జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Thursday, August 5, 2010

సమరమే! సయోధ్య కష్టమే.. జగన్‌పై ఆగ్రహంతో రాహుల్ అందుకే అసమ్మతులపై వేట్లు.. సోనియా ఆమోదంతోనే

 
పార్లమెంటు తర్వాత కీలక చర్యలు?
ముప్పు పసిగట్టిన ముఖ్య నేతలు
రాజీ కోసం రంగంలోకి మధ్యవర్తులు
రాహుల్ సన్నిహితుల ద్వారా యత్నాలు
కడప ఎంపీతో కేవీపీ, సబ్బం చర్చలు
హైదరాబాద్ చేరుకున్న జగన్
వెనుకంజ సంకేతాలు శూన్యం
వర్ధంతి మరునాడే మళ్లీ ఓదార్పు
3 నుంచి ప్రకాశంలో ప్రారంభం
ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో!
మళ్లీ విరుచుకుపడ్డ అంబటి
అటు సంధి యత్నం... ఇటు యుద్ధ సన్నివేశం. అక్కడ సయోధ్య వ్యాఖ్యలు... ఇక్కడ సమర క్రీడలు. ఆయనది అమితమైన మౌనం... ఆయన మనుషులది అపార వాగాడంబరం. అంతా చక్కబడుతుందంటారు అయిన వాళ్లు.. అంతలోనే రెచ్చగొడుతుంటారు అంతేవాసులు! ఇదీ ఇప్పుడు కడప ఎంపీ జగన్ వర్గం అనుసరిస్తున్న వ్యూహం. ఎత్తి పొడుపు మాటలకు అధిష్ఠానం కత్తి వేట్లతోనే జవాబిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాజకీయం మరింత వేడెక్కుతోంది.

ఐదు రోజుల్లో అంతా చక్కబడుతుందని జగన్ వర్గంలోని కొందరు మధ్యవర్తులు ప్రచారం చేస్తున్నప్పటికీ ఆ చాన్స్ ఎంతమాత్రం లేదని, రాజీకి అవకాశం కనిపించడం లేదని ఢిల్లీ వర్గాలు సూచిస్తున్నాయి. సెప్టెంబర్ 2 (వైఎస్ వర్ధంతి) రోజు రాజకీయంగా ఎన్నో మార్పులకు నాంది కానుందని రాష్ట్ర రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. జగన్‌పై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు, ఆమె కుమారుడు, భావి ప్రధానిగా భావిస్తున్న రాహుల్‌గాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పార్టీకి జగనే ప్రధాన ఆకర్షణ అని, అంతటి ప్రజా నాయకుడు మరొకరు లేరని, ఆయన లేకుంటే రాష్ట్రంలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన వర్గం చేస్తున్న ప్రచారం పట్ల రాహుల్ మండిపడుతున్నట్టు అవి పేర్కొన్నాయి. ఇటీవల రాష్ట్రానికి చెందిన యువ ఎమ్మెల్యేలతో రాహుల్ జరిపిన సమావేశాల తర్వాతే అధిష్ఠానం జగన్ పట్ల 'ఒక నిర్ణయానికి' వచ్చినట్టు కనిపిస్తోందని జగన్ సన్నిహితులే పేర్కొంటున్నారు.

"రాష్ట్ర నాయకత్వంపైన, అధిష్ఠానంపైన జగన్ వర్గం గతంలో ఇంతకన్నా ఎక్కువగా విమర్శలు గుప్పించింది. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కానీ రాష్ట్ర రాజకీయాలపై రాహుల్ సమీక్ష చేపట్టి, లోతుగా విశ్లేషించిన తర్వాత ఢిల్లీ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. జగన్ వర్గీయులపై వరుసగా వేటు పడడం మొదలైంది'' అని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు.

అంబటి రాంబాబు, గట్టు రామచంద్ర రావు తర్వాత ఎమ్మెల్యే కొండా సురేఖకు కూడా షోకాజ్ నోటీసు జారీ కావడంతో, ఇక అవసరమైతే జగన్‌పై కూడా ఎలాంటి చర్యకైనా అధిష్ఠానం వెనుకాడబోదని స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. దీంతో జగన్ పట్ల సానుభూతితో ఉండే కొందరు ముఖ్యులు సయోధ్య యత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాహుల్‌ను ప్రసన్నం చేసుకోవడానికి వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాహుల్‌కు అత్యంత సన్నిహితులైన సందీప్ దీక్షిత్, మిలింద్ దేవరా వంటి యువ నేతల సాయంతో మేడమ్ కుమారుడిని చల్లబరచడానికి వారు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

అటు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌కు సన్నిహితుడైన రాజీవ్ శుక్లా వంటివారి సాయంతోనూ రాయబార యత్నాలు ప్రారంభమయ్యాయి. "జగన్‌కు మేం నచ్చజెబుతాం. అయితే అధిష్ఠానం కూడా ఆయన పట్ల సానుకూల వైఖరి అవలంబించాలి'' అని ఈ మధ్యవర్తులు ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌తో వ్యూహాత్మక స్నేహం అవసరమని, అన్ని ద్వారాలు మూసుకుపోయిన తర్వాతే తదుపరి కార్యాచరణ చేపట్టాలని జగన్‌కు కూడా మధ్యవర్తులు హితవు చెబుతున్నట్లు తెలిసింది.

జగన్ నేపథ్యం, ఆయన వ్యాపార లావాదేవీల గురించి ఇప్పటికే అధిష్ఠానం పూర్తి సమాచారం సేకరించిందని, పార్లమెంట్ సమావేశాల తర్వాత తగిన చర్యలు ఉంటాయని తెలిసినందువల్లే ఆయన వర్గీయులు జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు గతంలో జగన్ విషయంలో కేంద్రానికి అందించిన నివేదిక ఆధారంగా వివిధ విభాగాలు ఇప్పటికే సమాచారం సేకరించినట్టు భోగట్టా.

అంతేకాక కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్దన్‌రెడ్డి నుంచి జగన్‌కు అందుతున్న సహాయ సహకారాల గురించి కూడా హైకమాండ్‌కు ఇప్పటికే పూర్తి వివరాలు అందాయి. ఈ నేపథ్యంలోనే తన తరఫున మధ్యవర్తులు చేసే ప్రయత్నాలకు జగన్ అడ్డుచెప్పలేదని తెలిసింది. గురువారం ఉదయం ఢిల్లీలో వైఎస్ కుటుంబ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి జగన్‌ను కలిసి, తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు.

అనంత వెంకట రెడ్డి, సాయిప్రతాప్, కిల్లి కృపారాణి తదితరులు కూడా జగన్‌ను కలుసుకున్నారు. తర్వాత విలేఖరులతో మాట్లాడిన సబ్బంహరి, రాజీ యత్నాలు మొదలైనట్టు వెల్లడించారు. అయితే జగన్ తప్పేమీ లేదని, అధిష్ఠానమే అసలు వాస్తవాలను గుర్తించి ఆయన పట్ల సానుకూలంగా వ్యవహరించేందుకు ముందుకు వచ్చిందని ఆయన పేర్కొనడం విశేషం.

సయోధ్య కుదిర్చే బాధ్యతను హైకమాండ్ నలుగురు ఎంపీలకు అప్పగించిందని చెప్పడం ద్వారా, రాజీకి అధిష్ఠానమే చొరవ చూపుతున్నదనే కలర్ ఇవ్వడానికి సబ్బం ప్రయత్నించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సోనియా గురువారం రాత్రి తిరిగి వస్తారని, తర్వాత మధ్యవర్తులు జగన్ విషయంలో జరిగిన పరిణామాలను ఆమెకు వివరిస్తారని అంటున్నారు. మంగళవారం నాటికి అంతా చక్కబడుతుందని సబ్బం హరి చెప్పడం అందుకే!

సోనియా క్షమించేనా?
అయితే జగన్ విషయంలో సోనియా సానుకూల వైఖరి అవలంబించే అవకాశాలు లేనే లేవని పార్టీ వర్గాలు అంటున్నాయి. "తాను నియమించిన ముఖ్యమంత్రి రోశయ్యపై విమర్శలు గుప్పించడం అంటే, తన నిర్ణయాన్ని ధిక్కరించడమేనన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఉంది. పరిస్థితి క్రమంగా చేజారిపోతోందని, తెలంగాణ ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని సోనియా భావిస్తున్నారు. అందుకే పార్టీకి వ్యతిరేకంగా ఏ ఒక్కరు మాట్లాడినా తక్షణమే వేటు వేయాలని ఢిల్లీ పెద్దలకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.

ఈ కారణంగానే అసమ్మతుల విషయంలో రాష్ట్ర నాయకత్వం కంటే ఢిల్లీయే ముందుగా స్పందిస్తోంది. సస్పెన్షన్ నిర్ణయాలను వెల్లడిస్తోంది'' అని పార్టీ నేతలు వివరిస్తున్నారు. జగన్ విషయంలో సోనియా అంత సులభంగా మనసు మార్చుకునే అవకాశాలు లేవని వారు అభిప్రాయపడుతున్నారు. "తనతో జరిగిన సంభాషణను ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో వెల్లడించిన తర్వాత జగన్‌పై ఆమె తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. సాధారణంగా ఆమె ఒకసారి తనను వ్యతిరేకించిన వారిని క్షమించే అవకాశం ఉండదు'' అని వారు తెలిపారు.

అధిష్ఠానం జగన్ పట్ల సానుకూలతతో ఉందని, సర్దుబాటు జరుగుతుందని సబ్బం హరి చేసిన వ్యాఖ్యలను సీనియర్ ఎంపీ ఒకరు కొట్టిపారేశారు. "జగన్ గురించి హైకమాండ్‌కు అంతా తెలుసు. మేడమ్ ఆయనను ప్రోత్సహిస్తుందని నేను అనుకోను'' అని ఆయన అన్నారు.

మళ్లీ ఓదార్పు
'అధిష్ఠానం వద్దంటున్న' ఓదార్పు యాత్రకు సంబంధించి తన వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండబోదని జగన్ మరోసారి తేల్చిచెప్పారు. సయోధ్య కుదురుతుందని సబ్బం హరి ప్రకటించిన కొన్ని గంటల్లోనే... 'మూడో విడత' ఓదార్పు యాత్ర తేదీలు అనధికారికంగా వెల్లడి కావడం గమనార్హం.

జగన్ సన్నిహితుల సమాచారం ప్రకారం... వచ్చేనెల 2న ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. అన్నదానం చేస్తారు. అదే రోజు హైదరాబాద్‌కు తిరిగివచ్చి, రాత్రికి ఓదార్పు యాత్ర నిమిత్తం ప్రకాశం జిల్లాకు వెళతారు. 3 నుంచి ఐదు రోజుల పాటు ఆ జిల్లాలో యాత్ర కొనసాగుతుంది. అనంతరం నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటిస్తారు.

దీన్ని పక్కనబెడితే, అటు సయోధ్య మాటలు వినిపించిన రోజే జగన్ సన్నిహితుడు అంబటి రాంబాబు మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రోశయ్యను, అధిష్ఠానాన్ని ఏకిపారేశారు. పార్టీ నియమావళి ప్రకారం.. తనను సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీకి లేదనడం ద్వారా, తాము ఎవరికీ అదిరేదీ బెదిరేదీ లేదన్న సంకేతాన్ని జగన్ వర్గం ఇచ్చినట్టు భావిస్తున్నారు.

శ్రేయోభిలాషుల ఒత్తిడి మేరకు సయోధ్య యత్నాలకు సరే అన్నా, గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై జగన్ కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఓదార్పు యాత్ర తేదీలను వెల్లడించేందుకు విలేఖరుల సమావేశం పెట్టి, అదే సమయంలో పార్టీలో తన వర్గానికి జరుగుతున్న అన్యాయంపై జగన్ పెదవి విప్పే అవకాశాలున్నాయి.

పీసీసీ తీరుపైనా అసంతృప్తి
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పీసీసీ పనితీరుపై కూడా అధిష్ఠానం పూర్తి సంతృప్తిగా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. "రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితులపై అధిష్ఠానానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాల్సి ఉంది. అయితే పీసీసీ నుంచి అధిష్ఠానం ఆశించిన స్థాయిలో రిపోర్టు రావడం లేదని అంటున్నారు.

రోశయ్యపై మాజీ మంత్రి సురేఖ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయాన్ని అధిష్ఠానం దృష్టికి ముందుగా డీఎస్ తీసుకు వెళ్లాలి. కానీ అలా జరగలేదు'' అని పార్టీ నేతలు కొందరు తెలిపారు. "ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభించలేదని డీఎస్ అధిష్ఠానానికి వివరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో నేరుగా అధిష్ఠానమే ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నది'' అని వారు వెల్లడించారు.

No comments:

Post a Comment