జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Wednesday, August 18, 2010

ఎవరేమన్నా నా దారి నాదే! మీరు నాకు చెప్పేంత వాళ్లా? మీ స్థాయి ఏంటి? ప్రకాశం ఎమ్మెల్యేలపై జగన్ ఫైర్


నా ఉనికి నాకు ముఖ్యం.. నాతోనే జనం
నా సర్వేలు నాకున్నాయి.. మీరు చెబితే నేను వినాలా?
అది నాన్నకిచ్చిన మాట...
పార్టీకి లాభమా? నష్టమా? ఆలోచించను
ఇప్పటికే ప్రయాణం ప్రారంభించా..
ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది
మీరెవరూ ఓదార్పు యాత్రకు రానక్కర్లేదు: కడప ఎంపీ
రాహుల్‌లా నమ్రతగా ఉండండి.. ఎమ్మెల్యేల విజ్ఞాపన లేఖ
"మీరు నాకేమీ బోధించనక్కర్లేదు. మీకంత స్థాయి లేదు. మీరు చెబితే నేను వినాలా? మీరు అంత పెద్దవారా? మీరు నాకు చెప్పేదేంటి? పావురాల గుట్టలో నాన్నకిచ్చిన మాట అది. నెరేవేర్చడం నా ధర్మం. ఓదార్పు కొనసాగించి తీరుతాను. పార్టీకి లాభమా.. నష్టమా.. అనేది ఆలోచించను'' ఇవీ కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అధిష్ఠానం కాదంటున్నా వచ్చే నెల 3న ఓదార్పు యాత్రను చేపట్టేందుకు జగన్ సన్నాహాల నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుగురు శాసనసభ్యులు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు.

జగన్‌ను ఆయన నివాసంలో రాత్రి పది గంటల తర్వాత కలుసుకుని, భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మనసు మార్చేందుకు ఎమ్మెల్యేలు విఫలయత్నం చేశారు. అంతకు ముందే ఓదార్పు యాత్రకు వెళ్లొద్దంటూ కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ నుంచి క్లాస్ తీసుకుని వచ్చిన జగన్... కొద్ది సేపటికే తనను ఒప్పించేందుకు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు రావడంతో అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి సీనియర్‌లు ఆ బృందంలో ఉన్నా.. గమనించనట్లు.. గేటు దగ్గరే ఆవేశం కట్టలు తెంచుకున్నారు.

జగన్‌తో భేటీ సందర్భంగా పది ప్రశ్నలతో కూడిన ఒక లేఖను ఆయనకు ఎమ్మెల్యేలు అందించారు. దాన్ని ఆయన పూర్తిగా చదవకుండానే అలా పైపైన చూసి పక్కన పడేసినట్లు తెలిసింది. "మీరు చెబితే నేను వినాలా? మీరు అంత పెద్దవారా? అంటూ జగన్ ఆగ్రహంగా మాట్లాడినట్లు ఒక ఎమ్మెల్యే చెప్పారు. "దివాకర్ రెడ్డి మాట విని మీరు ఢిల్లీ రావడమేమిటి? ప్రకాశం జిల్లాకూ ఆయనకూ సంబంధమేమిటి?'' అని ప్రశ్నించినట్లు తెలిసింది.

"మిమ్మల్ని యాత్రకు రమ్మని నేను కోరలేదు. మీరు వచ్చినా, రాకపోయినా, ఫర్వాలేదు. నా దారి నాదే. ఎవరి కోసమో ఓదార్పు యాత్ర ఆగదు'' అని జగన్ వారికి స్పష్టంగా చెప్పారు. జగన్‌ను కలిసిన వారిలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఉగ్రనరసింహారెడ్డి, కృష్ణమోహన్, మహీధర్‌రెడ్డి, గొట్టిపాటి రవి, జీవీ శేషు, సురేశ్ ఉన్నారు. అత్యంత విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం వీరితో జగన్ సంభాషణ ఇలా ఉంది.....

ఎమ్మెల్యేలు: అధిష్ఠానం చెప్పినట్లు నడుచుకోండి. అది మీకూ మాకూ పార్టీకీ మంచిది. అధిష్ఠానం ఆదేశాలు ధిక్కరిస్తే మీకూ మాకూ నష్టమే. జగన్: నేను సరైన మార్గంలోనే వెళుతున్నా. నా సర్వేలు నాకున్నాయి. జనం నా వెంట ఉన్నారు. నా ఉనికి నాకు ముఖ్యం. పార్టీకి నష్టమా? లాభామా? అనేది నేను పట్టించుకోను. ఇప్పటికే ప్రయాణం ప్రారంభించాను. కొనసాగిస్తాను. ఏది మంచో ఏది చెడో మీరు నాకు చెప్పనక్కరలేదు. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది.

ఎమ్మెల్యేలు: పార్టీ కూడా ముఖ్యమే కదా?
జగన్: పార్టీ గురించి తర్వాత. నన్ను ఇబ్బంది పెట్టేందుకే కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా ఎస్పీని మార్చారు.

ఎమ్మెల్యేలు: (ఒక సీనియర్ ఎమ్మెల్యే కల్పించుకుని) మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి చాలా జరిగాయి. మాకు తెలియకుండానే మా జిల్లాకు సంబంధించినఎన్నో నిర్ణయాలు తీసుకునేవారు. మేమేమీ వ్యతిరేకించలేదు. రాజకీయాల్లో ఇవి మామూలే. పాలనా పరంగా అధికారుల బదిలీలు జరుగుతుంటాయి. డీఎల్ రవీంద్రారెడ్డి, జేసీ దివాకరరెడ్డిలను దృష్టిలో పెట్టుకుని మీరు వ్యవహరించడం సమంజసంగా లేదు. పార్టీని ధిక్కరించే విధంగా సిద్ధమవుతున్నారు. మా ఆలోచనలను ఈ లేఖలో పొందుపరిచాం. పరిశీలించండి. మీ చర్యల వల్ల పార్టీ బలహీనపడడంతో పాటు టీడీపీ బలపడేలా ఉంది.
జగన్: అవన్నీ నాకు అనవసరం.

ఎమ్మెల్యేలు: ఎమ్మెల్యేలను కూడగడుతున్నారని.. సొంత పార్టీ పెడతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ మీరు కనీసం ఖండించలేదు. జగన్: అలా ఖండించాల్సిన అవసరం నాకు లేదు.ఎమ్మెల్యేలు: పదవుల విషయంలో రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్‌లో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఓదార్పు యాత్ర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలిగేలా కిందిస్థాయి కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వారు ఎమ్మెల్యేలతో విబేధించేలా చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యేలకు కూడా నష్టదాయకం. పార్టీకీ నష్టమే.
జగన్: (అవేమీ పట్టనట్లుగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ..) నా చర్యల వల్ల పార్టీకి లాభమా నష్టమా? అని ఆలోచించే పరిస్థితిలో నేను లేను. ఆ విషయాన్ని నేను పట్టించుకోను. ఓదార్పు యాత్ర కొనసాగిస్తాను. అధిష్ఠానం యాత్ర పట్ల మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంది. నాన్నకిచ్చిన మాట మేరకు ఓదార్పు కొనసాగించి తీరుతాను.

మేమే ఢిల్లీ వచ్చాం: ఆమంచి
తమను దివాకర్ రెడ్డి ఢిల్లీకి తీసుకురాలేదని, తమంతట తామే వచ్చామని ఎమ్మెల్యేలు ఆమంచి కృష్ణమోహన్, ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. ఓదార్పు యాత్రపై పార్టీలో అయోమయం తొలగిపోయేందుకు ఢిల్లీ వచ్చామని, జగన్ వైఖరిని, అధిష్ఠానం అభిప్రాయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలని భావించామని వారు చెప్పారు.

ఎంపీలకు అధిష్ఠానం తమ వైఖరిని స్పష్టంగా చెప్పిందని తెలిసిందని, తాము కూడా అధిష్ఠానంతో మాట్లాడి స్పష్టత ఏర్పర్చుకోవాలని భావిస్తున్నామని వారు తెలిపారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని శిరసావహిస్తామని, పార్టీ శ్రేణులకు కూడా ఓదార్పు యాత్రలో పాల్గొన వద్దని చెబుతామని కృష్ణమోహన్ చెప్పారు.

No comments:

Post a Comment