జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Sunday, August 22, 2010

పులి జూదం.. క్లైమాక్స్ దిశగా యాక్షన్ సీన్ సొంత గడ్డ పులివెందులలో సోమ, మంగళవారాల్లో జగన్ పర్యటన

12 కుటుంబాలకు ఓదార్పు
ప్రకాశం యాత్రకు ముందు బల ప్రదర్శన
ఇది 'సెమీఫైనల్' అంటున్న నేతలు
సన్నిహితులతో జగన్ మంతనాలు
ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచే వ్యూహం
నిశితంగా గమనిస్తున్న అధిష్ఠానం
గీత దాటే వారిపై వేటు ఖాయం!
ఈటెల్లాంటి మాటల వేట కొనసాగుతుండగానే, అసలు ఆటకు తెర లేస్తోంది. క్లైమాక్స్ దిశగా యాక్షన్ సీన్ మొదలవుతోంది. అధిష్ఠానం ఆదేశాలను తోసిరాజంటూ, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కడప ఎంపీ జగన్, ఓదార్పు యాత్రతో ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకున్నారు. ఓదార్పును పార్టీపరంగా చేయాలన్న హైకమాండ్ హితబోధను ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన వ్యక్తిగతంగానే యాత్రకు వెళ్లబోతున్నారు.

స్వస్థలమైన కడప జిల్లాలో, కంచుకోట వంటి పులివెందులలో సోమ, మంగళవారాల్లో జగన్ పర్యటించబోతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 12 మంది కుటుంబాలను ఆయన ఈ సందర్భంగా ఓదారుస్తారు. ఓదార్పునకు సంబంధించిన కార్యాచరణపై జగన్ ఆదివారం పలువురు నేతలతో చర్చించారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. వైఎస్ వర్ధంతి మరుసటి రోజు నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టి తీరాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్టు తెలిసింది.

తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పు ముగిశాక, సంధి-సయోధ్య కోసం జరిగిన పలు యత్నాలు విఫలమైన నేపథ్యంలో... దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న కడప జిల్లాలో పర్యటన తలపెట్టడం ద్వారా జగన్, అధిష్ఠానానికి నేరుగా సవాలు విసురుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చేపట్టే యాత్రకు ముందే, సొంత జిల్లాలో సత్తా చాటడం జగన్ లక్ష్యమని వారు విశ్లేషిస్తున్నారు. కడప జిల్లాలో జగన్ యాత్రను 'సెమీ ఫైనల్'గా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక 'ఫైనల్'కు చేరుకునే దాకా... అం టే ప్రకాశం యాత్ర చేపట్టే సెప్టెంబర్ 3 దాకా అధిష్ఠానం ఆగుతుందా? లేక ఆ లోగానే చర్యలు తీసుకుంటుందా? అన్నది అసలు ప్రశ్న. పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు దీనిపైనే జోరుగా చర్చ సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని స్పష్టం చేసిన సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ, ఏకంగా 'జగన్ పార్టీలో ఉంటే ఎంత? పోతే ఎంత?' అని వ్యాఖ్యానించడంతో, గీత దాటితే జగన్‌పై క్రమశిక్షణ చర్య తప్పదని స్పష్టమైంది. అయితే అది ఎప్పుడు? ఎవరు ముందుగా అడుగు ముందుకు వేస్తారు? అన్నవే ఇప్పుడు కీలక ప్రశ్నలు.

వ్యూహ ప్రతివ్యూహాలు
ఆఖరి అంకానికి సమయం సమీపిస్తుండడంతో, రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం కూడా అదే స్థాయిలో తీవ్రమవుతోంది. పురందేశ్వరి, పనబాక లక్ష్మి, కేశవరావు, హర్షకుమార్, సర్వే సత్యనారాయణ, మధుయాష్కీ వంటి వారు ఒకవైపు మోహరించగా, అంబటి రాంబాబు, వైఎస్ వివేకానందరెడ్డి, సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా సురేఖ, పుల్లా పద్మావతి వంటివారు మరోవైపు మోహరించారు.

స్థూలంగా చూస్తే, ఇప్పుడు పార్టీలో హైకమాండ్ వర్గం, జగన్ వర్గం అనే రెండు గ్రూపులు, వాటి మధ్య విభజన రేఖ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యక్తుల కంటే పార్టీ ప్రధానమని అధిష్ఠానం చెబుతున్నప్పటికీ, వైఎస్ తనయుడిగా ప్రజల్లో కరిష్మా ఉ న్న జగన్ వెంట వెళ్లేందుకే తాము మొగ్గు చూపుతామని ఆయన వర్గం చెబుతోంది. పలువురు ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా శాసనసభ్యులు మాత్రం అధిష్ఠానం మాటను శిరసావహిస్తామని స్పష్టంచేస్తున్నారు.

దీంతో వారిని దారిలోకి తెచ్చుకునేందుకు జగ న్ వర్గం ఒత్తిడిని పెంచుతోంది. ఈ వర్గానికి చెందిన వారు గత 2 రోజులుగా కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఉగ్ర నరసింహారెడ్డిల దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. "వైఎస్ వల్లే అసెంబ్లీకి ఎన్నికైనందున, శాసనసభ్యులు ఓదార్పు యాత్రలో పాల్గొనాలని ఈ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు'' అని వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.

ప్రజా ప్ర తినిధుల్లో అత్యధికులు అధిష్ఠానం బాట పట్టడంతో, జగన్ వర్గం, జిల్లాల వారీగా కింది స్థాయి నాయకులతో మాటా మంతీ జరుపుతోంది. పంచాయతీల్లోనూ, మునిసిపాలిటీల్లోనూ, పార్టీ సమావేశాల్లోనూ ఓదార్పు యాత్రకు అనుకూలంగా తీర్మానాలు చేయిం చి ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీన్ని గమనించిన ప్రజా ప్రతినిధులు కూడా ఓదార్పును అధిష్ఠానం ఏ మాత్రం వద్దన లేదని, జిల్లా కేంద్రంలో బాధితులతో కలిపి పార్టీ పరంగా చేయాలని చెబుతోందని, అయితే జగన్ అందుకు అంగీకరించడం లేదని కార్యకర్తలకు వివరిస్తున్నారు.

మరోవైపు 'తిరుమలలో అక్రమాలు- తనపై ఆరోపణల'కు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టిన టీటీడీ పాలకమండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి జగన్ వర్గీయులు సంఘీభావం ప్రకటిస్తున్నారు. సెప్టెంబర్ 2న తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యం లో ఇప్పటి నుంచే వేడి రాజేస్తున్నారు. యాత్ర జరిగే ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే కొండా సురేఖ పర్యటిస్తూ, దగ్గుబాటి దంపతులపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ, కాక పుట్టిస్తున్నారు.

రాష్ట్రంలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అధిష్ఠానం, కట్టుదాటిన వారిపై క్రమశిక్షణ వేటు వేసేందుకే సిద్ధమవుతున్నట్టు సీనియర్ నేతలు చెబుతున్నారు. రెండు వర్గాలూ దేనికవి పట్టిన పట్టు వీడకుండా, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుండడంతో, ఈ నెలాఖరులో, సెప్టెంబర్ తొలి వారంలో కాంగ్రెస్ రాజకీయాల్లో పెను మార్పులు తప్పవని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

No comments:

Post a Comment