆ కత్తి పొరపాటున ఆమెకు తగిలి ముక్కు, చెవులు గాయపడ్డాయని మొయిలీ రాశారు.
సీత అగ్ని ప్రవేశం సరైనదేనా?
సీతను రాముడు అగ్ని ప్రవేశం చేయించడమనేది చాలామందికి లాగే మొయిలీకి కూడా మింగుడుపడలేదు. ఇది స్త్రీజాతికే అవమానకరమైన ఘట్టం అని భావించి మొయిలీ ఈ సంఘటనను మరో రకంగా చిత్రించారు. రావణుడిని యుద్దంలో జయించిన తర్వాత కూడా రాముడు తనను కలుసుకోవడంలో ఆలస్యం కావడంతో ఆ నిరీక్షణ దుర్భరమనిపించి సీత తనను తాను కాల్చుకుని మరణించేందుకు ప్రయత్నించిందని, మండోదరి ఆమెను కాపాడుతుందని మొయిలీ రాశారు. అప్పుడు మండోదరి సీతతో ఇలా అంటుంది:
ఇదేం అఘాయిత్యం నా పుత్రికా.. నీవే కాదు, నన్నూ మంటల్లోకి లాగావు.. మన ం స్త్రీలం.. మన జీవితాల్లో అడుగడుగునా కష్టాలే కదా.. అవి సరిపోదా..
ఎప్పుడో ఏ వేలసంవత్సరాలకో మన కష్టాల్ని తీర్చే మహాపురుషుడొస్తాడు.. రావణుడు విలన్ కాదు రావణుడు సీతపట్ల ఆకర్షితుడై మొదట ఆమెను అపహరించినా భార్య మండోదరి, సోదరుల సలహాపై తన మనసు మార్చుకుంటాడు. యుద్దం పూర్తయిన తర్వాత సీతను గౌరవంగా రాముడికి అప్పగించాలనుకుంటాడు కాని దురదృష్టవశాత్తు ఆ యుద్ధంలో రావణుడు చనిపోతాడు.
గనికార్మికుల కోసం రాముడి తపన
ఆధునిక కాలంలో మైనింగ్ కంపెనీ యజమానులు అడవులను ధ్వంసంచేయడం, గిరిజనులను ఊచకోత కోయడం జరుగుతున్నది కదా. రాముడి కాలంలో కూడా అదే జరిగిందని, దాన్ని రాముడు చూసి చలించి పోయాడని మొయిలీ రాశారు. రావణుడు గిరిజన సంస్కృతిని , అడవులను ధ్వంసం చేస్తున్నాడని జటాయువు రాముడికి చెబుతాడు. అదే సమయంలో శరభంగ (కొత్త పాత్ర) అనే మునిని కలుసుకుంటాడు. ఈ ముని రాముడు, ఇతర జనం చూస్తుండగానే సజీవదహనం అవుతాడు.
రాముడు దిగ్భ్రాంతి చెంది ఇదేమిటని మిగతావారిని ప్రశ్నిస్తాడు. శరభంగ గనికార్మికులను సమీకరించి వారికి మంచి వేతనాల కోసం పోరాడారని, దోపిడీ తప్ప మరేదీ తెలియని ఇంద్రుడు, రావణుడు వారిని ఊచకోత కోశారని చెబుతారు. దీన్ని తట్టుకోలేక శరభంగ తనను తాను బలిచేసుకున్నాడని చెపుతారు. అప్పుడు రాముడు ఒక రాజు విధులేమిటో అర్థం చేసుకుంటాడు. భవిష్యత్తులో పేదలు, శ్రమ జీవుల అభ్యున్నతికి కృషిచేస్తానని శపథం చేస్తాడు.
మద్యపాన నిషేధం
సీతారాములు దండకారణ్యంలో తిరుగుతుండగా ఒక చోట భర్త బాగా త్రాగి భార్యను చితక బాదడం గమనిస్తారు. ఆమె రోదనలను భరించలేక సీత భవిష్యత్తులో తన రాజ్యంలో మద్యాన్ని నిషేధించాలని రాముడికి చెబుతుంది. ఆదర్శవంతమైన సుగ్రీవ రాజ్యం
ఇవే నా ఆదేశాలు.. మూసివేయండి మత్తు దుకాణాల్ని
మూసివేయండి వ్యభిచార గృహాల్ని, జూదశాలల్ని
అన్ని రంగాల్లో అవినీతిని పెరికివేయడమే
అధికారుల బాధ్యత అని గుర్తించండి..
అని సుగ్రీవుడు చేత ఆదేశింప చేస్తాడు మొయిలీ. శ్రమ జీవులకు (చెట్లపై ఉండే కోతులకు) చదువెందుకు అని వాదించిన వారికి సుగ్రీవుడు చేత గట్టి జవాబు కూడా ఇప్పిస్తాడు. ఆడా, మగా తేడా లేకుండా అందరికీ చదివే హక్కు ఉండాలని, మనం జంతువుల్లా ఎందుకు జీవించాలని సుగ్రీవుడు అంటాడు. లంకలో, అయోధ్యలో అందరూ మంచి జీవితం అనుభవిస్తుండగా, మన మెందుకు అమాయకత్వం, మూఢనమ్మకాల మధ్య సతమతం కావాలని ప్రశ్నిస్తాడు. లంక, అయోధ్యల్ని ఆధునిక దేశాలుగా మొయిలీ అభివర్ణిస్తాడు.
రామరాజ్యం అంటే ఏమిటి?
పట్టాభిషిక్తుడయ్యాక రాముడు రామరాజ్యం ఎలా ఉంటుందో తన ఆస్థానంలో ప్రకటిస్తాడు.
కులం, వర్గం, జాతి ఏదైనా
అందరికీ మంచి చదువు అందిస్తా
చట్టం ముందు అంతా సమానులే
ఆరోగ్యం, తాగునీరు, రక్షణ నాకు ముఖ్యం
పనిచేయగలిగిన వారందరికీ ఇస్తా నే ఉద్యోగం
ప్రపంచానికి ఒక్కడే దేవుడు
సృష్టి, స్థితి, లయలకు ఆయనే బాధ్యుడు
ఆయనకు జననం లేదు, మరణం లేదు
ఆయన లేని స్థలమంటూ లేదు
అందరిలో ఆయనే, ఆయనే అంతటా
నిత్యనూతనం భగవత్స్వరూపం అభివృద్ది, పురోగమనమే
రామరాజ్య లక్ష్యం.
ఇదీ మొయిలీ శ్రీరామాయణ మహాన్వేషణం. ఎవరికి ఏది కావాలంటే అది ఇక్కడ లభిస్తుంది..
No comments:
Post a Comment