వచ్చే నెల 3వ తేదీ నుంచి వైయస్ జగన్ ప్రకాశం జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్ర పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఈ విషయమై ఢిల్లీలో విస్తృతంగా మంతనాలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి వైయస్ జగన్ కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. వారిద్దరి మధ్య జరిగిన చర్చలు బయటకు రాలేదు. అయితే, ప్రణబ్ జగన్ కు హితబోధ చేసినట్లు తెలుస్తోంది. అధిష్టానం ఓదార్పు యాత్రకు వ్యతిరేకం కాదని, అయితే అది దండయాత్ర లాగా ఉండకూడదని భావిస్తోందని, ఈ విషయంలో తగిన విధంగా వ్యవహరించాలని ప్రణబ్ ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా, బుధవారం ఉదయం ప్రకాశం జిల్లా శాసనసభ్యులు వైయస్ జగన్ తో సమావేశమయ్యారు. జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, శివప్రసాదరెడ్డి మినహా జిల్లాకు చెందిన ఆరుగురు శాసనసభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం వారు ఢిల్లీలో ఉన్న సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆ తర్వాత సోనియా గాంధీ సలహాదారు అహ్మద్ పటేల్ తో సమావేశమయ్యారు. ఈ స్థితిలో తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రకాశం జిల్లా శాసనసభ్యులు జగన్ కు చెప్పేందుకు బుధవారం ఉదయం సమావేశమైనట్లు తెలుస్తోంది. ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని అధిష్టానం నుంచి నోటి మాటగా స్పష్టమైన ఆదేశాలు రావడంతో శాసనసభ్యులు ఇరకాటంలో పడ్డారు. తమ పరిస్థితిని వారు జగన్ కు వివరించి, అధిష్టానం మాట వినాలని వారు జగన్ కు సూచించినట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment