కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను ఒంటరి చేయాలనే కాంగ్రెసు పార్టీ అధిష్టానం వ్యూహం ఫలిస్తున్నట్లే ఉంది. జగన్ ఓదార్పు యాత్రను కట్టడి చేయడానికి అధిష్టానం ఈసారి సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. పార్లమెంటు సభ్యులకు తగిన మౌఖిక ఆదేశాలు జారీ చేస్తూనే, ప్రకాశం జిల్లా శాసనసభ్యులను ఢిల్లీకి పిలిపించి మంత్రాంగం నిర్వహిస్తోంది. ప్రకాశం జిల్లా శాసనసభ్యులతో అధిష్టానం నాయకులు జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. హైకమాండ్ నిర్ణయమే తమకు సుప్రీం అని ఆమంచి కృష్ణ మోహన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అంతకు ముందు ప్రకాశం జిల్లా శాసనసభ్యులు అదే జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి నివాసంలో సమావేశమైన చర్చించారు.
అధిష్టానం జగన్ ఓదార్పు యాత్రను వ్యతిరేకించడం లేదని, దాని తీరు మార్చుకోవాలని మాత్రమే సూచిస్తోందని కృష్ణమోహన్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓదార్పు యాత్రలో రెండో శ్రేణి నాయకులు పాల్గొన్నారని, దాని వల్ల ప్రతిపక్షాలకు వెసులుబాటు కల్పించినట్లయిందని ఆయన అన్నారు. ఇంతుకు జగన్ నిర్వహించిన ఓదార్పు యాత్రల్లో తప్పులు జరిగాయని, తదుపరి యాత్రల్లో ఆ యాత్రలు జరగకూడదనేది అధిష్టానం ఆలోచన అని ఆయన అన్నారు. ఓదార్పు యాత్ర బలప్రదర్సన లాగా జరగకూడదని ఆయన అన్నారు. ప్రస్తుత పట్టు వల్ల జగన్, తమకు, పార్టీకి ఇబ్బంది కలుగుతుందని ఆయన అన్నారు. ఓదార్పు యాత్రను మార్చుకోవాలని, హైకమాండ్ ఆదేశాలను ధిక్కకరించడం మంచిది కాదని ఆయన జగన్ కు సూచించారు.
తమకు జగన్ వేరు కాదు, పార్టీ వేరు కాదని, అయితే పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తమ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డికి తమ ఢిల్లీ పర్యటనతో సంబంధం లేదని, జెసి తమ జిల్లాకు సంబంధించివారు కారని, జెసి తమతో ఓదార్పు యాత్ర గురించి ఏమీ మాట్లాడలేదని ఆయన అన్నారు. జెసి ఎందుకు ఢిల్లీ వచ్చారో తమకు తెలియదని ఆయన అన్నారు.
No comments:
Post a Comment