జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Friday, August 20, 2010

నేను చెప్పిందేమిటి ? జగన్‌ చేస్తున్నదేమిటి ? * వివేకా ఇన్‌...

sonia2
‘జగన్‌, ఆయన కుటుంబసభ్యులు నా వద్దకు వచ్చిన ప్పుడు నేను వాళ్లకు చెప్పిందేమిటి? ఇప్పుడు జగన్‌ అక్కడ చేస్తున్నదేమిటి? జగన్‌ ఒక సాధారణ ఎంపీ. మిగిలిన ఎంపీల్లో ఆయనొకడు. పార్టీ కోసం కృషి చేసిన వైఎస్‌ కుటుంబంపై మాకున్న సానుభూతి మీకు తెలుసు. అందు కే జగన్‌కు గౌరవం ఇస్తున్నా దాన్ని ఆ యంగ్‌బాయ్‌ కాపాడుకోలేపోతున్నాడు. పార్టీని కాదంటే పరిస్థితి ఏమవుతుంది’ అని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తనను కలసిన కేంద్రమంత్రి పురంధేశ్వరితో సోనియా ఓదార్పు యాత్రకు అధిష్ఠానం అనుమతి లేదని స్పష్టం చేశారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం... జగన్‌ ఓదార్పు యాత్రకు ఎంపి, ఎమ్మెల్యే, మంత్రులను వెళ్లవద్దని చెప్పాలని తానే అహ్మద్‌పటేల్‌కు స్పష్టమైన ఆదేశాలిచ్చానని సోనియా వెల్లడించారు. మీరు కూడా ఈ విషయాన్ని మీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేయండన్నారు. జగన్‌ వ్యవహారశైలి పార్టీ విధానాలకు పూర్తి విరుద్ధంగా ఉందని, సొంత అజెండాలు పార్టీలో కుదరవని స్పష్టం చేశారు. ఓదార్పు యాత్రను పార్టీపరంగా నిర్వహించాలని, జిల్లాల్లో వైఎస్‌ విగ్రహాలు పెట్టాలని, బాధితులందరినీ ఒకచోట చేర్చి పార్టీ పరంగా సాయం చేయాలని తానిచ్చిన ఆదేశాలకు విరు ద్ధంగా జగన్‌ వ్యవహరిస్తున్నారనఇసంతృప్తి వ్యక్తం చేశారు.

జగన్‌ తన యాత్రలో కాంగ్రెస్‌ పార్టీ గురించి గానీ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమా ల గురించి ఎక్కడా ప్రస్తావించని వైనాన్ని తాను కూడా పరిశీలించానన్నారు. పార్టీ కంటే వ్యక్తి గొప్ప కాదని, నాయకత్వం సూచనలు కాదని వెళుతున్న జగన్‌ యాత్రలో పాల్గొంటే పార్టీ నాయకులకు కష్టాలు తప్పవని హెచ్చరిం చారు. ఇదే విషయాన్ని తాను అహ్మద్‌పటేల్‌, వీరప్ప మొయిలీకి స్పష్టంగా చెప్పానని, ముఖ్యమంత్రి రోశయ్యకూ ఇదే సందేశం పంపించామన్నారు. జగన్‌ యాత్రలో ద్వితీయశ్రేణి నేతలు పాల్గొంటున్నందున.. తాము వెళ్లవలసిన అనివార్య పరిస్థితి ఏర్ప డిందన్న ఎమ్మెల్యేల ఆవేదనను అర్థం చేసుకున్నానని, ఆ మేరకు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఆదేశాలు జారీ చేశామ న్నారు. జగన్‌ వెంట వెళ్లిన వారికి భవిష్యత్తులో ఎలాంటి గుర్తింపు ఇవ్వరన్న సంకేతాలు వెళ్లినందున, ఎమ్మెల్యేలు, ఎంపీలు భయపడనవసరం లేదన్నారు. జగన్‌ పార్టీ విధానాలను గౌరవించినంతకాలమే నాయ కత్వం కూడా అతనినీ గుర్తిస్తుందని, సొంత అజెండాతో పార్టీని, నాయకులను ఇబ్బందిపెడితే అతడే నష్టపోతాడని స్పష్టం చేశారు.

యాత్రను పార్టీపరంగా చేయాలన్న ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల సూచనలను పట్టించుకోకపోగా, వారిపై జగన్‌ విరుచుకుపడిన విషయం తన దృష్టికి వచ్చిందని, అహ్మద్‌పటేల్‌ తనకు ఆ సమావేశ వివరాలు చెప్పారన్నారు. ‘ఎప్పుడేం చేయాలో పార్టీకి తెలుసు. కొంద రి సమస్యలను కాలమే పరిష్కరిస్తుందని’ నర్మగర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సాయంత్రం వీరప్ప మొయిలీ ఇచ్చే విందులో సైతం పటేల్‌ వెళతారని, మొయిలీ-పటేల్‌ ఇద్దరూ జగన్‌ యాత్రకు ఎంపీలు వెళ్లవద్దని స్పష్టం చేస్తారని, అప్పుడు ఆ సందేశం కింది స్థాయి వరకూ వెళుతున్నందున ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇబ్బందిపడనవసరం లేదని భ రోసా ఇచ్చారు.

పటేల్‌ చెప్పింది నిజమే: పురంధరీశ్వరి
కాగా, జగన్‌ యాత్రకు అధిష్ఠానం అనుమతి లేదని సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌ ఎంపీలకు చెప్పడం వాస్తవమేనని కేంద్రమంత్రి పురంధేశ్వరి అంగీకరించారు. ఈ విషయాన్ని సోనియాగాంధీ తనకు స్వయంగా చెప్పారని మీడియాకు వెల్లడించారు. పార్టీపరంగానే యాత్ర చేయాలన్నది నాయకత్వం అభిమతమన్నారు. జిల్లాల్లో వైఎస్‌ విగ్రహాల ఏర్పాటు, బాధితులందరినీ కలిపి అక్కడే ఓదార్చమని సోనియా గతంలోనే జగన్‌కు సూచించారని, పార్టీ నాయకత్వం ఇప్పుడూ అదే వైఖరితో ఉందని వివరించారు.
వివేకా ఇన్‌...
YS-Viveka
అవసరం అయితే కుటుంబాన్ని సైతం కాదని పార్టీకి వీర విధేయత ప్రకటిస్తే అందుకు తగిన బహుమానం కూడా ఘనంగానే ఉంటుం దని కాంగ్రెస్‌ అధిష్ఠానం రుజువు చేయ దలచుకున్నట్టు కనిపిస్తున్నది. కడప ఎంపీ, తన అన్నయ్య కుమారుడు వైఎస్‌ జగ న్మోహన్‌రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్ర నేపథ్యంలో ఎమ్మెల్సీ వైఎస్‌ వివేకానం దరెడ్డి అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖ పట్ల అధిష్ఠానం సంతోషంగా ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో పార్టీ రాజకీయాలు అట్టుడికి పోతున్న తరుణంలో వివేకా నందరెడ్డి ‘సాహసోపేతంగా’ వ్యవహరించి రాసిన లేఖకు నజరానాగా ఆయనకు ఏదైనా ఘనమైన బహుమతి ఇచ్చేందుకు అధినాయకత్వం నిర్ణయించుకున్నట్టు విశ్వ సనీయ సమాచారం.

పార్టీకన్నా తమకు ఎవరూ ఎక్కువ కాదని, అధినాయకత్వానికే తమ కుటుంబం విధేయతగా ఉంటుం దంటూ వివేకానందరెడ్డి బుధవారం రాసిన లేఖ అధిష్ఠానం చాణక్యంలో భాగమే అయినా, జగన్‌ ఛత్రఛాయ నుంచి వివే కాను విజయవంతంగా బయటకు లాగ టంలో మాత్రం విజయం సాధించినట్ట యింది. గతంలో ఎన్నడూ నేరుగా పార్టీ వివాదాల పరిష్కార ప్రయత్నాలు చేయని సోనియా, ఓదార్పు యాత్రవిషయంలో కఠినంగా వ్యవహరించకపోతే పార్టీకి నష్టదాయకం అనే నిర్ణయానికి వచ్చి యాత్రలో ఎవరూ పాల్గొనవద్దంటూ ఆంక్షలు విధించారు. వాటి నేపథ్యంలో వివేకా రాసిన లేఖ రాజకీయంగా అపరిమిత ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్‌ మరణించిన తర్వాత తమ కుటుంబానికి జగన్‌ ఒక్కడే పెద్ద దిక్కు అని పైకి చెబుతున్నా, వివేకా రాసిన లేఖ అంతరార్థం చూస్తే తాను ఇక ముందు జగన్‌ అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధంగా లేనన్న భావనను వివేకా తన లేఖ ద్వారా అధినాయకత్వానికి స్పష్టం చేశారు.

ఏమిటా బహుమానం?
తాము ఊహించినట్టే ఓదార్పు యాత్రపై విధించిన ఆంక్షలు ఫలించి ప్రకాశం, నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలలో అధికశాతం మనసు మార్చుకోవటం, అదే సమయంలో వివేకానందరెడ్డి అధినేత్రిని ఉద్దేశించి రాసిన లేఖ లీక్‌ కావటం, ఆ లేఖను తానే రాశానని వివేకా అంగీకరించటం వంటి పరిణామాలు సహజంగానే అధినాయకత్వానికి సంతోషం కలిగించాయి. తన సోదరుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏనాడూ అధిష్ఠానం ఆదేశాలను కాదని పక్కకు పోలేదని, అధిష్ఠానం చలువ వల్లనే ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని, తమ కుటుంబం ఏనాటినుంచో కాంగ్రెస్‌ పట్ల విధేయతతో ఉందంటూ వివేకా తన లేఖలో పేర్కొన్నారు.

అంటే వద్దు వద్దన్నా పట్టించుకోకుండా ధిక్కార స్వరాన్ని వినిపించటంతో పాటు తనను అనునయించేందుకు వచ్చిన ఎమ్మెల్యేలపై సైతం పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసి, ఎవరు వచ్చినా రాకపోయినా తన యాత్ర ఆగదని స్పష్టం చేసిన జగన్‌కు పార్టీ పట్ల ఏమాత్రం విధేయత లేదన్న అంశాన్ని తన లేఖ ద్వారా అధిష్ఠానానికి స్పష్టం చేశారు. సంచలనం సృష్టించే రీతిలో వివేకా లేఖ రాసినందుకు బహుమతిగా ఆయనకు రానున్న కేబినెట్‌ విస్తరణలో కీలకమైన మంత్రి పదవిని ఇచ్చే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు బహిరంగంగానే చెప్పుకుంటున్నాయి. ఈ నజరానా ఇవ్వటం ద్వారా జగన్‌ వైపు దింపుడు కళ్ళం ఆశతో మొగ్గు చూపాలనుకుంటున్న పార్టీ ఎమ్మెల్యేలకు చెక్‌ పెట్టే వ్యూహానికి అధిష్ఠానం పదును పెట్టింది. చేసిన మేలును పార్టీ మరవదని, వెన్నంటి ఉండే వారిని కంటికి రెప్పలా చూసుకుంటుందన్న సంకేతాన్ని ఎటువైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు వివేకా ద్వారా అధిష్ఠానం ఇవ్వదలచినట్టు కనిపిస్తున్నది.

అంతరం ఇప్పటిది కాదు...
వాస్తవానికి చాలాకాలం నుంచే వివేకా వైఎస్‌ కుటుంబానికి అంతరం పాటిస్తున్నారు. జగన్‌ను కడప ఎంపీగా నిలబెట్టాలనుకుంటున్నానని, అందుకు వీలుగా పదవికి రాజీనామా చేయాలని రాజశేఖరరెడ్డి చెప్పినప్పుడు వివేకా అంత సులభంగా మాట వినలేదు. రాజీనామా చేయకుండా అమెరికా వెళ్ళి కూర్చున్నారు. కుమారుడి కోసం తన పదవికే ఎసరు పెట్టిన వైఎస్‌పై కోపంతోనే అలిగి వెళ్ళిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత వచ్చి రాజీనామా చేయటం వేరే సంగతి. ఇక ఇటీవలి పరిణామాలు పరిశీలిస్తే జగన్‌ ఓదార్పు యాత్రలో వివేకా ఎక్కడా పాల్గొనలేదు. జగన్‌ పిలవనూ లేదు...పైగా వివేకా ఈ యాత్రకు మద్దతుగా ఎక్కడా ప్రకటనలూ ఇవ్వలేదు. తాజాగా పులివెందులలో జరగాల్సిన ఓదార్పు యాత్ర నేపథ్యంలో వివేకా రాసిన లేఖ సంచలనానికి తెర లేపింది. ఎఐసిసి వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ ఇవ్వదలచుకున్న విందుకు హాజరయ్యేందుకు వీలుగా జగన్‌ పులివెందుల యాత్రను వాయిదా వేసుకున్నారు.

అన్నిటికీ మించి గురుకుల్‌ ట్రస్టులో తాను విలువైన భూములను ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నట్టు విపక్షాలు పరంపరగా విమర్శల వర్షం కురిపిస్తున్నా తనను ఎవరూ ఆదుకునేందుకు ముందుకు రాలేదన్న బాధ సైతం వివేకాలో ఉన్నట్టు చెబుతున్నారు. రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పటినుంచే విపక్షాలు ఈ ఆరోపణలు చేస్తున్నాయి. తనను అనరాని మాటలు అంటున్నా సోదరుడు కానీ, జగన్‌ కానీ పల్లెత్తు మాట అయినా మాట్లాడకపోవటం వివేకాను ఆవేదనకు గురి చేసిందని సమాచారం. సహజంగానే ముక్తసరిగా మాట్లాడే తత్వం, రాజకీయాలను పెద్దగా పట్టించు కోకుండా తన పని తాను చేసుకుపోయే అలవాటు ఉన్న వివేకా మొత్తం మీద తాను చేయదలచుకున్నది సమయం, సందర్భం చూసి మరీ చేశారని, అందుకు అధినాయకత్వం ఆయనకు భారీ నజరానాయే ఏదో ఒక రూపంలో సమర్పించనున్నదని పార్టీ వర్గాలు చెప్పు కుంటున్నాయి.

No comments:

Post a Comment