మబ్బులు విడిపోతున్నాయి- ముసుగులు తొలగిపోతున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠాన వర్గానికి, కడప ఎం.పి. వై.ఎస్.జగన్మోహనరెడ్డికి మధ్య ఇంతకాలంగా ప్రచ్ఛన్నంగా సాగిన దోబూచులాట ఇప్పుడు ప్రత్యక్ష పోరుకు దారితీయనుందా? గడచిన కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగి, జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని పార్టీ ఎం.పి.లు, ఎం.ఎల్.ఎ.లకు స్పష్టంచేయడంతో.. జగన్ విషయంలో పార్టీ వైఖరి తేటతెల్లమైంది.
ఇక ఇప్పుడు బంతి జగన్ కోర్టులోకి చేరింది. పార్టీ అధినాయకత్వంతో సంధి కుదుర్చుకోవడమా? లేక సమరానికి సిద్ధం కావడమా? అన్నది తేల్చుకోవలసిన పరిస్థితి జగన్‌కు ఎదురైంది. అటు కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఇటు జగన్ గానీ, ఆయన అనుచరులు గానీ చేస్తున్న ప్రకటనలను గమనిస్తే.. సంధి అవకాశాలు తక్కువనే చెప్పవచ్చు.
జగన్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలంటే, పార్టీ అధిష్ఠానం ఆదేశాలను ఆయన శిరసావహించి, ప్రకాశం జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్రను పార్టీ తరఫున నిర్వహించడానికి అంగీకరించాలి. అదే సమయంలో తన పోకడల వల్ల పార్టీ అధిష్ఠానం ఆగ్రహానికి గురైన ఆయన.. ముఖ్యమంత్రి పదవిపై కనీసం పదేళ్లపాటు ఆశలు వదలుకోవలసి ఉంటుంది.
జగన్‌ను ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ అధిష్ఠానం ఏ మాత్రం పరిశీలించడం లేదనడానికి, ఆయనను ఉద్దేశించి "ఆ పిల్లాడికి పిచ్చా''అని అహ్మద్ పటేల్, "ఆ పిల్లాడు ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు'' అని సోనియాగాంధీ స్వయంగా వ్యాఖ్యానించడమే నిదర్శనం. ముఖ్యమంత్రి పదవి చేపట్టే స్థాయి జగన్‌కు లేదన్నది వారి ఉద్దేశంగా ఆ వ్యాఖ ్యలు చెప్పకనే చెబుతున్నాయి.
జగన్ మనస్తత్వం తెలిసినవారెవరూ ఆయన లొంగిపోతారని భావించలేరు. ఒక వ్యవస్థకు లోబడి గానీ, ఒక చట్రం పరిధిలో పనిచేయగల లక్షణాలు గానీ జగన్‌లో లేవని ఆయనను ఎరిగిన వారు ఇట్టే చెబుతారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇడుపులపాయకు వెళ్లిన సందర్భాలలో.. జగన్‌కు, వైఎస్‌కు మధ్య జరిగిన సంభాషణలను ఆ జిల్లాకు చెందిన పలువురు అధికారులు తమ సన్నిహితుల వద్ద పదే పదే ఉదహరిస్తూ ఉంటారు.
జగన్ దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనూ, రాజశేఖరరెడ్డి వారించే వారనీ, "నీకు తెలియదు. అది అలా చేయకూడదు. నాకొదిలేయ్'' అని రాజశేఖరరెడ్డి అంటూ ఉండేవారని ఆ జిల్లా అధికారులు చెప్పేవారు.
కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ తర్వాత అంతటి బలమైన నాయకుడిగా వ్యవహరిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని గురువారం రాత్రి కలిసిన తర్వాత కూడా జగన్ వైఖరిలో మార్పు వచ్చిన దాఖలాలు లేవు. ఆయన తన సొంత పత్రికలో వేయించుకున్న కార్టూన్ ఇందుకు నిదర్శనం. వాస్తవానికి కాంగ్రెస్ అధిష్ఠానానికి, జగన్‌కు మధ్య దూరం పెంచడానికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఆయన అనుయాయులు తరచూ ఆరోపిస్తూ ఉంటారు.
ఇందుకు భిన్నంగా తనకు-మృతుల కుటుంబాలకు మధ్య.. అంటే తనకు-ప్రజలకు మధ్య అంతరం సృష్టించడానికి కొన్ని పత్రికలు, తన వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారన్న అర్థం వచ్చేలా ఆయన తన పత్రికలో కార్టూన్ గీయించుకున్నారు. అంతేకాకుండా తనను కలిసిన ప్రకాశం జిల్లా ఎం.ఎల్.ఎ.లతో మాట్లాడుతూ, తన సర్వేలు తనకు ఉన్నాయనీ, జనం తనతోనే ఉన్నారనీ జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన ఆలోచనలకు అద్దం పడుతున్నాయి.
సోనియాగాంధీ రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ తరఫున ముఖ్యమంత్రి కె.రోశయ్య.. మంత్రి బాలినేనికి ఫోన్ చేసినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా జగన్ శిబిరం ఆలోచనలకు అద్దం పట్టేవే.
మరోవైపు ఏది ఏమైనా తన విధేయత పార్టీ అధినాయకత్వానికేనంటూ సోనియాగాంధీకి లేఖ రాసిన రాజశేఖరరెడ్డి సోదరుడు, ఎం.ఎల్.సి. వివేకానందరెడ్డి, రెండు రోజుల్లోనే స్వరం మార్చుకున్నారు. సోనియా ఆదేశాల మేరకు ఆమె భావాలను వెల్లడించిన కేంద్ర మంత్రి పురందేశ్వరి దంపతులపై విరుచుకుపడ్డారు.
మరోవైపు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం స్వరం పెంచి.. ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను ఎనిమిది రోజులపాటు నిర్వహించాలని తొలుత భావించామనీ, ఇప్పుడు దాన్ని 15 రోజులకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే.. పార్టీ అధిష్ఠానంతో రాజీకి జగన్ ఏ మాత్రం సిద్ధంగా లేరనీ, తన సొంత ఎజెండా ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతున్నది.
ఏదిఏమైనా ఓదార్పు యాత్రను ఆపేది లేదని, సెప్టెంబర్ 3 నుంచి యథాతథంగా జరిగి తీరుతుందని శుక్రవారం ఢిల్లీలో కరాఖండీగా ప్రకటించిన జగన్.. అక్కడి నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు వచ్చేశారు కూడా. మొత్తంమీద అధిష్ఠానంతో సున్నం పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు మనసు చంపుకొని రాజీ పడినా తన లక్ష్యమైన ముఖ్యమంత్రి పదవి దరిదాపుల్లో లభించదన్న విషయాన్ని గ్రహించలేనంత అమాయకుడేమీ కాదు జగన్!
ఇక జగన్ ఆలోచనలను పసిగట్టలేని పరిస్థితిలో కాంగ్రెస్ నాయకత్వం ఉందనుకోవడమూ పొరపాటే! ప్రజల్లో రాజశేఖరరెడ్డి పట్ల ఉన్న సానుభూతి జగన్‌వైపు మళ్లకుండా కాంగ్రెస్ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలోనే సోనియాగాంధీ- జగన్‌ల మధ్య జరిగిన సంభాషణ వివరాలను శాసనసభ్యులు, ఎం.పి.లు, కేంద్ర మంత్రుల ద్వారా బయటి ప్రపంచానికి వెల్లడి చేయించారు.
దీంతో ఓదార్పు యాత్రను సోనియాగాంధీ వద్దన లేదనీ, పార్టీ తరఫున నిర్వహించాలని సూచించారనీ, రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చనిపోయినందున, ఆయన మరణ వార్తతో మృతి చెందిన వారి కుటుంబాలకు కూడా పార్టీ తరఫునే ఆర్థిక సహాయం అందించవలసిందిగా సోనియా సూచించారని లోకానికి తెలిసింది. వాస్తవానికి వేరే ఆలోచనలు, ఉద్దేశాలు లేకపోతే సోనియాగాంధీ చేసిన సూచనలను తప్పుపట్టవలసిన అవసరం లేదు.
రాజశేఖరరెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి తన పార్టీకే దక్కాలని ఒక పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఆశించడం సహజం. అయితే జగన్ మాత్రం ఆ సానుభూతి తనకే పరిమితం కావాలన్న ఆలోచనతో.. తన ఓదార్పు యాత్ర వ్యక్తిగతమైనదంటూ ప్రకటనలు చేశారు.
పేచీ అంతా ఇక్కడే ఉంది. ప్రజల్లో ఉన్న సానుభూతితో పాటు రాష్ట్రంలో మొత్తం పార్టీని హస్తగతం చేసుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయానికి వచ్చిన పార్టీ అగ్ర నాయకత్వం.. నేరుగా రంగంలోకి దిగింది. ఓదార్పు యాత్రపై తమ అభిప్రాయాన్ని లోకానికి వెల్లడించడంతో పాటు, జగన్‌ను ఒంటరిని చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అధిష్ఠానం ఆదేశాలను పాటిస్తారన్న నమ్మకం ఉన్న వారినే ఢిల్లీ పిలిపించుకుని అహ్మద్ పటేల్ మంత్రాంగం నెరపుతున్నారు.
తనకు పూర్తి విధేయులని నమ్మకం కుదిరిన వారితో సోనియాగాంధీ నేరుగా తన మనోభావాలను పంచుకుంటున్నారు. అదే సమయంలో ఆర్థిక నేరాలకు సంబంధించి జగన్‌పై వచ్చిన ఆరోపణల విషయంలో పూర్తి సమాచారాన్ని సేకరించి పెట్టుకున్నారు.
ఐ.బి. డైరెక్టర్ స్వయంగా ఒకే నెలలో రెండు పర్యాయాలు హైదరాబాద్‌ను సందర్శించారంటే, అధిష్ఠానం జగన్ పట్ల ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి జగన్ విషయంలో ఇంత ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి లేదు.
రాష్ట్రానికి సంబంధించి విభజన సమస్య తమ ముందున్నందున భవిష్యత్తులో తాము తీసుకునే నిర్ణయం వల్ల జగన్ లాభపడకూడదన్నది అధిష్ఠానం ఆలోచనగా చెబుతున్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించే పక్షంలో.. ఇప్పటికే సమైక్య నినాదం అందిపుచ్చుకున్న జగన్, సీమాంధ్రలో ఆ నినాదంతో పుంజుకోకూడదన్నది ఢిల్లీ పెద్దల ఆలోచన. ఈ కారణంగానే ఆచితూచి వ్యవహరించడం ద్వారా జగన్‌ను అన్ని రకాలుగా నిర్వీర్యం చేయాలన్న వ్యూహంతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఉంది.
సోనియాగాంధీని ఒకసారి ఎదిరిస్తే ఏమి జరుగుతుందో జగన్‌కు కూడా స్పష్టంగా తెలుసు. భావి పరిణామాలు ఎలా ఉన్నా అందుకు సిద్ధపడినందునే పార్టీ అధిష్ఠానం ఆలోచనలకు భిన్నంగా ఆయన ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి మృతుల కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సహాయం చేయాలంటే ఒక్కొక్క జిల్లాలో అన్ని రోజులపాటు పర్యటించవలసిన అవసరం లేదు.
'ఓదార్పు' పేరుతో ప్రజలను నేరుగా తనవైపు తిప్పుకోవాలన్నదే జగన్ అభిమతం. ముఖ్యమంత్రి పదవి కోసం పది, పదిహేనేళ్లు వేచి ఉండే ఓపిక ఉన్న మనిషి కాదు కనుకే.. జగన్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అధిష్ఠానంతో ఢీ అంటే ఢీ అంటున్నారు.
ఈ క్రమంలో జన హృదయాలను గెలుచుకుని, తన లక్ష్యమైన ముఖ్యమంత్రి పదవిని జగన్ సాధించుకుంటారా? లేక అటు జనాభిమానం చూరగొనలేక, ఇటు కాంగ్రెస్ పార్టీకి దూరమై రెండింటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోతారా? అన్నది కాలమే నిర్ణయించాలి.
నిజానికి, జగన్ విషయంలో పలువురు ఎం.ఎల్.ఎ.లకు సానుభూతి ఉన్న విషయం వాస్తవం. అయితే ఆయా జిల్లాలలో జగన్ వర్గంగా ముందుగానే ప్రకటించుకున్న వారి వల్ల పలువురు జగన్‌కు దూరం అవడం ప్రారంభమైంది.
ఉదాహరణకు ప్రకాశం జిల్లా విషయాన్నే తీసుకుంటే, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి నచ్చని కారణంగానే ఆ జిల్లాకు చెందిన మెజారిటీ శాసనసభ్యులు జగన్‌కు దూరమై, అధిష్ఠానానికి దగ్గరయ్యారు.
అలాగే వరంగల్ జిల్లాలో కొండా సురేఖ దంపతుల కారణంగా మిగతా ముఖ్య నాయకులెవరూ జగన్‌వైపు రావడానికి ఇష్టపడటం లేదు. గుంటూరు జిల్లా విషయానికి వస్తే, జనంతో సంబంధం లేని అంబటి రాంబాబు అధికార ప్రతినిధిగా చలామణి అవడం వల్ల, మెజారిటీ ఎం.ఎల్.ఎ.లు జగన్ వైపు చూడటానికి ఇష్టపడటం లేదు. అంతేకాదు.. మున్ముందు జగన్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడానికి కూడా పలువురు శాసనసభ్యులు సిద్ధపడుతున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరిస్తే ఏమవుతుందో అటు జగన్‌కు గానీ, ఇటు ఆయన వర్గంగా చలామణి అవుతున్న వారికి గానీ అనుభవం లేదు. అందుకే య«థాలాపంగా ఏ ప్రకటన అంటే ఆ ప్రకటన చేస్తున్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారంనాడు ముఖ్యమంత్రి తనతో మాట్లాడిన తర్వాత చేసిన ప్రకటన ఈ కోవలోనిదే! అహ్మద్ పటేల్ ముఖ్యమంత్రికి స్వయంగా ఫోన్ చేసి మరీ ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని బాలినేనికి సూచించవలసిందిగా ఆదేశించారు.
అయినా తాను జగన్‌కే విధేయుడిగా ఉంటానని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ భవిష్యత్తుకు బాలినేని సమాధి కట్టుకున్నారు. జగన్ కాంగ్రెస్‌లో కొనసాగినా, కొనసాగకపోయినా, బాలినేని వంటి వారికి కాంగ్రెస్ అధిష్ఠానం భవిష్యత్తులో కత్తెర వేయడం ఖాయం.
ఎవరి విధేయతలు ఏమిటో తెలిసిన తర్వాత ఉపేక్షించేటంత పెద్ద మనసు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి ఉండదు. అంతేకాదు, రాష్ట్రంలో ఎదురవుతున్న తరహా సమస్యను కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం గతంలో ఎప్పుడూ ఎదుర్కొనలేదు.
విభేదాల కారణంగా పార్టీని చీల్చిన వారు ఉన్నారు గానీ, సాక్షాత్తు పార్టీ అధినాయకత్వం కంటే తానే గొప్ప అని ప్రకటించుకునే సాహసానికి ఒడిగట్టిన స్వతంత్ర రాజులను కాంగ్రెస్ పార్టీ గతంలో చూడలేదు.
ఈ నేపథ్యంలో సంధి కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పలువురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులలో ఒకరిగా తాను కూడా కొనసాగడానికి జగన్ సిద్ధపడతారా? లేక ఎలా జరగాలనుంటే అలా జరుగుతుందని తాను తరచుగా చెబుతున్నట్లుగానే తిరుగుబాటు బావుటా ఎగరేస్తారా? మరో వారం పది రోజులలో ఏదో ఒకటి తేలిపోతుంది. పార్టీని ధిక్కరించి నిలదొక్కుకోగలిగితే ఆ ఘనత జగన్‌కు ఒక్కరికే దక్కుతుంది.
ఈ ప్రయత్నంలో విఫలమైతే తన సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైన నాయకుడిగా జగన్ మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఎదుటి వ్యక్తులు వాస్తవాలను గుర్తించలేని స్థితిలో ఉంటారని గట్టిగా నమ్మే జగన్.. పనిలో పనిగా అటు పార్టీ నాయకులను, ఇటు సాటి పత్రికలను కూడా ఆడిపోసుకోవడం అప్పుడే ప్రారంభించారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆలోచనలు గానీ, అహ్మద్ పటేల్ చర్యలు గానీ రాష్ట్రంలో చిన్న పిల్లలకు సైతం అర్థం అవుతున్నా.. అధిష్ఠానం నుంచి తనను దూరం చేయడానికి కొన్ని పత్రికలు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కుతంత్రాలు పన్నుతున్నారంటూ వార్తలు ప్రచురించడం ద్వారా తన సొంత పత్రికను ఒక రోత పత్రికగా జగన్ తీర్చిదిద్దుతున్నారు.
గడచిన నాలుగైదు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ వీరప్ప మొయిలీ పాత్ర లేకపోవడానికి కూడా స్థానిక పత్రికలే కారణమని జగన్ భావించినా ఆశ్చర్యపోవలసింది లేదు. జగన్‌లాంటి వ్యక్తులను ఎవరూ ఏమీ చేయనవసరం లేదు. మంచి గానీ, చెడు గానీ వారికి వారే చేసుకోగల సమర్థులు!