జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Wednesday, August 18, 2010

జగన్‌కు సెగ ... జగన్ బోల్తా పడతారా?


Jagan-standకాంగ్రెస్‌లో జగన్‌ కథ ఇక క్లయిమాక్స్‌కు చేరుతున్నది. వచ్చే నెల 3నుంచి ప్రకాశం జిల్లాలో జరపతలపెట్టిన ఓదార్పు యాత్రకు ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వెళ్లకుండా అధిష్ఠానం నేరుగా బ్రేకులు వేయడంతో జగన్‌ యాత్రకు శాసనసభ్యులు వెళ్లడం అనుమానంగానే కనిపిస్తోంది. జగన్‌ ప్రకాశం, ఆ తర్వాత నెల్లూరు జిల్లా పర్యటనల సందర్భంగా ఎమ్మెల్యేలను కట్టడి చేయకపోతే తాను స్థానికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి మంగళవారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసి మొరపెట్టుకున్నారు.

ఎమ్మెల్యేలు వెళితే ద్వితీయ శ్రేణి నేతలు కూడా యాత్రలో పాల్గొంటారని, అది స్థానికంగా తమకు ఇబ్బందికరంగా పరిణమిస్తుందని వాపోయినట్లు సమాచారం. దానితో స్పందించిన సోనియాగాంధీ అప్పటికప్పుడు మాగుంటతో కూడా మాట్లాడారు. ఆయన కూడా పనబాకతో ఏకీభవించారు. అప్పుడు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలను ఢిల్లీకి రావలసిందిగా హుటాహుటిన ఆదేశాలు పంపారు. దానితో రాత్రికి మంత్రి బాలినేని, శివప్రసాదరెడ్డి మినహా ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి చేరుకున్నారు. అంతకుముందు.. ప్రకాశం జిల్లా పార్టీ ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.

యాత్రకు వెళ్లి అధిష్ఠానం ఆగ్రహాన్ని కొని తెచ్చుకోవద్దని, జగన్‌ తన యాత్రలో ఎక్కడా సోనియాను గానీ, పార్టీని గానీ ప్రస్తావించకపోవడంతో నాయకత్వం ఆగ్రహంతో ఉందని వివరించారు. నెల్లూరు జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మంగళవారం పార్లమెంట్‌ హాలులో సోనియాను ఆమె కార్యాలయంలో కలిశారు. ఆమెతోకాసేపు రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. జగన్‌ యాత్ర సందర్భంగా జిల్లాలో తమకు ఎదురయ్యే ఇబ్బందులను ఆమె సోనియా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఓంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డిని పిలువాలని సోనియా, పనబాకకు సూచించినట్లు సమాచారం. తాను ప్రయాణంలో ఉన్నానని, తక్షణమే చేరుకోవడం సాధ్యం కాదని మాగుంట చెప్పడంతో ఆ విషయాన్ని పనబాక సోనియాకు తెలియజేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. వచ్చే నెల 3 నుంచి జగన్‌ తమ జిల్లాల్లో చేపట్టనున్న ఓదార్పు యాత్రలో తాము పాల్గొనబోమని వీరిద్దరు సోనియాకు స్పష్టం చేశారు. అప్పుడు సోనియా కలగజేసుకుని జగన్‌ ఓదార్పు యాత్ర పార్టీ కార్యక్రమం కాదని, అది ఆయన వ్యక్తిగత ర్యాలీ మాత్రమేనని స్పష్టం చేశారు.

Soniaఆ కార్యక్రమానికి వెళ్ళవద్దని ఆమె వారిని ఆదేశించడంతోబాటు వారి పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలకు తనమాటగా చెప్పాలని పనబాకకు సోనియా సూచించినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే పనబాక, ఓంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఫోన్‌ చేసి సోనియా మనోగతాన్ని వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదే విధంగా పనబాక తన ఎంపి నియోజకవర్గం పరిధిలో వచ్చే సంతనూతలపాడు, అద్దంకి, చీరాల, బాపట్ల ఎమ్మెల్యేలకు సోనియా చెప్పిన విషయాన్ని ఫోన్‌ ద్వారా తెలియజేసి ఓదార్పు యాత్రకు వెళ్ళకూడదని సూచించారు. దళిత ఎమ్మెల్యేలు కూడా అధైర్యపడొద్దని, అధిష్ఠానం మాటకు కట్టుబడి ఉంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని సోనియా నుంచి లభించిన హమీని కూడా పనబాక ప్రకాశం, నెల్లూరు జిల్లాల దళిత ఎమ్మెల్యేల చెవిన పడేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

రెండుగా చీలిన నేతలు
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రారంభం కానున్న వైఎస్‌ జగన్‌ మూడో విడత ఓదార్పు యాత్రలో పాల్గొనే విషయంలో ఆ రెండు జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు రెండు గ్రూపులుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. జగన్‌కు అత్యంత సన్నిహితులుగా ఉంటూ అతని వర్గంగా ముద్రపడిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఓదార్పు యాత్రలో పాల్గొనేందుకు ఏర్పాటు చేసు కుంటుండగా, జగన్‌ను వ్యతిరేకించే, సిఎం వర్గంగా ముద్రపడిన ప్రజాప్రతినిధులు ఈ యాత్ర కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అధిష్ఠాన నిర్ణయానికి వ్యతిరేకంగా తాము ఓదార్పు యాత్రలో పాల్గొనబోమని వారు బాహటంగానే స్పష్టం చేస్తున్నారు. జగన్‌ ఓదార్పు యాత్ర విషయంలో ఓంగోలు, ప్రకాశం జిల్లా కాంగ్రెస్‌ నేతలు రెండుగా చీలిపోయినట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర మంత్రి పనబా లక్ష్మి, ఓంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి మంగళ వారం తాజాగా చేసిన వ్యాఖ్యలు పై వాదనలకు మరింత బలాన్నిస్తున్నాయి.

మేకపాటి రెడీ
ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లాకు చెందిన ఎంపీ మేకపాటి రాజ్‌మో హన్‌రెడ్డి జగన్‌ యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ అధి ష్ఠానం వైఖరి ఎలా ఉన్నప్పటి కీ తాను మాత్రం జగన్‌ యాత్రకు వెళ్ళాలనే ఆలోచనతో మేకపాటి ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మరో వైపు ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా మంగళవారం సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ జగన్‌ ఓదార్పు యాత్రలో పాల్గొ నాలా? వద్దా? అనేది ఇంకా తన మదిలో రాలేదని స్పష్టం చేశారు. మరో ఎమ్మెల్యే మిహీధర్‌రెడ్డి అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గతం లోనే తేల్చి చెప్పారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధుల్లో సగానికి పైగా నేతలు జగన్‌ యాత్రకు వెళ్ళేందుకు సిద్ధమవు తున్నారు. ఓంగోలు ఎమ్మెల్యే, మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తాను జగన్‌ యాత్రలో పాల్గొంటానని ఇప్పటికే ప్రకటించారు.

అదే విధంగా జగన్‌ వర్గంగా ముద్రపడిన ఎమ్మెల్యేలు బి.శివ్ర పసాద్‌రెడ్డి, ఉగ్ర నరసింహ్మరెడ్డి, డి.రవికుమార్‌, విజయకుమార్‌, చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం వివేకా నందరెడ్డి తదితరులు ఓదార్పు యాత్రలో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రోశయ్య వర్గానికి చెం దిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓదార్పుయాత్రకు దూరం పాటించాలని నిర్ణయించుకున్నారు. కాగా ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీని వాసరెడ్డి జగన్‌ ఓదార్పు యాత్రను విజయవంతం చేయడానికి పూర్తి బాధ్యతలు తన భుజాన వేసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆయన ఒత్తిడి మేరకు జిల్లాలోని ఎంత మంది ఎమ్మెల్యేలు ఓదార్పు యాత్రకు వెళుతారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.
కాంగ్రెసు కడప  పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన బలాన్ని అతిగా ఊహించుకుంటున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తనకు విశేష ప్రజాదరణ ఉందని చాటి చెప్పుకునేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయన తన ఓదార్పు యాత్రల్లో జన సందోహం ఉండే విధంగా చూసుకుంటున్నారని అనుకుంటున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి  మృతికి కలత చెంది ఆకస్మికంగా మరణించినవారి కుటుంబాలను పరామర్శించడానికి ఆయన ఓదార్పు యాత్రలు చేపట్టారు. ఆ ఓదార్పు యాత్రలు పరామర్శ యాత్రలుగా కాకుండా దండయాత్రలుగా సాగుతున్నాయనేది పార్టీ అధిష్టానం ప్రధాన అభియోగం. బాధితులను ఒకే వేదిక  మీదికి తెచ్చి సహాయం అందించాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన సూచన జగన్ కు నచ్చడం లేదు. తన బలప్రదర్శనకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్న జగన్ ఆ విధమైన కార్యక్రమాన్ని ఇష్టపడకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.
YS Jagan

వైయస్ జగన్ స్పష్టంగా రాష్ట్ర కాంగ్రెసును రెండు విభజించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రోశయ్యను అసమర్థుడిగా చిత్రీకరించేందుకు జగన్ వర్గం తొలుత ప్రయత్నించింది. ఇప్పుడు ఆయనను తమ ప్రత్యర్థిగా భావిస్తోంది. రోశయ్య తన వర్గంవారితో కలిసి జగన్ ను అణచివేసేందుకు కుట్ర చేస్తోందని దుమ్మెత్తి పోసేందుకు వెనకాడడం లేదు. మొత్తంగా, పార్టీ అంతర్గత పోరును రోశయ్య, జగన్ వర్గాల మధ్య సమరంగా మార్చేశారు. అధిష్టానం తనకు ఇంకా అనుకూలంగానే ఉందని జగన్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పరిస్థితి ఆయన చెప్పినట్లు లేదు. అధిష్టానం ఆదేశాల మేరకే రోశయ్య గానీ, ఇతర నాయకులు గానీ జగన్ ఓదార్పు యాత్ర తీరును వ్యతిరేకిస్తున్నారు. జగన్ ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికితోడు, వైయస్ హయాంలో జరిగిన అక్రమాల చిట్టా విప్పుతున్నారు.

ప్రజాబలం ఉందని చెప్పడానికి ప్రయత్నిస్తున్న జగన్ శాసనసభ్యులను తన వైపు తిప్పుకునేందుకు తీవ్రమైన పట్టుదలతో పనిచేస్తున్నారు. వారికి ఫోనులు చేస్తూ తన ఓదార్పు యాత్రకు రావాలని పిలుస్తున్నారు. శాసనసభ్యులపైనే ఆయన ప్రధానంగా దృష్టి పెట్టడమే అనుమానాలకు తావిస్తోంది. రోశయ్యకు వ్యతిరేకంగా మెజారిటీ శాసనసభ్యులను కూడగట్టాలనేది ఆయన ప్రయత్నంగా కనిపిస్తోంది. పైగా, ఆయన తన యాత్రల్లో సోనియా పేరును గానీ రాహుల్ పేరును గానీ ప్రస్తావించడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం తన తండ్రి ప్రవేశపెట్టిన పథకాలకు గండి కొడుతుందని విమర్సిస్తున్నారు. వీటన్నింటినీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగానే అధిష్టానం భావిస్తోంది. ప్రజాబలం ఉన్న జగన్ శాసనసభ్యుల వెంట పడడమేమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. లోపల రోశయ్య ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఆలోచన లేకపోతే జగన్ ఆ విధంగా ప్రవర్తించబోరని అంటున్నారు. మొత్తం మీద, జగన్ తన బలాన్ని కూడా ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని అనిపిస్తోంది. తాను పిలిస్తే శాసనసభ్యులు పరుగెత్తుకొస్తారని, ప్రజలు తండోపతండాలుగా కదిలివస్తారని ఆయన చాటి చెప్పడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తన శక్తిని, బలాన్ని జగన్ ఇదే పద్ధతిలో ఎక్కువగా అంచనా వేసుకుంటే బోల్తా పడడం ఖాయమని అంటున్నారు.

No comments:

Post a Comment