వైఎస్ స్థాయిలో జనాకర్షణ శక్తి గల నేతగా, నమ్మిన వారి కోసం పోరాడే నాయకుడిగా పేరు తెచ్చుకోవాలని తహతహలాడుతోన్న ఆయన తనయుడు జగన్‌లో తండ్రి స్థాయి పోరాట పటిమ లేకపోవడంపై ఆయనను సమర్ధిస్తున్న నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు ప్రధాన మద్దతుదారయిన ఎమ్మెల్యే కొండా సురేఖకు అధిష్ఠానం షోకాజ్ నోటీసు జారీ చేసి ఇరవై 4 గంటలు దాటుతున్నా ఇంతవరకూ దానిపై జగన్ నోరు విప్పకపోవడంపై సొంత శిబిరంలోనే విమ ర్శలు వినిపిస్తున్నాయి.
జగన్‌ను సమర్థించే పిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు, కిసాన్‌సెల్ కార్యాలయ కార్యదర్శి గట్టు రామచంద్రరావును పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇన్ని రోజులవుతున్నా, వాటిని ఎత్తివేయించేందుకు జగన్ ఇంతవరకూ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం, ఢిల్లీలో ఉన్నప్పటికీ, ఆ మేరకు అధిష్ఠానంతోచర్చలు జరపకపోవడం జగన్ శిబిరంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొండా సురేఖ, అంబటికి అన్యాయం జరిగిందని, వారికి న్యాయం చేసేందుకు ఎవరితో నయినా మాట్లాడతానని కాకినాడలో చెప్పి 8 రోజులవుతున్నప్పటికీ, ఆ మేరకు జగన్ కనీస ప్రాథమిక ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఆయన సమర్థతపై చర్చ మొదలయింది.
కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో వైఎస్ వర్గీయులు కొందరు దానిని వ్యతిరేకించగా, వ్యతిరేకవర్గం మాత్రం స్వాగతించింది. అయితే, జగన్ మాత్రం ఇంతవరకూ షోకాజ్‌పై నోరు మెదపక పోవడం ఆయన సొంత శిబిరంలోనే విస్మయం వ్యక్తమవుతోంది.
నిజానికి ఆయన గురువారం షోకాజ్ అంశంపై స్పందిస్తారని ఆయన వర్గీయులు చెప్పా రు. కానీ గురువారం రాత్రి వరకూ జగన్ స్పందించలేదు. ఢిల్లీలో మీడియా అందుబాటులోనే ఉన్నప్పటికీ ఆయన వారిని కలిసే ప్రయత్నం చేయలేదు. మళ్లీ తాజాగా ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌కు వస్తున్నందున, శుక్రవారం స్పందించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆయన బుధవారమే స్పందిస్తే క్యాడర్, ఆయన అనుచరుల్లో మంచి సంకేతాలు వెళ్లేవని, ఇంతవరకూ మాట్లాడకపోవడం వల్ల జగన్ తాజా పరిణామాలతో గందరగోళంలో ఉన్నారన్న సంకేతాలు వెళ్లడానికి కారణమవుతోందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
కాగా, జగన్ మౌనంపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రు. తనకు అండగా నిలిచిన మద్దతుదారులనే రక్షించలేని నాయకుడు, తనను తాను ఎలా రక్షించుకుంటాడన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు అండగా నిలిచిన వారికోసం చివరి వరకూ పోరాడి, వారిని రక్షించుకునే వారని గుర్తు చేస్తున్నారు. వైఎస్ రాష్ట్ర స్థాయిలో తన ప్రత్యర్థులపై పోరాడినప్పటికీ, అధిష్ఠానాన్ని గౌరవించినందుకే ఢిల్లీలో ఆయనకు పలుకుబడి పెరిగిందంటున్నారు. అందుకే ఆయన తన వర్గాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకోగలిగారని విశ్లేషిస్తున్నారు.
జగన్ వ్యవహారశైలి అందుకు భిన్నంగా ఉండటం వల్ల ఆయన తన అనుచరులను కాపాడుకోలేకపోతున్నారని చెబుతున్నారు. వైఎస్ స్థానికంగా తన ప్రత్యర్థులతో పోరాడి అధిష్ఠానానికి విధేయుడిగా వ్యవహరిస్తే.. జగన్ మాత్రం ఏకంగా అధిష్ఠానంతోనే తలపడుతున్నారన్న సంకేతాలు వెళుతున్నందున ఆయనకు ఢిల్లీలో మద్దతు కరవయిందని విశ్లేషిస్తున్నారు. జగన్‌ను ముట్టుకోకుండా, ఆయనకు మద్దతునిస్తున్న వారిపై వేటు వేస్తూ మానసికంగా జగన్‌ను నిర్వీర్యం చేస్తున్న అధిష్ఠానం ఎత్తులకు ఆయన అనుచరులే బలి అవుతున్నారంటున్నారు.
జగన్‌పై చర్య తీసుకోవడంలో వ్యూహాత్మకంగానే ఆలస్యం చేస్తున్న నాయకత్వం, ఆయనకు మద్దతునిస్తున్న నేతలపై మాత్రం యుద్ధప్రాతిపదికన వేటు వేస్తుండటం ప్రస్తావనార్హం.
నిజంగా.. జగన్‌కు తన అనుచరులను కాపాడే శక్తి ఉంటే ఈపాటికే అంబటి, గట్టు సస్పెన్షన్లను తొలగించుకునేవారని స్పష్టం చేస్తున్నారు. అది ఇంతవరకూ జరగలేదంటే జగన్‌కు అధిష్ఠానంలో పలుకుబడి లేనందుకే మౌనం వహిస్తున్నారని, ఆయన పరిస్థితే అయోమయంలో ఉంటే ఇక అనుచరులను ఎలా కాపాడతారన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో అంతర్గతంగా వినిపిస్తున్నాయి. అధిష్ఠానంలో పలుకుబడి ఉంటే రాష్ట్రంలో ఎన్ని చేసినా ఫర్వాలేదని, బలంగా ఉండవలసిన చోటనే బలహీనంగా ఉంటే జగన్‌కు మద్దతునిచ్చేందుకు ఎవరూ ముందుకు రారని అంటున్నారు.
ప్రధాన అనుచరులందరినీ పార్టీ నుంచి బయటకు పంపిస్తే, ఇక జగన్ ఒక్కరే పార్టీలో ఉన్నా ప్రయోజనం ఏమిటన్న చర్చ జరుగుతోంది. తన అనుచరులపై వేటు పడకుండా జగన్ కాపాడలేకపోతున్నారన్న సంకేతాలు ఇప్పటికే వెళుతు న్నాయి. అలాంటి సంకేతాలు పంపించడంలో అధిష్ఠానం వ్యూహం ఫలించింది. కొండా సురేఖపై కూడా వేటు పడితే ఇక జగన్ వద్దకు వెళ్లే నాయకులే ఉండరని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఒక ఎమ్మెల్యేకే వేటు తప్పకపోతే, ఇక తామెంత అన్న మానసిక భావన జగన్‌కు మద్దతునిస్తున్న ద్వితీయ శ్రేణి నేతల్లో బయలుదేరితే, ఆయన నాయకత్వం బలపడటం చాలా కష్టమని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఉబలాటపడుతున్న నాయకుడు అత్యంత బలంగా ఉండాలని, ముందు తన వారిని కాపాడుకోవటం ద్వారా.. తమ కోసం నాయకుడు ఏదైనా చేయగలడన్న విశ్వాసాన్ని మద్దతుదారులలో కల్పించగల గాలని చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఇద్దరు ప్రముఖులపై వేటు పడి, ప్రధానమైన మూడవ వ్యక్తిపైనా వేటు వేసేందుకు సిద్ధమవుతున్నా.. జగన్ మాటా పలుకూ లేకుండా మౌనంగా ఉండటం బట్టి, అసలు నాయకుడే బలహీనంగా ఉన్నారని, ఇప్పుడు కనిపిస్తున్నదంతా మేకపోతు గాంభీర్యమేనన్న వ్యాఖ్యలు నిజమవుతున్నాయంటున్నారు.
No comments:
Post a Comment