జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, August 19, 2010

ఎందుకిలా చేస్తున్నాడు.. ఆ బాలుడు.. సోనియా చిరాకు.. కిళ్లి కృపారాణితో సహా ఎంపిల విధేయతా వాక్కులు


వై దట్ బాయ్ ఈజ్ డూయింగ్ లైక్ దిస్? (ఆ బాలుడు ఎందుకిలా చేస్తున్నాడు).. అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చిరాకు వ్యక్తం చేశారు. గురువారం నాడు కేంద్ర మంత్రి పురంధేశ్వరితో సహా కొందరు ఎంపిలు పార్లమెంట్‌లోని సిపిపి కార్యాలయంలో వేర్వేరుగా కలిసినప్పుడు సోనియా ఈ ప్రశ్న అడిగినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు స్వయంగా జగన్మోహన్ రెడ్డిని కలిశారని, పార్టీ అధ్యక్షురాలు చేసిన సూచనలను తిరస్కరించి బలప్రదర్శనలాగా ఓదార్పు చేయరాదని, రాహుల్ గాంధీలా నమ్రతలా వ్యవహరించారని కోరారని వారు మేడమ్ దృష్టికి తీసుకువచ్చారు.

కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా, తెలుగుదేశంకు లాభం చేకూర్చేలా వ్యపహరించరాదని కోరుతూ పది అంశాల లేఖ సమర్పించారని తెలిపారు. అయితే తన సమయం వృధా చేయవద్దని, మీకు తనకు చెప్పేంత స్థాయి లేదని, మీ ఎజెండా ఏమిటని జగన్ వారినే ప్రశ్నించారని వారు చెప్పినట్లు తెలిసింది. నా దారి నాదేనని మీరు చెప్పక్కర్లేదని అన్నారని కూడా వారు మేడమ్‌కు చెప్పినట్లు తెలిసింది. దాదాపు గంట సేపు చెప్పినా జగన్ వైఖరిలో మార్పు లేదని తెలిపారు.

ఇదంతా విన్న మేడమ్ ఒక బాలుడిలా జగన్ ఎందుకిలా చేస్తున్నారని చిరాకు ప్రదర్శించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా తాము ఆ తర్వాత ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను కలిశామని కూడా వారు మేడమ్‌కు వివరించారు.

వైఎస్ మరణ వార్త విని చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు పార్టీ పరంగానే కార్యక్రమాలు నిర్వహించాలని, వారిని జిల్లా కేంద్రాలకు పిలిపించి ఆర్థిక సహాయం చేయాలని మేడమ్ చేసిన సూచనను అహ్మద్ పటేల్ పునరుద్ఘాటించారని కూడా వారు తెలిపారు. దీనితో అవును నేను అదే చెప్పానుగా.. అని మేడమ్ ధృవీకరించినట్లు తెలిసింది.

కాగా అధిష్ఠానం ఆదేశాల మేరకు తామెవ్వరమూ ఓదార్పు యాత్రకు వెళ్లడం కానీ, ఆ యాత్రకు సహకరించడం కానీ చేయబోమని ఎంపిలు స్పష్టం చేశారు. ఈ ఎంపిల్లో శ్రీకాకుళం ఎంపి కిళ్లి కృపారాణి కూడా ఉండడం గమనార్హం.

గతంలో జగన్ ఓదార్పు యాత్రకు కుటుంబ సభ్యులను ఎందుకు పంపించావని గతంలో సోనియా ప్రశ్నించడంతో ఖంగుతిన్న కృపారాణి మరో సారి మేడమ్‌ను కలుసుకుని పూర్తి విధేయత ప్రకటించినట్లు తెలిసింది. కృపారాణి కాక మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పొన్నం ప్రభాకర్, జి.వివేక్, రాజయ్య, రాయపాటి సాంబశివరావు తదితరులు కూడా మేడమ్‌ను కలిసి ఓదార్పు యాత్ర విషయంలో పార్టీ అధిష్టానం ఆదేశాలే శిరోధార్యమని స్పష్టం చేశారు.

కాగా తెలంగాణలో ఉన్న వనరులను రక్షించాలని, మైనింగ్‌ను కొద్ది కాలమైన జాతీయ కరణ చేయాలని సోనియాను కోరానని వివేక్ చెప్పారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదాగురించి విజ్ఞప్తి చేశానని, శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతిని«ధులు సమర్పించిన లేఖను ఇచ్చానని కూడా ఆయన చెప్పారు.

మేడమ్ అదే చెప్పారు-పురంధేశ్వరి

కాగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసుకుని బాధితులందర్నీ అక్కడకు పిచి పార్టీ పరంగా కొంత ఆర్థిక సహాయం చేయాలని, ఓదార్పు కార్యక్రమాన్ని కూడా పార్టీ పరంగా చేయాలని మేడమ్ మరో సారి పునరుద్ఘాటించారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పురంధేశ్వరి చెప్పారు.

గతంలోనే మేడమ్ ఇదే సూచన చేశారని సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను బుధవారం రాత్రి తమను కలిసినప్పుడు చెప్పారని ఆమె తెలిపారు. అహ్మద్‌పటేల్ చెప్పిన విషయాలనే మేడమ్ ధృవీకరించారని ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

No comments:

Post a Comment