జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Saturday, August 21, 2010

జగన్ పార్టీలో ఉంటే ఉండవచ్చు... వెళితే వెళ్లవచ్చు... ఓదార్పుపై నిప్పులు చెరిగిన ప్రణబ్


ఓదార్పు యాత్ర తిరుగుబాటు కాదని, పార్టీకి వ్యతిరేకం కావని, ఇందులో రాజకీయాలు లేవని జగన్ కాంగ్రెస్ అధిష్ఠానానికి స్పష్టంగా చెబుతున్నప్పటికీ అధిష్ఠానం వినే మూడ్‌లో లేదని తేలిపోయింది. గత వారం సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీని కలిసిన జగన్ తన కోణాన్ని వివరించే ప్రయత్నం చేశారని ఆయన అస్మదీయులే చెబుతున్నారు. అయితే ప్రణబ్ మాత్రం ఓదార్పు యాత్రను మానుకొమ్మని జగన్‌కు స్పష్టంగా చెప్పారని కూడా తేలిపోయింది. శనివారం కోల్‌కటాలో ప్రణబ్ బెంగాలీ విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఓదార్పు యాత్ర వద్దని ఆయనకు స్పష్టంగా చెప్పామని వెల్లడించడం గమనార్హం. జగన్ పార్టీలో ఉంటే ఎంత? పోతే ఎంత? ఒక వ్యక్తి గురించి ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయనను తాము బుజ్జగించే ప్రసక్తే లేదని చెప్పారు.

ప్రణబ్ తన వైఖరిని స్పష్టం చేయడం ఇది మొదటి సారి కూడా కాదు. రెండు నెలల క్రితమే జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం పార్టీని ధిక్కరించినట్లు భావిస్తున్నామని ప్రణబ్ బెంగళూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఆయనపై చర్య తీసుకుంటామని కూడా సంకేతాలు ఇచ్చారు. తాజాగా జగన్ ప్రణబ్‌తో చర్చలు జలిగిననేపథ్యంలో అధిష్టానం వైఖరి ఏమైనా మారుతుందోనేమోనని ఆయన సన్నిహిత వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి. కాని ప్రకాశం ఎమ్మెల్యేలతో అహ్మద్ పటేల్ వ్యాఖ్యలు, సోనియా ఎంపిలకు స్వయంగా ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేయడం, ప్రణబ్ కూడా కోల్‌కటాలో జగన్ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేయడంతో అధిష్టానం మనసు మార్చుకునే అవకాశమే లేదని మరింత స్పష్టమైనది.

అయినప్పటికీ అనకాపల్లి ఎంపి సబ్బం హరి ఇప్పటికీ ఓదార్పు యాత్ర విషయంలో అధిష్ఠానం వైఖరిని మార్చగలమన్న నమ్మకాన్ని వ్యక్తం చేయడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన యాత్రలో రాజకీయాలు లేవని, అందులో రాజకీయాలు చూడరాదని జగన్ పదే పదే అందర్నీ అభ్యర్థిస్తున్నారని సబ్బం హరి శనివారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. జగన్ పై రాజకీయ, వ్యక్తిగత కక్షలతో కొందరు శక్తులు చేస్తున్న కుట్ర వల్లే అధిష్టానానికీ, ఆయనకూ మధ్య అగాధం పెరిగిందన్న ప్రచారం జరుగుతున్నదని సబ్బం హరి అన్నారు. నిజానికి జగన్‌కు కానీ, తమకు కానీ, అధిష్టానాన్ని, సోనియాను ధిక్కరించే ఆలోచనే లేదన్నారు. ఒక్క ఓదార్పు యాత్ర విషయంలోనే తన కోణాన్ని అర్థం చేసుకొమ్మని కోరుతున్నామని ఆయనచెప్పారు.

వీరప్ప మొయిలీ విందు ఏర్పాటు చేయడం, జగన్ ను ప్రణబ్ రెండుసార్లు కలుసుకోవడం మంచి పరిణామంలో భాగమని అన్నారు. అధిష్ఠానం తమతో కూడా మాట్లాడుతుంటుందని, అయితే తాము మైకులకెక్కి ఆ విషయాన్ని చెప్పుకోబోమనని ఆయన పరోక్షంగా దగ్గుబాటి దంపతులను విమర్శించారు. తమకూ బాధ్యతలు, పరిధులు ఉంటాయన్నారు. ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని అధిష్టానం ఎవరికైనా చెప్పడంలో ఆశ్చర్యం లేదని, నిజానికి జగనే ఎవరూ తమ పనులు మానుకుని ఓదార్పు యాత్రకు రావద్దని ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారని సబ్బం హరి అన్నారు.

తన యాత్ర వ్యక్తిగతమని, ఎవరైనా తమంతట తాము వస్తే తనకు అభ్యంతరం లేదని చెప్పారని తెలిపారు. ఏ అంశాన్నైనా సానుకూల మనసుతో అర్థం చేసుకుంటే సానుకూలంగానే అర్థమవుతుందని, వ్యతిరేక కోణంతో ఆలోచిస్తే అంతా వ్యతిరేకంగానే కనపడుతుందని అన్నారు. ఓదార్పు యాత్ర రాష్ట్రమంతటా జరుగుతుందని దాన్ని అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఎవరూ భావించనవసరంలేదని సబ్బం హరి అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి కానీ, ముఖ్యమంత్రికి కానీ వ్యతిరేకంగా గానీ జగన్ ఒక్క మాటైనా మాట్లాడారా, మాట్లాడితే బయటపెట్టండి.. అని ఆయన సవాలు విసిరారు .మొయిలీ, అహ్మద్‌పటేల్, ప్రణబ్ తమతో కూడా మాట్లాడుతున్నారని అన్నారు. ఓదార్పు యాత్ర వద్దని అధిష్టానం చెబుతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు తాము జవాబిచ్చే ప్రసక్తే లేదన్నారు. జగన్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ యే బలపడుతుందని ఆయన అన్నారు.

No comments:

Post a Comment