జనం - జగన్

ఓదార్పు యాత్ర * జనం గుండెల్లో నాన్నను చూసుకోవాలనే ఆశతో.......

Monday, August 23, 2010

వేరుబాటే...!

jagan-console
అధిష్ఠానంపై ధిక్కార అస్త్రాలను పరంపరగా వదులుతున్న కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తాను ఏర్పాటు చేయదలచు కుంటున్న కొత్త పార్టీకి ఇప్పటినుంచే పునాదులు వేసుకుంటున్నారు. అధిష్ఠానం నుంచి ఎదురవు తున్న ‘అవమానాలను’ సహిస్తూ ఇక ఎంతోకాలం పార్టీలో ఇమడలేనని గట్టి నిర్ణయానికి వచ్చిన జగన్‌, గత కొద్ది రోజుల నుంచీ కొత్త పార్టీ నిర్మా ణం, స్వరూప స్వభావాలు, నామకరణం వంటి వాటిపై పలువురితో మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవైపు ఓదార్పు యాత్రకు సన్నద్ధం అవుతూనే పార్టీ విషయమై తీరిక చిక్కినప్పుడల్లా అన్ని జిల్లాల నాయకులతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. అన్నీ కలసి వస్తే సెప్టెంబర్‌ రెండున వైఎస్‌ఆర్‌ప్రథమ వర్ధంతి రోజునే ఆలోచనను ఆవిష్కృతం చేయాలనుకుంటున్న జగన్‌, ఒకటి, రెండు రోజులు అటూ ఇటూ అయినా పార్టీ పెట్టి తీరాల్సిందే అనే గట్టి నిర్ణయానికి వచ్చేసినట్టు తెలిసింది.

క్షేత్ర స్థాయి సర్వేలు...
ఒకసారి పార్టీ పెట్టటం అంటూ జరిగితే అది టీడీపీ, కాంగ్రెస్‌ ఉత్తమమైన, బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచిపోవాలన్న ఆలోచనతో జగన్‌ ఉన్నట్టు సమాచారం. ప్రజారాజ్యం పార్టీ మాదిరిగా హడావుడి ఏర్పాట్లు, టికెట్ల పంపిణీలో అవకతవకలు, చిట్ట చివరకు పట్టుమని 50 స్థానాలు అయినా రాని దుస్థితి, ఆ తర్వాత వరుస ఓటముల వంటివి ఎదురు కాకుండా అతి జాగ్రత్తగా పార్టీ నిర్మాణం జరగాలన్న ఆలోచనతో జగన్‌ అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు.

ఇందుకోసం క్షేత్ర స్థాయిలో ముమ్మరంగా సర్వేలు ప్రారంభమయ్యాయంటున్నారు. తనకు అత్యంత నమ్మకస్థులైన గ్రామ, మండల, తాలూకా స్థాయి యువతతో అతి గోప్యంగా ఆయా ప్రాంతాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. మండలాలు, పంచాయతీలు, నియోజకవర్గాలలో వీరంతా ఎవరికీ తెలియకుండా జనం మధ్యనుంచి సమాచారం సేకరించటం, హైదరాబాద్‌కు చేరవేయటం జరిగిపోతున్నది.

పోటీ ఇచ్చిన వారికి ప్రాధాన్యం

పార్టీకి అండగా నిలిచే వారిని ఎంపిక చేసుకోవటంలోనూ జగన్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి ఓటమిపాలైన వారు, ఆయా పార్టీలలో అసంతృప్తితో ఉన్న వారు, ఇక తమకు మనుగడ లేదని నిరాశతో ఉన్న వారు, అంగ, అర్ధబలాలతో పాటు జనంలో మంచి పేరు ఉన్న వారు, అవసరం అయితే దేనికైనా వెనుకాడని వారు...ఇలా విభజించి వీరిలో తమకు ఎవరు అనుకూలంగా ఉంటారో, పార్టీపరంగా వారికి ఎలాంటి గుర్తింపు ఇవ్వాలో అభిప్రాయ సేకరణ జరుగుతున్నది. ఇందులో కేవలం ఒకే పార్టీ నుంచే లాగాలనే ఆలోచన కాకుండా అన్ని పార్టీల నుంచి ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ప్రాంతాల వారీగా వివరాలు...
ఇలా వివరాలు సేకరించటంలో జగన్‌ కానీ, ఆయన సలహాదారులు కానీ ఎలాంటి తొందరపాటు కనబరచటం లేదు. ఒకేసారి రాష్ట్రం మొత్తం నుంచి సమాచారం తెప్పించుకుని హడావుడి నిర్ణయాలు తీసుకోకుండా, ప్రాంతాల వారీగా వివరాలు సేకరిస్తున్నట్టు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, రాయలసీమ...ఇలా ఒక్కో ప్రాంతం నుంచి కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసి అక్కడి పరిస్థితులు, బలంగా ఉన్న పార్టీలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లో బలమైన నేతలు, వారికి ఉన్న పలుకుబడి వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు. అవసరం అనుకున్న పక్షంలో తన అనుయాయులతో మంతనాలు జరిపిస్తున్నారు. మొదట సన్నిహితులు, సలహాదారులు ఎంపిక చేసిన వారితో మాట్లాడి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత వారితో సంప్రదించిన అనంతరమే దగ్గరకు తీసుకోదలచిన వారితో జగన్‌ స్వయంగా మాట్లాడతారని తెలిసింది. ఇప్పటికే కొందరు నేతలతో మంతనాలు పూర్తి అయ్యాయని చెబుతున్నారు.

ప్రధాన టార్గెట్‌ కాంగ్రెస్‌...
కాంగ్రెస్‌ నాయకత్వం తనను అవమానాల పాలు చేస్తున్నదని ఆగ్రహంతో ఉన్న జగన్‌, పార్టీ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌నే ప్రధాన లక్ష్యం చేసుకోవాలని భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వైఎస్‌ఆర్‌ విషాదాంతం తర్వాత కొంతకాలం తన వెంట ఉన్న ట్టు ‘నటించి’, ఇప్పుడు అధిష్ఠానం పేరు చెప్పి ముఖాలు చాటేస్తున్న వారిపై గుర్రుగా ఉన్నారు.

అలాంటి వారిని ప్రధాన లక్ష్యాలుగా చేసుకుని, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వారు గెలవకుండా చేయాలన్న దృక్పథంతో వ్యూహ రచన చేస్తున్నట్టు తెలిసింది.ఆ తర్వాత ఓదార్పు యాత్రకు గైర్హాజరయ్యేవారు, కొంత తగ్గి అధిష్ఠానం మాట వినాలని హితవు పలికిన వారు, తనపైన, తన తండ్రి పైన దురుసు వ్యాఖ్యలు చేస్తున్న వారు...ఇలా ఒక్కో స్థాయి వారందరినీ ఒక చూపు చూడాలన్న ఆలోచనతో జగన్‌ ముందుకు సాగుతున్నట్టు కాంగ్రెస్‌లో బలమైన వర్గాలు చెబుతున్నాయి.

పేరు ఓదార్పు... ప్రయత్నం సమాచార సేకరణ
ప్రస్తుతం సొంత జిల్లాలో ఓదార్పు యాత్ర జరుపుతున్న జగన్‌, వచ్చేనెలలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ యాత్రకు ఎంతమంది వచ్చేదీ ఇంకా తేలకపోయినా, యాత్ర మాత్రం జరిగితీరుతుందని ఇప్పటికే స్పష్టమైంది. అయితే తనకు కావలసిన సమాచారాన్ని సేకరించటానికి ఓదార్పు యాత్ర కూడా ఉపకరిస్తుందని జగన్‌ విశ్వసిస్తున్నారు. పార్టీలోకి రాజకీయ నాయకులను లాగడానికి తాను ఏర్పాటు చేసుకున్న ప్రాతిపదికల ప్రకారం వెళ్ళిన చోటల్లా అలాంటివారు ఎవరెవరు ఉన్నారో కూపీ లాగుతున్నారు. ఈ విషయంలో జగన్‌కు అత్యంత విశ్వసనీయమైన నెట్‌వర్క్‌ టీమ్‌ పూర్తిగా సహకరిస్తున్నట్టు తెలిసింది.

హై కమాండ్‌ ఆరా?
సొంత కుంపటి పెట్టుకునేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న వార్తలు ఢిల్లీ దాకా చేరినట్టు సమాచారం. ఇందులో వాస్తవాలేమిటో తెలుసుకునేందుకు హై కమాండ్‌ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జగన్‌ ఉంటే ఎంత? పోతే ఎంత? అని ప్రణబ్‌ ముఖర్జీ లాంటి వారు వ్యాఖ్యానించటంతో జగన్‌కు ఇక కాంగ్రెస్‌లో ఎలాంటి గుర్తింపూ ఉండబోదని తేలిపోయింది. అయినప్పటికీ వేరు కుంపటి పెట్టే విషయం వాస్తవమే అయితే ఆ వ్యూహాన్ని ఎదుర్కునేందుకు ఏమి చేయాలన్న దానిపై అంత సీరియస్‌గా కాకపోయినా ఒక కన్ను మాత్రం వేసి ఉంచాలని హైకమాండ్‌ పెద్దలు భావిస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ఇంటిలిజెన్స్‌ వర్గాల ద్వారా జగన్‌ పార్టీ ప్రయత్నాలపై ఎప్పటికప్పుడు కూపీలు లాగుతున్నారు. పార్టీ ఏర్పాటు నిజమే అయితే పార్టీలో ఉన్న వారు ఎంత మంది అటువైపు దూకుతారన్న స్థాయిలో ఆలోచించకపోయినా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ, జగన్‌ వ్యూహాలను గమనిస్తూ ఉండాలని మాత్రం అధిష్ఠానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

No comments:

Post a Comment