జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Tuesday, August 24, 2010

9 నెలలుగా ఏం జరుగుతోందో మీకు తెలుసు లోతుపాతులకు వెళ్లను.. బోరు కొట్టించను

 

మీ ఆశీర్వాదంతోనే ఈ చిరునవ్వు
నాన్నలాగే నన్నూ ఆదరించండి
పులివెందుల ఓదార్పులో జగన్ వ్యాఖ్యలు
హాజరైన మంత్రి అహ్మదుల్లా తనయుడు
కడప ఎంపీ వెంట ఆరుగురు ఎమ్మెల్యేలు
తొలి రోజు కనిపించని బాబాయి
"మీకు బోరు కొట్టించను. లోతుపాతులకు వెళ్లను. 9 నెలలుగా ఏం జరుగుతోందో మీకు తెలుసు. పత్రికల్లో చదువుతున్నారు. మీ అందరి ఆశీర్వాదం, ఆప్యాయతలతోనే మీ ముందు చిరునవ్వుతో ఉన్నాను'' అని కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సోమవారం పులివెందుల నుంచి ఓదార్పు యాత్రను ఆయన ప్రారంభించారు. "నాన్నను ఎలా ఆదరించారో, ఆప్యాయత చూపారో అలాగే నన్ను కూడా ఆశీర్వదించండి'' అని విజ్ఞప్తి చేశారు.

ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ సమాధి వద్ద ఆయన ఉదయం నివాళులర్పించారు. అనంతరం 10.30 గంటలకు పులివెందులకు చేరుకున్నారు. పులివెందుల- కడప బైపాస్ సర్కిల్లో వైఎస్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఆ తర్వాత కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొని పార్నపల్లె, పులివెందుల మున్సిపల్ కార్యాలయాల్లో విగ్రహావిష్కరణలు చేశారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న ప్రజలనుద్దేశించి మాట్లాడారు. "రాష్ట్రంలో ఎన్నో వైఎస్ విగ్రహాలు ఆవిష్కరించాను.

ఇక్కడ మీ ఆప్యాయత మధ్య వైఎస్ విగ్రహం ఆవిష్కరించడంలో గల ఆనందం ఈ మధ్య కాలంలో అరుదుగానే కలిగింది. ఎక్కువగా మాట్లాడను. ఒక్క విషయం మాత్రం చెపుతాను. 9 నెలలుగా ఏం జరుగుతోందో మీకు తెలుసు. ఈ రోజు చిరునవ్వుతో మీ ముందు ఉండగలుగుతున్నానంటే మీ ఆప్యాయత, ప్రేమానురాగాలే కారణం'' అని జగన్ చెప్పారు.

"ఈ వీధుల్లో తిరిగాను. మీ అందరి మధ్య పెరిగాను. మీ ఆశీర్వాదం నాకు కావాలి'' అని కోరారు. అభిమానులు.. కాబోయే సీఎం జగన్, జగన్ సీఎం కావాలి.. అంటూ నినాదాలు చేసినపుడు కూడా ఆయన "తొమ్మిది నెలలుగా ఏం జరుగుతోందో తెలుసు'' అని మాత్రమే మాట్లాడారు.

జగన్ వెంట ఆరుగురు ఎమ్మెల్యేలు
ఓదార్పు యాత్రలో కడప జిల్లా రాజంపేట, రాయచోటి, బద్వేల్, రైల్వే కోడూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కమలమ్మ, కొరముట్ల శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డిలతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన గురునాథ రెడ్డిలు పాల్గొన్నారు.

వీరితో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి అహ్మదుల్లా కుమారుడు అష్రఫ్ కూడా జగన్‌ను కలిసి వెళ్లారు. తాను రాజమండ్రికి వెళ్తున్నానని జగన్‌కు ముందే చెప్పానని.. ఆయన ఆమోదం పొందానని.. మంగళవారం నుంచి ఓదార్పులో పాల్గొంటానని మంత్రి అహ్మదుల్లా ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రిగా ముఖ్యమంత్రి అనుమతిని తీసుకుంటారా.. లేక.. జిల్లా ఎంపీ ఆమోదం పొందుతారా? అనే సందేహం పార్టీలో నెలకొంది.

ప్రకాశం జిల్లా పర్యటన గురించి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడిన ముఖ్యమంత్రి రోశయ్య.. ఇప్పుడు అహ్మదుల్లాతోనూ మాట్లాడతారా అనేది అసక్తికరంగా మారింది. జడ్పీ చైర్మన్ జ్యోతిరెడ్డి, డీసీసీబీ చైౖర్మన్ పల్లం బ్రహ్మానంద రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సురేష్‌బాబు, పులివెందుల మునిసిపల్ చైర్‌పర్సన్ రుక్మిణిలు కూడా హాజరయ్యారు. వీరితో పాటు ఆయన జగన్ కుటుంబ సభ్యులు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డిలు కూడా ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.

జగన్ బాబాయి.. ఎమ్మెల్సీ వివేకానందరెడ్డి మొదటి రోజు ఓదార్పు యాత్రలో కనిపించలేదు. ఇటీవల సోనియాకు రాసిన లేఖ రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో ఆయన గైర్హాజరు చర్చనీయాంశమైంది. అయితే.. అమెరికాలో కూడా వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నందున ఆ ఏర్పాట్ల కోసం హైదరాబాద్ వెళుతున్నానని ముందు రోజే వివేకా చెప్పారు. జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యులు డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డిలు ఓదార్పునకు దూరంగా ఉన్నారు. కోస్తాతో పోలిస్తే సొంత జిల్లాలో ఓదార్పునకు అంతస్థాయిలో జన స్పందన కనిపించలేదు.

నలుగురికి ఓదార్పు
మొదటి రోజు నాలుగు కుటుంబాలను జగన్ ఓదార్చారు. పులివెందుల్లో దేరంగుల జయరామ్ అనే వ్యక్తి వైఎస్ మృతి చెందిన ఆరు రోజుల తర్వాత చనిపోయారు. అలాగే అంబకపల్లెలో లోమడ వెంగముని అనే వృద్ధ్దుడు వారం తర్వాత చనిపోయాడు. ఈ ఇద్దరి కుటుంబాలను జగన్ పరామర్శించారు. అలాగే దిగువ పల్లెలో చాపల వెంకటరమణ అనే వ్యక్తి కుటుంబాన్ని, పార్నపల్లెలో మృతి చెందిన అంకె పుల్లన్న అనే వ్యక్తి కుటుంబాలను కూడా జగన్ ఓదార్చారు. వీరితోపాటు ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మరో నలుగురి కుటుంబాలను కూడా ఆయన పరామర్శించారు.

ఓపిగ్గా, ఓర్పుగా సాగిన ఓదార్పు
పులివెందులలో జగన్ ఓదార్పు యాత్ర ఓర్పుగా, ఓపిగ్గా సాగింది. ఉదయం 8.30 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒకటిన్నరకు పూర్తి కావాల్సి ఉండగా 10.30 గంటలకు మొదలై రాత్రి 7.30 గంటలకు కూడా పార్నపల్లెకు చేరుకోలేక పోయారు. ఆలస్యం కావడంతో వేముల ఓదార్పును రద్దు చేసుకున్నారు. మార్గమధ్యంలో వివిధ గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

పెద్దకుడాలలో జిలిటెన్‌స్టిక్స్ లభ్యం
ఓదార్పు యాత్రకు ముందుగా లింగాల మండలం పెద్దకుడాలలో పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా పెద్దకుడాలలో వైఎస్ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. దీనికి కొన్ని గంటల ముందే విగ్రహం ఏర్పాటు చేసిన సమీప ప్రాంతంలో 52 జిలిటెన్‌స్టిక్స్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఏఎస్పీ కార్తికేయన్ పరిశీలించారు. పలు కోణాల్లో వీటిపై పరిశీలన చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment