జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Wednesday, August 18, 2010

ఖబడ్డార్! * జగన్‌పై అధిష్ఠానం వార్ * యువనేతకు చెక్ చెప్పడమే లక్ష్యం

మేడమ్ రంగ ప్రవేశం..
యాత్రలో పాల్గొనొద్దని నేతలకు చెప్పండి....      పనబాక, మాగుంటకు ఆదేశాలు 

ప్రకాశం నేలకు 'క్లాసులు' -   ఆరుగురు ఎమ్మెల్యేలతో జేసీ భేటీ - మేడమ్ మనసులో మాట వెల్లడి

ఢిల్లీ చేరిన శాసనసభ్యులు
నేడు అహ్మద్ పటేల్‌తో మీటింగ్
బాలినేని, శివప్రసాద రెడ్డిలకు అందని పిలుపు
యాత్ర ఏర్పాట్లలో ఆ ఇద్దరు
యువనేతపై సోనియా రుసరుస
  వైఎస్ జగన్ ఓదార్పు యాత్రకు చెక్ చెప్పేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. 'ధిక్కారమున్ సైతునా' అంటూ యువనేతను ఒంటరిని చేసే వ్యూహాన్ని చకచకా అమలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు డీఎస్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ లాంటి వారందరినీ పక్కనపెట్టి... మేడమ్ స్వయంగా పావులు కదుపుతున్నారు.

ప్రకాశం జిల్లా నేతలతో నేరుగా కాంటాక్ట్‌లోకి వస్తున్నారు. జిల్లా ఎంపీలు పనబాక లక్ష్మి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి ద్వారా తన సందేశాన్ని పంపిన సోనియా... ఇప్పుడు ఆ జిల్లా ఎమ్మెల్యేలకూ టెన్-జన్‌పథ్ తలుపులు తెరుస్తున్నారు. తాను స్వయంగా పిలిచినట్లుకాకుండా... 'మేడమ్‌ను కలిస్తే మంచిది' అనే సందేశాన్ని కింది స్థాయికి పంపిస్తున్నారు.

'మేడమ్ సోనియా ఎవరినీ పిలవరు. అయితే, ఎవరు వచ్చి మాట్లాడినా సంతోషిస్తారు' అంటూ ఎమ్మెల్యేలకు పరోక్ష ఆహ్వానాలు పంపిస్తున్నారు. అదే సమయంలో... జగన్ వర్గీయులు, వీర విధేయులపట్ల కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, దర్శి ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డిలకు మాత్రం ఈ పరోక్ష ఆహ్వానం కూడా అందకపోవడం విశేషం. మొత్తానికి... మేడమ్ సందేశాన్ని 'అర్థం చేసుకున్న' ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అంతకుముందు హైదరాబాద్, ఢిల్లీ కేంద్రంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇవీ ఆ వివరాలు...

కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంగళవారం సోనియాతో భేటీ అయ్యారు. ఓదార్పుపై మేడమ్ మరోమారు తన మనసులోమాట స్పష్టంగా బయటపెట్టారు. "ఓదార్పు యాత్రకు వెళ్లవద్దు. మీ ప్రాంత ఎమ్మెల్యేలకు ఈ విషయాన్ని స్పష్టం చేయండి'' అని ఆదేశించారు. ఇలా ఆదేశించడం ఈ మూడురోజుల్లో ఇది రెండో సారి కావడం గమనార్హం. అయితే... ఈసారి ఆమె మరింత స్పష్టంగా తన అభిప్రాయం తెలిపారు. "పార్టీలో చిచ్చు పెట్టేందుకే జగన్ ఓదార్పు యాత్ర చేపడుతున్నారు.

ఆయన ప్రయత్నాలు ఫలించకుండా చూడాలి'' అని ఆమె స్పష్టం చేశారు. అయితే... అధిష్ఠానం మనోభిప్రాయం పార్టీ ఎమ్మెల్యేలకు చేరడంలేదని, మొయిలీ నుంచి సరైన మార్గదర్శకాలు లేవని ఎంపీలు మేడమ్ దృష్టికి తీసుకొచ్చారు. 'మొయిలీకి నేను చెప్పేది చెబుతాను. మీరు చేయాల్సింది చేయండి' అని సోనియా సూటిగా అన్నారు. ఓదార్పును వ్యతిరేకించాలంటూ మరో కేంద్ర మంత్రి పురందేశ్వరికి కూడా సోనియా ఇప్పటికే సూచించారు.

అంతేకాదు... 'అధిష్ఠానాన్ని ధిక్కరించి చేపడుతున్న యాత్రను తీవ్రంగా వ్యతిరేకించాల్సిన బాధ్యత మీ పై ఉంది' అంటూ తనను కలిసిన పార్టీ నేతలందరికీ సోనియా చెబుతున్నారు. దీంతో విషయం తీవ్రత క్రమక్రమంగా ఎమ్మెల్యేలకు అవగతమవుతోంది. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో దగ్గుబాటి వెంకటేశ్వరావుకు మినహా, మిగిలిన వారికి అధిష్ఠానం అంటే ఏమిటో తెలియదు.

అందువల్లే అధిష్ఠానం వారితో నేరుగా చర్చలకు రంగం సిద్ధం చేసింది. మొయిలీతో మాట్లాడించే వీలున్నా... అహ్మద్ పటేల్‌తోనే భేటీకి ఏర్పాట్లు చేసింది. జగన్ యాత్రలో పాల్గొనబోనని ఇప్పటికే ఒకసారి స్పష్టం చేసిన పనబాక ఇదే విషయాన్ని మరోమారు ప్రకటించారు. జగన్ యాత్ర వ్యక్తిగతమని, అందులో పాల్గొనబోనని తేల్చి చెప్పారు.

ఎమ్మెల్యేలకు జేసీ బోధనలు
ఢిల్లీలో పనబాక, మాగుంటలతో సోనియా భేటీ ముగియగానే... హైదరాబాద్‌లో పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ రంగంలోకి దిగారు. రాష్ట్ర రాజధానిలో అందుబాటులో ఉన్న ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, గొట్టిపాటి రవికుమార్, ఉగ్ర నరసింహారెడ్డి, మానుగుంట మహీధర్ రెడ్డి, బీఎన్ విజయ కుమార్, జీవీ శేషులతో భేటీ అయ్యారు.

నియోజకవర్గంలో ఉన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్, కర్నూలులో ఉన్న ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేశ్‌లతో ఫోన్‌లో చర్చించారు. ఓదార్పుపై సోనియా మనోభావాలను జేసీ ఎమ్మెల్యేలకు తెలిపారు. యాత్రలో పాల్గొనడం ఎంతమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న కొందరు నేతలు కూడా ఈ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. "సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను కలిసే... ఓదార్పు యాత్రపై సోనియా నిర్ణయేమిటో తెలుస్తుంది. ఒకసారి వచ్చి చూడండి'' అని సూచించారు.

జేసీతో భేటీ అనంతరం ఆరుగురు ఎమ్మెల్యేలు సీఎల్పీ కార్యాలయంలో మరోమారు కలిశారు. ఆ తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలు చలో అంటూ ఢిల్లీ చేరుకున్నారు. వీరితోపాటు జేసీ కూడా దేశ రాజధానిలో వాలిపోయారు. వీరంతా బుధవారం సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను కలుసుకోనున్నారు. మరికొందరు ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యే వీలుంది. ఆ తర్వాత ఈ ఎమ్మెల్యేలు జగన్‌ను కలిసి, అధ్యక్షురాలు వద్దంటున్నందున యాత్ర ఆపాలని సూచించే అవకాశముందని చెబుతున్నారు.

ఇదే సమయంలో తమ గోడు కూడా యువనేత ముందు వెళ్లగక్కాలని భావిస్తున్నారు. "మాకందరికీ వైఎస్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది. మీ పట్ల సానుభూతి కూడా ఉంది. అయితే... అందరికన్నా పార్టీ ముఖ్యం. యాత్ర విషయంలో అధిష్ఠానానికీ, మీకూ మధ్య నలిగిపోతున్నాం. పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలతో అందరికీ ఇబ్బందే. ఈ విషయంలో మీరే చొరవ తీసుకుని అధిష్ఠానంతో మాట్లాడాలి'' అని జగన్‌ను కోరే అవకాశం కనిపిస్తోంది.

అంతకుముందు సోనియా ఎమ్మెల్సీ, ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డితో కూడా రాష్ట్ర రాజకీయ పరిస్థితి గురించి ఆరా తీశారు. "రాష్ట్రంలో పరిస్థితులు సరిగా లేవు. ఒక వైపు ఓదార్పు యాత్ర, మరోవైపు తెలంగాణ - సీమాంధ్ర నేతల పరస్పర దూషణలు, అవినీతి ఆరోపణలు పార్టీలో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. వీటిని చక్కదిద్దాలి'' అని పొంగులేటి చెప్పినట్లు తెలిసింది.

దీనికి మేడమ్ స్పందిస్తూ... తనకు అన్ని విషయాలు తెలుసని, వాటన్నింటినీ సరి చేస్తానని చెప్పినట్లు సమాచారం.జగన్‌కు అనుకూలురుగా ముద్ర పడిన వారిని సోనియా సూటిగా హెచ్చరిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రాంత ఎంపీ ఒకరు ఎదురైనప్పుడు... "నాకు తెలుసు. మీరు జగన్‌కు స్నేహితులు. శ్రీకాకుళంలో ఓదార్పు యాత్రకు జనాన్ని పంపించారు'' అంటూ మేడమ్ నిలదీసినట్లు తెలిసింది. దీంతో నివ్వెర పోయిన ఆ ఎంపీ... తనకేమీ తెలియదని, అధిష్ఠానానికి విధేయుడిగా ఉంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం.

నా దారి నాదే: జగన్
అధిష్ఠానం 'అష్ట దిగ్బంధం' చేస్తున్నప్పటికీ... వైఎస్ జగన్ ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. దీనిని ఏమాత్రం పట్టించుకోనట్లుగా కనిపిస్తున్నారు. తన ఏర్పాట్లు తాను చేసుకుంటున్నారు. 'ఓదార్పు యాత్రకు వెళ్లొద్దని మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మేడమ్ చెప్పారు' అని ఒక ఎంపీ జగన్‌కు చెప్పగా... 'అలాగా!' అంటూ తలపంకించారు. "ఎవరు ఎన్ని చేసినా ఓదార్పు యాత్ర ఆగదు. ఈ విషయం ముందే చెప్పాను.

అది మా నాన్న చనిపోయాక ఇచ్చిన వాగ్దానం'' అని జగన్ పునరుద్ఘాటించినట్లు తెలిసింది. మరోవైపు... జగన్ వర్గీయులైన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి, వైఎస్ తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి మాత్రం వచ్చేనెల 3వ తేదీ నుంచి జరగనున్న ఓదార్పు యాత్రకు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మంగళవారం హైదరాబాద్‌లో జేసీ నిర్వహించిన సమావేశంలో బాలినేని, శివప్రసాద్ రెడ్డి కనిపించ లేదు. ఓదార్పు ఏర్పాట్లను వీరు దగ్గరుండి చూస్తున్నందున అధిష్ఠానమే వారిని సంప్రదించకుండా దూరం పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు... ఢిల్లీ చేరిన ఎమ్మెల్యేల్లో దగ్గుబాటి మినహా మిగిలిన వారు మంగళవారం రాత్రే జగన్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది.

అధిష్ఠానం సుముఖంగా లేనందున యాత్రను విరమించుకోవాలని వారు సూచించగా... అది కుదరదని జగన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో వీరు దగ్గుబాటితో కలిసి బుధవారం అహ్మద్ పటేల్‌తో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేలను అధిష్ఠానం పూర్తిస్థాయిలో నియంత్రిస్తున్న నేపథ్యంలో... శ్రీకాకుళంలో లాగే ద్వితీయ శ్రేణి నేతలతో ఓదార్పు నిర్వహించాలని జగన్ వర్గం భావిస్తోంది.

* కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో సోనియా మరోమారు భేటీ అయ్యారు.
* ఓదార్పులో ఎమ్మెల్యేలు పాల్గొనవద్దని తనమాటగా ఎమ్మెల్యేలకు చెప్పాలని మేడమ్ ఆదేశించారు.
* హైదరాబాద్‌లో ప్రకాశం జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలతో జేసీ మంతనాలు జరిపారు. మేడమ్ అభిప్రాయాన్ని వారికి చేరవేశారు.
* జేసీతో భేటీ అనంతరం ఆరుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకున్నారు.
వారు బుధవారం అహ్మద్ పటేల్‌తో సమావేశం కానున్నారు. * వీటితో సంబంధం లేకుండా జగన్ తన ఏర్పాట్లు తాను చేసుకుంటున్నారు.

నమస్కారం.. తిరస్కారం
జగన్‌పై తనకున్న వ్యతిరేక భావాన్ని సోనియా ఏమాత్రం దాచుకోవడంలేదు. మంగళవారం సెంట్రల్ హాలులో సోనియా నడుచుకుంటూ వెళుతుండగా జగన్ ఆమెకు నమస్కరించారు. ఆమె దీనిని పెద్దగా పట్టించుకోకుండా, చూసీ చూడనట్లు తిరస్కారభావంతో వెళ్లడం కాంగ్రెస్ ఎంపీలను ఆశ్చర్యపరిచింది. 

No comments:

Post a Comment