తమను కలుసుకునేందుకు వచ్చిన వారితో ఓదార్పు యాత్రకువెళ్ళొద్దని చెప్పటమే తప్ప అధికారికంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఏ ప్రకటనా చేయని నేపథ్యం లో కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమ, మంగళవారాలలో మరోసారి ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. దశాబ్దాల తరబడి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన కడప జిల్లాలో, అందులోనూ ఆయన ఎంతో ఇష్టపడే పులివెందుల శాసనసభా స్థానం నుంచి ఈ యాత్ర మొదలు కావటం ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఓదార్పు యాత్రకు ఎవరూ వెళ్ళటానికి వీలు లేదని హై కమాండ్ కరాఖండిగా తేల్చి చెప్పినట్టు కేంద్ర మంత్రులు పురంధ్రీశ్వరి, పనబాక లక్ష్మి, మరి కొందరు సీనియర్ నేతలు బాహాటంగా ప్రకటనలు చేయటం, యాత్రలో పాల్గొనవద్దని అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తనకు చెప్పినట్టు ముఖ్యమంత్రి రోశయ్య అందరితో చెబుతున్న నేపథ్యంలో జగన్ వాటిని గమనంలోకి తీసుకోకుండా, ఏమాత్రం ఖాతరు చేయకుండా మరోసారి ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. దీని పర్యవసానాల మాట ఎలా ఉన్నా స్వంత జిల్లాలో తన సత్తా ఏమిటో హై కమాం డ్‌కు చూపాలన్న జగన్ ఆరాటం స్పష్టంగా బయటపడుతున్నది.
లాభ నష్టాల బేరీజు?
రెండు రోజుల ఓదార్పు యాత్ర విజయవంతం అవుతుందా లేదా అనే సందేహం జగన్‌కు లేదు. అయితే సమీప భవిష్యత్తులో తాను రాజకీయంగా వేయబోయే అడుగులకు సానుకూల వాతావరణం స్వంత జిల్లాలో ఉందా లేదా అనే బేరీజు వేసుకోవ టానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. తన యాత్రకు జనం మద్దతు ఉందని, ఎమ్మెల్యేలు వచ్చినా రాకపోయినా భవిష్యత్తులో పార్టీకి అండగా ఉండేది ప్రజలే కాబట్టి వారి కోరిక మేరకే యాత్ర జరుపుతున్నానని అధిష్ఠానానికి మరోసారి జగన్ గుర్తు చేయదలచుకున్నారు. అదే సమయంలో భవిష్యత్తులో తనకు ఈ యాత్ర ఏమేర మేలు చేయగలదో బేరీజు సైతం వేసుకోనున్నారు.
అధికారంలో ఉండగా రాజశేఖరరెడ్డి జిల్లాకు అందులోనూ పులివెందుల నియోజకవర్గానికి చేసిన మేలు అక్కడి ప్రజలు అంత సులభంగా మరచిపోరు. ఇడుపులపాయలో ఆర్‌జెయు గేట్ ఏర్పాటు చేయించి విద్యాపరంగా, బ్రహ్మాండమైన రహదారులకు నిధుల కేటాయింపు, సాగు, తాగునీటి రంగానికి ప్రాధాన్యం...ఇలా జిల్లాకు తన శక్తి మేరకు ఏమేమి చేయాలో అన్ని ప్రయోజనాలనూ వైఎస్ సమకూర్చారు. ఫలితంగా ఆయన అన్నా, జగన్మోహన్‌రెడ్డి అన్నా జిల్లా ప్రజానీకానికి అభిమానం ఉండటం సహజమే. అయితే ఈ అభిమానం జగన్ వేరు కుంపటి పెట్టుకున్నా కొనసాగుతుందా లేక అది కాంగ్రెస్ పార్టీ వైపు బదిలీ అవుతుందా అనేదే ఇప్పుడు ప్రశ్న. వచ్చేనెలలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో సుదీర్ఘంగా ఓదార్పు యాత్ర జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న జగన్‌కు స్వంత జిల్లాలో ఎదురయ్యే అనుభవం పైనే తర్వాతి యాత్రల పరిస్థితి అంచనా వేయ వచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వద్దంటున్నది ముగ్గురే...
జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒకరు (ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి-టీడీపీ) మినహా మిగిలిన వారంతా కాంగ్రెస్ వారే. అయితే ప్రాథమిక విద్య, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అహ్మదుల్లా సయ్యద్ (కడప), డీఎల్ రవీంద్రరెడ్డి (మైదుకూరు), జి.వీరశివారెడ్డి (కమలాపురం) తప్ప మిగిలిన ఆరుగురూ వైఎస్ వీరాభిమానులే...వైఎస్ స్థానంలో ఎన్నికైన జగన్ తల్లిగారు విజయమ్మ, కె.శ్రీనివాసులు (కోడూరు), జి.శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), ఆదినారాయణరెడ్డి (జమ్మల మడుగు), అమరనాథరెడ్డి (రాజంపేట), కమలమ్మ (బద్వేలు) ఓదార్పు యాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓటమిపాలైన వరదరాజులు రెడ్డి లాంటి సీనియర్లు యాత్రకు దూరంగా ఉంటారన్న వార్తలు వస్తున్నాయి. వైఎస్ జీవించి ఉన్నంత దాకా ఆయనకు తిరుగు లేదు కాబట్టి జిల్లాలో పలువురు సీనియర్ నేతలు ఆయనకు అండగా ఉన్నారు. డీఎల్ లాంటి వారు అలాంటి వారే. ఇప్పుడు ఆయన లేకపోవటంతో డీఎల్, వీరశివ లాంటి వారు గళాలు పెంచారు. ఈ నేపథ్యంలో జగన్ నిర్వహించ తలపెట్టిన స్వంత జిల్లా ఓదార్పు యాత్ర రాజకీయంగా ప్రాధాన్యం సంతరించు కోవటంతో పాటు సమీప భవిష్యత్తులో ఆయన అనుసరించ బోయే వ్యూహాలకు సైతం నాందిగా నిలవనున్నది.
No comments:
Post a Comment