అధిష్ఠానాన్ని ధిక్కరించేలా వ్యవహరిస్తోన్న కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని లొంగదీసుకునేందుకు పార్టీ నాయకత్వం రంగంలో దిగింది. జగన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా ఆయనను దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోన్న పార్టీ అధిష్ఠానం ఆ మేరకు తన చర్యలను ఆచరణలో అమలుచేస్తోంది. అందులో భాగంగా.. జగన్‌కు చెందిన వ్యాపార సంస్థల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలపై ఆదాయపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ విభా గాలు గత రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వాటి వివరాలను ఇచ్చి, స్వయంగా హాజరుకావాలని ఆదేశించినట్లు ఢిల్లీ పార్టీ వర్గాలతో పాటు, రాష్ట్రానికి చెందిన కొందరు ఎంపిలు సైతం ధృవీకరిస్తున్నారు.
ఆ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మధ్య ఇదే అంశానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. జగన్ వ్యాపార సంస్థల వివ రాలు అందచేయాలని ఆ రెండు సంస్థలు నోటీసులు జారీ చేశారని, అందుకే జగన్ వైఖరి మార్చుకుంటు న్నారని రాష్ట్రానికి చెందిన ఎంపీలు మీడియా వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాపార సంస్థలను కాపాడుకు నేందుకే ఆయన ప్రణబ్‌ను ఎక్కువసార్లు కలుస్తున్నారని, తనపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టడం ద్వారా తన ఆస్తులు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ వ్యతిరేక వర్గానికి చెందిన ఎంపీలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలాఉండగా.. కేంద్రఆర్థికమంత్రి, యుపిఏలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ప్రణబ్‌ముఖర్జీని జగన్ కలవడం వెనుక కారణం కూడా ఇదేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తాను పార్టీని చీలుస్తున్నానంటూ కొందరు సీనియర్లు మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, కానీ తనకు అలాంటి ఉద్దేశం లేదని జగన్ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. తాను పార్టీని చీలుస్తున్నానన్న ఆగ్రహంతోనే తన సంస్థల ఆదాయ వ్యవహారాలపై నోటీసులు ఇస్తున్నట్లు కనిపిస్తోందని జగన్ ఆయన వద్ద అనుమానం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
‘నాకయితే అలాంటి ఉద్దేశం లేదు. మీరు దాన్ని నమ్మి నాపై కక్ష సాధిస్తే నేను చేసేదేమీ లేదు. నాకూ న్యాయమార్గాలు తెలుసు’నని చెప్పినట్లు సమాచారం. అంటే తనపై వేధింపులు కొనసాగిస్తే న్యాయస్థానాల ద్వారా వాటిని ఎదుర్కొంటానని పరోక్షంగా చెప్పినట్టయిందని విశ్లేషిస్తున్నారు. ఓదార్పు యాత్ర తన వ్యక్తిగతమని, దానికి పార్టీతో సంబంధం లేదని, ఆ విషయంలో మిగిలిన పార్టీ వ్యవహారాల్లో నాయకత్వం మాట జవదాటనని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. ఓదార్పు యాత్ర అంశాన్ని తన తండ్రి మృతి చెందిన తర్వాత బహిరంగంగా ప్రకటించానని, ఆ మాటకు కట్టుబడి ఉండటం తన ధర్మమని ప్రణబ్‌కు నచ్చచెప్పినట్లు సమాచారం. ఆయన విన్నపాన్ని ప్రణబ్ సావధానంగా ఆలకించి, తాను సోనియాతో మాట్లాడి, మీ అభిప్రాయాన్ని వెల్లడిస్తానని చెప్పినట్లు తెలిసింది.
ఆ తర్వాత జగన్ ఒక జాతీయ మీడియా సంస్థ ప్రతినిధితో కూడా దాదాపు ఇదేవిధంగా మాట్లాడినట్లు పార్టీ ఎంపీ వెల్లడించారు. తనకు పార్టీని చీల్చే యోచన లేదని, అలాంటి ఆలోచనతో ఉన్నానన్న అనుమానంతోనే తన ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఒకవేళ తనపై వేధింపులు కొనసాగిస్తే న్యాయపోరాటం చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
No comments:
Post a Comment