అధిష్ఠానం ప్రోత్సాహంతో విమర్శనాస్త్రాలు సంధిస్తోన్న పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి మాటల తూటాలకు జగన్ వర్గం బెంబేలెత్తుతోంది. గత రెండు రోజుల నుంచి జగన్‌పై శరపరంపరగా చిరంజీవి, ఆయన పార్టీకి చెందిన సీనియర్లు అవినీతి ఆరోపణలు చేస్తున్నా జగన్‌ను సమర్ధిస్తున్న ఒక్క ఎమ్మెల్యే కూడా చిరంజీవి విమర్శలను ఖండించకపోవడం చూస్తే జగన్ శిబిరం అధిష్ఠానం దన్ను ఉన్న చిరంజీవిని చూసి భయపడుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే స్థాయి కాకుండా, పెద్దగా ప్రాధాన్యం లేని వారితో జగన్ వర్గం ఎదురుదాడి చేయించినా వాటిని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు.
ఐదేళ్లలో జగన్ కూడబెట్టిన అవినీతి సంపాదనను చిరంజీవి తూర్పార పడుతున్నారు. అయినా జగన్ శిబిరం మౌనం వహించడం రాజకీయవర్గాల్లో అనేక ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నది. పీఆర్పీ నేతలు సి.రామచంద్రయ్య, కోటగిరి విద్యాధరరావు సైతం జగన్ అవినీతిపై ధ్వజమెత్తారు. పాల్వాయి గోవర్దన్‌రెడ్డి వంటి కాంగ్రెస్ సీనియర్లు కూడా చిరంజీవి విమర్శలను ఖండించకుండా, స్వాగతించి వాటిపై విచారణ చేయాలని డిమాండ్ చేయడం విస్మయం కలిగించింది. అటు పీఆర్పీ, ఇటు సొంత పార్టీలోని తన ప్రత్యర్థి నేతలు దాడులు చేస్తున్నా, వారిపై ఎదురు దాడి చేసేందుకు జగన్ శిబిరం సంకోచించడం చూస్తుంటే.. జగన్ ఇంకా అయో మయం నుంచి తేరుకోలేదని స్పష్టమవు తోంది. తన మద్దతుదారులయిన కొండా సురేఖ, అంబటి రాంబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజు పీసీసీకి సిఫారసు చేసినప్పటికీ జగన్ ఇంత వరకూ స్పందించకపోవడం పార్టీ వర్గాల్లో చర్చ నీయాంశమయింది.
దీన్ని బట్టి.. వైఎస్ మాదిరిగా తన అనుచరులను రక్షించుకోడం జగన్‌కు చేత కావడం లేదని, అందుకు ఆయన అనుభవం, ఎత్తుగడ సరిపోవడం లేదన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అదే సమయంలో అధిష్ఠానంతో రాజీ చర్చలు జరుగుతున్నందున, ఇప్పుడే తొందర పడటం ఎందుకన్న ముందు జాగ్రత్త కూడా లేక పోలేదంటున్నారు. తాజాగా రెండు రోజుల నుంచి చిరంజీవి చేస్తున్న విమర్శల దాడిపైనా జగన్ శిబిరం మౌనంగా ఉండటం ఆయన అభిమానులను విస్మయపరుస్తోంది. ఇంతకాలం వైఎస్ లక్షణాలను ఆయన కుమారుడిలో చూస్తున్న వారికి.. జగన్ మౌనం, భయం ఆశ్చర్యానికిగురిచేస్తున్నాయి. తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయలేని నాయకుడిని ఎమ్మెల్యే స్థాయి నేతలు ఎలా విశ్వసిస్తారన్న ప్రశ్నలు మరోసారి తెరపైకొస్తున్నాయి. కనీసం తన అనుచరులపై సస్పెండ్ వేటు సిఫార్సును కూడా ఖండించి, ప్రశ్నించలేని జగన్.. ఇక తన వెంట వచ్చే ఎమ్మెల్యేలకు ఎలా భరోసా ఇస్తారంటున్నారు. అయితే.. జగన్‌పై చిరంజీవి, ఆయన పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకూడదని జగన్ వర్గం భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ఎమ్మెల్యే స్థాయి నేతలు కాకుండా..
చిరును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సినీ నటుడు రాజశేఖర్-జీవిత, కేవీపీ వర్గీయుడయిన గోనె ప్రకాశరావును తెరపైకి తెచ్చి చిరుపై విమర్శలు చేయించినట్లు కనిపిస్తోంది. చిరు విషయంలో మౌనంగా ఉండాలన్న వాదన నిజమేనని అనుకున్నప్పటికీ.. జగన్‌పై ఈగ వాలినా సహించలేని కొండా సురేఖ, అంబటి రాంబాబు, శ్రీకాంత్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వంటి ప్రముఖులు జగన్‌పై చిరంజీవి విరుచుకుపడుతున్నా వీరెవరూ మాట్లాడకపోవడం విస్మయం కలిగిస్తోంది.
చిరంజీవి అధిష్ఠానం ఆశీస్సులతోనే జగన్‌పై ధ్వజమెత్తుతున్నందున ఆయనను విమర్శించాలా వద్దా అన్న భయం కూడా జగన్ వర్గంలో కనిపిస్తోంది. చిరంజీవికి పెద్దగా బలం లేకపోయినా, ఆయనకు నాయకత్వం ఆశీస్సులు ఉన్నందున ఏం మాట్లాడినా అది తిరగబడే ప్రమాదం ఉందన్న భయంతోనే, జగన్ వర్గం చిరంజీవిపై విమర్శల విషయంలో తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment