జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Sunday, August 22, 2010

కాంగ్రెస్ పార్టీలో జగన్ ఉంటే ఎంత? పోతే ఎంత? జగన్‌ను బుజ్జగించం ఓదార్పు వద్దే వద్దు కోల్‌కతాలో ప్రణబ్ స్పష్టీకరణ

జగన్ వర్గం ఒత్తిడి రాజకీయం
ఎమ్మెల్యేలపై కార్యకర్తలే అస్త్రాలు
ద్వితీయ శ్రేణితోనే ముందుకు
అధిష్ఠానానికి సవాల్
భూమన దీక్షకు మద్దతు
  ఓదార్పుపై జగన్ వర్గం వాదనలు, వేదనలు వినే మూడ్‌లో అధిష్ఠానం లేదని మరోమారు స్పష్టమైంది. ఓదార్పు వద్దని జగన్‌తో ఆంతరంగికంగా చెప్పిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన సొంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ బహిరంగంగానే ఈ విషయం స్పష్టం చేశారు.

పైగా... జగన్ పార్టీలో ఉంటే ఎంత, పోతే ఎంత అని వ్యాఖ్యానించారు. శనివారం కోల్‌కతాలో బెంగాలీ విలేఖరులతో ప్రణబ్ మాట్లాడారు. "ఓదార్పు యాత్ర వద్దని జగన్‌కు స్పష్టంగా చెప్పాం. ఒక వ్యక్తి గురించి ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను బుజ్జగించే ప్రసక్తే లేదు. జగన్ పార్టీలో ఉంటే ఎంత? లేకపోతే ఎంత?'' అని ప్రణబ్ వ్యాఖ్యానించారు. ఆయన తన వైఖరిని స్పష్టం చేయడం ఇదే మొదటిసారి కాదు.

జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం పార్టీని ధిక్కరించినట్లు భావిస్తున్నామని రెండు నెలల క్రితమే ప్రణబ్ బెంగళూరులో విలేకరులతో అన్నారు. ఆయనపై చర్య తీసుకుంటామని కూడా సంకేతాలు పంపారు. తాజాగా ప్రణబ్‌తో జగన్ చర్చలు జరిపిన నేపథ్యంలో అధిష్ఠానం వైఖరి మారుతుందేమో అని ఆయన సన్నిహిత వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. అయితే... ఈ ఆశ అడియాసే అని ప్రణబ్ ముఖర్జీ తాజా స్పందనతో స్పష్టమైంది.

అధిష్ఠానానికి సవాల్
ఓదార్పు పట్ల అధిష్ఠానం వైఖరి స్పష్టం కావడంతో... ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలలో ప్రస్తుతానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మరో ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి మాత్రమే యాత్రలో పాల్గొనేందుకు సన్నద్ధమయ్యారు. జగన్ తన యాత్రపై అధిష్ఠానం వైఖరి గురించి కొన్ని విషయాలు దాచారని స్పష్టం కావడంతో... రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆలోచనా ధోరణి కూడా మారింది.

జగన్ హైదరాబాద్‌లో బస చేసినప్పుడు ఆయనను కలిసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సుకత చూపే వారు. కానీ, శనివారం జగన్‌ను మంత్రి బాలినేనితోపాటు ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, కమలమ్మ, శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాథ రెడ్డి మాత్రమే కలవడం గమనార్హం. యాత్రపై బాలినేని, జగన్‌లు గంటకు పైగా చర్చించుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంట వచ్చే అవకాశాల్లేకపోవడంతో ద్వితీయ స్థాయి నేతలను భాగస్వాములను చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చినా రాకున్నా యాత్రను విజయవంతం చేయాలని జగన్ వర్గీయులు తీర్మానించారు. ఇదే సమయంలో కిందిస్థాయి కార్యకర్తల ద్వారా ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేయించే వ్యూహాన్ని మరింత చురుగ్గా అమలు చేయాలని జగన్ వర్గం నిర్ణయించినట్లు తెలిసింది. యాత్రలో పాల్గొనాల్సిందేనని డిమాండ్ చేయడం, దూరంగా ఉండే ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దహనం చేయడం, ఆ నాయకులను ఘెరావ్ చేయడం వంటి చర్యలకు దిగాలని భావిస్తున్నారు.

యాత్రలో పాల్గొనరాదని భావిస్తున్న ఎమ్మెల్యేలకు 'మేం నియోజకవర్గ ప్రజలం' అంటూ ఇప్పటికే భారీగా ఫోన్లు వస్తున్నాయి. ఏదిఏమైనా ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను విజయవంతం చేసి అధిష్ఠానానికి ఒక సవాల్ విసరాలనే కృత నిశ్చయం జగన్ వర్గంలో కనిపిస్తోంది. పార్టీకే తమ అవసరం ఉందనే సంకేతాలు పంపేందుకు జగన్ వర్గం కార్యాచరణను రూపొందిస్తోంది.

సబ్బం హరి ఆశాభావం అనకాపల్లి ఎంపీ సబ్బం హరి ఇప్పటికీ ఓదార్పు యాత్ర విషయంలో అధిష్ఠానం వైఖరిని మార్చగలమని నమ్మకం వ్యక్తం చేయడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. "తన యాత్రలో రాజకీయాలు లేవని, అందులో రాజకీయాలు చూడరాదని జగన్ పదే పదే అందర్నీ అభ్యర్థిస్తున్నారు. జగన్‌పై కక్షతో కొందరు శక్తులు చేస్తున్న కుట్ర వల్లే అధిష్ఠానానికీ, ఆయనకూ మధ్య అగాధం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది.

జగన్‌కు కానీ, మాకు కానీ సోనియాను ధిక్కరించే ఆలోచనే లేదు'' అని సబ్బం హరి ఢిల్లీలో విలేకరులతో అన్నారు. ఒక్క ఓదార్పు యాత్ర విషయంలోనే తన కోణాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. మొయిలీ విందు ఏర్పా టు చేయడం, జగన్‌ను ప్రణబ్ రెండుసార్లు కలుసుకోవడం మంచి పరిణామాలలో భాగమని సబ్బం హరి తెలిపారు.

"అధిష్ఠానం మాతో కూడా మాట్లాడుతుంటుంది. అయితే... మేము మైకులకు ఎక్కి ఆ విషయాలను బయటికి చెప్పం'' అంటూ పరోక్షంగా దగ్గుబాటి దంపతులను విమర్శించారు. ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని అధిష్ఠానం ఎవరికైనా చెప్పడంలో ఆశ్చర్యం లేదని, నిజానికి జగనే ఎవరూ తమ పనులు మానుకుని యాత్రకు రావద్దని విజ్ఞప్తి చేశారని సబ్బం హరి గుర్తు చేశారు. ఏ అంశాన్నైనా సానుకూల మనసుతో అర్థం చేసుకుంటే సానుకూలంగానే అర్థమవుతుందని అ న్నారు.

ఓదార్పు యాత్ర రాష్ట్రమంతటా జరుగుతుందని... దానిని అధిష్ఠానానికి వ్యతిరేకంగా భావించనవసరం లేదన్నారు. "కాంగ్రెస్‌కు, సీఎంకు వ్యతిరేకంగా జగన్ ఒక్క మాటైనా మాట్లాడారా? మాట్లాడితే బయటపెట్టండి'' అని సవాల్ విసిరారు. మొయిలీ, అహ్మద్ పటేల్, ప్రణబ్ తమతో కూడా మాట్లాడుతున్నారని అన్నారు. ఓదార్పు యాత్ర వద్దని అధిష్ఠానం చెబుతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు తాము జవాబిచ్చే ప్రసక్తే లేదన్నారు. జగన్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీయే బలపడుతుందని సబ్బం హరి తెలిపారు.
వేడెక్కుతున్న రాజకీయం
'ఓదార్పు' యాత్ర సమీపించే కొద్దీ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. అవకాశం దొరకడమే ఆలస్యమన్నట్లుగా 'వైరి వర్గాలు' కత్తులు దూసుకుంటున్నాయి. యాత్రలో పాల్గొనాల్సిందిగా ఒత్తిడి రాజకీయం కొనసాగుతోంది. ఇది మున్ముందు మరింత ఉధృతం కానుంది. శనివారం అనంతపురం జిల్లాలో మంత్రి రఘువీరారెడ్డిని కార్యకర్తలు నిలదీశారు.

ఓదార్పుపై వైఖరేమిటో చెప్పాలంటూ ఆయనను ప్రశ్నించారు. అటు... ప్రకాశం జిల్లాలో దగ్గుబాటి దంపతులు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి దిష్టిబొమ్మల దహనం రెండోరోజూ కొనసాగింది. ఓదార్పును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తగిన బుద్ధి చెబుతామంటూ కార్యకర్తలు హెచ్చరించారు. టీటీడీలో అక్రమాలకు పాల్పడినట్లుగా తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి చేపట్టిన దీక్ష రాజకీయ రంగు పులుముకుంటోంది.

జగన్ వర్గీయులు ఒక్కొక్కరుగా వచ్చి దీక్షకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. శనివారం అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, ఎమ్మెల్యేలు అమర్‌నాథ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి నిరశన శిబిరాన్ని సందర్శించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి వైఎస్ కుటుంబానికి తన పూర్తి విధేయత ప్రకటించారు.

No comments:

Post a Comment